Saturday 26 September 2015

నరసాపురంలో 20 మంది దుబాయ్ ‌శ్రీనులు

నరసాపురంలో 20 మంది దుబాయ్ ‌శ్రీనులు
Updated :26-09-2015 10:16:17
దుబాయ్‌లో మంచి ఉద్యోగం..మీ జేబులో రూపాయి ఖర్చు పెట్టనక్కర్లెద్దు.. మంచి కంపెనీ.. పీఎఫ్‌..ఈఎస్‌ఐ..హెచ్‌ఆర్‌ఏ తదితర సౌకర్యాలు.. రూమ్‌ నుంచి కారులో తీసుకెళతారు..రూమ్‌కి కారులో దింపుతారు. వారానికి రెండు రోజులు సెలవు..మీ ఇంటికి ఫోన్‌ చేసుకునేందుకు కంపెనీ ఫోన్‌.. నెలకు రూ. 30 వేలు జీతం..మీదే ఆలస్యం. అంతా రాజభోగమే మరి.. కాళ్ళదగ్గరకు వచ్చిన అవకాశాన్ని వదులుకోవద్దు.. మీరిప్పుడు ‘‘ఊ’’ అంటే
ఈ వారంలోనే ప్రయాణం..చాలా అర్జెంట్‌..మీరెళ్ళకపోతే దుబాయ్‌లో పనినిలిచిపోతుందట.. నాకు ఒక గంట ముందే షేట్‌ ఫోన్‌ చేశాడు.. మీరు ఏ విషయం కళ్ళుమూసి తెరిచేలోపల చెప్పాలి. లేదంటే దువ్వ వాళ్ళు ఫోన్‌ చేస్తున్నారు..వాళ్ళకు అవకాశం ఇచ్చేస్తా..మీరు వెళతానంటే.. చేయాల్సిందల్లా ఒకటే ఒక వారం రోజుల్లో ఒక్కొక్కరు రూ. 3 లక్షలు చూసుకోండి.ఇదీ ఒక ఏజెంట్‌ మాటల మాయాజాలం..

ఇలా చెబితే ఎవరికి మాత్రం ఆశ ఉండదు. దేవుడు మనకు అవకాశం ఇచ్చినట్టున్నాడు. వెళ్ళకపోతే తప్పుచేసినవాళ్ళమవుతాం. కుటుంబానికి నాలుగేళ్ళు దూరంగా ఉన్నా.. సెటిల్‌ అయిపోతాం. ఎందుకు వచ్చిన అవకాశాన్ని వదులుకోవడం అనుకుంటారు..వెంటనే ప్రయాణానికి రెడీ అయిపోతారు.

మన మాటల మాంత్రికులు(ఏజెంట్లు) విజిటింగ్‌ వీసాలతో పంపించేస్తారు. వెను తిరిగి చూసుకుంటే ఇలా జిల్లా నుంచి వెళ్లి ఎంతో మంది గల్ఫ్‌ దేశాల్లో జైళ్ళలో మగ్గుతున్నారు.అయితే వాళ్ళను అక్కడకు పంపించిన ఏజంట్లు (మాయలమరాఠీలు) మాత్రం దర్జాగా తిరుగుతున్నారు. వీరిపై చర్యలు చేపట్టిన దాఖలాలు లేవు.. కుటుంబ సభ్యులు కన్నీరు తుడిచిన పెద్దలూ లేరు. ఏజంట్ల భరతం పట్టిన పోలీసులు లేరు.ఎందుకంటే అందరూ దొంగలే.. ఎవడు ఏమైపోతేం మనకేంటిలే అనుకునేవారే!!
 
20 మంది దుబాయ్‌ శీనులు
మూడేళ్ళ కిందట నరసాపురం, మొగల్తూరు మండలాలకు చెందిన సుమారు 20 మంది యువకులు మలేషియా వెళ్లారు. పీఎం లంక గ్రామానికి చెందిన ఓ ఏజంట్‌ యువకులను మలేషియా పంపాడు.మంచి ఉద్యోగం, జీతం, భోజనం, వసతి సౌకర్యం కంపెనీ కల్పిస్తుందని నమ్మించాడు.ఈ ఏజంట్‌ మాటాలు నమ్మి చాలా మంది అప్పులు చేసి అడిగిన సొమ్ము చెల్లించారు. తీరా అక్కడికి వెళ్లిన తరువాతగాని తెలియలేదు. తాము వచ్చింది విజిటింగ్‌ వీసాపై అని. చేతిలో డబ్బులు లేకపోవడంతో రోజుల తరబడి పస్తులతో గడిపారు. జరిగిన మోసాన్ని కుటుంబ సభ్యులకు ఫోన్‌లో చెప్పడంతో ఏజంట్‌ను నిలదీశారు.అయితే ఏజంట్‌ కనిపించకపోవడంతో చివరికి పోలీసులు, అధికారులను ఆశ్రయించారు. అయినా లాభంలేకపోయింది. అయితే నరసాపురం మండలం సీతారాంపురం గ్రామానికి చెందిన పులపర్తి శ్రీను మలేషియాలో స్థిరపడ్డాడు. అతనికి సమాచారం అందించారు.అతని సహకారంతో వీరంతా క్షేమంగా ఇంటికి చేరారు. కట్టిన సొమ్ము మాత్రం తిరిగి రాలేదు.
 
ఇండియా వస్తానను కోలేదు : మహేష్‌. నరసాపురం
నా పేరు మహేష్‌..నేనుండేది పొన్నపల్లి. ఈ ఏడాది ఫిబ్రవరిలో పట్టణానికి చెందిన ఓ ఏజంట్‌ మాటలు నమ్మి దుబాయ్‌ వెళ్ళా. కంపెనీ ఉద్యోగం. నెలకు రూ. 20 వేలు జీతం అని చెప్పాడు. ఏజెంట్‌ అడిగిన రూ.70 వేలు చెల్లించా. తీరా అక్కడికి వెళ్లిన తరువాత ఏజెంట్‌ చెప్పిన దానికి చేసే పనికి పొంతనలేదు. కూలీ పనులు, మూటలు మోసేపని. తిండి లేదు. దీంతో జరిగిన మోసాన్ని కుటుంబ సభ్యులకు చెప్పడంతో వాళ్లు అప్పుచేసి డబ్బు పంపారు. తిరిగి ఇండియాకు వచ్చేశా. ఇప్పటికీ అసలు ఇంటికి ఏలా వచ్చానా అనిపిస్తుంది.

చంపేస్తామన్నారు : ఆంజనేయులు , నరసాపురం

ఈ ఏడాది ఏజంట్‌ ద్వారా దుబాయ్‌ వెళ్లా. అక్కడ దిగగానే ఏజంట్‌ నా పాస్‌పోర్టు తీసేసుకున్నాడు. ఎందుకంటే నాకు ఇచ్చింది విజిటింగ్‌ వీసా. అక్కడ ఖాళీగా ఉన్న పనిలో నన్ను పెట్టాడు. దీంతో నేను ఎదురుతిరిగా. నాకు చెప్పిన ఉద్యోగం ఇది కాదంటూ నిలదీశా. దీంతో ఏజంట్‌ నన్ను బెదిరించాడు. ఇక్కడికి రావడం వరకే నీ పని.. మేం చెప్పేది చేయాలి.. లేకపోతే చంపేస్తాం అంటూ బెదిరించారు. దీంతో రెండు నెలలు నానా కష్టాలు పడ్డా. చివరికి కుటుంబ సభ్యులు సొమ్ము పంపితే తిరిగి ఇండియాకు వచ్చా.
 
ప్రాణాలు తీసిన పని...
అత్తిలి మండలం ఉనికిలి గ్రామానికి చెందిన గాడాల దానయ్య ఎన్నో ఆశలతో మలేషియా వెళ్లాడు. ఏజంట్‌ ఒక కంపెనీలో మంచి ఉద్యోగం అని చెప్పడంతో వెనుకా ముందూ ఆలోచించలేదు. అయితే అక్కడకు వెళ్లిన తరువాత అలవాటులేని గ్యాస్‌ పైప్‌లైన్‌ దగ్గర పని.. ఏం జరిగిందో ఏమో కానీ ఒకసారి గ్యాస్‌ లీకై చనిపోయాడు. ఈ విషయం కుటుంబ సభ్యులకు సమాచారం అందింది. రెక్కాడితే కానీ డొక్కాడని కుటుంబం. ఏం చేయాలో తెలియదు.మూడు నెలలైనా మృతదేహం రాలేదు. కుటుంబ సభ్యులు కన్నీరుపెడుతూనే ఉన్నారు. చివరికి పెంటపాటి పుల్లారావు సహకారంతో మృతదేహం ఇండియాకు వచ్చింది. అయితే ఆ కుటుంబాన్ని కష్టాలు మాత్రం ఇంకా వీడలేదు.
 
చావుబతుకుల మధ్య వచ్చా : సయ్యద్‌ బీబీ, నరసాపురం
నాది నరసాపురంలోని కృష్ణబాబుకాలనీ..మొగల్తూరుకు చెందిన ఏజంట్‌ మాటలు నమ్మి గల్ఫ్‌ వెళ్లా. ఇంట్లో వంట పని... ఇద్దరే ఉంటారు. వారికి వంట చేసిపెట్టాలి. నెలకు రూ. 17 వేలు జీతం అంటూ నమ్మించాడు.తీరా అక్కడికి వెళ్లిన తరువాత గాని తెలియలేదు.వంట చేసి పెట్టాల్సింది ఇద్దరికి కాదు.. రెండు మూడిళ్ళలో వంట చేయాలని.. దీంతో అనారోగ్యానికి గురయ్యా. చావు బతుకుల మధ్య ఇండియాకు తిరిగొచ్చా.
 
మోసపోతూనే ఉన్నారు : సీఐ
గల్ఫ్‌ మోసాలు తరచు వెలుగులోకి వస్తున్నా... ఇంకా చాలా మంది ఏజంట్లను నమ్ముతున్నారు. కనీసం వచ్చిన వీసా చదవడం లేదు. అది విజిటింగ్‌ వీసానా.. లేక పర్మినెంట్‌ వీసానా అన్న విషయం తెలుసుకుంటే మోసపోయే అవకాశం ఉండదు. చాలా మంది విజిటింగ్‌ వీసాపై వెళ్లి మోసపోతున్నారు. ముందు ఏజెంట్‌ వీసా వచ్చిందనగానే వీసా కాఫీని అడిగి తీసుకోవాలి. నెట్‌ లేదా ఆ దేశం ఎంబసీకి వెళ్లి వీసా గురించి పూర్తి వివరాలు తెలుసుకోవాలి.

No comments:

Post a Comment