Wednesday 2 September 2015

పులివెందులకూ నీళ్లిచ్చాం.. పట్టిసీమకు వైసీపీ అనుకూలమా; వ్యతిరేకమా?

పులివెందులకూ నీళ్లిచ్చాం.. పట్టిసీమకు వైసీపీ అనుకూలమా; వ్యతిరేకమా?
Updated :03-09-2015 01:49:32

  •  ప్రాజెక్టులపై మీ వైఖరి ఏమిటి?
హైదరాబాద్‌, సెప్టెంబరు 2 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో సాగునీటి ప్రాజెక్టులన్నీ పూర్తిచేసి చరిత్ర సృష్టిస్తామని ఏపీ సీఎం చంద్రబాబు అన్నారు. విపక్ష నేత జగన్‌ ఊరికి కూడా నీళ్లిచ్చామని, ఇంకా ఇస్తామని ప్రకటించారు. పట్టిసీమపై మీ వైఖరి ఏమిటని వైసీపీని నిలదీశారు. ప్రజలు చనిపోయాక నీరివ్వాలని చెబుతారా? అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.
నిధుల కొరత ఉంటే అప్పు చేసైనా ప్రాజెక్టులకు ఖర్చుచేస్తామని తెలిపారు. ప్రాజెక్టులు, గోదావరి జలాల వినియోగం, పట్టిసీమ ప్రాజెక్టుపై బుధవారం శాసనసభలో షార్ట్‌టైమ్‌ డిస్కషన్‌(స్వల్పకాలిక చర్చ) జరిగింది. దీనిపై మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు వివరణ ఇచ్చారు. ఈ సందర్భంగా ప్రతిపక్ష ఉపనేత జ్యోతుల నెహ్రూ, అధికార పార్టీ సభ్యుల మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. పట్టిసీమపై వైసీపీ వైఖరి ఏమిటో చెప్పాలని టీడీపీ సభ్యులు, బీజేపీ సభ్యులు ఆయనను నిలదీశారు. ఈ సమయంలో ముఖ్యమంత్రి మాట్లాడారు. పోలవరం పూర్తయ్యేవరకూ పట్టిసీమ కట్టకుండా రాయలసీమను ఎండగట్టాలని వైసీపీ కోరుకుంటోందన్నారు. తాగునీరు కూడా లేక సీమ ప్రజలు అలమటిస్తుంటే... పట్టిసీమ చేపట్టకుండా ప్రజలు చనిపోయాక నీరు ఇవ్వాలంటారా? అని ఘాటైన వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో కరువు పరిస్థితులు నెలకొన్నాయని చంద్రబాబు అన్నారు. ఈ పరిస్థితుల్లో పట్టిసీమతో ఇటు కృష్ణా డెల్టాకు, అటు రాయలసీమకు సాగునీరు ఇవ్వాలని సంకల్పించినట్లు తెలిపారు. కేవలం 11.5 టీఎంసీల నీటితోనే రాయలసీమలో వేల ఎకరాలకు సాగునీరు అందిందని, అదే మరిన్ని టీఎం సీలు తీసుకెళ్లగలిగితే రాయలసీమ మొత్తం పంటలు పండివచ్చని తెలిపారు. తన 15 నెలల పాలనలో అత్యధిక సమయం సాగునీటి రంగానికే కేటాయించానన్నారు.
మంత్రి దేవినేని ఉమా వందల సార్లు ప్రాజెక్టుల వద్ద పర్యటించారని చెప్పారు. పట్టిసీమతో తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాల్లో ఎక్కడా ఎకరం పంట ఎండిపోనివ్వమని స్పష్టంచేశారు. ఆగస్టు 15 పట్టిసీమను జాతికి అంకితం చేస్తున్నానని మాత్రమే చెప్పానని, నీరు ఇస్తున్నట్లు చెప్పలేదని తెలిపారు. ఈనెల రెండో వారం నాటికి గోదావరి జాలాలను కృష్ణాకు తీసుకెళ్తామన్నారు. పట్టిసీమ పూర్తైతే దేశంలో తొలిసారిగా నదుల అనుసంధానం చేసి, చరిత్ర సృష్టించిన ఘనత ఏపీకి దక్కుతుందన్నారు. పట్టిసీమకు అనుకూలమా? వ్యతిరేకమా ? అన్న విషయం వైసీపీకే తెలియదన్నారు. ప్రాజెక్టుల నిర్మాణంలో భాగంగా చేపడుతున్న భూసేకరణను వ్యతిరేకించే వారికి ప్రాజెక్టులపై మాట్లాడే అర్హత లేదన్నారు. భూసేకరణ వద్దంటే కాలువలు ఆకాశంలో నిర్మించాలా అని చంద్రబాబు ఎద్దేవా చేశారు. పులివెందులకు కూడా 2 టీఎంసీల నీళ్లిచ్చి చీనీ చెట్లను బతికించామని పేర్కొన్నారు.
ఏడాదిలోపులోనే పట్టిసీమను కట్టేశాం
వైసీపీ నేతలు పట్టిసీమ ప్రాజెక్టు అసాధ్యమన్నారని, కానీ దాన్ని సుసాధ్యం చేస్తున్నామని చెప్పారు. ఏడాది అని చెప్పి ఆరేడు నెలల్లోనే పూర్తిచేస్తున్నామని తెలిపారు. అత్యంత ప్రాధాన్యం కలిగిన సాగునీటిపై చర్చ జరుగుతుంటే వైసీపీ సభ్యులు ఐదుగురు కూడా సీట్లలో లేరని అన్నారు. జ్యోతుల నెహ్రూ వ్యాఖ్యలు అపహాస్యం చేసేలా ఉన్నాయని తెలిపారు. ఏదైనా ప్రాజెక్టు నిర్మిస్తే జ్యోతులకే అప్ప గిస్తానంటూ ఎద్దేవా చేశారు. పట్టిసీమపై సీఎం వివరణ ఇచ్చే ముందు వైసీపీ నేతలు పోడియం వద్దకు వచ్చిన నిరసన తెలిపారు. తమకు మాట్లాడే అవకాశం కల్పించాలని డిమాండ్‌ చేశారు.
పట్టిసీమపై టీడీపీ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి మాట్లాడుతుండగా, రోజా కామెంట్లు చేయడంతో ‘నీ రన్నింగ్‌ కామెంట్రీ ఆపమ్మా..ఇది జబర్దస్త్‌ కాదు’ అని గోరంట్ల ఆగ్రహం వ్యక్తంచేశారు. ?

No comments:

Post a Comment