Thursday 10 September 2015

చాకలి ఐలమ్మ - దొరను ధిక్కరించిన ధీరవనిత

దొరను ధిక్కరించిన ధీరవనిత
Updated :10-09-2015 01:47:23
చిట్యాల ఐలమ్మ. ఈ పేరు చాలా మందికి తెలిసి ఉండకపోవచ్చు. కాని చాకలి ఐలమ్మ అంటే తెలియనివారు ఉండరు. ఆధిపత్యవాదంపై ఎక్కుపెట్టిన ఆయుధం ఆమె. అన్యాయాన్ని నిలదీసిన సివంగి. వివక్షపై వీరోచితంగా పోరాడిన యోధురాలు. దొరతనాన్ని ఎదిరించిన ధీరత్వం ఆమె సొంతం. భూస్వాములపై గర్జించిన వీరవనిత. ఆకలికి అతి చేరువైన చాకలి కులంలో జన్మించింది ఐలమ్మ. 1895లో వరంగల్‌ జిల్లా రాయపర్తి మండలం కిష్టాపురంలో ఆమె కళ్లు తెరిచింది. మల్లమ్మ, సాయిలు దంపతుల ముద్దుబిడ్డ. చిన్న, చితక కులాలు, చేతి వృత్తిదారులు అరిగోస పడుతున్న కాలమది. భూస్వాములు, పటేల్‌, పట్వారీల పదఘట్టనల కింద బలహీనులు నలిగి అణగారుతున్న రోజులవి. మట్టిలో పుట్టి వెట్టిలో మగ్గిన జాతి నుంచి వెలుగురేఖలాగా దూసుకొచ్చింది. చీకటి బతుకుల్లో వెలుగులు నింపిన ఆశాదీపం. ఆనాటి సామాజిక పరిస్థితులు అత్యంత దుర్భరంగా ఉండేవి. దొరలు, భూస్వాములు, పటేల్‌, పట్వారీలు కనపడితేనే భయం భయంగా, బిక్కుబిక్కుమంటూ దయనీయంగా బతకాల్సిన పరిస్థితి అణగారిన వర్గాలది. శ్రామిక మహిళల మాన, ప్రాణాలకు రక్షణ ఉండేది కాదు. చిన్న వయస్సులోనే పాలకుర్తికి చెందిన చిట్యాల నర్సయ్యతో పెళ్లి అయింది. ఆమెకు ఐదుగురు కొడుకులు, ఇద్దరు కూతుళ్లు. పెద్ద కుటుంబం కావడంతో పూటగడవడం కష్టంగా ఉండేది. వృత్తి పని చేసినా సరైన భుక్తి కలిగేది కాదు. ఆ పరిస్థితుల్లో పాలకుర్తి పరిసరాల్లో మల్లంపల్లి దొర వద్ద రెండు ఎకరాల భూమిని ఐలమ్మ కుటుంబం కౌలుకు తీసుకొని సాగు చేసేది. ఇది పాలకుర్తి పొరుగునే ఉన్న విస్నూరు గ్రామానికి చెందిన దొర రామచంద్రారెడ్డికి కోపం తెప్పించింది.
ఐలమ్మ కుటుంబం సొంతంగా భూమిని కౌలుకు తీసుకొని సాగు చేసుకోవడం సహించలేకపోయాడు. నల్లగొండ, వరంగల్‌, ఖమ్మం జిల్లాల్లోని పెద్ద దేశ్‌ముఖ్‌లలో విస్నూరు రామచంద్రారెడ్డి ఒకరు. జనగామ తాలూకాలోని 40 గ్రామాల్లో 40వేల ఎకరాల భూమి ఉన్న దేశ్‌ముఖ్‌ ఆయన. విస్నూరు దొరకు నరరూప రాక్షసుడనే పేరు ఉండేది. బువ్వకు లేనోళ్లు భూమి గురించి ఆరాటపడటమంటే తలెత్తుకుని సగర్వంగా నిలబడటం కిందే లెక్క. అది దొర ఆధిపత్యానికి సవాల్‌ అన్నమాటే. ఐలమ్ము భర్తను, కొడుకును జైలుపాలు చేశాడు. ఐలమ్మ పొలాల్లోని పంటలను గూండాలతో కొల్లగొట్టించాలని చూశాడు. ఐలమ్మ ధీరోద్ధాతగా నిలబడి ఎదిరించింది. కొంగు నడుముకు చుట్టి కొడవలి చేతబట్టి సివంగివలే గర్జించింది. కమ్యూనిస్టు కార్యకర్తల సహాయంతో గూండాలను తరిమికొట్టింది. ఒడుపుగా పంటను ఇంటికి చేర్చింది. ఐలమ్మపై దొర అంతకంతకు కక్ష పెంచుకుని గూండాలతో దాడులు చేయించేవాడు. ఆమె మాత్రం ఆత్మ విశ్వాసాన్నే ఆయుధంగా చేసుకొని ఎదిరించేది. ‘‘నీ గడీల గడ్డి మొల్తది’’ అని తూటాల్లాంటి మాటలతో దొరను గడగడలాడించింది. అప్పట్లో ఆమెతోపాటు కమ్యూనిస్టు నాయకులపై పాలకుర్తి దొమ్మి కేసు పెట్టించాడు దొర. ఖూనీకోర్లతో దాడి చేయించాడు. కోర్టుకు విన్నవించుకుందామని వెళ్తుంటే భువనగిరి సమీపంలో వారిపై దాడి చేయించాడు. తీవ్రగాయాలతోనే హైదరాబాద్‌ వచ్చారు. ఈ సంఘటనను ‘మీజాన్‌’ ఉర్దూ, తెలుగు దినపత్రికలో సంపాదకులు అడివి బాపిరాజు ప్రముఖంగా ప్రచురించారు. విస్నూరు దొర ఆగడాలకు ఆమె కుటుంబం ఛిద్రమైంది. పోరాటంలోనే కొడుకు, భర్త ప్రాణాలు వదిలారు. అయినా వెరవలేదు. అగ్నికణం వలె నిత్యం ఉద్యమనెగళ్లను కాపాడేది. భూపోరాటాలకు దారి చూపి నైజాం రాజ్యం పతనానికి పునాదులు వేసినా ఆమెకు దక్కిందేమీలేదు. కనీసం స్వాతంత్య్ర సమరయోధుల ఫించన్‌కు కూడా నోచుకోకపోవడం గమనార్హం.
ఐలమ్మ పోరాట స్ఫూర్తితో మలి విడత తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఉద్యమం సాగి విజయం సాధించింది. తెలంగాణ తొలి ప్రభుత్వమైనా ఆమెకు సముచిత గుర్తింపునివ్వాలి. ఆమె జీవిత చరిత్రను పాఠ్యాంశంగా పెట్టాలి. హైదరాబాద్‌లో ట్యాంక్‌బండ్‌పై ఐలమ్మ విగ్రహాన్ని ప్రతిష్టించాలి. వరంగల్‌తో పాటు ప్రతి జిల్లాలో ఆమె విగ్రహాలు నెలకొల్పాలి. స్మారక భవనాలు నిర్మించాలి. ఆమె పేరిట ఒక యూనివర్సిటీని ఏర్పర్చాలి. ప్రతి ఏటా ప్రభుత్వమే ఆమె జయంతి, వర్ధంతి కార్యక్రమాలను ఘనంగా నిర్వహించాలి. ఆమె పేరిట ఒక కొత్తజిల్లాను ఏర్పాటు చేయాలి. ఆర్థికంగా కుంగిపోయిన ఆమె కుటుంబాన్ని ప్రభుత్వమే ఆదుకోవాలి. ఐలమ్మ 1985 సెప్టెంబర్‌ 10న కన్నుమూసింది. అయితే తెలంగాణ మలి దశ ఉద్యమంలో యావత్‌ తెలంగాణ జాతికి పోరాట స్ఫూర్తి నింపిన వీరనారిని నేడు విస్మరించడం అత్యంత బాధాకరం. ఇక్కడ దళిత, బహుజనవర్గాల ఆందోళన పరుస్తున్న విషయం మరొకటి ఉన్నది. అదేమిటంటే, కేవలం చాకలి ఐలమ్మ మాత్రమే విస్మృతికి గురవుతున్నది. ఇందుకు కారణాలను లోతుగా అధ్యయనం చేస్తే, అణువణువూ సామాజిక వివక్షే ప్రస్ఫుటమవుతోంది. అదే మలి విడత ఉద్యమంలో పోరాట స్ఫూర్తి నింపిన ఇతర యోధులకు నేడు మన రాష్ట్ర ప్రభుత్వం ఏ విధంగా పట్టం కడుతుందో చూస్తూనే ఉన్నాం. చాకలి కులానికి చెందిన మహిళ అవడమే ఐలమ్మ చేసుకున్న పాపం అన్న విషయం ఇక్కడ స్పష్టమౌతున్నది. లేదా చాకలి ఐలమ్మ తల్లి తెలంగాణ సమాజం మొత్తం తెలంగాణ తల్లిగా అభివర్ణించినందుకు ఈ ప్రభుత్వం నిర్లక్ష్యంచేస్తోందా? అన్నింటికీ వాస్తునే చూస్తున్న మన ప్రభుత్వం ఈమె పేరు ప్రకటించేందుకు కూడా తాత్సారం చేస్తున్నదో తెలియాల్సిన అవసరం ఉన్నది.
మహిళలపట్ల ఈ ప్రభుత్వానికి ఉన్న గౌరవం ఏపాటిదో కేసీఆర్‌ మంత్రి వర్గాన్ని చూస్తే తెలుస్తోంది. తెలంగాణ తొలి కేబినేట్‌లో ఒక్క మహిళకు కూడా స్థానం కల్పించలేదు. తెలంగాణ తల్లి అయిన ఐలమ్మ త్యాగాలను విస్మరించింది. ఉద్యమం నడుస్తున్నప్పుడు జాతికి పోరాట భావాన్ని రగిలించేందుకు అహా ఐలమ్మ, ఓహో ఐలమ్మ అంటూ ఆమెకు జేజేలు పలికారు. నేడు ఆమె అవసరం తీరిందని ఆమె పోరాట స్ఫూర్తిని, వీరనారికి ఇవ్వాల్సిన సముచిత స్థానం గురించి పట్టించుకోకపోవడం ఎంతవరకు సమంజసం? పాలక, ప్రతిపక్షాలు బహుజన సమాజానికి సమాధానం చెప్పాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది. దాంతోపాటు మధ్యలో ఐలమ్మ విగ్రహాలను రాష్ట్రవ్యాప్తంగా కూలగొట్టడం, కాల్చివేయడం వంటి సంఘటనలు ఎన్నో జరిగాయి. ఒక మహిళ (కె.కవిత) ప్రాతినిధ్యం వహిస్తున్న నిజామాబాద్‌ పార్లమెంటు నియోజకవర్గంలో ఐలమ్మ విగ్రహాల కూల్చివేతల పరంపర మొదలైంది. అది మహబూబ్‌నగర్‌ జిల్లా ఆలంపూర్‌ వరకు కొనసాగింది. దొరల ఆధిపత్యమున్న జిల్లాల్లోనే ఐలమ్మ విగ్రహాలను కూల్చడం, కాల్చడం గమనార్హం. కుట్రలో భాగంగా బీసీ నాయకుడు ప్రాతినిధ్యం వహించే ఎల్‌.బి.నగర్‌తో పాటు ఎస్సీ నియోజకవర్గమైన ఆలంపూర్‌లో ఐలమ్మ విగ్రహాలకు అపచారం జరిగింది. ఆ విషాద ఘటనలన్నీ రజక సమాజం బాధతో గుండెల్లో అదిమిపెట్టింది. కానీ, భౌతిక ప్రతిఘటనకు ఏనాడూ పాల్పడలేదు. ఇక్కడే రజకుల సహనం, సేవాగుణం అర్థం చేసుకోవలసిన అవసరం ఈ సభ్య సమాజంపై ఉన్నది. ఎందుకంటే పాలించే ప్రభువు, ఏనాటికైనా కరుణించకపోతాడా ఎదురు చూసే ధోరణి ఉన్న చరిత్ర రజకులన్నది కాబట్టి. దాన్ని పాలకులు అవగతం చేసుకుంటే, అందరికీ మంచిది. లేకపోతే పోగొట్టుకున్న చోటే పోరాడాల్సిన అవసరం ఉంటుందన్న విషయాన్ని పాలకులు గుర్తెరగాలి.
                            దక్షిణ భారత కమ్యూనిస్టు ఉద్యమ నిర్మాత పుచ్చలపల్లి సుందరయ్య తన జీవిత చరిత్ర (విప్లవ పథంలో నా పయనం)లో ఆధిపత్యవాదంపై ఐలమ్మ పోరాడిన తీరును కొనియాడిన విషయం మరువలేనిది. అదే పుస్తకాన్ని చైనా భాషలోకి అనువదిస్తే... అక్కడ కూడా ఆమె పోరాట ఘటనలన్నీ ప్రముఖమైనవిగా చరిత్రలో నిలిచిపోయాయి. తెలంగాణ రాష్ట్రంలో ఐలమ్మ పరిచయమున్న వ్యక్తుల కంటే చైనాలోనే ఎక్కువ ఉన్నారన్న విషయం అద్భుతం. కారణం అక్కడ సోషలిజ భావజాల మట్టే కాబట్టి. అదంతా చరిత్ర, దాన్నెవరూ కాదనలేరు. ఎందుకంటే దాన్ని విస్మరించిన వారు, చరిత్రహీనులుగా మిగిలిపోతారు. ప్రస్తుత ఐలమ్మ వర్ధంతికి ఆమె నివాళి అర్పించాల్సి వస్తుందని తెలంగాణ సీఎం ప్రత్యేక విమానాన్ని ఏర్పాటుచేసుకుని చైనాకు వెళ్ళారు. మరి బడుగు బలహీనవర్గాల పట్ల నిజంగా అభిమానం ఉంటే, కేసీఆర్‌ చైనాలోఅయినా ఐలమ్మకు నివాళి అర్పించవచ్చు. ఎందుకంటే అక్కడి ప్రజానీకానికి ఆమె సుపరిచితమైన మహిళే కాబట్టి.
 మన్నారం నాగరాజు
ఆలిండియా దోభీ మహాసమాజ్‌
(నేడు ఐలమ్మ 30వ వర్ధంతి)

No comments:

Post a Comment