హైదరాబాద్, జనవరి 15 : మజ్లిస్ పార్టీకి వ్యతి రేకంగా మాట్లాడితే బీజేపీ ముస్లింలకు వ్యతిరేకమని అనుకుంటారని, కానీ తాము ముస్లిం మైనారిటీలకు వ్యతిరేకం కానేకాదని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌రెడ్డి స్పష్టం చేశారు. బుధవారమిక్కడ పార్టీ కార్యాలయంలో మైనారిటీ మోర్చా రాష్ట్ర కార్యవర్గ సమావేశం జరిగింది. మైనారిటీ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు హనీఫ్ అలీ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో కిషన్‌రెడ్డి ముఖ్యఅతిథిగా పాల్గొని మాట్లాడారు. "ఇది వరకు ఒక మజ్లిస్ ఎమ్మెల్యే.. హిందువులకు, హిందూ దేవతలకు వ్యతిరేకంగా మాట్లాడారు. అయితే, మరో మతాన్ని అవమానించేలా ప్రవర్తించడం ముస్లింల సంప్రదాయం కాదు. కాబట్టి, మా పార్టీ ముస్లిం ప్రజలను కాక, మజ్లిస్ పార్టీని, ఆ పార్టీ నేతలను మాత్రమే వ్యతిరేకిస్తున్నది'' అని తెలిపారు. కాంగ్రెస్ పార్టీ కూడా చాలా సందర్భాల్లో హిందువులు, ముస్లింల మధ్య భేదాభిప్రాయాలు సృష్టించే ప్రయత్నం చేసిందని విమర్శించారు. దేశం అనేక సమస్యలను ఎదుర్కొంటుందని, కాంగ్రెస్ పాలనలో పేదరికం, అవినీతి వంటి సమస్యలు పెరిగిపోయాయని చెప్పారు. ఈ స్థితిలో మతం, కులం, ప్రాంతం వంటి అంశాలు అంత ప్రధానం కాదని, ముందుగా అవినీతి, పేదరికం వంటి సమస్యలను పరిష్కరించుకోవాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు.
No comments:
Post a Comment