అసెంబ్లీలో అక్బర్ వన్ మ్యాన్ షో
Written by Prr Kameswara Rao | Updated: January 20, 2014 16:38 (IST)
దేశంలోని మొట్టమొదటి విద్యుత్ బోర్డు ఎక్కడ పెట్టారో తెలుసా.. హైదరాబాద్ లో!! భారత కోకిల సరోజినీ నాయుడు లండన్ లో చదువుకోడానికి స్కాలర్ షిప్ ఇచ్చింది ఎవరో తెలుసా.. నిజాం! మీరందరూ కూర్చున్న ఈ అసెంబ్లీ భవనాన్ని నిర్మించింది ఎవరో తెలుసా.. నిజాం!! హైదరాబాద్ జాగీర్ స్కూల్.. అదే ఇప్పటి హైదరాబాద్ పబ్లిక్ స్కూలును కట్టించింది కూడా ఆ నిజామే. అదే స్కూల్లో సభా నాయకుడు కిరణ్ కుమార్ రెడ్డి, నేను, మా అన్న, జగన్ మోహన్ రెడ్డి, పల్లంరాజు.. అందరం చదువుకున్నాం. హైదరాబాద్ లో ఎప్పుడెప్పుడు ఏయే ఫ్యాక్టరీలు, పాఠశాలలు, గ్రంథాలయాలు వచ్చాయో తెలుసా.. అంటూ మొత్తం సంవత్సరాల వారీగా లెక్కలు, పేర్లు ఏకబిగిన అరగంటపాటు చదివిన మజ్లిస్ ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఒవైసీ సోమవారం నాడు అసెంబ్లీలో వన్ మ్యాన్ షో నడిపించారు.
ముందుగా ప్రిపేర్ అయ్యి ఉంటే, లెక్కలన్నీ దగ్గర పెట్టుకుంటే, దానికి తోడు తగిన వాగ్ధాటి ఉంటే సభను ఎలా తన అదుపులోకి తెచ్చుకోవచ్చన్న దానికి అక్బరుద్దీన్ ఒవైసీ చక్కటి ఉదాహరణగా నిలిచారు. నిజాం కాలం నుంచి రాష్ట్రం ఏర్పడే వరకు హైదరాబాద్ నగరంలో ఉన్న మొత్తం ఫ్యాక్టరీలు, విద్యాలయాలు, గ్రంథాలయాలు, చెరువులు.. ఇలా మొత్తం వేటివేటిని ఎప్పుడెప్పుడు ఏర్పాటుచేశారో సంవత్సరాలతో సహా లెక్కలు మొత్తం చదివి వినిపించారు. ఈ చారిత్రక సత్యాలను ఎవరైనా కాదనగలరా అంటూ నిలదీశారు. ఒక్కరు సమాధానం చెబితే ఒట్టు!! హైదరబాద్ నగర అభివృద్ధి మొత్తం తనహయాంలోనే జరిగిందని చెప్పుకొన్న విపక్షనేత చంద్రబాబు నాయుడుకు ఈ దెబ్బకు దిమ్మతిరిగిపోయింది. సభ సజావుగా నడవకుండా ఉండేందుకు తన ఎమ్మెల్యేలతో గొడవ చేయించారు తప్ప, అక్బర్ ప్రశ్నల్లో ఒక్కదానికి కూడా ఆయన గానీ, ఆయన సహచరులుగానీ సమాధానం మాత్రం ఇవ్వలేకపోయారు. హైదరాబాద్ నగరంలో అప్పటికే అభివృద్ధి ఉంది కాబట్టే దేశం నలుమూలల నుంచి అందరూ వచ్చి ఇక్కడ వ్యాపారాలు, ఇతర వ్యవహారాలు చేసుకుంటున్నారని అక్బరుద్దీన్ చెప్పిన మాటలను ఎవరూ కాదనలేకపోయారు.
No comments:
Post a Comment