Wednesday, 15 January 2014

కనుక..తొలగించగలరు!

కనుక..తొలగించగలరు!

Published at: 11-01-2014 08:53 AM
 1  0  1 
 
 

క్లాజ్‌లు వారీగా సవరణల ప్రతిపాదన.. పూర్తిగా తిలగించాలంటూ వినతి
సీమాంధ్ర నేతలు ప్రతిపాదించిన సవరణలు ఇవే
(హైదరాబాద్ - ఆంధ్రజ్యోతి) సీమాంధ్ర కాంగ్రెస్ ప్రజాప్రతినిధులు విభజన బిల్లులో స్పీకర్‌కు ప్రతిపాదించినలు, అందుకు చూపిన కారణాలు ఇవి...
'హద్దుల కమిషన్' కావాలి
క్లాజ్ నెంబర్: పార్ట్-2లో 3

అంశం: ఇది కొత్త రాష్ట్రాల సరిహద్దులకు సంబంధించిన విషయం. పది జిల్లాలతో కూడిన తెలంగాణ ఇస్తూ బిల్లును రూపొందించారు.
సవరణ: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ముందున్న సరిహద్దులను పరిగణనలోకి తీసుకోకుండానే ఇప్పుడు పది జిల్లాల తెలంగాణ ఇస్తామనడంలో స్పష్టత లేదు. హైదరాబాద్ స్టేట్‌లో తెలుగు మాట్లాడే అనేక ప్రాంతాలను కర్ణాటకలో కలిపేశారు. వీటిని తిరిగి తెలంగాణ రాష్ట్రంలో కలిపే అంశాన్ని ప్రస్తావించలేదు. అంతేకాదు, ఖమ్మం జిల్లాలోని భద్రాచలం, నల్లగొండ జిల్లాలోని మునగాల గతంలో కోస్తాంధ్రలో ఉండేవి. వీటన్నింటి నేపథ్యంలో కొత్త రాష్ట్రం సరిహద్దులు నిర్ణయించేందుకు, గతంలో తొలి ఎస్సార్సీ సమయంలో చేసినట్లుగా 'సరిహద్దుల కమిషన్' వేయడం మంచిది. విభజన బిల్లులో రాష్ట్రాల సరిహద్దుల నిర్ణయంలో ఔచిత్యం, హేతుబద్ధత లేనందున... ఈ క్లాజ్‌ను తొలగించాలి.
'ఉమ్మడి' ఎక్కడుంది?
క్లాజ్ నెంబర్: పార్ట్-2లో 5(1), (2)

అంశం: హైదరాబాద్ పదేళ్లు ఉమ్మడి రాజధాని, ఈలోపు సీమాంధ్రకు కొత్త రాజధాని నిర్మాణం.
సవరణ: హైదరాబాద్ నగరం కోస్తాంధ్ర ప్రాంతానికి కూడా సుదీర్ఘకాలం రాజధానిగా ఉండేదని చరిత్ర చెబుతోంది. "ఆంధ్రప్రదేశ్‌కు వేల సంవత్సరాలపాటు ప్రత్యేకమైన సాంస్కృతిక ఉనికి ఉంది. బౌద్ధ సాహిత్యంలోనే ఈ పదాన్ని ప్రస్తావించారు. ఆంధ్రప్రదేశ్‌లో ప్రస్తుతమున్న ప్రాంతాలన్నీ చరిత్రలోనూ ఒకే ఛత్రం కింద ఉన్నాయి. అందువల్ల... కేవలం ఇటీవలి చరిత్రను మాత్రమే పరిగణనలోకి తీసుకోవద్దు'' అని ప్రధాని హోదాలో ఇందిరాగాంధీ పార్లమెంటులోనే చెప్పారు. ఆంధ్రప్రదేశ్ ఏర్పాటు నుంచి ఇప్పటిదాకా (1956 నుంచి 2013) హైదరాబాద్ అభివృద్ధిలో తెలంగాణేతరుల పాత్ర ఎంతో ఉంది. (దీనిపై ప్రత్యేక అనుబంధం జత చేశారు.) హైదరాబాద్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌కు రాజధానిగా ఉండటమే సముచితం. పైగా... ఉమ్మడి రాజధాని ప్రస్తావన రాజ్యాంగంలోనూ లేదు. ఉమ్మడి రాజధానికి చట్టబద్ధమైన వివరణ ఇవ్వాలి. అందువల్ల... ఈ క్లాజ్‌ను బిల్లును తొలగించగలరు.
గవర్నర్‌గిరీ చెల్లదు కనుక..
క్లాజ్: పార్ట్ 2లో 8(1) నుంచి (4) వరకు.

అంశం: ఉమ్మడి రాజధానిలో శాంతి భద్రతలను గవర్నర్‌కు అప్పగించడం, గవర్నర్‌కు కేంద్ర ప్రభుత్వం ఇద్దరు సహాయకులను నియమించడం మొదలైనవి.
సవరణ: శాంతి భద్రతలు, అంతర్గత భద్రత, కీలకమైన సంస్థల రక్షణ, ప్రభుత్వ భవనాల కేటాయింపు, నిర్వహణ అనేవి పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వ కార్యనిర్వాహక, చట్టసంబంధమైన అధికారాలు. రాష్ట్ర ప్రభుత్వ పరిధిలోని అంశాలను కేంద్రం పరిధిలోకి తీసుకురావడం కుదరదు. ఇది రాజ్యాంగ మౌలిక స్వరూపానికే విరుద్ధం. అందవల్ల ఈ క్లాజ్‌ను తొలగించాలి.
'స్థానాల'కు స్థానమెక్కడ?
క్లాజ్: పార్ట్ 3లో 16(1) (2) (3)
అంశం: విభజన తర్వాత రెండు రాష్ట్రాల్లో అసెంబ్లీ, శాసన మండలి స్థానాలు.
సవరణ: రాష్ట్ర విభజనకు పరిగణనలోకి తీసుకున్న సరిహద్దులే శాస్త్రీయంగా లేవు. చరిత్రను విస్మరించి హద్దులు నిర్ణయించారు. ఈ సరిహద్దులను సరిగా నిర్ణయించిన తర్వాతే ఏ రాష్ట్రంలో ఎన్ని అసెంబ్లీ స్థానాలు ఉండాలో తేల్చాలి. అందువల్ల ఈ క్లాజ్‌ను తొలగించాలి.
'మండలి'కి సభ్యులేరీ?
క్లాజ్: పార్ట్ 3లో 23
అంశం: విభజన తర్వాత ఆంధ్రప్రదేశ్‌లో 50, తెలంగాణలో 40 శాసన మండలి స్థానాలు ఉండాలి.
సవరణ: ప్రస్తుత శాసన మండలిలో తెలంగాణ ప్రాంతం నుంచి 35 మంది మాత్రమే ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఆర్టికల్ 171 ప్రకారం మండలిలో కనీసం 40 మంది సభ్యులు ఉండాల్సిందే. అలాంటప్పుడు తెలంగాణకు శాసన మండలిని ఎలా ఏర్పాటు చేస్తారు? రాజ్యాంగ విరుద్ధంగా ఉన్న ఈ క్లాజ్‌ను తొలగించాలి.
హైదరాబాద్ ఆదాయం పంచరా?
క్లాజ్: పార్ట్ 5లో 46(1), (2)
అంశం: సంయుక్త ఆంధ్రప్రదేశ్‌కు 13వ ఆర్థిక సంఘం చేసిన కేటాయింపులను విభజన తర్వాత కేంద్రం రెండు రాష్ట్రాలకు పంపిణీ చేయాలి.
సవరణ: ఆంధ్రప్రదేశ్ ఆదాయంలో హైదరాబాద్ నుంచి వచ్చేదే ఎక్కువ. పెట్టుబడులకు 'రాజధాని'గా ఉన్న హైదరాబాద్ నుంచి వచ్చే ఆదాయం మొత్తం రాష్ట్రానికి చెందుతుంది. కానీ, ఆదాయ పంపిణీ అంశంలై హైదరాబాద్ అంశాన్నే ప్రస్తావించకపోవడం ఆశ్చర్యకరం. పదేళ్లపాటు హైదరాబాద్ ఉమ్మడి రాజధానిగా ఉంటే, హైదరాబాద్ నుంచి వచ్చే ఆదాయం కూడా ఉమ్మడిగానే ఉండాలి. ఈ విషయాన్ని పూర్తిగా విస్మరించారు. ఇది సరికాదు, సహేతుకమూ కాదు. అందువల్ల ఈ క్లాజ్‌ను తొలగించాలి.
కేంద్రానికి ఏం అధికారం?
క్లాజ్: పార్ట్ 7లో 69
అంశం: విద్యుత్తు ఉత్పత్తి, పంపిణీ, సరఫరా - నీటి సరఫరాలకు సంబంధించి అవసరమైతే రెండు రాష్ట్రాలను సంప్రదించి కేంద్రం ఆదేశాలు జారీ చేస్తుంది.
సవరణ: విద్యుత్తు అనేది రాష్ట్ర ప్రభుత్వ, ఉమ్మడి జాబితాలోని అంశం. నీరు, విద్యుత్తు వంటి అంశాలపై కేంద్రం తన సొంతంగా ఆదేశాలు జారీ చేయేదు. ఇలా జారీ చేయడమంటే రాష్ట్రాలను అవమానించడమే. అందువల్ల, ఈ క్లాజ్‌ను తొలగించాలి.
నదులు రాష్ట్రానివే!
క్లాజ్: పార్ట్ 9లో 84(1) (2) (3)
విషయం: గోదావరి, కృష్ణా జలాల పంపిణీ, నిర్వహణపై కేంద్ర ప్రభుత్వం ఉన్నతస్థాయి మండలిని ఏర్పాటు చేస్తుంది. ఈ మండలికి కేంద్ర జలవనరుల మంత్రి చైర్మన్‌గా ఉంటారు. ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు సభ్యులుగా ఉంటారు. రెండు నదులపై కొత్త ప్రాజెక్టుల నిర్మాణానికి అనుమతులు, ఉన్న ప్రాజెక్టుల నిర్వహణ, పంపిణీ వివాదాలు, కృష్ణా ట్రిబ్యునల్‌లో ప్రస్తావనకు రాని అంశాలన్నీ ఉన్నతస్థాయి మండలి పరిధిలోకి వస్తాయి.
సవరణ: ఇలాంటి ఉన్నతస్థాయి మండలిని నియమించే అధికారం కేంద్రానికిలేదు. నదీ జలాల సరఫరా, సాగునీరు, కాలువలకు విడుదల, నీటి నిల్వ, జల విద్యుత్తు వంటి అంశాలపై రాజ్యాంగం ప్రకారం సంబంధిత నదీ పరివాహక ప్రాంతం ఉన్న రాష్ట్ర ప్రభుత్వాలకే అధికారం ఉంటుంది. వీటిపై కేంద్రం పెత్తనం కుదరదు. అందువల్ల ఈ క్లాజ్‌ను తొలగించాలి.
కృష్ణ.. కృష్ణా!
క్లాజ్: పార్ట్9లో 89
అంశం: 'కృష్ణా జల వివాదాల ట్రిబ్యునల్-2' కొనసాగింపు.. నీటి కొరత సమయంలో ప్రాజెక్టుల వారీగా నీరు కేటాయింపు.
సవరణ: ముసాయిదా బిల్లులో ఈ క్లాజ్‌ను చేర్చడం వెనుక ఉద్దేశాలను కేంద్రం చెప్పనేలేదు. అంతర్‌రాష్ట్ర జల వివాదాల ట్రిబ్యునల్ చట్టం-1956 ప్రకారం ట్రిబ్యునళ్ల ఏర్పాటుకు నిర్దిష్టమైన విధి విధానాలున్నాయి. వాటిని పాటించకుండా కృష్ణా ట్రిబ్యునల్-2ను పొడిగించలేరు. కృష్ణా ట్రిబ్యునల్-1, 2లకు ఈ క్లాజ్ విరుద్ధంగా ఉంది. ఈ రెండు ట్రిబ్యునళ్లు ఎక్కడా 'నీటి కొరత' సమయంలో పంపకాల గురించిన ప్రస్తావన లేదు. వీటన్నింటి నేపథ్యంలో ఈ క్లాజ్‌ను తొలగించాలి.
ఇదేమి పోలవరం?
క్లాజ్: పార్ట్ 90(2) (3)
అంశం: పోలవరం ప్రాజెక్టుకు జాతీయ హోదా కల్పించడం, దానిని కేంద్రప్రభుత్వమే చేపట్టడం.
సవరణ: పోలవరం ప్రాజెక్టును ఇప్పటికే గోదావరీ జలాల వివాద ట్రిబ్యునల్ అనుమతించింది. దీనికి సంబంధించిన రాష్ట్రాలతో పలు ఒప్పందాలు కుదిరాయి. ప్రాజెక్టుకు అవసరమైన భూసేకరణ, పునరావాసం, నిర్మాణ పనులపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చాలా ఖర్చు పెట్టింది. నదీ జలాల నిల్వ అనేది రాజ్యాంగం ప్రకారం రాష్ట్ర ప్రభుత్వ అధికారం. అంతర్రాష్ట్ర నదులకు సంబంధించిన నియంత్రణ, అభివృద్ధి విషయంలో కేంద్రం జోక్యం చేసుకోలేదని సుప్రీంకోర్టు గతంలో తీర్పు చెప్పింది. ప్రాజెక్టు నిర్మాణానికి ఆంధ్రప్రదేశ్‌కు తగిన స్వేచ్ఛ ఇచ్చి, కేంద్రం గ్రాంట్ మంజూరు చేస్తే చాలు. పోలవరం ప్రాజెక్టును నిర్మించుకునే హక్కు ఆంధ్రప్రదేశ్‌కు ఉంది. అంతేకానీ, 'విభజన తర్వాత రెండు రాష్ట్రాలతో సంప్రదింపులు జరిపి కేంద్రం ప్రాజెక్టును చేపడుతుంది'అనే ప్రస్తావనకు ఆస్కారమే లేదు. అందువల్ల ఈ క్లాజ్‌ను తొలగించాలి.
371(డి)తో ఢీ
క్లాజ్: పార్ట్ 12లో 96, 97
అంశం: 371 (డి).
సవరణ: రాజ్యాంగంలోని ఆర్టికల్ 168, 371-డిలకు పార్లమెంటు మాత్రమే సవరణలు ప్రతిపాదించగలదు. 168, 371 అధికరణలను ఆర్టికల్ 4 పరిధిలోకి తీసుకురాలేం. 371డికి సవరణ చేయడం సర్వీసెస్, విద్య అంశాలకు ప్రతిబంధకంగా మారుతుంది. ఈ సవరణలు న్యాయపరంగా సాధ్యం కావు. 371డి ఆర్టికల్‌కు సవరణ చేయడం రాజ్యాంగ పరంగా చెల్లుబాటు కాదు. అందువల్ల... ఈ రెండు క్లాజ్‌లను తొలగించాలి.
ఇదేనా పంపకం?
షెడ్యూలు: 12వ షెడ్యూల్ (సెక్షన్ 92)
అంశం: సింగరేణి కాలరీస్‌లో 51 శాతం తెలంగాణకు, 49 శాతం కేంద్ర ప్రభుత్వానికి చెందుతుంది. సహజవాయువు, గ్యాస్ నిక్షేపాల కేటాయింపులపై కేంద్ర ప్రభుత్వం ఎప్పటికప్పుడు మార్గదర్శకాలు జారీ చేస్తుంది. ఆయా వనరులు ఎక్కడున్నాయో 'రాయల్టీ'కూడా ఆ రాష్ట్రానికే చెందుతుంది. ఏపీజెన్‌కో యూనిట్లను కూడా ఎక్కడ ఉన్నవి అక్కడే అనే ప్రతిపదికన విభజించాలి.
సవరణ: సింగరేణిని ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ వనరులతో అభివృద్ధి చేశారు. అందువల్ల... సింగరేణి ఆస్తులకు ప్రస్తుత మార్కెట్ ప్రకారం విలువకట్టి పంపిణీ చేయాలి. కానీ... ఈ విషయాన్ని బిల్లులో ప్రస్తావించలేదు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ వాటా మొత్తాన్ని తెలంగాణకు బదిలీ చేయడం సరికాదు. 51 శాతం వాటాను రెండు రాష్ట్రాలకు సమంగా పంచాలి. జల విద్యుత్తు కేంద్రాలు ఉమ్మడి నీటినే వాడుకుంటాయి. మరి... వాటి నుంచి ఉత్పత్తి అయ్యే విద్యుత్తును 'భౌగోళిక' ప్రాతిపదికన ఉపయోగించుకోవడం ఎలాగో స్పష్టత ఇవ్వలేదు. ఆయకట్టు లేదా జనాభా ప్రాతిపదికన విద్యుత్ పంపిణీ చేయాలి. లేదా గాడ్గిల్ ఫార్ములా అనుసరించాలి. దీనిపై ఒక అథారిటీని నియమించాలి. కేంద్ర ప్రభుత్వ విద్యుత్ ప్లాంట్లలో ఉత్పత్తి అయ్యే కరెంటు పంపిణీకి గాడ్గిల్ ఫార్ములా అనుసరించాలి. వీటన్నింటి నేపథ్యంలో ఈ షెడ్యూల్‌ను తొలగించాలి.
ఉత్తుత్తి హామీలు
షెడ్యూల్: 13 (సెక్షన్ 93)
అంశం: కేంద్ర ప్రభుత్వం సీమాంధ్రలో ఒక ఐఐటీ, ఒక ఎన్ఐటీ, ఒక కేంద్ర విశ్వవిద్యాలయం, ఒక ఐఐఎం, ఒక వ్యవసాయ విశ్వవిదాలయం ఏర్పాటు చేయాలి. ఎయిమ్స్ తరహా సూపర్ స్పెషాలిటీ బోధనాస్పత్రి ఏర్పాటు చేయాలి. ఇవన్నీ 12, 13 పంవర్ష ప్రణాళికల కాలంలో జరగాలి. తెలంగాణకు గిరిజన విశ్వవిద్యాలయాన్ని, ఉద్యాన వర్సిటీని మంజూరు చేయాలి. అలాగే... సీమాంధ్రలో రేవులు, రైల్వేలు, విమానాశ్రయాలు, జాతీయ రహదారుల వంటి మౌలిక సదుపాయాలను అభివృద్ధి చేయాలి.
సవరణ: వీటి ఏర్పాటుకు నిర్దిష్టమైన గడువు ఏదీ చెప్పలేదు. గట్టి హామీ కూడా ఇవ్వలేదు. 'ఫైనాన్షియల్ మెమొరాండం' కూడా ఇవ్వలేదు. మౌలిక సదుపాయాలకు సంబంధించి 'సాధ్యాసాధ్యాలను బట్టి' అనే పదం ప్రయోగించిన నేపథ్యంలో ఇవన్నీ ఉత్తుత్తి హామీలుగానే భావించవచ్చు. ఈ షెడ్యూలులోని ప్రతిపాదనల వెనుక చిత్తశుద్ధి కనిపించడంలేదు. ఇలాంటివి ఆచరణలోకి రావు. ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ఎలాంటి ఉపశమనానికి కల్పించలేవు. సీరియస్‌నెస్ లేకుండా, పైపైమెరుగులతో రూపొందించిన ఈ షెడ్యూలను తొలగించండి.
హైదరాబాద్ కీలకం
3వ క్లాజ్ సవరణకు అనుబంధంగా ఇచ్చిన వివరాలు ఇవి...
- హైదరాబాద్‌ను ఏం చేస్తారనేదే ముఖ్యం. విద్య, ఆరోగ్యం, ఉపాధి, పెట్టుబడి అవకాశాలు ఇక్కడ ఉండడమే కాదు.. కోస్తాంధ్ర, రాయలసీమ ప్రజలకు ఈ నగరంతో ఉన్న భావోద్వేగాలు కూడా ఇందుకు కారణం. గతంలో కోస్తాంధ్రకు హైదరాబాద్ రాజధానిగా ఉందని చరిత్ర చెబుతోంది. వేలాది సంవత్సరాలుగా ఇది సాంస్కృతిక కేంద్రం. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్‌లో భాగమైన అన్ని ప్రాంతాలూ కూడా చరిత్రలో కొన్ని దశాబ్దాల కిందట ఒకే గొడుగు కింద ఉన్నవే.
- కోస్తాంధ్ర జిల్లాలు కలిసిన తర్వాత, గత 57 ఏళ్లలో హైదరాబాద్ ఆర్థిక పరిస్థితిలో గణనీయమైన మార్పు వచ్చింది. 1956 తర్వాతే రాజధాని హైదరాబాద్‌కు ప్రభుత్వరంగ సంస్థలు క్యూ కట్టాయి. బీహెచ్ఈఎల్ (1959), ఐడీపీఎల్ (1967), మిశ్రమ ధాతు నిగం (మిథానీ) (1973), హెచ్ఎంటీ (1964), హిందుస్థాన్ ఫ్లోరో కార్బన్స్ (1983), ఈసీఐఎల్ (1967), బీడీఎల్ (1970) తదితరాలు. 1956 తర్వాతే 140కిపైగా ఫార్మాస్యూటికల్ కంపెనీలు ఇక్కడికి తరలి వచ్చాయి.
- జేఎన్‌టీయూ, నల్సార్ వంటి 14 ప్రఖ్యాత ఉన్నత విద్యా సంస్థలు ఉన్నాయి. నగరంలో సీసీఎంబీ, డీఆర్‌డీవో వంటి 46 పరిశోధన సంస్థలు, సెంటర్ ఆఫ్ ఎక్స్‌లెన్స్‌లు ఉన్నాయి.
- ప్రస్తుతం హైదరాబాద్ గ్లోబల్ మెడికల్ హబ్. విదేశాల నుంచి వచ్చే రోగుల విషయంలో దేశంలోనే దీనిని నాలుగో స్థానం.
- ఇతర ప్రాంతాలకు వలసలు కేవలం ఒక్క శాతం ఉంటే.. ఒక్క హైదరాబాద్‌కే వలస శాతం 10.6 శాతమని శ్రీకృష్ణ కమిటీ తేల్చి చెప్పింది.
- రాష్ట్రంలో 2012-13లో సాఫ్ట్‌వేర్ టర్నోవర్ రూ.55 వేల కోట్లు. ఇందులో 90 శాతం హైదరాబాద్‌దే. ఇక, హైదరాబాద్ నుంచి ఫార్మా ఎగుమతులు కూడా దాదాపు రూ.20 వేల కోట్లకుపైనే.
ఫార్మా పెట్టుబడులు, మెజారిటీ ప్రైవేటు విద్యా సంస్థలు, మెజారిటీ హోటళ్లు, మల్టీ ప్లెక్సులు, రీటెయిల్ మాల్స్, ప్రఖ్యాత ఆస్పత్రులు, మొత్తం సినిమా రంగం మరియు మౌలిక సదుపాయాల కంపెనీలన్నీ సీమాంధ్ర పెట్టుబడిదారులవే. అందువల్ల, సీమాంధ్ర ప్రజలనే కాదు.. వారి ఆస్తులను, మౌలిక సదుపాయాలను, పెట్టుబడులను కూడా మనం కాపాడాల్సి ఉంది.
- See more at: http://www.andhrajyothy.com/node/53022#sthash.I0xKJ9Aw.dpuf

No comments:

Post a Comment