Sunday, 19 January 2014

భద్రాచలం సీమాంధ్రకే - BJP

విభజన బిల్లుకు బీజేపీ సవరణాస్త్రం! 





భద్రాచలం సీమాంధ్రకే

Published at: 20-01-2014 04:26 AM
 New  0  0 
 
 

బహుళార్థ సాధక ప్రాజెక్టుగా పోలవరం
సీమాంధ్ర ప్రాజెక్టులకు చట్టపరమైన రక్షణ
రాజ్యాంగ సవరణ ద్వారా ఉమ్మడి రాజధాని
పార్లమెంటులో పది సవరణలకు సంసిద్ధం?
న్యూఢిల్లీ, జనవరి 19: రాష్ట్ర విభజన విషయంలో సీమాంధ్ర ప్రయోజనాలు కాపాడేందుకు బీజేపీ సిద్ధమైంది. విభజన బిల్లుకు పార్లమెంటులో పది సవరణలు ప్రతిపాదించేందుకు రంగం సిద్ధం చేసింది. భద్రాచలం రెవెన్యూ డివిజన్‌ను సీమాంధ్రలోనే కలపడం.. పోలవరానికి బహుళార్థ సాధక ప్రాజెక్టు హోదా కల్పించడం.. సీమాంధ్ర సాగునీటి ప్రాజెక్టులకు చట్టపరమైన రక్షణ కల్పించడం.. హైదరాబాద్‌లోని సీమాం«ద్రులకు, ఉద్యోగులకు భరోసా ఇవ్వడం తదితరాలు ఈ సవరణల్లో ప్రధానంగా ఉన్నాయి. ఈ సవరణలకు కాంగ్రెస్ ఆమోదించకపోతే బిల్లుకు మద్దతు ఇవ్వరాదని కూడా నిర్ణయించింది. ఈ మేరకు బీజేపీ సీమాంధ్ర నేత హరిబాబు సూచించిన సవరణల్లో అధిక శాతం అంశాలను పార్లమెంటులో లేవనెత్తాలని బీజేపీ జాతీయ మండలి సమావేశాల్లో నిర్ణయించినట్లు తెలిసింది. వీటిని ఆమోదిస్తేనే సీమాంధ్రలో ముందుకు వెళ్లగలమని కూడా బీజేపీ భావిస్తోంది. బీజేపీ సూచించనున్న పది సవరణలు...
పోలవరం.. భద్రాచలం రెవెన్యూ డివిజన్: బిల్లులోని పార్ట్-2లోని క్లాజ్ 3, పార్ట్ 9లోని క్లాజు 9లో పోలవరానికి సంబంధించి బీజేపీ సవరణలు ప్రతిపాదించే అవకాశాలున్నాయి. బిల్లులో పోలవరాన్ని కేవలం నీటిపారుదల ప్రాజెక్టుగా మాత్రమే పేర్కొన్నారని, దాన్ని బహుళార్థ సాధక ప్రాజెక్టుగా మార్చి కేంద్ర జల వనరుల సంఘం ఇచ్చిన అనుమతిని యథాతథంగా అమలు చేయాలని బీజేపీ భావిస్తోంది. లేకపోతే తెలంగాణ, కర్ణాటక దయాదాక్షిణ్యాలపై సీమాంధ్ర ప్రజలు ఆధారపడాల్సి వస్తుందని బీజేపీ పేర్కొంటోంది. ఇక భద్రాచలం రెవెన్యూ డివిజన్‌పై తెలంగాణకు హక్కు లేదని, అది 1820 నుంచి 1959 వరకు సీమాంధ్రలో ఉందని బీజేపీ వాదిస్తోంది. ఈ మేరకు జీవో 111, 27.6.2005లో పేర్కొన్నట్లుగా మొత్తం 134 గ్రామాలను భద్రాచలం రెవెన్యూ డివిజన్‌తో పాటు సీమాంధ్రలో చేర్చాలని ప్రతిపాదిస్తున్నారు.
ప్రాజెక్టులకు చట్టపరమైన పరిరక్షణ: తెలంగాణ, సీమాంధ్రలోని అన్ని నీటిపారుదల ప్రాజెక్టులకు చట్టపరమైన రక్షణ కల్పిస్తూ పార్ట్ 9లో కొత్త క్లాజును చేర్చాలని, రాయలసీమకు గోదావరి బేసిన్ నుంచి 200 టీఎంసీల నీటిని పంపిణీ చేసేందుకు వీలుగా పార్ట్ 9లో కొత్త క్లాజును చేర్చాలని ప్రతిపాదిస్తున్నారు. హైదరాబాద్‌లో సీమాంధ్ర ప్రజలకు భద్రత: తెలంగాణలో 50 లక్షల మంది సీమాంధ్ర ప్రజలున్నారని. అందులో సగం మందికి పైగా హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల్లో ఉన్నారని బీజేపీ పేర్కొంది. రాజధాని వీరి జీవితంలో భాగమని, వీరు రాజధాని అభివృద్దిలో కీలక పాత్ర పోషించారని, వీరిని ఉమ్మడి రాజధాని పేరుతో మోసగించేందుకు ప్రయత్నిస్తున్నారని, న్యాయస్థానాలు కూడా దీన్ని కొట్టివేసే అవకాశాలున్నాయి బీజేపీ వాదిస్తోంది.
కొత్త రాజధాని: కొత్త రాజధాని విషయంలో మున్ముందు ఎలాంటి వివాదాలు లేకుండా ఉండాలంటే బిల్లులోనే సీమాంధ్రకు కొత్త రాజధాని పేరును ప్రకటించాలని బీజేపీ డిమాండ్ చేస్తోంది. ప్రజల్లో గందరగోళ పరిస్థితులు తలెత్తకుండా ఉండాలంటే రాజ్యాంగ సవరణ ద్వారా ఉమ్మడి రాజధానిని ఏర్పర్చాలని బీజేపీ సీమాంధ్ర నేతలు భావిస్తున్నారు. ఈ మేరకు ఆర్థిక ప్యాకేజీ ఎంతో బిల్లులోనే పేర్కొనాలని కోరుతోంది.
ఉపాధి అంశాలు: ప్రభుత్వోద్యోగులు విభజన తర్వాత ఎక్కడ కావాలంటే అక్కడ పనిచేసేందుకు అవకాశం కల్పించాలని బీజేపీ డిమాండ్ చేస్తోంది.
ఆర్థిక మెమోరాండం: అత్యంత కీలకమైన ఆర్థిక మెమోరాండంను బిల్లులో భాగంగా చేర్చాలి.
హైదరాబాద్ రెవెన్యూ: రాష్ట్ర రెవెన్యూలో 30 శాతం హైదరాబాద్ నగరం నుంచే లభిస్తోంది సీమాంధ్రకు ఈ ఆదాయంలో ఎంత వాటా లభిస్తుందో బిల్లులో స్పష్టంగా పేర్కొనాలి.
ఉన్నత సంస్థలు, ప్రాజెక్టులు: 13వ షెడ్యూలులోని 5వ అంశంలో ఐఐటీ, ఐఐఎం, ఎన్ఐటీ, కేంద్ర విశ్వవిద్యాలయాలు వంటి సంస్థలను 12, 13 వ ప్రణాళికలో సీమాంధ్రలో ఏర్పరుస్తామని చెప్పారు. కేవలం హామీలు సరిపోవు. నిర్ణీత కాలంలో ప్రణాళికాసంఘం ఆమోదంతో అమలు చేసేందుకు బిల్లులో స్పష్టత ఇవ్వాలి. అదే విధంగా క్రూడ్ ఆయిల్ రిఫైనరీ, వైజాగ్-చెన్నై పారిశ్రామిక కారిడార్, విమానాశ్రయాల విస్తరణ పై ఉత్తుత్తి వాగ్దానాలు చేర్చారు. ఈమేరకు ఉత్తర్వులను బిల్లులో చేర్చాలి.
సీమలో స్టీలు ప్లాంట్: రాయలసీమలోని కడప జిల్లాలో ఉపాధి అవకాశాలు పెంచేందుకు బ్రాహ్మణి స్టీల్స్ స్థానంలో ప్లాంట్‌ను నెలకొల్పాలి. దాని బదులు ఖమ్మంలో పెడతామని హామీ ఇవ్వడం సరి కాదు.
భారీ ప్యాకేజీ: ఉత్తర కోస్తా, రాయలసీమ ప్రాంతాలకు భారీ ఆర్థిక ప్యాకేజీని నిర్ణయించి బిల్లులో చేర్చాలి.
- See more at: http://www.andhrajyothy.com/node/55896#sthash.ka1G7Dy3.dpuf

No comments:

Post a Comment