Saturday, 25 January 2014

ముసాయిదా బిల్లే

మేం పంపించింది ముసాయిదా బిల్లే : కేంద్ర హోం శాఖ

Published at: 25-01-2014 20:25 PM
 New  0  0 
 
 

న్యూఢిల్లీ, జనవరి 25 : రాష్ట్ర అసెంబ్లీకి తాము పంపించింది ముసాయిదా బిల్లేనని కేంద్ర హోం శాఖ స్పష్టం చేసింది. ఈ మేరకు ఈ నెల మొదటి వారంలో రాష్ట్ర ప్రభుత్వానికి రాసిన లేఖలో పేర్కొంది. బిల్లుతో పాటు లక్ష్యాలు, కారణాల ప్రకటన.. వీటికి సంబంధించిన నోట్స్, క్లాజులు.. ఆర్థిక పత్రం.. ప్రతిపాదనల పరిధిని వివరించే, అవి సాధారణమైనవా లేక అ సాధారణమైనవా తెలియజేసే శాసన ప్రాతినిధ్య పత్రాన్ని కూడా పంపించాలని రాష్ట్ర శాసనసభలోని కొందరు సభ్యులు కోరారని, కాబట్టి ఆ సమాచారాన్ని తమకు పంపించాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డిసెంబర్ 18వ తేదీన కేంద్ర హోం శాఖను కోరారు. దీనికి హోం శాఖ జనవరి మొదటి వారంలో సమాధానం ఇస్తూ ఒక లేఖను పంపించింది. రాష్ట్ర అసెంబ్లీకి పంపించింది ముసాయిదా బిల్లేనని, కాబట్టి ముసాయిదా బిల్లులో ఆ వివరాలేమీ ఉండవని స్పష్టం చేసింది. వాస్తవానికి తామే ఇంకా ఆ వివరాలన్నింటినీ సిద్ధం చేయలేదని, కాబట్టి ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం కోరిన సమాచారాన్ని ఇవ్వటం తొందరపాటు అవుతుందన్నది తమ అభి ప్రాయమని అందులో పేర్కొంది.
ఆ లేఖలో ఇంకా ఏమని పేర్కొన్నారంటే..
"బిల్లు లక్ష్యాలు, కారణాల ప్రకటన.. వీటికి సంబంధించిన నోట్స్, క్లాజులు.. ఆర్థిక పత్రం.. ప్రతిపాదనల పరిధిని వివరించే, అవి సాధారణమైనవా లేక అ సాధారణమైనవా తెలియజేసే శాసన ప్రాతినిధ్య పత్రాన్ని కూడా పంపించాలని రాష్ట్ర శాసనసభలోని కొందరు సభ్యులు కోరారని, కాబట్టి ఆ సమాచారాన్ని పంపించాలని మీరు చేసిన విజ్ఞప్తిని మేం పరిశీలించాం.
అయితే, ముసాయిదా బిల్లు ఉద్దేశ్యం సుస్పష్టం. ఇది ప్రస్తుత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని రెండు ప్రత్యేక రాష్ట్రాలుగా చేయాలని కోరుతోంది. ఆ రెండు రాష్ట్రాలకూ ప్రాంతాలను నిర్దేశించి, పార్లమెంటు, రాష్ట్ర శాసనవ్యవస్థల్లో తప్పనిసరి అయిన అనుబంధ, యాదృచ్ఛిక ప్రాతినిధ్యాలకు సంబంధించిన నిబంధనల్ని ఏర్పాటు చేస్తుంది. అలాగే, ఆదాయాల పంపిణీ, ఆస్తులు, అప్పుల కేటాయింపులు, సాగునీటి వనరులు, ఇంథనం, సహజ వనరులు, ఇతర అంశాల యాజమాన్యం, అభివృద్ధికి సంబంధించిన నిబంధనల్ని ఏర్పాటు చేస్తుంది. అయితే, (మీరు కోరిన) పైన పేర్కొన్న నాలుగు అంశాలూ ముసాయిదా బిల్లులో అంతర్భాగం కాదు. కాబట్టే వాటిని ఇందులో చేర్చలేదు. నేనిక్కడ మరొక విషయం చేర్చదల్చుకున్నాను.. ఈ నాలుగు అంశాలూ అనుబంధ అంశాలు. న్యాయ శాఖను సంప్రదించి పార్లమెంటులో ప్రవేశపెట్టే ముందు బిల్లును కేంద్ర కేబినెట్ ఆమోదిస్తుంది. ఆ తర్వాత పైన పేర్కొన్న నాలుగు అంశాలనూ తయారు చేస్తారు. ప్రస్తుతానికి ఇది ముసాయిదా బిల్లే. రాజ్యాంగంలోని ఆర్టికల్ 3 ప్రకారం తప్పనిసరి అయిన ఆంధ్రప్రదేశ్ శానస సభ క్లాజుల వారీ వైఖరి కోసం ఇది ఎదురు చూస్తోంది. ఈ నేపథ్యంలో, పైన పేర్కొన్న నాలుగు అంశాలనూ దీనిలో పేర్కొనటం తొందరపాటు అవుతుందనేది మా అభి ప్రాయం.
వివిధ మంత్రిత్వ శాఖలు, ఇతర భాగస్వామ్య పక్షాలు, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుంచి సేకరించిన సమాచారానికి సంబంధించి.. ఈ సమాచారాన్నంతా ఇప్పటికీ ఒకే నివేదికలాగా తయారు చేయలేదు. అయితే, ఈ సమాచారాన్ని కేంద్ర కేబినెట్ నియమించిన మంత్రుల బృందం నివేదిక తయారు చేసేందుకు ఉపయోగించాం. విస్తృతంగా ఉపయోగించిన మరొక సమగ్ర నివేదిక జస్టిస్ బీఎన్ శ్రీకృష్ణ నివేదిక. ఇది హోం శాఖ వెబ్‌సైట్‌లో ఉంది.''
- See more at: http://www.andhrajyothy.com/node/58040#sthash.Qzwrk3ya.dpuf

No comments:

Post a Comment