10 వామపక్షాల సమావేశం డిమాండ్ విజయవాడ/తాడేపల్లి, సెప్టెంబర్ 1 (ఆంధ్రజ్యోతి): నూతన రాష్ట్ర రాజధాని విషయంలో ప్రభుత్వ వైఖరి ప్రజల్ని అయోమయానికి గురిచేస్తోందని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి పి.మధు అన్నారు. రాజధాని ఏక్కడ ఏర్పాటు చేయాలన్న విషయంలో ఏకాభిప్రాయం సాధించే వరకూ ప్రభుత్వం దీనిపై ఓ నిర్ణయానికి రాకూడదని ఆయన పేర్కొన్నారు. సోమవారం విజయవాడలో 10 వామపక్ష పార్టీల సమావేశం జరిగింది. ఆ తర్వాత జరిగిన విలేకర్ల సమావేశంలో మధు మాట్లాడారు. అలాగే గుంటూరు జిల్లా తాడేపల్లిలోనూ ఆయన విలేకరులతో రాజధాని అంశంపై మాట్లాడారు. శివరామకృష్ణన్ కమిటీ సూచనలపై ప్రభుత్వంలోని మంత్రులు తలోమాట మాట్లాడుతూ ప్రజల్ని అయోమయానికి గురిచేస్తూ వాళ్లూ గందరగోళానికి గురౌతున్నారని అన్నారు. కమిటీ సూచనల్ని పట్టించుకోబోమని చెబుతున్న ప్రభుత్వం దీనిపై స్పష్టత సాధించేందుకు అన్ని పార్టీల అభిప్రాయాలు సేకరించి ఏకాభిప్రాయానికి రావాలని అన్నారు. రుణ మాఫీ వాగ్దానం వలన సక్రమంగా రుణాలు చెల్లించే డ్వాక్రా మహిళలు కూడా కట్టడం మానివేయడంతో ప్రస్తుతం బ్యాంకుల నుంచి వారు తీవ్ర ఒత్తిడి ఎదు ర్కొంటున్నారని విమర్శించారు. సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ మాట్లాడుతూ అధికారంలోకి వచ్చి మూడు నెలలు గడుస్తున్నా ముఖ్యమంత్రి చంద్రబాబు ఇచ్చిన ఏ ఒక్క వాగ్దానాన్ని నెరవేర్చలేదన్నారు. ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరుకు నిరసనగా 10 వామపక్ష పార్టీలతో ఐక్య ఉద్యమాన్ని చేపట్టాలని సమావేశం నిర్ణయించిందని తెలిపారు. ఈ నెల 24వ తేదీ వరకూ గడువు ఇస్తున్నామని, ఈలోగా ప్రజా సమస్యలపై ప్రభుత్వం స్పందించకపోతే పెద్దఎత్తున ఐక్య ఉద్యమాన్ని నిర్మిస్తామని హెచ్చరించారు. |
|
No comments:
Post a Comment