భారత్‌ కోసమే జీవిస్తారు..మరణిస్తారు
వారు అల్‌కాయిదా మాట వింటారనుకుంటే భ్రమే
సీఎన్‌ఎన్‌ ఇంటర్వ్యూలో ప్రధాని నరేంద్ర మోదీ

న్యూఢిల్లీ, సెప్టెంబర్‌ 19: దేశం కోసం ప్రాణాలర్పించడానికి భారతదేశ ముస్లింలు సిద్ధంగా ఉంటారని, వారి దేశభక్తిని ఎవ్వరూ ప్రశ్నించలేరని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. ఈ నెలాఖరులో అమెరికాలో పర్యటించనున్న మోదీ.. అమెరికా చానల్‌ సీఎన్‌ఎన్‌తో మాట్లాడారు. ప్రధానిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత మోదీ అంతర్జాతీయ మీడియాకు ఇంటర్వ్యూ ఇవ్వడం ఇదే తొలిసారి. ప్రశ్నోత్తరాలు స్థూలంగా ఇలా సాగాయి...
ప్రపంచంలోనే అత్యంత ప్రాచీన ప్రజాస్వామ్య దేశమైన అమెరికా.. ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశమైన భారత్‌ మధ్య మరింత సన్నిహిత సంబంధాలు ఉండి ఉండాల్సిందని రెండు దేశాల్లోనూ చాలామంది కోరుకుంటున్నారు. కానీ, అది ఇన్నాళ్లుగా జరగలేదు. ఇరు దేశాల మధ్యా కొన్ని ఘర్షణలు, ప్రతిబంధకాలూ చోటుచేసుకుంటున్నాయి. ఈ నేపథ్యంలో.. భారత్‌, అమెరికాల మధ్య నిజమైన వ్యూహాత్మక బంధం ఏర్పడుతుందని మీరు భావిస్తున్నారా?
దీనికి నా వద్ద ఒకే ఒక్క పదంతో కూడిన జవాబు ఉంది. అదేంటంటే.. ‘అవును’! ఈ విషయాన్ని నేను గొప్ప ఆత్మవిశ్వాసంతో చెబుతున్నాను. ఇండియా, అమెరికాల మధ్య చాలా పోలికలున్నాయి. కొన్ని శతాబ్దాలను పరికించి చూస్తే.. రెండు విషయాలు అర్థమవుతాయి. ఒకటి.. ప్రపంచం నలుమూల నుంచి ప్రజలను అమెరికా తన వద్దకు చేర్చుకుంది. రెండు.. ప్రపంచంలోని ప్రతి భాగంలోనూ భారతీయులు ఉన్నారు. ఇది ఈ రెండు సమాజాల లక్షణాలను సూచిస్తుంది. అవును, నిజమే.. గత శతాబ్దంలో రెండు దేశాల సంబంధాల మధ్య కొన్ని ఒడుదొడుకులున్నాయి. కానీ, 20వ శతాబ్దం చివరి నుంచి 21వ శతాబ్దపు తొలి దశాబ్దకాలంలో మనం భారీ మార్పును చూశాం. ఇరు దేశాల మధ్య సంబంధాలు బలపడ్డాయి. చారిత్రకంగా, సాంస్కృతికపరంగా కలిసిపోయాయి. ఇవి మరింత బలపడతాయి.
భారతదేశంతో దృఢమైన సంబంధాన్ని ఏర్పరచుకోవడానికి, బలపరుచుకోవడానికి వాషింగ్టన్‌ మనస్ఫూర్తిగా ప్రయత్నించిందని మీరు భావిస్తున్నారా?
భారత్‌, అమెరికా మధ్య సంబంధాలను కేవలం ఢిల్లీ-వాషింగ్టన్‌ పరిధిలో చూడకూడదు. దీనికి చాలా విస్తృతి ఉంది. మంచి విషయమేంటంటే.. ఢిల్లీ, వాషింగ్టన్‌ల మధ్య సామరస్యపూర్వక వాతావరణం ఉంది.
కశ్మీర్‌, గుజరాత్‌లో అణచివేతకు గురవుతున్న ముస్లింలను ఆదుకునేందుకు భారత్‌లోనూ, అలాగే దక్షిణాసియాలోనూ అల్‌కాయిదా విభాగాన్ని ఏర్పాటు చేస్తామని పేర్కొంటూ ఆ సంస్థ అధినేత ఒక వీడియో విడుదల చేశారు. అలాంటి ప్రయత్నాలు విజయవంతమవుతాయని మీరేమైనా ఆందోళన చెందుతున్నారా?
నా ఉద్దేశం ప్రకారం.. వారు (అల్‌కాయిదా) మా దేశంలోని ముస్లింలకు అన్యాయం చేస్తున్నారు. భారతీయ ముస్లింలు తమ మాట వింటారని ఎవరైనా భావిస్తే వారు భ్రమల్లో ఉన్నట్టే. భారతీయ ముస్లింలు దేశం కోసం జీవిస్తారు. దేశం కోసమే మరణిస్తారు. భారతదేశానికి చెడు చేసే దేన్నీ వారు కోరుకోరు.
భారతదేశంలో 17 కోట్ల మంది ముస్లింలున్నారు. కానీ, వారిని అల్‌కాయిదా వైపు వెళ్లకుండా ఆపుతున్నదేమిటి?
దీనిపై మానసిక, మతపరమైన విశ్లేషణ చేయడానికి నేను తగిన వ్యక్తిని కాదు. కానీ, ప్రపంచంలో మానవత్వానికి రక్షణ ఉందా లేదా.. మానవత్వంపై నమ్మకం ఉన్నవారు ఏకమవుతారా లేదా అన్నదే ప్రశ్న. ఇది ఏదో ఒక దేశానికో.. ఒక జాతికో ఎదురైన సంక్షభం కాదు.. మానవత్వానికి ఎదురవుతున్న సంక్షోభం. కాబట్టి, దీన్ని మనం మానవత్వానికి, అమానుషత్వానికీ మధ్య జరుగుతున్న పోరుగా చూడాలి.
ముస్లిం నేతల హర్షం
‘భారతీయ ముస్లింలు దేశం కోసం జీవిస్తారు. దేశం కోసమే మరణిస్తార’న్న మోదీ వ్యాఖ్యలు..అమెరికా వీసా పొందడం కోసమేనని కాంగ్రెస్‌ ప్రతినిధి సందీప్‌ దీక్షిత్‌ విమర్శించారు. ముస్లింలకు ఎవరి దగ్గరి నుంచీ ఎలాంటి సర్టిఫికెట్‌ అక్కర్లేదని పేర్కొన్నారు. ఇక.. మోదీ వ్యాఖ్యలను స్వాగతిస్తున్నామని, ఆ వ్యాఖ్యల పట్ల ఎవరికీ అభ్యంతరం లేదని పేర్కొన్న కాంగ్రెస్‌ నేత సల్మాన్‌ ఖుర్షీద్‌.. ఈ వ్యాఖ్యలు చేసేటప్పుడు మోదీ తన సహచరులైన యోగి ఆదిత్యనాథ్‌, గిరిరాజ్‌ సింగ్‌, అమిత్‌షా వంటివారిని పరిగణనలోకి తీసుకున్నారా అని ప్రశ్నించారు. మోదీ వ్యాఖ్యలను బీజేపీ కట్టుబడి ఉంటుందో లేదో చూడాలన్నారు. అలాగే, ఈ విషయాన్ని మోదీ యూఎస్‌ టూరు ముందు కాకుండా ఎర్రకోట ప్రసంగంలో ఎందుకు చెప్పలేదన్నారు. మరోవైపు.. ముస్లిం మత పెద్దలు, బీజేపీ నేతలు మోదీ వ్యాఖ్యల పట్ల హర్షం వ్యక్తం చేశారు. లవ్‌ జీహాద్‌ పేరుతో ముస్లింలను నిందిస్తున్నవారికి ప్రధాని వ్యాఖ్యలే సమాధానమని ఒక మత పెద్ద వ్యాఖ్యానించారు.
ఇక.. మోదీ ఈ మాటను గతంలోనే తమతో అన్నారని కేంద్ర మంత్రి నజ్మాహెప్తుల్లా అన్నారు. ముస్లిం యువత ఐఎస్‌ఐఎస్‌, అల్‌కాయిదా ట్రాప్‌లో పడకుండా మోదీ వ్యాఖ్యలు ఆపుతాయని అభిప్రాయపడ్డారు. ప్రతిపక్షాలు, విమర్శకులు ఇప్పటికి కూడా మోదీపై ముస్లిం వ్యతిరేకిగా ముద్ర వేస్తే అది హాస్యాస్పదమన్నారు. పార్టీ అభిప్రాయాన్నే మోదీ చెప్పారని బీజేపీ నేత షానవాజ్‌ హుస్సేన్‌ అన్నారు అవి మోదీ గుండెలోతుల్లోంచి వచ్చిన మాటలని బీజేపీ ప్రతినిధి ఎంజే అక్బర్‌ చెప్పారు.



http://www.andhrajyothy.com/Artical.aspx?SID=21825&SupID=29