Monday 1 September 2014

రాజధాని బెజవాడే!

రాజధాని బెజవాడే!


విజయవాడ-గుంటూరు మధ్యే నిర్మాణం
ఏపీ కేబినెట్‌ నిర్ణయం.. నేడు సభలో ప్రకటన
50 వేల ఎకరాలు సేకరించే యోచన
స్థల సేకరణ సమస్య వస్తే నూజివీడు వైపు
కుదరకుంటే దొనకొండ ఉండనే ఉంది!
60ః40 ఫార్ములా ప్రకారం భూసేకరణ
స్థల పరిశీలన, సేకరణకు మంత్రుల కమిటీ
ప్రభుత్వ కార్యాలయాలు రాజధానిలోనే
పరిశ్రమలు, విద్యా సంస్థల వికేంద్రీకరణ
అన్ని జిల్లాల సమగ్ర అభివృద్ధి
ఏపీ మంత్రివర్గం ఏకాభిప్రాయం
శివరామకృష్ణన్‌ సిఫారసులు తూచ్‌!
రాజధానికి 1.35 లక్షల కోట్లు కావాలి!
ఆర్థిక సంఘాన్ని కోరాలని నిర్ణయం


హైదరాబాద్‌, సెప్టెంబర్‌ 1 నవ్యాంధ్రప్రదేశ్‌ రాజధానిపై ఊహాగానాలు, అనిశ్చితి, అయోమయానికి తెర దించాలని చంద్రబాబు ప్రభుత్వం నిర్ణయించుకుంది. విజయవాడ - గుంటూరు మధ్యే రాష్ట్ర రాజధానిని ఏర్పాటు చేయాలని తీర్మానించింది. ‘విజయవాడ-గుంటూరు మధ్యే రాజధాని’ అని కేబినెట్‌ ఏకగ్రీవంగా నిర్ణయం తీసుకుంది. ‘విజయవాడ-గుంటూరు మధ్య రాజధాని అవాంఛనీయం! అక్కడ ప్రభుత్వ కార్యాలయాలను కేంద్రీకరించవద్దు’ అని శివరామకృష్ణన్‌ కమిటీ చేసిన సిఫారసుతో కలకలం రేగిన సంగతి తెలిసిందే. ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన సోమవారం హైదరాబాద్‌లో జరిగిన మంత్రివర్గ సమావేశంలో ఈ అంశంపై కీలక చర్చ జరిగింది. ముందుగా కార్మిక మంత్రి అచ్చెన్నాయుడు ఈ అంశాన్ని లేవనెత్తారు.
‘‘శివరామకృష్ణన్‌ కమిటీ నివేదికలో రకరకాల వైరుధ్యాలు ఉన్నాయి. అవి అనవసరమైన అపోహలకు దారితీస్తున్నాయి. రాజధానిపై ఇప్పటికే రాష్ట్ర ప్రజల్లో ఒక స్పష్టత ఉంది. విజయవాడ- గుంటూరు మధ్య రాజధానిని పెడుతున్నామని మనం అనేకసార్లు ప్రకటించాం. దానికి కట్టుబడి సత్వరం నిర్ణయం తీసుకుంటే మంచిది’’ అని ఆయన సూచించారు. దీనిపై చంద్రబాబు మంత్రులందరి అభిప్రాయాలను తీసుకున్నారు. ఇప్పటికే ప్రభుత్వ మనోగతం ప్రజల్లోకి వెళ్లినందువల్ల ఇక జాప్యం చేయడం తగదని, రాజధానిపై స్పష్టత ఇవ్వడం మంచిదని మంత్రులంతా ఏకగ్రీవంగా సూచించారు. శివరామకృష్ణన్‌ కమిటీ సూచించినట్లుగా పరిపాలనా విభాగాలను తలా ఒక చోట ఏర్పాటు చేయడంతో ప్రజలకు అసౌకర్యం కలిగించడం తప్ప ఉపయోగం లేదని అభిప్రాయపడ్డారు. పరిపాలన అంతా రాజధానిలో ఉంచి, అభివృద్ధిని మాత్రం వికేంద్రీకరించాలని తెలిపారు. కేంద్ర విద్యా సంస్థలు, పరిశ్రమలు, ఐటీ పార్కులు వంటివాటిని అన్ని జిల్లాలకు విస్తరించి... అభివృద్ధి అన్నిచోట్లా సమానంగా విస్తరించేలా చూడాలని అంతా అభిప్రాయపడ్డారు. ఈ సూచనలకు ముఖ్యమంత్రి చంద్రబాబు ఆమోద ముద్ర వేశారు.
విజయవాడ- గుంటూరు మధ్యే రాజధాని ఉంటుందని మంత్రివర్గ సమావేశంలోనే ఆయన ప్రకటించారు. అక్కడ భూ సేకరణకు ఏదైనా ఇబ్బంది వస్తే... విజయవాడ పరిసరాల్లోనే మరెక్కడైనా చూస్తామని ఆయన చెప్పారు. విజయవాడ-గుంటూరు మధ్య భూమి లభ్యం కాకపోతే నూజివీడు పరిసరాల్లోని అటవీ భూములను తీసుకొని అక్కడ రాజధానిని ఏర్పాటు చేయాల్సి వస్తుందని ఆయన అన్నారు. ఒక మంత్రి సూచనకు ఆయన ప్రతిస్పందిస్తూ... కృష్ణా నదికి అటూఇటూ ఉన్న ప్రాంతం కూడా బాగానే ఉంటుందని, అవసరమైతే దానిని కూడా పరిగణనలోకి తీసుకోవాలని అధికారులకు చెప్పారు. ‘ఎక్కడా దొరకకపోతే దొనకొండ ఉండనే ఉంది. ఇలాంటి ప్రత్యామ్నాయాలు చాలానే ఉన్నాయి’ అని కూడా చంద్రబాబు వ్యాఖ్యానించారు.
భూసేకరణకు కమిటీ
రాజధానికి సరైన స్థలం చూసి రైతులతో సంప్రదింపులు జరిపి, భూ సేకరణ చేయడానికి ఐదుగురు మంత్రులతో ఒక కమిటీని ఏర్పాటు చేశారు. ఇందులో యనమల, పి.నారాయణ, అచ్చెన్నాయుడు, దేవినేని ఉమా, పత్తిపాటి పుల్లారావు ఉన్నారు. కామన్‌ పూల్‌ విధానంలో 60ః40 నిష్పత్తిలో రైతుల నుంచి భూమి సేకరించాలని, భూమి ఇచ్చిన రైతులకు అత్యుత్తమ ధర వచ్చేలా చూడాలని చంద్రబాబు ఆదేశించారు. మరో వందేళ్ల అవసరాలకు సరిపడేలా ఏభై వేల ఎకరాల భూమిని సేకరించాలని నిర్ణయించారు.
రాజధానిపై ప్రభుత్వ నిర్ణయాన్ని చంద్రబాబు మంగళవారం అసెంబ్లీలో అధికారికంగా ప్రకటించనున్నారు. వైఎస్‌ వర్ధంతి నేపథ్యంలో వైసీపీ ఎమ్మెల్యేలు ఇడుపులపాయ వెళ్తున్నారని మంత్రి గంటా శ్రీనివాసరావు చెప్పినప్పుడు వారి కోసం ప్రభుత్వం తన పనిచేయడం ఆపదని, మంత్రివర్గంలో తీసుకొన్న నిర్ణయాలను ప్రజలకు చెప్పాల్సిన ధర్మం ఉందని చంద్రబాబు వ్యాఖ్యానించారు. 

No comments:

Post a Comment