- కృష్ణా జిల్లాలో 1.23 లక్షల ఎకరాల అటవీ భూమి - విజయవాడ రేంజ్‌లోనే 45 వేల ఎకరాలు - సర్కారుకు అధికార యంత్రాంగం నివేదిక (విజయవాడ - ఆంధ్రజ్యోతి) ప్రైవేటు భూములు సేకరించాల్సిన అవసరంలేదు. వ్యవసాయ భూములను లాక్కోవాల్సిన అవసరం అంతకంటే లేదు! నవ్యాంధ్రప్రదేశ్ రాజధాని నిర్మాణం కోసం... రాష్ట్ర విభజన చట్టం అనుమతించిన మేరకు కృష్ణా జిల్లాలోనే, విజయవాడ పరిసరాల్లోనే పుష్కలంగా అటవీ భూములు అందుబాటులో ఉన్నాయి. ఇవన్నీ ‘డీగ్రేడెడ్’ అటవీ భూములని, రాజధాని అవసరాలకోసం ఉపయోగించుకోవచ్చునని అధికారులు గుర్తించారు. ఒక్క కృష్ణా జిల్లాలోనే విజయవాడ దగ్గరగా లక్ష ఎకరాల అటవీ భూములు ఉన్నట్టు జిల్లా యంత్రాంగం గుర్తించింది. దీనిపై ప్రభుత్వానికి నివేదిక పంపింది. రాజధాని విజయవాడ - గుంటూరు మధ్యనే ఉంటుందని రాష్ట్ర మంత్రివర్గం నిర్ణయించిన సంగతి తెలిసిందే. భూసేకరణకు ఇబ్బంది తలెత్తితే నూజివీడు వైపు, అక్కడా కుదరకపోతే దొనకొండను ప్రత్యామ్నాయంగా చూడాలని ముఖ్యమంత్రి చంద్రబాబు వ్యాఖ్యానించినట్లు వార్తలు వచ్చాయి. అయితే... అలాంటి అవసరమేదీ లేదని, రాష్ట్ర ప్రభుత్వం తొలి ప్రాధాన్యత ఇస్తున్న విజయవాడ పరిసరాలలోనే రిజర్వ్ భూములు ఎక్కువగా ఉన్నాయని అధికారుల లెక్కలో తేలింది. కృష్ణా జిల్లా వ్యాప్తంగా అందుబాటులో ఉన్న సమస్త భూముల సమాచారాన్ని ఆయా విభాగాలు ప్రభుత్వానికి సమర్పించాయి. ‘ఆంధ్రజ్యోతి’కి అందిన జాబితా ప్రకారం... గుంటూరు జిల్లాను పక్కనపెడితే, ఒక్క కృష్ణా జిల్లాలో 1.23 లక్షల ఎకరాల అటవీ భూ ములు అందుబాటులో ఉన్నాయి. అందు లోనూ... విజయవాడ అటవీ రేంజ్ పరిధిలోనే 45 వేల ఎకరాల అటవీభూములున్నాయి. విజయవాడ రూరల్ మండలం పరిధిలో నున్న, పాతపాడు, పి.నైనవరం ప్రాంతాలలో 13,488.60 ఎకరాల అటవీ భూములు ఉన్నాయి. విజయవాడ అర్బన్ మండలం పరిధిలో 300 ఎకరాలు, ఇబ్రహీంపట్నం మండలం పరిధిలో 16305 ఎకరాలు, వీరుపాలపాడు మండలంలో 630 ఎకరాలు, కంచికచర్ల మండలంలో 10500 ఎకరాలు, చందర్లపాడు మండలంలో 927 ఎకరాలు, జగ్గయ్యపేట మండలం పరిధిలో 14,768 ఎకరాల అటవీ భూములు ఉన్నాయని యంత్రాంగం గుర్తించి ఈ వివరాలను ప్రభుత్వానికి పంపించింది. నూజివీడు వైపు ఇలా... మంగళగిరిలో ఎక్కువగా ప్రైవేటు భూములు ఉన్నట్లు అధికారులు గుర్తించారు. ఇక్కడ భూసేకరణ సమస్యగా మారితే... నూజివీడుపై దృష్టి సారించాలని ప్రభుత్వం నిర్ణయించుకుంది. ఈ నియోజకవర్గ పరిసరాలలో సుమారు 25 వేల ఎకరాలకుపైగా దేవాదాయ, ప్రభుత్వ భూ ములు ఉన్నాయి. నూజివీడు రేంజ్‌లోనే 35 వేల ఎకరాల అటవీ భూములు ఉన్నాయి. నూజివీడు మం డలం అన్నవరం, వెంకటాయపాలెం, హనుమంతునిగూడెం, యనమదల, బత్తులవారిగూడెం, జంగం గూడెంలలో 5269.48 ఎకరాల్లో అటవీ భూములు విస్తరించి ఉన్నాయి. విస్సన్నపేట మండలంలో విస్సన్నపేట, కొండపర్వ, తాతకుంట్ల, నరసాపురంలలో 1119.40 ఎకరాల అటవీ భూమి ఉంది. చాట్రాయి మండలంలో చాట్రాయి, చీపురుగూడెం, మంగపేట, మర్రిగూడెం, తుమ్మన్నగూడెం, ఆరుగొలనుపేట, సోమవరం, పోలవరం, పోతనపల్లి, పార్వతీపురం, బూరుగుగూడెం, చిత్తపూర్ ప్రాంతాలలో 7500.85 ఎకరాలు అందుబాటులో ఉన్నాయి. నూజివీడు రేంజ్‌లోని ముసునూరు మండలం పరిధిలో ఉన్న సూరేపల్లి, రమణక్కపేట, కాట్రేనిపాడు, గోపవరం, బలివే, వేల్పుచర్ల, చిల్లబోయినపల్లి, లోపూడి, గొల్లపూడి ప్రాంతాలలో 7331.80 ఎకరాల అటవీ భూమి ఉంది. రెడ్డిగూడెం మండలం పరిధిలో 5407 ఎకరాల భూములు ఉన్నాయి. గన్నవరంలో రాజధానికి అవసరమైన విమానాశ్రయం ఉంది. ఇది అంతర్జాతీయ స్థాయికి అభివృద్ధి చేస్తే... నూజివీడును ఆనుకొని ఉన్న మైలవరం, ఆగిరిపల్లి, గన్నవరం నుంచి విజయవాడలు కలిసిపోనున్నాయి. ఈ ప్రాంతాలలో చూస్తే... మైలవరం అటవీ రేంజ్ పరిధిలోకి వచ్చే ఎ.కొండూరు మండలంలో వల్లంపట్ల, చీమలపాడు, అట్లప్రగడలలో 8598 ఎకరాల అటవీ భూమలు ఉన్నాయి. ఇదే రేంజ్ పరిధిలో తిరువూరు మండలంలో మల్లెల, చిట్యాల, అంజనేయపురం, రామన్నపాలెం గ్రామాలను ఆనుకుని 1274.59 ఎకరాల అటవీ భూములు ఉన్నాయి. అలాగే రెడ్డిగూ డెం మండలం నారుకుళ్లపాడు, నాగులూరులో 500 ఎకరాలు, గంపలగూడెం మండల పరిధిలో కనుమూరు, నారికంపాడు, వినగడప, అనుమల్లంక గ్రామాలలో 2974 ఎకరాల అటవీ భూములను గుర్తించింది. ఇంకా కొం డూరు రిజర్వ్ ఫారెస్ట్ భూములు 4150 ఎకరాలు అందుబాటులో ఉన్నాయి. శివరామకృష్ణన్ కమిటీ ఎందుకలా చెప్పింది? వీజీటీఎం ఉడా పరిధిలో ప్రభుత్వ, దేవాదాయ, అటవీ భూములు భారీ సంఖ్యలో అందుబాటులో ఉన్న విషయాన్ని శివరామకృష్ణన్ కమిటీ మాటమాత్రమైనా ప్రస్తావించలేదు. పైగా... ఇక్కడ రాజధాని ఏర్పాటు ఎంతమాత్రం వాంఛనీయం కాదని తేల్చిచెప్పింది. రాజధాని కోసం అటవీ భూములను డీనోటిఫై చేసుకోవటానికి పునర్విభజన చట్టమే వెసులుబాటు కల్పిస్తోంది. శివరామకృష్ణన్ కమిటీ ఈ అంశాన్ని కూడా పరిగణనలోకి తీసుకోకుండా... విజయవాడ, గుంటూరు మధ్య భూములు అందుబాటులో లేవని ప్రకటించటం ఆశ్చర్యాన్ని కలిగిస్తుందని నేతలు వ్యాఖ్యానిస్తున్నారు. |
|
No comments:
Post a Comment