|
నవ్యాంధ్రప్రదేశ్ ప్రజలు ఎప్పుడా, ఎక్కడా అని ఎదురు చూస్తున్న రాజధానిపై అధికారిక ప్రకటన వెలువడనుంది. ముఖ్యమంత్రి చంద్రబాబు గురువారం శాసనసభ వేదికగా దీనిపై ప్రకటన చేయనున్నారు. విజయవాడ-గుంటూరు మధ్యే రాజధాని ఏర్పాటు చేయాలని సోమవారంనాటి మంత్రివర్గ సమావేశంలోనే తీర్మానించారు. మంగళవారం ఈ విషయాన్ని అసెంబ్లీలో ప్రకటించాలని నిర్ణయించుకున్నారు. అయితే... మంచి ముహూర్తం కోసం గురువారానికి వాయిదా వేశారు. గురువారం దశమి మంచి రోజని, అత్యంత కీలకమైన రాజధానిపై మంచిరోజునే ప్రకటన చేస్తే బాగుంటుందని పండితులు సూచించారు. అయితే... ఈ ప్రకటనను ముహూర్తం కోసం వాయిదా వేయలేదని ప్రభుత్వ విప్ కూన రవికుమార్ అసెంబ్లీ లాబీల్లో విలేకరులకు చెప్పారు. ప్రధాన ప్రతిపక్ష నేత జగన్ తన తండ్రి వర్ధంతి సందర్భంగా ఇడుపులపాయ వెళ్లారని, ఆయన సభలో లేనందునే ప్రకటనను వాయిదా వేశామని ఆయన చెప్పారు. రివర్ ఫ్రంట్ ‘రాజధాని’ కొత్త రాజధాని ప్రపంచంలోనే వినూత్నంగా రివర్ ఫ్రంట్ (నదికి అభిముఖం)గా ఉంటుందని టీడీపీ ఎమ్మెల్యే గద్దె రామ్మోహనరావు చెప్పారు. మంగళవారం ఆయన అసెంబ్లీ లాబీల్లో విలేకరులతో మాట్లాడారు. ‘కృష్ణా నదికి ఇరు వైపులా ఉన్న భూముల్లో కొత్త రాజధాని నిర్మాణం జరుగుతుంది. దీనివల్ల నది ఒడ్డున ఒక సుందరమైన నగరం వస్తుందని ముఖ్యమంత్రి భావిస్తున్నారు’’ అని తెలిపారు. కాగా, కొత్త రాజధానిలో సచివాలయం ప్రాంతానికి ఎన్టీఆర్ పేరు పెట్టాల్సిందిగా కోరతామని మంత్రి పత్తిపాటి, ఎమ్మెల్యే ధూళిపాళ నరేంద్ర చెప్పారు. |
|
No comments:
Post a Comment