ప్రత్యేక ఖాతా తెరవనున్న ఏపీ సర్కార్‌ 

హైదరాబాద్‌, సెప్టెంబర్‌ 17 (ఆంధ్రజ్యోతి): రైతు రుణమాఫీ కోసం ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం వినూత్న ఆలోచన చేసింది. రుణమాఫీకి సా యం చేయాలనుకున్న వ్యక్తులు, సంస్థల నుంచి చందాలు స్వీకరించా లని నిర్ణయించింది. రాజధాని నిర్మాణం కోసం ఇప్పటికే నిధులను సేకరిస్తున్న ప్రభుత్వం రుణమాఫీ కోసమూ ఇలాంటి ప్రయత్నమే మొదలు పెట్టనుంది. తిరుమల తిరుపతి దేవస్థానం(టిటిడి) పరిధిలోని వర్తకులు బుధవారం సీఎం చంద్రబాబును కలిసి రాజధానికి నిధులతోపాటు రైతు రుణమాఫీకి రూ.3 లక్షలు చందా అందజేశారు. అయితే, ఇప్పటి వరకు కేవలం రాజధాని నిర్మాణానికి మాత్రమే నిధులు స్వీకరిస్తున్నామని, కొత్తగా రుణమాఫీకి మీరు చందా ఇవ్వడం సంతోషకరమని బాబు వారితో వ్యాఖ్యానించారు. అదే సమయంలో బాబు పక్కనే ఉన్న మీడియా సలహాదారు పరకాల ప్రభాకర్‌ రుణమాఫీ కోసమూ ప్రత్యేక ఖాతా ఏర్పాటుచేస్తే బాగుంటుందని సీఎంకు సూచించారు. దీంతో బాబు ఆర్ధిక శాఖ ఉన్నతాధికారులను రుణమాఫీ చందాల స్వీకరణకు ప్రత్యేక ఖాతాను తెరవాల్సిందిగా ఆదేశించారు. రాష్ట్రంలో తొలిసారిగా రైతు రుణమాఫీకి టీటీడీకి చెందిన శ్రీవెంకటేశ్వర దుకాణ సముదాయాల సంఘం రూ.3 లక్షల చెక్కును సీఎంకు అందజేసింది. కోడూరు బాలసుబ్రమ ణ్యం ఆధ్వర్యంలో సురేష్‌, బి.సంతోష్‌కుమార్‌, ఎకె రాయ్‌, ఆర్‌వీ గిరి తదితరులు సీఎంను కలిసి చెక్కు అందజేశారు.
రుణమాఫీకి వ్యవసాయ కార్పొరేషన్‌: ప్రత్తిపాటి
‘వ్యవసాయానికి దన్నుగా నిలిచేందుకు ప్రత్యేక కార్పొరేషన్‌ను ఏర్పాటు చేయాలని యోచిస్తున్నట్లు ఏపీ వ్యవసాయశాఖ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు తెలిపారు. రుణమాఫీ అమలు చేసేందుకు అవసరమైతే ఆ కార్పొరేషన్‌ ఆస్తు లనూ తనఖా పెట్టనున్నామని చెప్పారు. ఈవిధంగా తొలి విడతలో రూ.20వేల కోట్లు సేకరిస్తామని చెప్పారు. ఈ విషయంలో ప్రైవేటు కంపెనీల తరహాలో ముందుకు వెళ్లాలని భావిస్తున్నామన్నారు. సచివాలయంలో బుధవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. రుణమాఫీకి ఆర్బీఐ సహకరించకపోయినా, సాధ్యమైనంత త్వరగా దాన్ని పూర్తిచేయాలని టీడీపీ ప్రభుత్వం భావిస్తోందన్నారు. రుణమాఫీని అమలు చేసేందుకు సెక్యూరిటైజేషన్‌ విధానంలో ముందుకు వెళ్లాలా.. బాండ్లు జారీ చేయాలా అన్న విషయం ఆలోచిస్తున్నామన్నారు. ప్రభుత్వ ఆదాయాన్ని తనఖా పెట్టే ఆలోచనా ఉందన్నారు. ఎర్ర చందనం ద్వారా వచ్చిన ఆదాయాన్ని కూడా రుణమాఫీకే వినియోగించుకుంటామని తెలిపారు. వ్యవసాయ, చేనేత, డ్వాక్రా రుణాలన్నీ కలిపితే రూ.50 వేల కోట్లు ఉంటాయని, తొలి విడతగా రూ.20 వేల కోట్ల నిధుల సమీకరణకు అన్ని మార్గాలను అన్వేషిస్తున్నామన్నారు. బ్యాంకులు రైతులకు కొత్తగా రుణాలు ఇవ్వడం లేదన్నది నిజమేనని అంగీకరించారు. రూ.1.5 లక్షల వరకు బకాయి ఉన్నవారిని రుణం చెల్లించాలని అడగవద్దని ఎస్‌ఎల్‌బీసీ కన్వీనర్‌కు సీఎం లేఖ రాశారని మంత్రి తెలిపారు.
కాగా... కూరగాయలు పండించే రైతులు గ్రూపులుగా ముందుకువస్తే వారికోసం రైతుబజార్లు, అక్కడికి వెళ్లేందుకు వాహనాలను సమకూరుస్తామన్నారు. యార్డుల్లో ధాన్యం నిల్వ చేసుకునే రైతులకు రైతు బంధు కింద ఇప్పటి వరకు రూ.లక్ష రుణం ఇస్తున్నామని, దాన్ని ఇకపై రూ.2లక్షలకు పెంచామన్నారు. నిల్వ చేసుకునే కాలాన్ని 90 నుంచి 180 రోజులకు పెంచామన్నారు. కాగా ఆంధ్రప్రదేశ్‌కు చంద్రబాబు తర్వాత ఆయన కుమారుడు లోకేష్‌ ముఖ్యమంత్రి అవుతారని పుల్లారావు అన్నారు. ఎన్టీఆర్‌ మనవడిగా లోకేష్‌కు ఆ అర్హత ఉందన్నారు. ఏపీలో మరో 20 ఏళ్ల వరకు టీడీపీయే అధికారంలో ఉంటుందన్నారు.



http://www.andhrajyothy.com/Artical.aspx?SID=21090&SupID=29