Tuesday, 2 September 2014

విభజనకు ముందే రాజధాని ‘ఫిక్స్‌’!?

విభజనకు ముందే రాజధాని ‘ఫిక్స్‌’!?

ఒంగోలుపై యూపీఏ పెద్దల మొగ్గు ... రాష్ట్రం అడగకున్నా విమానాశ్రయం!
అధ్యయనానికి హడావుడిగా కమిటీ
పర్యటించకున్నా శివరామకృష్ణన్‌ కమిటీ నివేదికలో మార్టూరు-వినుకొండ!
అంతా అనుమానాస్పదమే అంటున్న విశ్లేషకులు

(న్యూఢిల్లీ - ఆంధ్రజ్యోతి) ఎవరు అడిగారో తెలియదు! ఎందుకు అడిగారో కూడా తెలియదు! కానీ... ఒంగోలులో సరికొత్త (గ్రీన్‌ఫీల్డ్‌) విమానాశ్రయం ఏర్పాటుపై భారత విమానాశ్రయాల ప్రాధికార సంస్థ (ఏఏఐ) అధ్యయనం నిర్వహించింది. విమానాశ్రయ నిర్మాణానికి సానుకూలత వ్యక్తం చేసింది. సాధారణ పరిస్థితుల్లో అయితే ఈ వార్త వెనుక అనుమానాలేవీ ఉండేవి కావు! కానీ... ఆంధ్రప్రదేశ్‌ను విభజిస్తారా? తెలంగాణ ఇస్తారా? ఎప్పుడు ఇస్తారు? అనే అంశాలపై మూడు ప్రాంతాల్లో చర్చ, రచ్చ జరుగుతున్న సమయంలోనే ఒంగోలు విమానాశ్రయంపై ప్రతిపాదనలు ఊపిరి పోసుకున్నాయి. గత ఏడాది జూలై 30వ తేదీన కాంగ్రెస్‌ వర్కింగ్‌ కమిటీ రాష్ట్ర విభజనపై నిర్ణయం తీసుకోగా... సరిగ్గా అంతకు మూడు నెలల ముందు, అంటే మే 1వ తేదీనే కేంద్ర పౌర విమానయాన శాఖ ఆదేశం మేరకు ఒంగోలు విమానాశ్రయంలో సాధ్యాసాధ్యాల పరిశీలనకు ఏఏఐ ఒక కమిటీని నియమించింది. అంటే... అధికారిక నిర్ణయంకంటే ముందే కాంగ్రెస్‌ రాష్ట్ర విభజనపై ఓ అంచనాకు వచ్చేసిందా? రాష్ట్ర విభజన జరగకముందే... నవ్యాంధ్రప్రదేశ్‌కు ఒంగోలును రాజధాని చేయాలని ‘ఫిక్స్‌’ అయ్యిందా? ఇవి తాజా అనుమానాలు! యూపీఏ పోయి ఎన్డీయే రావడంతో ఈ ప్రతిపాదనలన్నీ మూలనపడినట్లే!
అయితే... రాజధానిపై యూపీఏ సర్కారు నియమించిన శివరామకృష్ణన్‌ కమిటీ కూడా ఒకపక్క నూజివీడు, గన్నవరంలలో తాత్కాలికంగా రాజధానిని ఏర్పాటు చేయాలని సిఫారసు చేస్తూనే... మరోపక్క విజయవాడ-గుంటూరు పరిధిలో రాజధానిని పెట్టొద్దు అంటూ నివేదిక ఇవ్వటం, మార్టూరు-వినుకొండ, దొనకొండల్లో పర్యటిం చలేదంటూనే ఆ ప్రాంతం అయితేనే రాజధానికి బాగుంటుందని నివేదించడం పలు అనుమానాలకు తావిస్తోంది. సమైక్య ఆంధ్రప్రదేశ్‌ రాషా్ట్రన్ని విభజించటానికి ముందే నవ్యాంధ్ర రాజధానిని ‘ఫిక్స్‌’ చేసేందుకు నాటి పెద్దలు ప్రయత్నించారనే సందేహాలు కలుగుతున్నాయి.
విమానాశ్రయం ఎందుకు?
సాధారణంగా ఏదైనా విమానాశ్రయాన్ని విస్తరించాలన్నా, కొత్తగా విమానాశ్రయం ఏర్పాటు చేయాలన్నా సంబంధిత రాష్ట్ర ప్రభుత్వమే దరఖాస్తు చేసుకోవాలి. పదేపదే విన్నవించుకుంటేగానీ కేంద్రం ఈ విషయంలో కదిలే అవకాశాలు తక్కువ. కానీ... రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఎలాంటి దరఖాస్తు లేకుండానే ఎయిర్‌ పోర్ట్స్‌ అథారిటీ ఆఫ్‌ ఇండియా ఒంగోలులో గ్రీన్‌ఫీల్డ్‌ విమానాశ్రయ నిర్మాణం కోసం ఒక నివేదికను తయారు చేసింది. దీనికోసం గత ఏడాది మే 1వ తేదీన నలుగురు సభ్యుల బృందాన్ని నియమించింది. ఈ బృందం గత ఏడాది ఆగస్టు 14న ప్రకాశం జిల్లా జాయింట్‌ కలెక్టర్‌, ఆర్డీవో, తహశీల్దారులతో కలిసి ఒంగోలులో పర్యటించింది. ఇప్పటికే ఉన్న విమానాశ్రయం (ఉపయోగంలో లేదు) విస్తరణకు స్థలం అందుబాటులో లేకపోవడంతో, కొత్త విమానాశ్రయం ఏర్పాటుకే మొగ్గు చూపింది. ప్రతిపాదిత విమానాశ్రయ స్థలాన్ని పరిశీలించింది.
ఇక్కడ గ్రీన్‌ఫీల్డ్‌ విమానాశ్రయాన్ని నిర్మించొచ్చునని తెలిపింది. విమానాశ్రయ నిర్మాణానికి పెద్దగా అడ్డంకులు లేవని నివేదికలో పేర్కొంది. ‘‘రాష్ట్ర ప్రభుత్వం విమానాశ్రయం కోసం గుర్తించిన స్థలం ఒంగోలు మండలంలో పశ్చిమాన ఉంది. ఇక్కడ ఉన్నవన్నీ పట్టా, డీకే భూములే. అల్లూరు, ఆలేరు, కొప్పోలు గ్రామాలు విమానాశ్రయ ప్రాంతం పరిధిలోకి వస్తాయి. ప్రధానమైన అడ్డంకులు ఏమీ లేనందున ప్రతిపాదిత ప్రాంతంలో విమానాశ్రయ నిర్మాణం సాధ్యమే’’ అని కమిటీ తెలిపింది.
ఎందుకు అనుమానాలు?
ఒంగోలు విమానాశ్రయం ఓకే అయినట్లు ఈ ఏడాది ఫిబ్రవరిలో సంబంధిత మంత్రి రాజ్యసభలో తెలిపారు. అయితే... దీనిపై అప్పట్లో ఎవరికీ అనుమానాలు రాలేదు. అయితే... కమిటీ వేసిన మూడు నెలల్లోపై అధ్యయనం మొత్తం పూర్తి కావడం గమనార్హం. ‘‘విభజన నిర్ణయం, ఆ సమయంలో నవ్యాంధ్ర రాజధానిపై జరిగిన ప్రచారం, ఇప్పుడు శివరామకృష్ణన్‌ కమిటీ నివేదికలో మార్టూరు-వినుకొండ ప్రస్తావన వంటివి చూస్తే మాత్రం యూపీఏ హయాంలోనే రాజధాని ఫిక్స్‌ అయ్యింది అనే అనుమానాలు తలెత్తుతున్నాయి’’ అని రాజకీయ వర్గాలు చెబుతున్నాయి. రాష్ట్ర విభజన సందర్భంగా ఒంగోలు రాజధాని అంటూ పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. కొందరు కాంగ్రెస్‌ నాయకులు కూడా ఈ డిమాండ్లు లేవనెత్తారు. ‘దొనకొండ’ కూడా బాగా ప్రచారంలోకి వచ్చింది. ఇప్పుడు శివరామకృష్ణన్‌ కమిటీ మార్టూరు-దొనకొండ ప్రాంతాలను పరిశీలించనప్పటికీ ఆ ప్రాంతం రాజధానిగా బాగుంటుందని అభిప్రాయపడటం గమనార్హం!
రాజధానికి రూ.1.35 లక్షల కోట్లు ఇవ్వండి!
ఆర్థిక సంఘాన్ని కోరాలని నిర్ణయం.. ప్రతిపాదనలు సిద్ధం చేయాలని ఆదేశం

హైదరాబాద్‌: రాజధాని నిర్మాణం కోసం 14వ ఆర్థిక సంఘాన్ని రూ.1,35,349 కోట్లు అడగాలని ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు ఆర్థిక సంఘానికి ప్రతిపాదనలు పంపించాలని ఉన్నతాధికారులను ఆదేశించింది. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఐవైఆర్‌ కృష్ణారావు అధ్యక్షతన సోమవారం ఆర్థిక శాఖ కార్యదర్శులతో జరిగిన భేటీలో ఈ నిర్ణయం తీసుకున్నారు. అయితే, ఇంత మొత్తంలో నిధులను గ్రాంటుగా రాబట్టుకోవాలంటే ముందుగా ఆంధ్రప్రదేశ్‌కు కేంద్రం ప్రత్యేక హోదాను ప్రకటించాల్సి ఉంది. రాష్ట్ర ప్రభుత్వ ప్రతిపాదనలను 14వ ఆర్థిక సంఘం ఓకే చేసి అక్టోబర్‌ నెలాఖరుకు కేంద్రానికి సిఫారసు చేయాల్సి ఉంది. ఈ లోపే రాష్ట్రానికి ప్రత్యేక హోదా దక్కితే రాజధాని కోసం అయ్యే ఖర్చులో 90 శాతం గ్రాంటుగా రాబట్టుకునే వీలుంటుంది. ఈ నెల 15 వ తేదీ నాటికి ప్రతిపాదనలు సిద్ధం చేసి ఉంచితే... ఆ తర్వాత రాష్ట్ర పర్యటనకు వచ్చే ఆర్థిక సంఘం ప్రతినిధులకు సమర్పించవచ్చునని అధికారులకు సీఎస్‌ తెలిపారు.

No comments:

Post a Comment