Monday, 2 May 2016

ప్రధానిదే బాధ్యత : చంద్రబాబు

ప్రధానిదే బాధ్యత : చంద్రబాబు
03-05-2016 00:58:31


  • మోదీ ప్రకటించిన సాయంలోనూ కోత
  • ఆయన దృష్టి పెడితేనే సమస్యలు పరిష్కారం
  • ప్రధానికి లేఖ రాస్తా.. అవసరమైతే మళ్లీ కలుస్తా
  • నేను మెతక కాదు... దృఢ చిత్తంతో ఉన్నా
  • రాష్ట్ర ప్రయోజనాల విషయంలో రాజీ లేదు
  • కష్టపడటమే నా తప్పా... సమర్థతే శిక్షా?
  • జూన్‌ 2న రెండోసారి నవనిర్మాణ దీక్ష
  • సాయంపై విపక్ష నేతలు కేంద్రాన్ని నిలదీశారా?
  • కేసుల కోసం వెళ్లి.. ముసుగేస్తున్నారు: బాబు
విజయవాడ, మే 2 (ఆంధ్రజ్యోతి): ‘‘విభజన చట్టంలో పేర్కొన్న హామీలను కేంద్రం అమలు చేయాలి కదా? ప్రతికూల పరిస్థితుల్లో ఉన్న రాష్ట్రాన్ని ఆదుకోవలసిన బాధ్యత కేంద్రానికి ఉందా.. లేదా?’’ అంటూ సీఎం చంద్రబాబు కేంద్రంపై ప్రశ్నల వర్షం కురిపించారు. రాషా్ట్రనికి రావలసిన వాటిని దక్కించుకునే విషయంలో కేంద్రంతో రాజీపడేది లేదని స్పష్టం చేశారు. తాను మెతక మనిషినేం కాదని, దృఢచిత్తంతోనే ఉన్నానని ఉద్ఘాటించారు. సోమవారం విజయవాడలో మంత్రివర్గ సమావేశం అనంతరం సీఎం విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్వయంగా ప్రకటించిన సాయంలో సైతం కోత పడుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రత్యేక హోదాసహా రాషా్ట్రనికి రావలసిన అన్ని అంశాలపై ప్రధాని మోదీకి లేఖ రాయాలని మంత్రివర్గ సమావేశంలో నిర్ణయించినట్టు సీఎం వెల్లడించారు.
 
హామీల అమలు కోసం తాను ఇప్పటికి 20-30 సార్లు కేంద్ర మంత్రులను, ప్రధానమంత్రిని కలిశానన్న సీఎం, అవసరమైతే మరోసారి ప్రధానిని కలుస్తానని చెప్పారు. ప్రధానమంత్రి దృష్టి పెడితే అన్ని సమస్యలూ పరిష్కారమవుతాయని ఉద్ఘాటించారు. కేంద్ర ప్రభుత్వ శాఖల అధికారుల నుంచి సరైన సమాచారం ప్రధానికి అందుతోందా? లేదా? అన్న సందేహాన్ని సీఎం వ్యక్తం చేశారు. నిబంధనల పేరిట కేంద్ర ప్రభుత్వ అధికారులు సాయంలో కోత విధిస్తున్నారని విమర్శించారు. విభజన తర్వాత... తొలి ఏడాది రెవెన్యూ లోటు రూ.16 వేల కోట్లకు పైగా ఉంటే కేంద్రం రూ.2,800 కోట్లు మాత్రమే ఇచ్చిందని, రాజధానికి రూ.1300 కోట్లు, వెనుకబడిన జిల్లాలకు రూ. 700 కోట్లు మాత్రమే ఇచ్చిందని, ప్రత్యేక కేటగిరి హోదా, రైల్వే జోన్‌తో సహా అనేక అంశాలు పెండింగ్‌లో ఉన్నాయని వివరించారు.
విభజన చట్టంలో పేర్కొన్న హామీలు చాలవనే అప్పుడు ప్రత్యేక హోదా కావాలనే డిమాండ్‌ ముందుకొచ్చిందని గుర్తు చేశారు. రాష్ట్రానికి న్యాయం చేయాల్సిన బాధ్యత బీజేపీపై ఉందన్నారు. ఆంధ్రప్రదేశ్‌కు ఐదేళ్ల పాటు ప్రత్యేక కేటగిరి హోదా ఇస్తామని కాంగ్రెస్‌ పార్టీ పార్లమెంటులో ప్రకటిస్తే... పదేళ్లు ఇవ్వాలని వెంకయ్యనాయుడు, అరుణ్‌జైట్లీ డిమాండ్‌ చేసిన విషయాన్ని చంద్రబాబు గుర్తు చేశారు. ‘‘కేంద్రం సహకరించలేదు కాబట్టి నేను అభివృద్ధి చేయను. సంక్షేమాన్ని అమలు చేయను అంటే అది బాధ్యతారాహిత్యం అవుతుంది. అప్పులు చేస్తున్నాను. రక రకాల మార్గాల్లో అభివృద్ధికోసం కృషి చేస్తున్నాను’ అని సీఎం పేర్కొన్నారు. కష్టపడటం నా తప్పా? అని ప్రశ్నించారు. జూన్‌ రెండో తేదీన రెండో సారి నవ నిర్మాణ దీక్షను చేయనున్నట్టు సీఎం చంద్రబాబు వెల్లడించారు. ప్రతిపక్ష నేత జగన్‌ కేసుల కోసం ఢిల్లీ వెళ్లి దానికి రాష్ట్రాభివృద్ధి ముసుగు వేస్తున్నారని సీఎం చంద్రబాబు విమర్శించారు.

No comments:

Post a Comment