కాంగ్రెస్ చేసిందే గొప్ప అనే రోజు వస్తుంది: శీలం
30-04-2016 02:37:51
కాంగ్రెస్ సభ్యుడు జేడీ శీలం మాట్లాడుతూ.. విభజన విషయంలో కాంగ్రెస్ చేసిందే గొప్ప అనే రోజు తప్పక వస్తుందన్నారు. ‘‘రాష్ట్ర విభజన సందర్భంగా చాలా జాగ్రత్తగా చర్యలు తీసుకున్నాం. ఏపీ ప్రజల ప్రయోజనాలు కాపాడేందుకు నిర్ధిష్ట ప్రతిపాదనలు చేశాం. హైదరాబాద్‌ను పదేళ్లు మాత్రమే ఉమ్మడి రాజధానిగా చేస్తారనుకున్నాం. ఆ తర్వాత కేంద్రపాలిత ప్రాంతం చేస్తారని భావించాం. కానీ ఆనాటి కేంద్ర మంత్రులు పదేళ్ల తర్వాత హైదరాబాద్ తెలంగాణకు వెళుతుందని చెప్పారు. అందుకు కారణాలేంటో వారికే తెలియాలి. మరి ఒక్కసారిగా హైదరాబాద్ నుంచి పొమ్మంటే మా పరిస్థితి ఏంటని అడిగాం. ఆదాయలోటును భర్తీ చేస్తాం అన్నారు. 2018 నాటికి పోలవరం పూర్తి చేస్తాం అన్నారు. పారిశ్రామికాభివృద్ధికి పన్ను రాయితీలు, రాజధాని నిర్మాణానికి నిధులు ఇస్తామన్నారు. ప్రత్యేక హోదా ఇస్తామని హామీ ఇచ్చారు. ఇప్పుడు ప్రధాని మోదీ వచ్చి మట్టి, నీరు ఇచ్చారు. బహిరంగంగా అబద్ధాలు ఆడొద్దు. ప్రజల్ని ఫూల్స్‌ని చేయొద్దు. అలా చేస్తే ప్రజలు అవకాశం వచ్చినప్పుడు తగిన బుద్ధి చెబుతారు. వెనుకబడ్డ ఏడు జిల్లాలకు రూ.30 వేల కోట్ల నిధులు ఇవ్వాలి. కానీ, రూ.350 కోట్లు ఇచ్చారు. సవతితల్లి ప్రేమ చూపిస్తున్నారు. ఏం చెప్పారు. ఏం చేస్తున్నారు?’’ అని ప్రశ్నించారు. పోలవరాన్ని సొంత కాంట్రాక్టర్లతోనే నిర్మించాలని సీఎం చూస్తున్నారన్నారు. రాషా్ట్రనికి ప్రత్యేక హోదా ఇవ్వకున్నా రాష్ట్ర ప్రభుత్వం నిద్రపోతోందన్నారు. జేడీ శీలం మాట్లాడే సమయంలో జైరాం రమేశ్ జోక్యం చేసుకొని హైదరాబాద్‌ను కేంద్ర పాలిత ప్రాంతం చేసే ఆలోచన ఎప్పుడూ చేయలేదన్నారు. దీనికి శీలం స్పందిస్తూ.. ‘‘విభజన బిల్లు రూపొందించే దశలో జైరాం వచ్చారు. అంతకుముందు జరిగిన చర్చలేవీ ఆయనకు తెలియదు’’ అన్నారు. జైరాంను ఉద్దేశించి.. జైరాం నీకేమీ తెలియదు. ఇప్పుడు గాయాలను కెలకొద్దు అని వ్యాఖ్యానించారు. కాంగ్రెస్ ఎంపీ ఎం.ఎ.ఖాన్ మాట్లాడుతూ.. ‘‘ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాలని, విద్యా సంస్థలు పెట్టాలని కాంగ్రెస్ పార్టీ సూచించింది. రెండేళ్లు గడిచినా కేంద్రం ఈ దిశగా ముందడుగు వేయలేదు. బిల్లులో ఏముందో అది నెరవేర్చలేదు’’ అన్నారు.
No comments:
Post a Comment