Wednesday, 13 April 2016

10వేల చదరపు అడుగులు.. 11 గంటలు!

10వేల చదరపు అడుగులు.. 11 గంటలు! 
14-04-2016 01:39:24

  • సీఎం కార్యాలయానికి శ్లాబ్‌ 
  • గడువుకన్నా 15 రోజుల ముందే పూర్తి 
విజయవాడ, ఏప్రిల్‌ 13 (ఆంధ్రజ్యోతి): నవ్యాంధ్ర రాజధాని అమరావతి చరిత్రలో తొట్టతొలి నిర్మాణంగా రికార్డులకెక్కనున్న తాత్కాలిక సచివాలయంలోని సీఎం కార్యాలయానికి శ్లాబ్‌ నిర్మాణం పూర్తయింది. 10వేల చదరపు అడుగుల విస్తీర్ణంలో ఉన్న సీఎం కార్యాలయానికి నిర్మాణ సంస్థలు 11 గంటల్లో శ్లాబ్‌ నిర్మాణాన్ని పూర్తి చేశాయి. రాజధాని ప్రాంతంలో సుమారు 42.19 ఎకరాల విస్తీర్ణంలో తాత్కాలిక సచివాలయాన్ని నిర్మిస్తున్నారు. ఈ నెలాఖరుకల్లా సీఎం కార్యాలయంసహా మరో 5 భవనాలకు శ్లాబ్‌ నిర్మాణం పూర్తి చేయాలని అధికారులు నిర్దేశించుకున్నారు. కానీ అనుకున్న దానికన్నా ముందుగానే నిర్మాణాలు పూర్తి చేయాలన్న లక్ష్యంతో నిర్మాణ కంపెనీలతో కలిసి సీఆర్డీయే అధికారులు ప్రత్యేక ప్రణాళికలు రూపొందించారు. అందులో భాగంగా మంగళవారం రాత్రి 10 గంటలకు సీఎం కార్యాలయానికి శ్లాబ్‌ నిర్మాణాన్ని మొదలుపెట్టి బుధవారం ఉదయం 9 గంటలకు పూర్తి చేసినట్లు అధికారులు తెలిపారు. శరవేగంగా శ్లాబ్‌ నిర్మాణాన్ని పూర్తి చేసేందుకు షాపూర్జీ అండ్‌ పల్లోంజీ తరఫున తాత్కాలిక సచివాలయ నిర్మాణ పనుల్లో నిమగ్నమైన కార్మికులందరినీ వినియోగించారు. తాత్కాలిక సచివాలయ సముదాయాల్లో అన్నిటికన్నా ముందుగా నిర్మాణం పూర్తయ్యే భవనం సీఎం కార్యాలయమేనని అధికారులు వెల్లడించారు. తాత్కాలిక సచివాలయ నిర్మాణ ప్రాంగణంలోని అన్ని భవనాలు శ్లాబ్‌ దశకు చేరుకున్నాయి. ప్రస్తుతం శ్లాబ్‌ నిర్మాణం పూర్తయిన సీఎం కార్యాలయంసహా ఇదే ప్రాంగణంలోని మరో 4 భవనాలకు ప్రీ ఫ్యాబ్రికేటెడ్‌ టెక్నాలజీ ద్వారా శ్లాబ్‌లు వేస్తున్నారు. తాత్కాలిక సచివాలయ ప్రాంగణంలో చివరగా పూర్తయ్యే నిర్మాణంగా అసెంబ్లీ భవనం నిలవనుంది. ఇప్పట్లో అసెంబ్లీ సమావేశాలు జరిగే అవకాశం లేకపోవడంతో తక్షణ అవసరం ఉన్న భవనాలను ముందుగా పూర్తి చేయాలని నిర్ణయించారు. తదుపరి అసెంబ్లీ సమావేశాలు వర్షాకాలంలో జరగనున్నాయి. అప్పటికి అసెంబ్లీ భవనాన్ని సిద్ధం చేయాలని భావిస్తున్నారు. దీంతో తాత్కాలిక సచివాలయ ప్రాంగణంలోని 3 బ్లాక్‌ల్లోని 6 భవనాల్లో చివరిగా పూర్తయ్యేది అసెంబ్లీ భవనమే. మొత్తం మీద నిర్దేశిత గడువు జూన్‌ 15 నాటికి మొత్తం తాత్కాలిక సచివాలయ నిర్మాణ పనులను పూర్తి చేయాలని నిర్మాణ సంస్థలు భావిస్తున్నాయి. 
 
అదనపు ఫ్లోర్లకు ఆర్థిక శాఖ ఓకే! 
తాత్కాలిక సచివాలయ నిర్మాణ ప్రాంగణంలో ప్రస్తుతం నిర్మించనున్న జీ+1 నిర్మాణాలను జీ+3గా పెంచేందుకు అధికారులు చేస్తున్న ప్రయత్నాలు ఫలించినట్లు సమాచారం. రెండు అదనపు ఫ్లోర్ల నిర్మాణం కోసం సీఆర్డీయే నుంచి రాష్ట్ర ప్రభుత్వానికి ఇప్పటికే ప్రతిపాదనలు వెళ్లాయి. ప్రస్తుతం ఈ ఫైలు ఆర్థికశాఖ పరిశీలనలో ఉంది. ప్రస్తుతం జీ+1గా ఉన్న తాత్కాలిక సచివాలయాన్ని జీ+3కి పెంచిన అనంతరం ఆయా స్లాబ్‌లను కూడా నిర్దిష్ట సమయంలో పూర్తి చేసే విధంగా అధికారులు ప్రాథమికంగా పలు సూచనలు సిద్ధం చేశారు. అందులో భాగంగా మిగిలిన రెండు ఫ్లోర్లలో ఒక్కో ఫ్లోర్‌ను ఒక్కో నెలలో పూర్తి చేయాలని టెండర్లు దాఖలు చేయడానికి ముందుకు వచ్చే కంపెనీలకు సీఆర్డీయే సూచించనున్నట్లు తెలిసింది. 

No comments:

Post a Comment