జనతన సర్కారే ప్రత్యామ్నాయం
25-04-2016 00:48:49
- విరసం సభ్యుడు అల్లం రాజయ్య
- విప్లవోద్యమ మదింపునకు ఉపయోగపడే రచన ‘జనతన రాజ్యం’
- ‘ఆంధ్రజ్యోతి’ ఎడిటర్ శ్రీనివాస్
కర్నూలు (కల్చరల్): దండకారణ్య జనతన సర్కారే భారతదేశానికి విప్లవ ప్రత్యామ్నాయమని విరసం సభ్యుడు, ప్రముఖ రచయిత అల్లం రాజయ్య అన్నారు. పాణి రాసిన ‘జనతన రాజ్యం’ పుస్తకావిష్కరణ సభ ఆదివారం కర్నూలులో జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దండకారణ్యంలో మావోయిస్టుల నేతృత్వంలో నిర్మాణమైన ప్రజాప్రభుత్వాన్ని నెల రోజులు అధ్యయనం చేసి పాణి రాసిన జనతన రాజ్యం పుస్తకం ఇవ్వాల్టి విప్లవ అవసరం తీర్చుతుందని అన్నారు. జనతన సర్కార్ ఆచరణను దాని వాస్తవికతలోంచి రాయడమేగాక దాని భవిష్యత్తు గురించి కూడా రచయిత ఈ పుస్తకంలో చర్చించారని అన్నారు. ‘ఆంధ్రజ్యోతి’ ఎడిటర్ కె. శ్రీనివాస్ మాట్లాడుతూ ఒక ప్రాంతంలో జరుగుతున్న ప్రజా ఉద్యమాన్ని బయట ప్రపంచానికి తెలియజేయాల్సిన బాధ్యత పత్రికలపై ఉందన్నారు. దండకారణ్యంలో మావోయిస్టు ఆచరణపై గతంలో వచ్చిన పుస్తకాలకంటే జనతన రాజ్యం భిన్నమైనదని, రచయిత తాను లోపలివాడిగా పరిశీలిస్తూనే విమర్శనాత్మకంగా రాశారని అన్నారు. ఇది మంచి పాత్రికేయ రచన కూడా అని అన్నారు. విప్లవోద్యమ అనుభవాలవైపు నుంచి రచయిత అనేక పరిశీలనలు, ఆలోచనలు ముందుకు తీసుకురావడమేగాక దాని మదింపునకు ఉపయోగపడే ప్రశ్నలు లేవనెత్తారని అన్నారు. సమావేశానికి అధ్యక్షత వహించిన విరసం కార్యదర్శి వరలక్ష్మి మాట్లాడుతూ..దండకారణ్య ఆదివాసులు విప్లవ ప్రజాస్వామ్యం ఆధారంగా రాజకీయ, ఆర్థిక, సామాజిక రంగాల్లో నూతన వ్యవస్థను నిర్మిస్తున్నారని, అదే జనతన సర్కారని అన్నారు. వర్గపోరాటం ద్వారా అభివృద్ధి, ప్రత్యామ్నాయం, మహిళల సామాజిక విముక్తి ఎలా ఉంటుందో దండకారణ్యంలో చూడవచ్చని అన్నారు.
No comments:
Post a Comment