Tuesday, 17 May 2016

కరువుకు ప్యాంటు, షర్టు వేస్తే ఆయనే!

కరువుకు ప్యాంటు, షర్టు వేస్తే ఆయనే!

Sakshi | Updated: May 17, 2016 13:20 (IST)
కరువుకు ప్యాంటు, షర్టు వేస్తే ఆయనే!వీడియోకి క్లిక్ చేయండి
కర్నూలు :
కరువుకు ప్యాంటు, షర్టు వేస్తే అదే చంద్రబాబు అని వైఎస్ఆర్‌సీపీ ఎమ్మెల్యే ఆర్కే రోజా అన్నారు. కృష్ణానదిపై తెలంగాణ ప్రభుత్వం కడుతున్న అక్రమ ప్రాజెక్టులకు వ్యతిరేకంగా, వాటిని ప్రశ్నించని ఏపీ సీఎం చంద్రబాబు తీరుకు నిరసనగా పార్టీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి కర్నూలులో చేస్తున్న 'జలదీక్ష' రెండోరోజున జగన్‌కు మద్దతుగా వచ్చిన ఆమె.. ఈ సందర్భంగా మాట్లాడారు. చంద్రబాబుతో పాటే రాష్ట్రంలో మళ్లీ కరువు వచ్చిందని, గతంలో తొమ్మిదేళ్లు.. ఇప్పుడు రెండేళ్లుగా కరువుతో అల్లాడుతున్నామని అన్నారు. ఏ ముహూర్తాన చంద్రబాబు సీఎం అయ్యారో ఆ రోజు నుంచి కరువుతో బాధపడుతున్నామని చెప్పారు. ఆయన కృష్ణా జిల్లాకు వెళ్లారు, డెల్టా మొత్తం ఎడారిలా మారిపోయిందని, లింగమనేని గెస్ట్‌హౌస్‌లో ఉంటే ప్రకాశం బ్యారేజి ఎండిపోయిందని, కర్నూలు వస్తే శ్రీశైలం ప్రాజెక్టులో నీళ్లు అడుగంటిపోయాయని ఎద్దేవా చేశారు. ఇంతటి తీవ్రమైన కరువును పట్టించుకోకుండా తన కుటుంబ సభ్యులతో విహార యాత్రలు చేస్తున్నాడని మండిపడ్డారు.

కరువు నిధులను కూడా వదలకుండా దోచేసుకుంటున్నారని, మజ్జిగ పేరుతో 39 కోట్లు విడుదల చేసి, హెరిటేజ్ మజ్జిగను అమ్ముకుంటున్నారని విమర్శించారు. కరువు రాష్ట్రాల సీఎంలు అంతా మోదీని కలిసి ఆయనతో నిధుల కోసం మాట్లాడుతుంటే ఈయన మాత్రం తాను దోచుకున్న డబ్బులు స్విట్జర్లాండ్‌లో తన బినామీల పేరిట దాచుకోడానికి వెళ్లారని ఆరోపించారు. రాష్ట్రానికి రూ. 4 వేల కోట్ల నష్టం వస్తే కనీసం 400 కోట్లు కూడా తీసుకురాలేకపోయారని విమర్శించారు. పశువులకు కూడా నీళ్లు లేని పరిస్థితిలో రాష్ట్రం ఉందని, ఇలాంటి పరిస్థితిలో కూడా ఎగువన అక్రమ ప్రాజెక్టులు కడుతున్నారని ఆమె అన్నారు. రాయలసీమ ఎడారిగా మారిపోతుందని తెలిసి కూడా చంద్రబాబు మాట్లాడటం లేదని మండిపడ్డారు. పాలమూరు- రంగారెడ్డి, డిండి ఎత్తిపోతలతో 115 టీఎంసీల కృష్ణా నీళ్లు మళ్లిస్తే రాయలసీమకు చుక్క నీరు కూడా రాదని గుర్తుపెట్టుకుని దీక్షను విజయవంతం చేయాలని కోరారు. సీమ ప్రాజెక్టులన్నీ ఉత్సవ విగ్రహాలుగా మారిపోయే ప్రమాదం ఉందని, ఏడాదిగా ఈ ప్రాజెక్టులకు సంబంధించిన పనులు జరుగుతుంటే చంద్రబాబు సైలెంట్‌గా గమనిస్తున్నారే తప్ప నోరు విప్పి మాట్లాడలేదని చెప్పారు.

రాజమౌళి మనకు బాహుబలి సినిమా చూపిస్తే, కేసీఆర్ మాత్రం చంద్రబాబుకు బాబు బలి పార్ట్ 1 చూపించారని, అందుకే ఆయన హైదరాబాద్‌ నుంచి మూటాముల్లె సర్దుకుని విజయవాడ పారిపోయారని ఎద్దేవా చేశారు. బాబు బలి పార్ట్ 2 బయటకు వస్తే చంద్రబాబు జైల్లో ఉండక తప్పదని స్పష్టం చేశారు. ఓటుకు కోట్ల కేసు కోసం అటు కేంద్రం వద్ద ప్రత్యేక హోదాను తాకట్టు పెట్టారని, ఇక్కడ కేసీఆర్ దగ్గర రాయలసీమ ప్రాజెక్టులను తాకట్టు పెట్టేశారని అన్నారు. సీమ అంటేనే చంద్రబాబుకు కక్షని, తనకు ఓట్లేయలేదన్న కసితో సీమ మీద పగ తీర్చుకుంటున్నారని తెలిపారు. కమీషన్ల కోసం పట్టిసీమ ప్రాజెక్టుతో 1500 కోట్లను నీళ్లపాలు చేశారని, హంద్రీ-నీవా, గాలేరు-నగరి ప్రాజెక్టులను గాలికి వదిలేశారని చెప్పారు. తాము సమస్యలపై నిలదీస్తుంటే ఎస్సీ ఎస్టీ కేసులు పెడతారని, ఏడాదికి పైగా అసెంబ్లీ నుంచి సస్పెండ్ చేస్తారని.. కానీ ఎమ్మెల్యేలను లాక్కున్నంత మాత్రాన రుణమాఫీ జరుగుతుందా, నిరుద్యోగ యువతకు ఉద్యోగం వస్తుందా అని రోజా ప్రశ్నించారు. మీరు కాదు కదా.. మీ చంద్రబాబు కాదు కదా.. ఆయనను పుట్టించిన ఖర్జూరనాయుడుకు కూడా వైఎస్ఆర్‌సీపీని ఖాళీ చేయించే దమ్ము లేదని ఆమె స్పష్టం చేశారు.
మోదీ, పవన్ కాళ్లు పట్టుకుని కేవలం 5 లక్షల ఓట్ల తేడాతో గెలిచారని.. జగన్ పార్టీ పెట్టిన కొత్తలో ఎంపీగా పోటీ చేస్తేనే 5.5 లక్షల ఓట్ల మెజారిటీ వచ్చిందని గుర్తుచేశారు. చంద్రబాబులో రాయలసీమ రక్తం ప్రవహిస్తుంటే తమ పార్టీ నుంచి వెళ్లిన ఎమ్మెల్యేలతో రాజీనామా చేయించి ఎన్నికలకు రావాలని సవాలు చేశారు. జగన్ తరఫున ఒక మహిళా ఎమ్మెల్యేగా వార్ డిక్లేర్ చేస్తున్నానని, ఉప ఎన్నికలకు వెళ్తే నీ అభివృద్ధి ఏంటో, జగన్ పట్ల జనానికి ఉన్న అభిమానం ఏంటో తెలుస్తుందని ఆమె అన్నారు.

No comments:

Post a Comment