భద్రత.. భరోసా.. రక్షణ... సేఫ్ తెలంగాణ!
28-05-2016 01:46:39
- విభజనకు ముందున్న భయాలు పటాపంచలు
- నక్సల్స్ కార్యకలాపాలపై నిజం కాని అపోహలు
- ఉగ్రవాద కదలికలపై నిరంతర నిఘా
- హైదరాబాద్ కేంద్రంగా శాంతి భద్రతల పహరా
- సీమాంధ్రుల దోస్తానా... ప్రాంతీయ ఘర్షణల్లేవు
- విద్యుత్తు కష్టాలను తట్టుకొని నిలిచిన కొత్త రాష్ట్రం
- కొత్త పుంతలు తొక్కుతున్న పారిశ్రామిక విధానం
- హైదరాబాద్, మే 27 (ఆంధ్రజ్యోతి): రెండేళ్లలో తెలంగాణ సాధించిన విజయం ఏమిటి!? ఈ ప్రశ్నకు జవాబు.. విభజన ముందున్న అనుమానాలను పటాపంచలు చేయడం! విభజన ముందు వ్యక్తమైన భయాలను పారదోలడం! విభజన ముందున్న సమస్యలను పరిష్కరించడం! ప్రత్యేక తెలంగాణ రాష్ట్రంలో మావోయిస్టుల జాడ లేదు! ఉగ్రవాద దాడులు లేవు! శివార్లలో విచ్చలవిడి దోపిడీలు లేవు! ప్రాంతీయ ఘర్షణల్లేవు! సీమాంధ్రులపై దాడుల్లేవు! వారి ఆస్తుల దోపిడీల్లేవు! విద్యుత్తు కోతలు లేవు! పరిశ్రమల వలస కూడా లేదు! పొరుగు రాష్ట్రం పోలీసుల సహకారం లేకుండా గణేశ్ నిమజ్జనం ప్రశాంతంగా సాగిపోతోంది! కరెంటు కోతలు లేకుండా భాగ్య నగరమూ ఇక్కడి పరిశ్రమలూ వెలుగులీనుతున్నాయి! వెరసి, ఇప్పుడిది శాంతి భద్రతల తెలంగాణ!
ప్రత్యేక తెలంగాణ రాష్ట్రంలో మావోయిస్టుల జాడ నామమాత్రంగానే ఉంది. దేశవ్యాప్తంగా మావోయిస్టు పార్టీ పరిస్థితే తెలంగాణలోనూ ప్రతిఫలిస్తోంది. తప్పితే, రాష్ట్ర విభజనకు ముందు భయపడినట్లుగా రాష్ట్రంలో మావోయిస్టుల విజృంభణ కనిపించడం లేదు. ‘మావోయిస్టులకు అడ్డా తెలంగాణ గడ్డ. ప్రత్యేక రాష్ట్రం ఏర్పడితే నక్సలిజం పెరుగుతుంది. అటు ఛత్తీ్‌సగఢ్, ఇటు మహారాష్ట్ర నుంచి నేరుగా మావోయిస్టులు రాష్ట్రంలో ప్రవేశిస్తారు. ఇక్కడ దాడులు చేస్తారు. శాంతి భద్రతలకు విఘాతం కలుగుతుంది’ అని ఉమ్మడి రాష్ట్ర విభజనను అడ్డుకునేందుకు కొందరు నేతలు ప్రచారం చేశారు. నిజానికి, ఉమ్మడి రాష్ట్రంలో వైఎస్ రాజశేఖర రెడ్డి హయాం నుంచే మావోయిస్టుల ప్రాబల్యం క్షీణిస్తూ వచ్చింది. రాష్ట్ర విభజనకు ముందు రెండేళ్లలోనూ అడపాదడపా తప్పితే రాష్ట్రంలో చెప్పుకోదగిన ఘటనలు కూడా ఏమీ జరగలేదు. ఇటువంటి పరిస్థితుల్లో తెలంగాణ వస్తే నక్సలిజం పెరుగుతుందనే ఆందోళనను వ్యక్తం చేశారు.
అయితే, తెలంగాణ ఏర్పడిన తర్వాత నక్సలిజంపై పోలీసులు ప్రత్యేక దృష్టిసారించారు. కొత్త నియామకాలు, అజ్ఞాతంలో ఉన్నవారి సమాచారాన్ని సేకరించారు. ఈ క్రమంలోనే వరంగల్ జిల్లాలో జరిగిన ఎనకౌంటర్‌లో ఇద్దరు విద్యార్థులు మరణించారు. ఆదిలాబాద్ జిల్లాలో ఎదురు కాల్పుల కలకలం చోటుచేసుకుంది. అదే సమయంలో, రాష్ట్రస్థాయి మొదలుకొని వివిధ కేడర్లలో పలువురు మావోయిస్టులు లొంగిపోయే విధంగా పోలీసులు చర్యలు తీసుకున్నారు. అడపాదడపా ప్రజా ప్రతినిధులకు హెచ్చరికలు జారీ చేసినా.. తెలంగాణలో నక్సల్ కార్యక్రమాలు ఎక్కడా కనిపించకుండా పోలీసులు జాగ్రత్తలు తీసుకున్నారు. భద్రతా చర్యల్లో భాగంగా సీఎం కేసీఆర్ సహా మంత్రులు, ప్రముఖుల వాహనాల్లో మార్పు, భద్రతా సిబ్బం ది సంఖ్య పెంపు వంటి చర్యలు తీసుకున్నారు.
సీమాంధ్రులు సురక్షితం తెలంగాణ ఉద్యమ సమయంలో భావోద్వేగాలు తారస్థాయికి చేరుకోవడంతో ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటుతో సీమాంధ్రులపై దాడులు జరుగుతాయనే ఆందోళన విభజనకు ముందు వ్యక్తమైంది. కానీ, పత్యేక రాష్ట్రంలో ఇప్పటి వరకు ఎలాంటి ప్రాంతీయ ఘర్షణలు చోటు చేసుకోలేదు. సీమాంధ్రులు, వారి ఆస్తులకు పూర్తి భద్రత కల్పించి వారికి భరోసా ఇచ్చేలా పోలీసులు చర్యలు తీసుకున్నారు. ఇటీవల జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో సీమాంధ్రులు కూడా తమకు ఓటు వేశారని, వారి భద్రతకు తాము తీసుకున్న చర్యలే ఇం దుకు కారణమని టీఆర్‌ఎస్ అగ్ర నేతలు ప్రకటించారు కూడా.
కరెంటు కోత లేని తెలంగాణ
ప్రత్యేక రాష్ట్రం ఏర్పడితే తెలంగాణకు కరెంటు కష్టాలు తప్పవని ఉమ్మడి రాష్ట్రంలో చివరి ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి ఢంకా భజాయించి మరీ చెప్పారు. కిరణ్ కుమార్ రెడ్డి హయాంలో తెలంగాణలోని గ్రామీణ ప్రాంతాల్లో విద్యుత్తు అంటే ఏమిటో మర్చిపోతే, హైదరాబాద్‌లోనూ ఆరేడు గంటలు కోతలు ఉండేవి. దాంతో తెలంగాణ వస్తే విద్యుత్తు సరఫరా ఇంకా భయంకరంగా ఉంటుందనే ఆందోళన నెలకొంది. కానీ, అందుకు పూర్తి విరుద్ధంగా తెలంగాణ రాష్ట్రంలో నిరంతర కరెంటు సరఫరా జరుగుతోంది.
2014 సంవత్సరంలో మే నెలలో ఒక్కో రోజుకు 165 నుంచి 170 మిలియన్ యూనిట్లు డిమాండ్ ఉండగా, అప్పట్లో సరఫరా కేవలం 135 నుంచి 140 మిలియన్ యూనిట్లు మాత్రమే. కానీ, ఇప్పుడు 145 నుంచి 150 మిలియన్ యూనిట్ల డిమాండ్ ఉండగా, సరఫరా కూడా దాదాపు అంతే ఉంది. దాంతో కోతలు లేకుండా కరెంటు ఇవ్వడం సాధ్యమవుతోంది. ఇతర రాషా్ట్రల నుంచి కొనుగోలు చేసి కరెంటు ఇబ్బందులు లేకుండా ప్రభుత్వం ముందస్తు చర్యలు చేపట్టింది. 2019 నాటికి రాష్ట్రంలోనే డిమాండ్‌కు అనుగుణంగా విద్యుత ఉత్పత్తి చేయాలనే విధంగా ప్రభుత్వం ముందుకు కదులుతోంది.
హైదరాబాద్.. భద్రం!
హైదరాబాద్‌లో గణేశ్ నిమజ్జనం జరిగితే సీమాంధ్ర నుంచి పోలీసులను పిలవక తప్పని పరిస్థితి ఉంటుందని ముఖ్యమంత్రి హోదాలో కిరణ్ కుమార్ రెడ్డి చెప్పారు. రంజాన్, గణేశ్ నిమజ్జనం వంటి పండుగలు ఏక కాలంలో వస్తే ఏపీతోపాటు ఇతర రాష్ట్రాల పోలీసులను కూడా రప్పించాల్సి వస్తుందని హెచ్చరించారు. కానీ, తెలంగాణ ఏర్పడి సీఎంగా కేసీఆర్ బాధ్యతలు చేపట్టిన తర్వాత శాంతి భద్రతలకే పెద్దపీట వేశారు. పోలీస్ శాఖకు వందల కోట్లు కేటాయించారు.
‘తెలంగాణకు హైదరాబాద్ నగరం ఐకాన. హైదరాబాద్‌ని స్మార్ట్ అండ్ సేఫ్ సిటీగా మారుస్తాం’ అని చెబుతున్న ప్రభుత్వం అందుకు అనుగుణంగానే చర్యలు తీసుకుంది. పోలీసులకు కొత్త వాహనాలు కొనుగోలు చేసి ఇచ్చింది. ప్రముఖ కూడళ్లలో సాయుధ బలగాలను మోహరించింది. గల్లీ.. బస్తీ తేడా లేకుండా భద్రతను పెంచింది. నగరంలో లక్ష సీసీ కెమెరాల ఏర్పాటుకు ప్రణాళిక సిద్ధం చేసింది. కానిస్టేబుల్, ఎస్సై స్థాయిలో పది వేలమంది నియామకానికి ప్రక్రియ ప్రారంభమైంది. ఏడాది చివర్లో మరో పదివేల మంది పోలీస్ సిబ్బంది నియామకానికి ప్రభుత్వం గ్రీన సిగ్నల్ ఇవ్వనుంది.
షీ టీమ్స్.. ఓ సంచలనం ‘అమ్మాయిలవైపు చూడాలంటేనే లాగులు తడవాలి’ అని పోలీసు అధికారులకు సీఎం కేసీఆర్ స్పష్టం చేశారు. పోకిరీల ఆట కట్టించి మహిళలకు భద్రత కల్పించాలని దిశానిర్దేశం చేశారు. ఇందులో భాగంగానే షీ టీమ్స్‌ను ఏర్పాటు చేశారు. హైదరాబాద్‌లో మెరుగైన ఫలితాలు రావడంతో రాష్ట్రవ్యాప్తంగా విస్తరించారు. రాష్ట్ర విభజనకు ముందు ఐటీ కారిడార్లోనే మహిళల భద్రతకు భరోసా లేని పరిస్థితి నుంచి పూర్తి భద్రతకు ‘భరోసా’ కేంద్రాన్ని ఏర్పాటు చేశారు.
http://epaper.andhrajyothy.com/823225/Hyderabad/28.05.2016#page/1/2
No comments:
Post a Comment