Sunday, 15 May 2016

రావాల్సింది కొండంత.. వచ్చింది కొంతే!

రావాల్సింది కొండంత.. వచ్చింది కొంతే! 
16-05-2016 01:27:36

  • అంతా కలిపినా ఇచ్చింది రూ.6 వేల కోట్లే
  • కేంద్రం వద్ద చిట్టా విప్పనున్న సీఎం
  • ఇతర రాష్ట్రాలతో పోలిక వద్దు..సాయంలో తాత్సారం వద్దు
  • 20 నెలలు అవుతున్నా రాష్ట్రానికి ఒక్క భారీ పరిశ్రమ లేదు
  • ‘ప్రత్యేకం’గా పరిగణించాల్సిందే
  • కరువు సాయమూ అరకొరే!
  • తెలంగాణలో 7 జిల్లాలకు 791 కోట్లు
  • ఏపీలో 10 జిల్లాలకు 433 కోట్లే
  • ప్రధానికి నివేదించనున్న చంద్రబాబు
  • హోదాపై మోదీకి రేపు ప్రజంటేషన్‌!
  • ఆర్థిక ఇబ్బందులపై సమగ్ర వివరాలు
  • ఆర్థిక మంత్రి, అధికారులతో చర్చలు
హైదరాబాద్‌, మే 15 (ఆంధ్రజ్యోతి): విభజన చట్టంలోని అంశాల అమలు, ప్రత్యేక హోదా ఆంధ్రప్రదేశ ప్రభుత్వానికి పెనుసవాలుగా మారింది. ఈ రెండు అంశాలు కేంద్రంతోనూ, ఇతర ఆర్థిక, సాంకేతిక అంశాలతోనూ ముడిపడి ఉండటంతో ఈ వ్యవహారం మొత్తం రాజకీయ రంగు పులుముకుంది. ప్రత్యేక హోదా సాధించడంలో ప్రభుత్వం విఫలమైందంటూ విపక్షాలు రాజకీయ దాడికి దిగాయి. బీజేపీతో మైత్రీ బంధాన్ని తెగదెంపులు చేసుకోవాలంటూ ప్రతిపక్షాలు ఉచిత సలహాలు ఇస్తుండగా మరోవైపు టీడీపీ, బీజేపీ నడుమ కూడా ఈ వ్యవహారం పొగబెడుతోంది. హోదాకు పలు సాంకేతిక అంశాలు అడ్డువస్తున్నాయని చెబుతున్నారు. కానీ మిగతా వ్యవహారాలకు ఏ ఇబ్బందీ లేకపోయినా కేంద్రం తగిన రీతిలో సహాయం చేయకపోవడం వివాదాలకు మూలమైంది. చట్టబద్ధంగా రాష్ట్రాలకు రావాల్సిన వాటా నిధులను చూపిస్తూ ఏపీకి భారీగా సాయం చేస్తున్నామంటూ బీజేపీ నేతలు ప్రకటనలు చేస్తున్నారు. వాస్తవ పరిస్థితి మాత్రం అందుకు భిన్నంగా ఉందని, ఇవ్వాల్సిన నిధులు కూడా ఇవ్వకపోగా తాత్సార ధోరణితో కేంద్రం వ్యవహరిస్తోందని ప్రభుత్వ పెద్దలు భావిస్తున్నారు. ఏపీని ప్రత్యేక రాష్ట్రంగా పరిగణించాల్సిందేనని స్పష్టం చేస్తున్నారు. ఇవే అంశాలను ప్రధానికి విన్నవించేందుకు సీఎం చంద్రబాబు సిద్ధమవుతున్నారు. రాష్ట్రంలో ఎదురవుతున్న విమర్శలు, సవాళ్లకు తగిన సమాధానం చెప్పి సమస్యను ఒక కొలిక్కి తెచ్చే ప్రయత్నంలో భాగంగా సీఎం చంద్రబాబు మంగళవారం ఢిల్లీ యాత్రకు వెళ్తున్నారు. ఇప్పటి వరకు సీఎం ఢిల్లీ పర్యటనలు ఒక ఎత్తయితే మంగళవారం నాటి పర్యటన ఒక ఎత్తుగా మారింది. అసలు విభజన చట్టం ప్రకారం రాష్ట్రానికి రావాల్సింది ఏమిటి? వచ్చింది ఏమిటి? అన్న అంశాలతో ఆర్థిక శాఖ అధికారులు గణాంకాలు రూపొందించారు. దాని ప్రకారం 2014-15లో అపాయింటెడ్‌ తేదీ నుంచి ఇప్పటి వరకు కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి ప్రత్యేకంగా రూ.6088 కోట్లు విడుదల చేసింది.

ఒక్క పరిశ్రమా రాలేదు..
కొత్త రాష్ట్రానికి అత్యంత ముఖ్యమైన పారిశ్రామికాభివృద్ధికి సంబంధించిన అంశంపై ఇప్పటి వరకు ఒక్క అడుగు కూడా ముందుకు పడలేదు. విభజన చట్టం సెక్షన్‌ 94(1) ప్రకారం ఏపీ, తెలంగాణల్లో పారిశ్రామికాభివృద్ధికి, ఆర్థికాభివృద్ధికి మార్గం సుగమం చేసేందుకు అవసరమైన ఆర్థిక వెసులుబాటు, పన్ను మినహాయింపులను కేంద్ర ప్రభుత్వం కల్పించాలి. ఈమేరకు ఎన్డీయే ప్రభుత్వం ఏపీలో పెట్టుబడులపై అదనంగా 15 శాతం సబ్సిడీ, పెట్టుబడుల తరుగుదలపై మరో 15 శాతం సబ్సిడీ ఇస్తామని హామీ ఇచ్చింది. రాష్ట్రంలోకి పెట్టుబడులు రావడానికి ఈ స్వల్ప సబ్సిడీలు ఏ మాత్రం ఉపయోగపడలేదు. దీంతో గత 20 నెలలుగా రాష్ట్రానికి ఒక్క భారీ పరిశ్రమ కూడా రాలేదు.

రాజధానికి రూ.1850 కోట్లు..
విభజన చట్టం 94(3) ప్రకారం ఏపీ కొత్త రాజధానిలో అత్యవసర సదుపాయాలు ఏర్పాటు చేసుకొనేందుకు కేంద్రం ప్రత్యేక ఆర్థికసాయం అందజేయాలి. రాజధాని ప్రాంతంలో మౌలికసదుపాయాల అభివృద్ధి కోసం మొదట రూ.1500 కోట్లు, ఆ తర్వాత రాజ్‌భవన, హైకోర్టు, ఇతర అత్యవసర మౌలికసదుపాయాల నిర్మాణం కోసం రూ.350 కోట్లు విడుదల చేసింది. 2016-17 బడ్జెట్‌లో అమరావతికి నిధులు కేటాయించలేదు.
 
రెవెన్యూలోటు భర్తీకి రూ.2803 కోట్లు
విభజన చట్టం 46(2) ప్రకారం విభజన వల్ల 2014-15లో ఏపీలో తలెత్తే వనరుల కొరతను కేంద్రమే భర్తీ చేయాలి. 14వ ఆర్థిక సంఘం సిఫారసుల మేరకు 2014-15 కేంద్ర బడ్జెట్‌లో ఈ నిధులు కేటాయించాలి. విడిపోయిన తర్వాత రెవెన్యూ లోటు(వనరుల కొరత) ఏపీలో రూ.16,200 కోట్లు ఉందని రాష్ట్రం కేంద్రానికి నివేదిక ఇచ్చింది. ఇందులో ఇప్పటి వరకు రాష్ట్రానికి రూ.2803 కోట్లు మాత్రమే అందాయి.
 
ఇంకా రూ.13,897 కోట్లు రావాల్సి ఉండగా, 2016-17 కేంద్ర బడ్జెట్‌లో దీని కోసం ఒక్క రూపాయి కూడా కేటాయించలేదు. విభజన చట్టం 46(3) ప్రకారం రాష్ట్రంలోని వెనుకబడిన జిల్లాల అభివృద్ధికి కేంద్రం ప్రత్యేక ప్యాకేజీ అందజేయాలి. దీని కోసం ఏపీ రూ.24,350 కోట్లు కేంద్రాన్ని కోరింది. ఇప్పటి వరకు రూ.700 కోట్లు మాత్రమే వచ్చాయి. 2016-17 కేంద్ర బడ్జెట్‌లో వీటి కోసం నిధులు కేటాయించలేదు. విభజన చట్టం సెక్షన్‌ 90(2) ప్రకారం పోలవరం ప్రాజెక్టును కేంద్రమే నిర్మించాలి. ఇందుకోసం రూ.30వేల కోట్లు ఖర్చవుతుంది. ఇందులో ఇప్పటి వరకు రాష్ట్రానికి రూ.735 కోట్లు విడుదల చేశారు. 2016-17 బడ్జెట్‌లో రూ.100 కోట్లు కేటాయించారు.

1 comment:

  1. Really glad to read... this is very informative post. Keep on updating the post.Telugu gossips in Hyderabad

    ReplyDelete