Tuesday, 17 May 2016

CBN Delhi Press Meet - Andhrajyothy

చేతులు కట్టుకొని కూర్చోను! 
18-05-2016 00:33:29


http://www.andhrajyothy.com/Artical?SID=242316
  • అభివృద్ధి కోసమే నాకు పట్టం కట్టారు
  • కావాల్సినవన్నీ కేంద్రం నుంచి సాధిస్తా
  • నాడు పద్ధతి లేకుండా విభజించారు
  • జాతీయ పార్టీలన్నీ బాధ్యత వహించాలి
  • ఏం చేస్తారు, ఎలా చేస్తారు.. కేంద్రం చెప్పాలి
  • చంద్రబాబు డిమాండ్‌
న్యూఢిల్లీ, మే 17 (ఆంధ్రజ్యోతి): ‘‘కేంద్రం ప్రత్యేక హోదా ఇవ్వలేదని నేను చేతులు కట్టుకొని కూర్చోను. నా పని నేను చేసుకుపోతా. నా తెలివి తేటలతో, నాకున్న అనుభవంతో రాష్ర్టాన్ని అభివృద్ధి చేస్తానని ప్రజలు పట్టం కట్టారు. హోదా వచ్చేంతవరకూ పోరాడుతా. ప్రజలు నాపై ఉంచిన నమ్మకాన్ని నిజం చేస్తా. అందుకు అహర్నిశలు కృషి చేస్తా’’ అని చంద్రబాబు ఉద్ఘాటించారు. నవ్యాంధ్రకు ప్రత్యేక హోదా ఇవ్వాలన్న వినతిపై ప్రధాని మోదీ, కేంద్ర ఆర్థిక మంత్రి జైట్లీ సానుకూలంగా స్పందించారని తెలిపారు. మంగళవారం ఢిల్లీలో మోదీతో భేటీ అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. ఏపీ బీజేపీ నేతలు చేస్తున్న వ్యతిరేక ప్రచారంపై విలేకరులు అడిగిన ప్రశ్నకు ఘాటుగా సమాధానమిచ్చారు. ‘‘విభజన సమయంలో జరిగిన వాస్తవాలు అందరికీ తెలుసు. ఏపీని ఆదుకోవాల్సిన బాధ్యత కేంద్రానికి లేదా? అన్ని రాజకీయపార్టీలు కలిసి నవ్యాంధ్రకు అన్యాయం చేశాయి. ప్రస్తుత పరిస్థితికి పార్లమెంటులో అన్ని పార్టీలు బాధ్యత వహించాల్సిందే. అందుకే జాతీయ పార్టీలన్నింటినీ నేను ప్రశ్నిస్తున్నా. జరిగిన అన్యాయాన్ని సరిదిద్దాలని కోరుతున్నా. విభజన సక్రమంగా చేసి ఉంటే ఈ పరిస్థితి దాపురించేదా? ఒక రాష్ర్టానికి ముఖ్యమంత్రిగా ఉంటూ కేంద్రం వద్ద అడుక్కోవాల్సిన అగత్యం ఎందుకొచ్చింది? దీనికి కారకులైన వారే పరిష్కారం కూడా చూపాలి. విభజన చేసిన విధానం చాలా తప్పు. కాంగ్రె్‌సను ప్రజలు ఎప్పటికీ వారిని క్షమించరు’’ అని అన్నారు. ప్రత్యేక హోదా ఇవ్వకపోతే కాంగ్రె్‌సకు పట్టిన గతే బీజేపీకి కూడా పడుతుందా అని అడిగిన ప్రశ్నకు ఆయన సమాధానమిస్తూ ‘‘ ఎన్నికలప్పుడు రాజకీయాలు మాట్లాడుతా. ఇప్పుడు రాష్ర్టానికి జరిగిన అన్యాయం గురించి మాత్రమే మాట్లాడుతా. ప్రత్యేక హోదా ఇవ్వలేమనో, ఇచ్చేది లేదనో మోదీ, జైట్లీ చెప్పలేదు. ప్రజల తరపున కేంద్రం వద్దకు వచ్చా. నా ప్రయత్నాలు నేను చేస్తూనే ఉన్నా. హోదా ఒక్క అంశాన్నే ఇప్పుడు మనం చర్చించకూడదు. రాజధాని నిర్మాణం జరగాల్సి ఉంది. ఎన్నో అనుమతులు పొందాల్సి ఉంది. హోదాతోపాటు పారిశ్రామిక అభివృద్ధి, ప్రత్యేక ప్యాకేజీ, పన్ను రాయితీలు ఇంకా చాలా అంశాలున్నాయి. ప్రత్యేక హోదా ఇచ్చి మిగతా ఆర్థిక ప్రయోజనాలు ఒనగూర్చకపోతే ఏం చేస్తాం? హోదా ఇచ్చాం... అన్నింటికీ దీన్నే సరిపెట్టుకోమంటే కుదరదు కదా! ప్రత్యేకహోదా మాత్రమే ఇచ్చిన రాష్ర్టాలు ఏం బాగుపడ్డాయి? ఏపీకి హోదాతోపాటు దక్షిణాదిన ఉన్న మిగతా రాష్ర్టాలతో సరితూగేంత వరకూ కేంద్రం అన్ని విధాలా ఆదుకోవాల్సిన అవసరం ఉంది. ఏంచేసి ఆదుకుంటారు? ఎలా అభివృద్ధి చేస్తారు? స్పష్టత ఇవ్వాల్సిన బాధ్యత కేంద్రంపై ఉంది. కేంద్రంపై ఒత్తిడి చేసి ఏపీకి కావాల్సినవన్నీ సాధిస్తాం’ అని చంద్రబాబు తన వైఖరిని స్పష్టం చేశారు. నవ్యాంధ్రకు పదేళ్లపాటు ప్రత్యేక హోదా ఇవ్వాలని నాడు రాజ్యసభలో బీజేపీ కోరిందని గుర్తు చేశారు. గత ఎన్నికల్లో బీజేపీతో పొత్తు పెట్టుకున్నప్పుడు కూడా ఇదే విషయాన్ని స్పష్టం చేశానని, ఏపీ అభివృద్ధి కోసమే పొత్తు పెట్టుకొని ప్రజలకు భరోసా కల్పించామని తెలిపారు. ‘‘ప్రధాని మోదీ కూడా అనేక సభల్లో ప్రత్యేకహోదాపై హామీ ఇచ్చారు. ఏపీకి జరిగిన అన్యాయాన్ని సరిచేస్తారన్న నమ్మకంతోనే ప్రజలు ఓటేశారు. రెండేళ్లలో కేంద్రం ఎన్నో పనులను చేసింది. కానీ, ప్రధాన సమస్యలు మాత్రం పరిష్కారం కాలేదు. నేను ముఖ్యమంత్రి పదవి చేపట్టకముందే... నవ్యాంధ్రకు రెవెన్యూ లోటు రూ.16వేల కోట్లు అని ఉమ్మడి గవర్నర్‌ కేంద్రానికి లేఖ రాశారు. లోటు భర్తీ కింద ఇప్పటికి కేంద్రం రూ.2800కోట్లు మాత్రమే ఇచ్చింది. రాజధాని నిర్మాణానికి, పోలవరానికి కూడా డబ్బులు ఇవ్వాలి. విభజన బిల్లులోని 12 కేంద్ర సంస్థల్లో తొమ్మిదింటికి శంకుస్థాపనలు జరిగాయి. కొన్ని సంస్థల్లో క్లాసులు ప్రారంభమయ్యాయి. విశాఖపట్నం రైల్వే జోన్‌, కడపలో స్టీల్‌ప్లాంట్‌, దుగ్గరాజపట్నంలో పోర్టు నిర్మాణంపై త్వరగా నిర్ణయం తీసుకోవాలని ప్రధాని మోదీని కోరాను’’ అని చంద్రబాబు వివరించారు.
 
జల వివాదాలూ తేల్చాలి
విభజన చట్టంలో స్పష్టత లేనికారణంగా ఏపీ, తెలంగాణ మధ్య జలవివాదాలు నెలకొన్నాయని చంద్రబాబు తెలిపారు. ఈ విషయంలో కేంద్రం జోక్యం చేసుకోవాలని కోరారు. హోదాతో పాటు విభజన సమస్యలన్నింటినీ నిర్ణీత గడువులోగా పరిష్కరించాలని మోడీ, జెట్లీలను కోరినట్లు చంద్రబాబు తెలిపారు.

1 comment:

  1. Really glad to read... this is very informative post. Keep on updating the post.Telugu gossips in Hyderabad

    ReplyDelete