ఆంధ్ర-తెలంగాణ తగాదాపై కె. శ్రీనివాస్ రచలన్నిటిలాగానే ఆగస్టు 24 తేదీ వ్యాసం కూడా నాకు ఒకింత విస్మయమూ కొండంత వినోదమూ కలిగించింది. పోలవరం, పులిచింతల ప్రాజెక్టులను అడ్డుకొనేంత 'చిత్తశుద్ధి' లేనందుకు 'తెరాస'ను మీరు మందలించడం నాకు నచ్చింది. సీమాం«ద్రుల భయాలకు బొత్తిగా అర్థం లేదని బాగా కనిపెట్టారు. వాళ్లని ఎప్పటికప్పుడు పొండి పొండి అంటున్నవాళ్లు 'పరమ సాత్వికులు' అని గ్రహించలేక, ఊరికే కించపడుతూ అవమానం జరుగుతోందని బాధపడుతూ కూర్చొనేవాళ్ళకు మీ అంతటి లోతైన అవగాహన ఎలా వస్తుంది? తెరాసకు భిన్నంగా మాట్లాడినందుకు నిండు అసెంబ్లీలో కొట్టండిరా అని అరుస్తూ ఒక ఎంఎల్ఏను కొట్టించినవాళ్ల గుండెలు నవనీతం కంటే మృదువని మీకు తెలిసినట్టుగా, ఆ అర్భకులు సీమాం«ద్రులకు ఎలా తెలుస్తుంది?
తాము కూసే కుహూ కుహూ కూతల్నే కూస్తున్నప్పటికీ గూట్లో ఉండి కూస్తున్నందుకు కేశవరావునీ మధుయాష్కీ గౌడ్‌నీ టాంకుబండ్ మీద అంతగా సత్కరించినవాళ్లు సాత్వికులు కాకుండా ఎలా ఉంటారు? అంతకుముందు నాగం జనార్ధన రెడ్డికీ, కేశవరావుకీ అర్థమయిందని కూడా అందరికీ తెలిసిందే కదా! ఇంతకంటే 'పరమ' సాత్వికతకి నిదర్శనాలేమి ఉంటాయి? సభ పెట్టి సమైక్యవాదాన్ని వినిపిద్దామనుకున్నందుకు తమ ప్రాంతం వాడే అయినప్పటికీ 'ద్రోహి' నల్లబోతు చక్రవర్తిపై దాడి చేసినవాళ్లే గదా, మీరు చెప్తున్న పరమ సాత్వికులు? తెలుగుదేశంవాళ్లు ప్రజాసమస్యలపై సభలు పెడితే కోడిగుడ్లతో రాళ్లతో కర్రలతో దాడి చేసినవాళ్లేగదా మన బంగారు కొండలు? జగన్ ఓదార్పు ప్రయత్నాలను భగ్నం చేసినవాళ్లే కదా మన సాత్వికులు. తెలుగుదేశం కార్యకర్తలు చాలా అమర్యాదకరంగా అప్రజాస్వామికంగా తిరగబడి బడితెపూజ చేస్తుంటే పోనీలే అని తెదేపా వాళ్లను విడిచిపెట్టారంటే అర్థం కావడంలేదా ఆ సాత్వికుల మంచితనం?
తెలుగు భాషకూ, తెలుగు జాతికీ సేవ చేసినవారి విగ్రహాలను పథకం ప్రకారం పగలకొట్టించినవాళ్లు సాత్వికులు కాదనడానికి ఎవరికెన్ని గుండెలు? పండగలకి బంధువుల ఇళ్లకు పోయి మళ్లీ హైదరాబాద్ తిరిగి వస్తున్నప్పుడు సీమాం«ద్రులను చంపేయకుండా కేవలం వేధించి వదిలేయడం సాత్వికత కాదా? మన బంగారు కొండలు, మన వెన్న ముద్దలు తమ సాత్వికతను కొన్ని వందలసార్లు రుజువుచేసుకొన్నారు. అయినా సీమాంధ్రలోనూ తెలంగాణలోనూ ఉన్న కొన్ని మొద్దు బుర్రలకు అర్థమే కాదు. చివరిగా ఒక్కమాట! మీకు ఈ 'పరమ' సాత్వికుల మీద నమ్మకముంది. నాకు మీ విశ్లేషణ మీద, మీ సత్య సంధత మీద, మీ న్యాయ దృష్టి మీద నమ్మకం ఉంది. పైగా రోజురోజుకీ అది బలపడతూ ఉంది. దాన్ని ప్రకటించడానికే ఈ ఉత్తరం. కానీండి మీ మాటే నా మాట.
No comments:
Post a Comment