Thursday, 1 August 2013

విభజనకు ఓకే.. మా హక్కుల మాటేంటి?

విభజనకు ఓకే.. మా హక్కుల మాటేంటి?

August 02, 2013

హైదరాబాద్, ఆగస్టు 1 : తెలుగుదేశం పార్టీ ప్రజా ప్రతినిధులు కూడా రాజీనామా బాట పట్టారు. అయితే, వారు రాష్ట్ర విభజనను వ్యతిరేకించడం లేదు. పదవులను వదులుకుంటున్నది కూడా రాష్ట్ర విభజనకు వ్యతిరేకంగా కాదు. సమైక్యాంధ్రప్రదేశ్‌ను కొనసాగించాలనీ కాదు. కాంగ్రెస్ అధిష్ఠానం, యూపీఏ ప్రభుత్వాలు తమ వ్యవహార శైలితో తమ ప్రాంత ప్రయోజనాలను దెబ్బ తీస్తున్నాయని, ఆంధ్రా ప్రాంతానికి అన్యాయం చేస్తున్నాయని ఆరోపిస్తూ మాత్రమే వారు రాజీనామా చేశారు. ఈ మేరకు రాజీనామాలకు తొలుత మైలవరం ఎమ్మెల్యే దేవినేని ఉమా శ్రీకారం చుట్టగా.. ఆ తర్వాత టీడీపీ ఎమ్మెల్యేలు ఒక్కొక్కరుగా రాజీనామాలు చేశారు. మొత్తంమీద గురువారం రాత్రికి 14 మంది టీడీపీ ఎమ్మెల్యేలు, ముగ్గురు ఎమ్మెల్సీలు తమ రాజీనామాలను స్పీకర్‌కు పంపించారు.

ఆంధ్రాకు అన్యాయం చేసినందుకే..
సీమాంధ్ర ప్రాంత హక్కులు పట్టించుకోకుండా.. అవసరాలను గుర్తించకుండా.. రాజధాని గురించి తేల్చకుండా.. విభజనపై హడావుడిగా నిర్ణయం తీసుకుని తమ ప్రాంత ప్రజలు నష్టపోయే పరిస్థితి కల్పించారనే వారంతా రాజీనామా చేస్తున్నారు. దీనికితోడు, స్థానిక ఒత్తిళ్లూ వారి రాజీనామాకు కారణమవుతున్నాయి. పార్టీ అధినాయకత్వం ఆపినా ఆగే వాతావరణం కనిపించడం లేదు. తెలంగాణకు అనుకూలంగా సీడబ్ల్యూసీ తన నిర్ణయాన్ని ప్రకటించిన క్షణం నుంచే రాజీనామాలపై ఎమ్మెల్యేల నుంచి ఒత్తిడి వచ్చినా ఆ పార్టీ అధినేత చంద్రబాబు వారిని ఆపుతూ వచ్చారు.

పార్టీ ఒక నిర్ణయం తీసుకొన్న తర్వాత దానికి భిన్నంగా రాజీనామాలు చేయడం సరికాదని ఆయన వారికి నచ్చచెప్పారు. కానీ, అధికార పార్టీ ఎమ్మెల్యేలు కొందరు రాజీనామాలు ప్రకటించిన తర్వాత టీడీపీ శిబిరంలో వాతావరణం మారిపోయింది. రాష్ట్రాన్ని విభజించిన పార్టీ నేతలే రాజీనామాలు చేస్తుంటే ప్రతిపక్షంలో ఉన్న తాము చూస్తూ ఉండలేమని సీమాంధ్ర టీడీపీ ఎమ్మెల్యేలు చంద్రబాబుకు కరాఖండీగా చెప్పేశారు. "స్థానికంగా మాపై తీవ్రమైన ఒత్తిడి ఉంది. ప్రజల మనోభావాలకు అనుగుణంగా మేం వెళ్లకపోతే తర్వాత నష్టపోతాం. అందుకే పార్టీ నాయకత్వం ఏం చెబుతున్నా రాజీనామాల నిర్ణయం తీసుకొన్నాం'' అని అనంతపురం జిల్లాకు చెందిన టీడీపీ ఎమ్మెల్యే ఒకరు వ్యాఖ్యానించారు.


అన్యాయానికి నిరసనగానే: దేవినేని ఉమా
తమ ప్రాంత రైతాంగానికి జరుగుతున్న అన్యాయానికి నిరసనగా తాము రాజీనామాలు చేస్తున్నట్టు టీడీపీ ఎమ్మెల్యే దేవినేని ఉమా ప్రకటించారు. కేంద్ర మంత్రులు కావూరి, పురందేశ్వరి, పళ్లంరాజు, జేడీ శీలం, పనబాక లక్ష్మి సీమాంధ్ర ప్రాంత రైతుల ప్రయోజనాలను తాకట్టు పెట్టి పదవుల్లో కులుకుతున్నారని ధ్వజమెత్తారు. ఇటలీకి చెందిన సోనియాకు భారతదేశంలో ఉండే ప్రేమలు ఏమి తెలుస్తాయని మండిపడ్డారు. ఇండియా, పాకిస్థాన్లను విభజించినట్టు ఆమె రాష్ట్రాన్ని రాత్రికి రాత్రే రెండు ముక్కలు చేశారని ద్వజమెత్తారు. శ్రీకృష్ణ కమిటీ రిపోర్టును ఏమాత్రం పరిగణనలోకి తీసుకోకుండా, దానిపై చర్చ అనేది కూడా లేకుండా కేవలం ఎన్నికల్లో సీట్ల కోసం హడావిడిగా రాష్ట్రాన్ని విభజిస్తున్నట్టు ప్రకటించి సీమాంధ్ర ప్రజల మనోభావాలను దెబ్బతీశారని ఆరోపించారు.

సీఎం కిరణ్ ఏసీ గది నుంచి బయటకు రావటం లేదని, ప్రధానమంత్రి దీనిపై నోరు తెవరటం లేదని విమర్శించారు. సీమాంధ్ర రైతుల ప్రయోజనాలను కాపాడుకోవటానికి తాము ఎలాంటి త్యాగాలకైనా సిద్ధంగా ఉన్నామని చెప్పారు. ఎంపీ లగడపాటి ఏమీ జరగదని ప్రజలను మభ్యపెడుతూ ఢిల్లీ చుట్టూ తిరిగి కాలం వెళ్లబుచ్చి చివరికి అందరినీ నట్టేట ముంచారని విమర్శించారు. రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచేందుకే సంచలన నిర్ణయం తీసుకున్నామని బీకే పార్థసారథి చెప్పారు.

రాజీనామాలు చేసిన ఎమ్మెల్యేలు.. ఎమ్మెల్సీలు!
ప్రత్తిపాటి పుల్లారావు (చిలకలూరిపేట, గుంటూరు జిల్లా), నక్కా ఆనందబాబు (వేమూరు, గుంటూరు జిల్లా), ధూళిపాళ్ల నరేంద్రకుమార్ (పొన్నూరు, గుంటూరు జిల్లా), యరపతినేని శ్రీనివాసరావు (గురజాల, గుంటూరు జిల్లా), కొమ్మాలపాటి శ్రీధర్ (పెదకూరపాడు, గుంటూరు జిల్లా), బీకే పార్థసారథి (పెనుకొండ, అనంతపురం జిల్లా), పయ్యావుల కేశవ్ (ఉరవకొండ, అనంతపురం జిల్లా), పరిటాల సునీత (రాప్తాడు, అనంతపురం జిల్లా), పల్లె రఘునాథరెడ్డి (పుట్టపర్తి, అనంతపురం జిల్లా), కందికుంట వెంకట ప్రసాద్ (కదిరి, అనంతపురం జిల్లా), అబ్దుల్ ఘనీ (హిందూపురం, అనంతపురం జిల్లా), మల్లెల లింగారెడ్డి (ప్రొద్దుటూరు, కడప జిల్లా), దేవినేని ఉమామహేశ్వరరావు (మైలవరం, కృష్ణా జిల్లా), తంగిరాల ప్రభాకర్ రావు (నందిగామ, కృష్ణా జిల్లా), ఎమ్మెల్సీలు నన్నపనేని రాజకుమారి, మెట్టు గోవిందరెడ్డి, శమంతకమణి

No comments:

Post a Comment