Thursday, 1 August 2013

Events of 1953 - 1

విభజన నాడేం జరిగిందంటే...

August 02, 2013
Andhrajyothy 
హైదరాబాద్, ఆగస్టు 1 : రాష్ట్ర విభజన ఖాయమైంది.. ఇక మిగిలింది పదవుల కోసం నేతల భజన.. ప్రాంతాల కోసం జన గర్జనే! ఈ నేపథ్యంలో.. మద్రాసు రాష్ట్రం నుంచి ఆంధ్రరాష్ట్రం విడిపోయినప్పుడు ఏం జరిగింది? రాజధానిని కర్నూలులోనే ఎందుకు ఏర్పాటుచేశారు? విజయవాడ-గుంటూరు మధ్య రాజధానిని ఏర్పరచాలన్న ప్రతిపాదన ఎందుకు వీగిపోయింది? ..వంటి సందేహాలు అనేకమందిలో రేగుతుంటాయి. ఆ ప్రశ్నలకు సమాధానాలు..
మద్రాస్‌ను ఆంధ్రాలో కలపాలన్నది ఒకనాటి డిమాండ్. తరువాతి కాలంలో ఆ డిమాండ్ వెనకబడింది. చెన్నై సెంట్రల్ రైల్వే స్టేషన్ నుంచి ఉత్తరంగా ఉన్న ప్రాంతమంతా ఆంధ్రాలో చేర్చాలన్న డిమాండ్ తెరపైకి వచ్చింది. నాటి ప్రధాని జవహర్‌లాల్ నెహ్రూ, ఉమ్మడి మద్రాసు ముఖ్యమంత్రి రాజగోపాలాచారి, ప్రకాశం పంతులు, నీలం సంజీవరెడ్డి, బెజవాడ గోపాల్‌రెడ్డి వంటి నేతల మధ్య కుదిరిన ఒప్పందం మేరకు తడ నుంచే తీసుకుని ఆంధ్ర ప్రాంతం సంతృప్తి పడింది. తిరుపతిని కూడా తమిళనాడులో కలిపేసుకోవాలని రాజగోపాలచారి శతవిధాలా ప్రయత్నించారు. అది సాధ్యం కాకపోవడంతో, అప్పటి వరకూ ఆంధ్రాలో ఉన్న తిరుత్తణిని తీసేసుకుని సంతృప్తి పడ్డారు. అందుకు ప్రతిగా తమిళనాడులోని సత్యవేడు ప్రాంతాన్ని వదిలేసుకున్నారు.

అలాగే.. రాయలసీమలో 5 జిల్లాలుండాల్సింది. కానీ నాటి నేతల వైఫల్యం కారణంగా బళ్లారి కర్ణాటకలో చేరిపోయింది. బళ్లారికి బదులుగా ఆదోని, ఆలూరు తదితర 5 తాలూకాలను ఆంధ్ర రాష్ట్రానికి ఇచ్చారు. కోలార్ ప్రాంతంలో 1953 నాటికి తెలుగువారు 52 శాతం దాకా ఉన్నారు. కానీ దాన్ని కన్నడిగులు సొంతం చేసుకున్నారు. ఇక.. తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక రాష్ట్రాల సరిహద్దుల్లో ఉన్న హోసూరు ప్రాంతం కూడా ఆంధ్రరాష్ట్రంలో మిళితం కావాల్సింది. కానీ దాని పక్కనే.. రాజగోపాలాచారి స్వగ్రామం తొరపల్లి అగ్రహారం ఉండటంతో దాని కోసం ఆయన పట్టుబట్టి హోసూరును తమిళనాడులోనే ఉంచుకోగలిగారు.
సంబరాలే తప్ప..
ఆంధ్రరాష్ట్రం ఏర్పడిందన్న ఆనందంలో నాటి మన నేతలు అసలు సంగతుల్ని వదిలేశారు. ఆస్తుల పంపకం సమయంలో ఆంధ్ర రాష్ట్రానికి వచ్చినవి విరిగిన కుర్చీలు, పనికిరాని బల్లలు, తుప్పుపట్టిన రోడ్డు రోలర్లే. ఇక, కర్నూలును రాజధానిగా చేసుకునేందుకు కేంద్రం తగినన్ని నిధులు ఇస్తామని, తమిళనాడు ప్రభుత్వం నుంచి కూడా కొంత ఇప్పిస్తానని హామీ ఇచ్చింది. కానీ అవేవీ సరిగ్గా జరగలేదు. దీనికి తోడు 1956లో ఆంధ్రప్రదేశ్ ఏర్పడి, రాజధాని హైదరాబాద్‌కు మారిన తరువాత, ఇక నిధుల అవసరమేముందని కేంద్రం, తమిళనాడు ప్రభుత్వం చేతులెత్తేశాయి. కేంద్రం అరకొర విదిల్చింది తప్ప.. ముందు ఇచ్చిన హామీలను పట్టించుకోకుండా పక్కనబెట్టేసింది.
రాజధాని రగడ...
కొత్తగా ఏర్పాటయ్యే ఆంధ్రరాష్ట్రానికి రాజధాని ఏది కావాలి? అనే అంశంపై అప్పట్లో జరిగిన రాజకీయాలను అవలోకిస్తే అనేక ఆసక్తికర విషయాలు తెలుస్తాయి. ఉమ్మడి మద్రాసు రాష్ట్రం నుంచి ఆంధ్రను విడగొట్టాలని నిర్ణయం తీసుకున్న తర్వాత రాజధాని విషయంలో చాలా పెద్ద గొడవ జరిగింది. రాష్ట్రం విడిపోయినా, ఆంధ్ర రాష్ట్రం కొత్త రాజధానిని ఏర్పాటు చేసుకొనే వరకూ మద్రాసు ఉమ్మడి రాజధానిగా ఉండాలని పార్టీషన్ కమిటీ ప్రతిపాదించింది. దీన్ని మద్రాసుకు చెందిన సభ్యులు తీవ్రంగా వ్యతిరేకించారు.
రాష్ట్రం ఏర్పాటైన తర్వాత గవర్నర్, ముఖ్యమంత్రి, ఇతర మంత్రులు కొత్త రాజధానిలోనే ప్రమాణ స్వీకారం చేయాలని వారు వాదిస్తూ వచ్చారు. ఆంధ్ర రాజధానిని కొన్నాళ్లపాటైనా మద్రాసులో కొనసాగిస్తే, భవిష్యత్తులో కూడా తెలుగువారు ఏదో ఒక మిషతో అక్కడే కొనసాగే పరిస్థితి ఉంటుందని వారు అనుమానించారు. ఈ వాదనపట్ల ఆంధ్ర రాష్ట్ర సభ్యులు అభ్యంతరం వ్యక్తం చేశారు. తాము రాజధానికి ఒక ప్రాంతాన్ని ఎంపిక చేసుకుని, అక్కడ భవనాలు నిర్మించుకోవడానికి సమయం పడుతుందని... ఉన్నపళంగా మద్రాసును ఖాళీ చేసి వెళ్లిపొమ్మనడం సరికాదని వారు వాదించారు. తాము మద్రాసు ప్రాంత సభ్యుల వాదనను ఒప్పుకోబోమని పేర్కొంటూ ప్రకాశం పంతులు కమిటీకి ఒక నోట్‌ను సమర్పించారు.
దీనితో మొత్తం ప్రక్రియే ఆగిపోయింది. ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ ప్రకాశం వాదనను సమర్థించింది. ఆంధ్ర ప్రాంతానికి మద్రాసు తాత్కాలిక రాజధానిగా ఉండేలా చర్యలు తీసుకోవాలని కోరింది. రాజధాని గొడవ కేంద్ర ప్రభుత్వానికి చేరినప్పుడు.. కావాలనుకుంటే నెహ్రూ మద్రాసు ప్రభుత్వాన్ని ఒప్పించి ఉండవచ్చు. లేకపోతే కొత్త రాజధానిని ఏర్పాటు చేయటానికి అయ్యే ఖర్చంతా తామే భరిస్తామని ప్రకటన కూడా ఇచ్చి ఉండచ్చు. ఈ రెండింటి వల్ల ఆంధ్ర ప్రజలు సంతృప్తి చెందేవారు. కానీ నెహ్రూ దీనిపై ఒక నిర్ణయం తీసుకోవటానికి వెనకాడారు. తాము ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటును వాయిదా వేస్తున్నట్లు ప్రకటించారు. ఈ విషయం అంత త్వరగా తేలేది కాదని కూడా ప్రకటించారు.
దీంతో కేంద్ర వైఖరిపై రాష్ట్రంలో అనేక అనుమానాలు రేకెత్తాయి. ప్రభుత్వం ఈ విషయాన్ని వెంటనే తేల్చాలని కోరుతూ 1952లో పొట్టిశ్రీరాములు ఆమరణ నిరాహార దీక్ష చేయటం మొదలుపెట్టారు. కేంద్రం దిగిరాలేదు. 50 రోజులు నిరాహార దీక్ష తర్వాత కూడా నెహ్రూ దీనిని విమర్శించారు. అయితే పొట్టి శ్రీరాములు మరణించడంతో పరిస్థితి మారిపోయింది. రాష్ట్రంలో అల్లర్లు చెలరేగాయి. కేంద్రం దిగిరాక తప్పలేదు. వెంటనే రాష్ట్రాన్ని ఏర్పాటు చేస్తున్నట్టు ప్రకటించక తప్పలేదు.
మారిన నిర్ణయం..
ఆంధ్ర రాష్ట్రం ఏర్పాటు అయిన వెంటనే- రాజధానిని ఎక్కడ ఏర్పాటు చేయాలనే విషయంపై చర్చ ప్రారంభమయింది. రంగా నేతృత్వంలోని కేఎల్‌పీ (ఈ గ్రూపునకు 15 మంది శాసనసభ్యులు ఉండేవారు) తిరుపతిలో రాజధాని ఉండాలని కోరింది. అయితే రాయలసీమకు చెందిన శాసససభ్యులు శ్రీబాగ్ ఒప్పందం ఉంది కాబట్టి రాజధాని తమ ప్రాంతానికే చెందాలని డిమాండ్ చేశారు. రాజధానిని, హైకోర్టును ఎక్కడ పెట్టాలో నిర్ణయించే అధికారాన్ని సంజీవరెడ్డికి, ప్రకాశానికి అప్పగించారు. అయితే ఈ విషయంలో పార్టీల మధ్య ఏకాభిప్రాయం లేదు కాబట్టి ఈ నిర్ణయాన్ని వాయిదా వేశారు. అయితే 1952 ఏప్రిల్‌లో, కొత్త రాష్ట్ర రాజధానిగా విజయవాడ ఉండాలని కోరుతూ తాము ఒక తీర్మానాన్ని ప్రతిపాదిస్తామని కమ్యూనిస్టు పార్టీ ప్రకటించింది.
ఆ సమయంలో కోస్తా ఆంధ్ర ప్రాంతానికి 86 మంది శాసనసభ్యులు ఉండేవారు. వీరందరూ రాజధాని రాయలసీమలో ఉండటం కన్నా కోస్తా ప్రాంతంలో ఉండటమే మేలని భావించేవారు. ఓటింగ్ పెడితే విజయవాడే నెగ్గుతుంది. అంతే కాకుండా విజయవాడ కమ్యూనిస్టులకు బలమైన కేంద్రం కాబట్టి- ఆ పార్టీ ఆ ప్రాంతంలో మరింత పటిష్ఠమయ్యే అవకాశముంటుంది. ఈ విషయాలను దృష్టిలో ఉంచుకొని సంజీవరెడ్డి తన అభిప్రాయాలను మార్చుకొని, తమ పార్టీ అభిప్రాయం కూడా అవసరమని ప్రకటించారు.
ఓటింగ్‌లో మద్రాసు సభ్యులు!
ఆంధ్ర రాష్ట్ర రాజధానిపై ఒక నిర్ణయం తీసుకోవటానికి 1953 జనవరి మొదటి వారంలో ఐదు రోజుల పాటు మద్రాసు శాసనసభలోని ఆంధ్ర శాసనసభ్యులు సమావేశమయ్యారు. రాజధానిపై నిర్ణయాన్ని సీక్రెట్ బ్యాలెట్ ద్వారా నిర్ణయించాలని కమ్యూనిస్టు పార్టీలు డిమాండ్ చేశాయి. అయితే అప్పటికే కాంగ్రెస్, పీఎస్‌పీ, కేఎల్‌పీలు రాజధానిపై ఒక అంగీకారానికి వచ్చాయి. సీక్రెట్ బ్యాలెట్‌లో తమ సభ్యులు విజయవాడ-గుంటూరు ప్రాంతానికి ఓటు వేసే అవకాశం ఉందని భావించాయి. దీంతో మామూలు ఓటింగ్ జరిగింది. విజయవాడను రాజధాని చేయాలన్న కమ్యూనిస్టుల డిమాండ్ 79-53 ఓట్లతో వీగిపోయింది. కర్నూలును రాజధాని చేయాలనే ప్రతిపాదనను మూజువాణి ఓటుతో ఆమోదించారు.
ఈ ఓటింగ్ జరిగిన రెండు వారాల తర్వాత కేఎల్‌పీ తన వైఖరిని మార్చుకొంది. తిరుపతిని కానీ చిత్తూరులో మరో ప్రాంతాన్ని కానీ రాజధాని చేయాలని డిమాండ్ చేసింది. దీంతో జూలై 25న.. చిత్తూరు జిల్లాలో రాజధాని పెట్టాలనే ప్రతిపాదనపై మద్రాసు శాసనసభలో ఓటింగ్ జరిగింది. దీనిని గౌతు లచ్చన్న ప్రవేశపెట్టారు. దీనితో పాటుగా కొత్త రాజధానిని కర్నూలు కాకుండా విజయవాడ-గుంటూరులో నెలకొల్పడానికి చేసిన ప్రతిపాదన కూడా ఓటింగ్‌కు పెట్టగా.. అది కేవలం ఒక్క ఓటు తేడాతో ఓడిపోయింది. ఈ ఓటమి వెనక కూడా మరొక పెద్ద కథ ఉంది.
ఆంధ్ర రాష్ట్ర వ్యవహారాల్లో కలగజేసుకోవద్దని, రాజధాని విషయంలో జరిగే ఓటింగ్‌లో పాల్గొనవద్దని మద్రాసు ముఖ్యమంత్రి తమ ప్రాంత శాసనసభ్యులను కోరారు. అయితే ఆయన మాటను వినకుండా మద్రాసుకు చెందిన ఐదుగురు శాసనసభ్యులు ఈ ఓటింగ్‌లో పాల్గొన్నారు. కేవలం వారివల్లే విజయవాడ ఓడిపోయింది. అదే.. ఆంధ్రకు చెందిన శాసనసభ్యులు మాత్రమే ఓటింగ్‌లోపాల్గొని ఉంటే లేదా వారి ఓట్లను మాత్రమే లెక్కలోకి తీసుకొని ఉంటే కర్నూలు బదులుగా విజయవాడ రాజధాని అయ్యి ఉండేది.
-చెన్నై, స్పెషల్‌డెస్క్, ఆంధ్రజ్యోతి

No comments:

Post a Comment