Wednesday, 28 August 2013

మా వద్దే కరువెక్కువ! Maharashtra and Karnataka

మా వద్దే కరువెక్కువ!

August 28, 2013

హైదరాబాద్, ఆగస్టు 27: ఆంధ్రప్రదేశ్ కంటే తమ రాష్ట్రాల్లోనే ఎక్కువ కరువు ప్రాంతాలున్నాయని బ్రిజేష్‌కుమార్ ట్రిబ్యునల్ ముందు కర్ణాటక, మహారాష్ట్రలు వాదించాయి. ఏపీతో పోల్చితే తమ రాష్ట్రాల్లోనే కృష్ణా నది పరివాహక ప్రాంతం ఎక్కువని, తమ వద్దే ఎక్కువ జలాలు లభిస్తాయని పేర్కొన్నాయి. కృష్ణా జలాల వినియోగంపై బ్రిజేష్‌కుమార్ ట్రిబ్యునల్ ముందు మంగళవారం ఢిల్లీలో కర్ణాటక, మహారాష్ట్రలు తమ తుది వాదనలు వినిపించాయి. కృష్ణా జలాల వినియోగంలో ఆంధ్రప్రదేశ్ ప్రయోజనాలకు పెద్ద పీట వేయడంపై రెండు రాష్ట్రాలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశాయి.

'నీటి లభ్యత మా దగ్గరే ఎక్కువ. మా భూభాగంలోనే కృష్ణా నది ఎక్కువగా ప్రవహిస్తుంది. మా రాష్ట్రాల్లోనే కరువు ప్రాంతాలు ఎక్కువ. మా ప్రయోజనాలను పరిగణనలోకి తీసుకోకుండా ఆంధ్రప్రదేశ్ అవసరాలకే పెద్ద పీట ఎలా వేస్తారు? నికర జలాలైనా, మిగులు జలాలైనా.. కేటాయింపుల ప్రకారం మా అవసరాలు తీరిన తర్వాతే కిందకు వదులుతాం. ఆంధ్రప్రదేశ్‌కు ఇచ్చినట్టుగానే మాకు కూడా మిగులు జలాలను వాడుకునే స్వేచ్ఛను ఇవ్వాలి' అంటూ కర్ణాటక, మహారాష్ట్రలు వాదించాయి.

'బచావత్ ట్రిబ్యునల్ సమయంలోనూ నాగార్జునసాగర్‌కు పూర్తిగా గేట్లు పెట్టకపోయినా ఎక్కువ కేటాయింపులు ఇచ్చారు. మిగులు జలాలు వాడుకునే స్వేచ్ఛను కల్పించారు. మా ఆలమట్టి విషయానికి వచ్చే సరికి అన్ని రకాల నిబంధనలను విధిస్తున్నారు. అనుమతులన్నీ సాధించిన తర్వాతే వాడుకోవాలంటున్నారు. ఇదేమి న్యాయం. ఇప్పుడు కూడా నాగార్జునసాగర్‌లో 150 టీఎంసీల క్యారీ ఓవర్ స్టోరేజీకి అవకాశం ఇచ్చారు. మా ఆలమట్టికి ఇవ్వలేదు. 448 టీఎంసీల మిగులు జలాల్లో మాకు కనీసం 203 టీఎంసీలు రావాలి. మీరైనా దీన్ని సరిదిద్దాలి' అని కర్ణాటక వాదించింది.

మరోవైపు 'మా రాష్ట్రంలోనే కృష్ణా నదికి ఎక్కువ జలాలు వస్తాయి. దానికి తగ్గట్టుగానే.. మా రాష్ట్ర అవసరాలకు వినియోగంపై ఎలాంటి నియంత్రణ ఉండరాదు. బచావత్ కేటాయింపుల ప్రకారం, మీరు చేసిన కేటాయింపుల ప్రకారం.. నికర జలాలైనా, మిగులు జలాలైనా మా అవసరాలన్నీ తీరిన తర్వాతే కిందకు వదులుతాం. అలాకాకుండా నికర జలాల కేటాయింపుల ప్రకారం దిగువ రాష్ట్రాలకు నీటిని విడుదల చేయాలనడం సరికాదు' అని మహారాష్ట్ర వాదించింది.

అయితే కృష్ణా జలాల వినియోగంపై ఇచ్చిన ముసాయిదా విధానంపై మహారాష్ట్ర, కర్ణాటకల వాదనను ట్రిబ్యునల్ చైర్మన్ బ్రిజేష్‌కుమార్ ఒప్పుకోలేదు. 'బచావత్ కేటాయింపుల్లో ఎలాంటి మార్పు చేయం. 65% లభ్యత ఆధారంగా నీటి వినియోగం విషయంలో మేం ఇప్పటికే చేసిన నిర్ణయాలను కూడా మార్చేది లేదు. ఏపీకి కేటాయించిన 811 టీఎంసీల నికర జలాల్లో.. వారి వాటా ప్రకారం 459 టీఎంసీలను మహారాష్ట్ర, కర్ణాటకలు కచ్చితంగా ఖరీఫ్ సీజన్ మొదలు కాగానే విడుదల చేయాల్సిందే. ఏపీ వాటా మొత్తం అందిన తర్వాతే.. 65% లభ్యత ఆధారిత జలాల వినియోగం మొదలు పెట్టాలి. దీంట్లో ఎలాంటి మార్పు లేదు' అని స్పష్టం చేశారు. ముసాయిదాపై మూడు రాష్ట్రాల మధ్య ఏకాభిప్రాయం కుదరలేదని కర్ణాటక న్యాయవాది తెలపగా.. వాదనలు పూర్తయిన తర్వాత తామే తుది నిర్ణయం తీసుకుంటామని చైర్మన్ వెల్లడించారు.

ఆంధ్రప్రదేశ్ వాదనలను కూడా వినిపించాలని ట్రిబ్యునల్ కోరగా.. రాష్ట్ర ప్రభుత్వం తరఫు న్యాయవాది సుదర్శన్ రెడ్డి కొంత సమయం కావాలన్నారు. కర్ణాటక, మహారాష్ట్ర లేవనెత్తిన అంశాలకు వెంటనే సమాధానం ఇవ్వలేమని, గురువారం వాదనలు వినిపించేందుకు అవకాశం ఇవ్వాలని కోరారు. ఇందుకు అంగీకరించిన ట్రిబ్యునల్.. వాదనలను గురువారానికి వాయిదా వేశారు. కాగా, తుంగభద్ర నదిపై గంగావతి ప్రాజెక్టును నిర్మించేందుకు కర్ణాటక సన్నాహాలు చేస్తున్నదని ఆంధ్రప్రదేశ్ ఫిర్యాదు చేసింది. దీనిపై కర్ణాటక న్యాయవాదిని బ్రిజేష్‌కుమార్ నిలదీశారు. ఆ ప్రాజెక్టును చేపట్టడం లేదని, భవిష్యత్తులో నిర్మించే ఆలోచన లేదని, పత్రికలను పరిగణనలోకి తీసుకోవద్దని కర్ణాటక న్యాయవాది చెప్పారు.

No comments:

Post a Comment