Saturday, 24 August 2013

లెక్కలు తేల్చుకోవడం అంత చిక్కుసమస్యా? K Srinivas

లెక్కలు తేల్చుకోవడం అంత చిక్కుసమస్యా? (సంధర్భం) - కె.శ్రీనివాస్

August 24, 2013



నల్లగొండ జిల్లాలో పులిచింతల ప్రాజెక్టు నిర్వాసితుల పునరావాస సమస్యలపై జరిగిన సమావేశానికి ఈ మధ్య వెళ్లినప్పుడు, జలసాధన ఉద్యమ కారుడు ఒకరు చేసిన వ్యాఖ్య ఆసక్తి కలిగించింది. 'తెలంగాణ ఉద్యమం లేకుంటే, పోలవరం అడుగు ముందుకు వేసేది కాదు, పులిచింతల పూర్తయ్యేదీ కాదు.' తెలంగాణ ఉద్యమం బలపడుతుండడం చూసి, వై.ఎస్. రాజశేఖరరెడ్డి ప్రభుత్వం ఆ ప్రాజెక్టులమీద పట్టుదలతో పనిచేసిందన్నది అతని అభిప్రాయం. ఆ రెండు ప్రాజెక్టుల విషయంలో తెలంగాణ ఉద్యమనాయకత్వం చూపిన వ్యతిరేకత నామమాత్రమే తప్ప, చిత్తశుద్ధితో కూడినది కాదని పులిచింతల నిర్వాసితులు నిర్మొహమాటంగానే అంటున్నారు. తగిన తోడ్పాటు దొరకక, ప్రతిఘటనను విరమించుకుని, చివరకు న్యాయమైన పరిహారాలకోసం మాత్రమే ఉద్యమించే స్థితికి వచ్చామని వారు బాధపడుతున్నారు. దానికి కూడా జిల్లా అధికార నేతలు సైంధవులుగా అడ్డుపడుతున్నారని వేదన చెందుతున్నారు.
తెలంగాణ ఉద్యమాన్ని రాజశేఖరరెడ్డే ఎగసన దోశారని అనడంలో ఏమంత వాస్తవం లేదు కానీ, మలి దశ తెలంగాణ ఆకాంక్ష మొగ్గగా ఉన్న దశలో, ఆయన దాన్ని స్వప్రయోజనాలకు వాడుకోవడానికి ప్రయత్నించారన్నది అంగీకరించక తప్పదు.

ఆ ప్రయత్నం, 2004 ఎన్నికలలో పొత్తుపెట్టుకోవడం దాకా కొనసాగింది కానీ, తెలంగాణ ఉద్యమసాయాన్ని కూడా కలుపుకుని ఆయన విజయం పొందాక, విరమించుకున్నారు. 2009 పోలింగ్ దశల నడుమ ప్రచారంలో, హైదరాబాద్‌కు రావాలంటే వీసాలు కావాలా అని ప్రశ్నించడంతో తెలంగాణ ఉద్యమంతో వైఎస్ తెగదెంపులు పూర్తిఅయ్యాయి. అవసరానికి ఉపయోగించుకుని, సమయం వచ్చినప్పుడు అణచివేయాలనో, ఆర్పివేయాలనో ఆయన ఉద్దేశ్యం అయి ఉండవచ్చు, అయినా, అతనిలోని రాజకీయవాదికి ఒక అనుమానం మిగిలే ఉండింది. ఎప్పటికో అప్పటికి తెలంగాణ ఏర్పడే అవకాశం ఉన్నదన్నదే ఆ అనుమానం. అది ఎంతటి సీరియస్ అనుమానం అంటే, అందుకు గాను ఆయన అనేక ముందస్తు జాగ్రత్తలు తీసుకోవడం మొదలుపెట్టారు. నికరజలాలు లేకున్నా అనేక ప్రాజెక్టులు సంకల్పించడం, పులిచింతలపై ఉన్న అభ్యంతరాలను ఖాతరు చేయకుండా ముందుకు వెళ్లడం, పోలవరం మీద గట్టి ప్రయత్నాలు చేయడం, హైదరాబాద్ చుట్టుపక్కల చాలా ప్రాంతాలను కలుపుకుని హెచ్ఎమ్‌డిఎ ఏర్పాటు చేయడం.. ఇవన్నీ, రాష్ట్రవిభజన జరిగితే కూడా కోస్తా, రాయలసీమ ప్రాంతాల ప్రయోజనాలను కాపాడుకునేందుకు చేపట్టినవి. హైదరాబాద్‌ను కేంద్రపాలితప్రాంతమో, ప్రత్యేక రాష్ట్రమో, ఉమ్మడి రాజధానో చేస్తే, దాని పరిధిని విస్తరించి ఉంచడం అవసరమని ఆయన అనుకున్నారు.

ఆశ్చర్యం ఏమిటంటే, వైఎస్‌కు అంత ముందుచూపు ఉంటే, ఆయనతో పాటు అధికారాన్ని పంచుకున్న టీఆర్ఎస్‌కు అది లోపించింది. పులిచింతల, పోలవరాలకు సంబంధించిన న్యాయమైన అభ్యంతరాలను కూడా ఆ పార్టీ సీరియస్‌గా తీసుకోలేదు. హైదరాబాద్ విస్తరణను ప్రశ్నించలేదు.

జలయజ్ఞంలోని అవినీతిని పక్కనపెట్టినా, ప్రాంతీయ జలహక్కుల ఉల్లంఘనల గురించి పట్టించుకోలేదు. మెట్రోరైల్ ప్రాజెక్టు హైదరాబాద్ ముఖచిత్రాన్ని వికృతంచేస్తుందని, చరిత్రను శిథిలం చేస్తుందని ఎంతగా గగ్గోలు పెట్టినా, దాన్ని వ్యతిరేకిస్తే ఎక్కడ 'అభివృద్ధి నిరోధకులమ'న్న పేరువస్తుందోనని మౌనంగా ఉండిపోయింది. మెట్రోమార్గానికి సంబంధించిన చిన్న చిన్న స్థానిక వివాదాల విషయంలో మాత్రం నోరువిప్పింది. ఇతర ప్రాంతాలకు మేలు చేయడానికి, ఉనికిలో ఉన్న అభివృద్ధి మార్గాన్ని కాపాడడానికి అంతగా సహకరించిన పార్టీ వల్ల, సీమాంధ్ర ప్రయోజనాలకు అపకారం జరుగుతుందని ఇప్పుడు సమైక్య ఉద్యమం చేస్తున్నవారు, కొందరు వాణిజ్యప్రముఖులు ఆందోళన చెంద డం కొంత విచిత్రంగానే కనిపిస్తోంది.

అసలు న్యాయమైన పంపకాల గురించి, సమన్యాయం గురించి ఇంతగా మథనపడడమే ఆశ్చర్యపరుస్తోంది. సీమాంధ్ర ప్రజల్లో కనిపిస్తున్న బాధ- భవిష్యత్తుగురించి స్పష్టత లేకపోవడం వల్ల, తమ మనుగడలపై కలుగుతున్న ఆందోళన తప్ప మరేమీ కాదు. వారి నినాదాలన్నిటి సారాంశం, రాష్ట్ర విభజన వల్ల ఉపాధికి, విద్యకు, జలవనరులకు లోటు జరుగుతుందేమోనన్న ఆవేదనే. ఒకవేళ అటువంటి లోటే ఏర్పడేమాటయితే, ఆ లోటు చిన్నదేమీ కాదు. బతుకుకు భరోసాను ప్రశ్నార్థకం చేసే లోటే. కాబట్టి, సామాన్యుల భావోద్వేగాలను అర్థం చేసుకోవచ్చు. కానీ, అక్కడి పౌరసమాజానికి వాస్తవాలు తెలియవా అన్నదే ప్రశ్న. స్పష్టతను తెచ్చుకోవచ్చునని, న్యాయమైన పంపకాల కోసం పోరాడవచ్చునని అక్కడి సమాజం నాయకులకు తెలుసు.

విభజన కంటె ముందుగానే లెక్కలన్నీ తేల్చుకోవలసిన అవసరమేమీ లేదు. విభజన ఒక నిర్ణయమైతే, దాని అమలు ఒక సుదీర్ఘ ప్రక్రియ. ఆ ప్రక్రియలో లెక్కల మదింపు, బేరసారాలు, వాదప్రతివాదాలు అన్నీ ఉంటాయి. వాటన్నిటిని పర్యవేక్షించే సంప్రదాయాలు, విధివిధానాలు, రాజ్యాంగం, చట్టాలు- అన్నీ ఉంటాయి. మన రాష్ట్రవిభజన ఒక్కదాని విషయంలోనే అవన్నీ మాయమైపోవు.

రెండు ప్రాంతాలు ఒక రాష్ట్రంగా కలసి ఉండాలా, విడిపోవాలా అన్న సమస్యపై ప్రజలు పోరాడవచ్చు. ఎందుకంటే, ఆ సమస్యకు కారణమయిన అంశాల విషయంలో ఫలానా నిర్ణయమే పరిష్కారమన్న అవగాహన అందులో ఉంటుంది. కానీ, విభజన జరిగితే, పంపకాలు ఎలా ఉండాలన్న అంశాన్ని వీధిపోరాటాలు నిర్ణయించలేవు. దానికి వాస్తవ, క్షేత్రస్థాయి సమాచారం, గణాంకాలు, చరిత్రాంశాలు, న్యాయదృష్టి అవసరం. కళ్ల ఎదురుగా కనిపిస్తున్న వాస్తవాన్ని కూడా నిరాకరించి, అన్యాయమైన పంపకాలు జరిగితే, పోరాటాలు చేయవచ్చు. కానీ, పంపకాల ప్రక్రియ కంటె ముందే, జనాందోళనల ద్వారా పూర్తిపూచీలను పొందలేవు. ఒకవేళ అట్లా పొందాలంటే కూడా, ఆవేశపూరితమైన నినాదాలు కాక, ఆలోచనతో కూడిన మదింపులు, తూకాలు అవసరమవుతాయి.

హైదరాబాద్ మాది అని తెలంగాణవాదులు అంటారు. హైదరాబాద్ అందరిదీ అని సమైక్యవాదులు అంటున్నారు. విభజన జరిగితే సీమకు నీళ్లు రావని ఒకరంటే, సీమాంధ్ర మొత్తం ఎడారి అవుతుందని మరొకరు అంటారు. మా భవిష్యత్తేంటి అని ప్రైమరీ స్కూలు పిల్లలు ప్లకార్డులు పట్టుకుని ఊరేగింపుల్లో నడుస్తున్నారు. హైదరాబాద్‌లో ఇల్లుకట్టుకున్నాం, ఇప్పుడు వెళ్లిపొమ్మంటే ఎట్లా అని ఉద్యోగులు అంటారు. ఈ భయాందోళనలు, ప్రకటనల్లోని సత్యాసత్యాలేమిటో నిజంగా ఈ సమాజానికి తెలియవా? హైదరాబాద్‌లో సీమాంధ్రులు 50 శాతం ఉన్నారని ఒకరంటే, పదిశాతమే ఉన్నారని మరొకరంటారు. ఎవరి జనాభా ఎంతో లెక్క కట్టలేమా? విభజన కోసం ఒక జనాభాసేకరణ చేస్తే తప్పేమిటి? హైదరాబాద్ ఎప్పుడో అభివృద్ధి చెందిందని తెలంగాణవాదులంటే, తామే అభివృద్ధి చేశామని సీమాంధ్రవాదులు అంటున్నారు. దీన్ని నిష్పాక్షికంగా అంచనా వేయలేమా? 1956 నాటికి హైదరాబాద్‌లో ఉన్న ప్రాథమిక సదుపాయాల విలువను లెక్కవేసి, ఈ అరవయ్యేళ్లలో జరిగిన అభివృద్ధిని విడిగా చూడవచ్చు. ఆ అభివృద్ధిలో సైతం, ప్రభుత్వ పెట్టుబడులయితే, తెలంగాణ భాగాన్ని విడిగా చూపవచ్చు.

ఆ పెట్టుబడికి భాగంగా, భూమి రూపంలో, నీటిరూపంలో, ఇతర సామాజిక మౌలికవ్యవస్థల రూపంలో తెలంగాణ అందించిన దోహదాన్ని అంకెలరూపంలోకి మార్చి చూడవచ్చు. రాష్ట్రంలోని తక్కిన అన్ని పట్టణాల్లో గత అరవయ్యేళ్లలో జరిగిన సాధారణ అభివృద్ధిరేటు కంటె, అదనంగా హైదరాబాద్ ఎంత 'అభివృద్ధి' చెందిందో, అందులో అరవైశాతాన్ని సీమాంధ్ర దోహదంగా చూడవచ్చు. అయితే, ఈ అభివృద్ధిని లెక్కగట్టేటప్పుడు, ప్రజల జీవనప్రమాణాలు ఎంతపెరిగాయి, అభివృద్ధిఫలితాలయిన ఉపాధి, ఆదాయాలు ఏ ప్రాంతాలకు ఎంత సమకూరాయో కూడా పరిగణనలోకి తీసుకోవాలి. ఇదంతా, నిపుణులు చేయగలిగిన పనే. భావనాత్మకమైన అంశాలు వదిలిపెట్టి, భౌతికమయిన అభివృద్ధిని లెక్కగట్టాలంటే, ఇటువంటి భౌతికమయిన ప్రమాణాలనే స్వీకరించాలి.

అలాగే, నీటివనరుల సంగతి కూడా. మొత్తం రాష్ట్రానికి ఉన్న నీటి వనరుల కేటాయింపు ఎంత, అందులో ఏ ప్రాంతానికి ఎంత కేటాయించారు, రాష్ట్ర విభజన జరిగితే, ఉత్తరాఖండ్‌లోను, ఛత్తీస్‌గఢ్‌లోను అనుసరించిన మార్గాలేమిటి? గత అరవయ్యేళ్ల కాలంలో న్యాయమైన నీటి కేటాయింపులను కోల్పోయిన ప్రాంతాలేమిటి, అదనంగా పొందిన ప్రాంతాలేమిటి? మూడు ప్రాంతాల అవసరాలేమిటి, వినియోగ వ్యవస్థలేమిటి? వీటన్నిటిని సమీక్షించితే కానీ, నీటి పంపకాలు ఎట్లా జరగాలో తెలియదు. ఈ పద్ధతిలో కాకుండా, ఎవరు ఎగువన ఉంటే వారు నీరు ఆపుకుంటారని భయపడడంలో అర్థం లేదు. ఈ దేశంలో ఒక వ్యవస్థ ఉన్నది కదా, కోర్టులు, ట్రిబ్యునళ్లు ఉన్నాయి కదా? వాటి మీద విశ్వాసం ఉన్నవాళ్లే కదా అంతా?

ఒక ప్రాంతం పాలనాయూనిట్‌గా విభజితమైనంత మాత్రాన, దాని అభివృద్ధి మరునాటి నుంచే ప్రారంభం కాదు. తెలంగాణ అభివృద్ధిలో తగిన భాగం పొందలేదంటున్నారంటే, ఆ వాస్తవికత ఆ ప్రాంతం అంతటా వ్యాపించి ఉన్నదన్నమాటే. పెట్టుబడులలోను, నైపుణ్యాలలోను, ఉపాధిలోను, వ్యవసాయ దిగుబడులలోను.. అన్నిటిలోను ఒక అంతరం ఉన్నదన్నమాటే. ఆ అంతరాలను అధిగమించడం ఒక సుదీర్ఘ ప్రక్రియ. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన వెంటనే, దానికి సొంత మానవ వనరులన్నీ ఏర్పడిపోవు. కోస్తాంధ్ర అభివృద్ధి వెనుక నూటాయాభై ఏళ్ల సాగునీటి సహకారం ఉన్నది. కాస్త, లోకజ్ఞానం, చారిత్రక జ్ఞానం ఉన్నవారెవరికైనా, నూతన తెలంగాణ రాష్ట్రంలో సీమాంధ్ర పెట్టుబడిదారుల, నిపుణుల, ఉద్యోగుల అవసరం దీర్ఘకాలం కొనసాగుతుందని అర్థమవుతుంది. అటువంటప్పుడు, కొత్త రాష్ట్రంలో తమ భవిష్యత్తుకు ముప్పున్నదని తెలంగాణలోని సీమాంధ్రులు భయపడడంలో అర్థం ఏమున్నది? కొత్త రాజధాని నిర్మించుకుని, వ్యక్తులు కానీ, రంగాలు కానీ స్వచ్ఛందంగా అక్కడికి తరలివెళ్లాలనుకునేదాకా, తెలంగాణ సమాజం వారిని తన అభివృద్ధి కోసం కూడా తనతోనే నిలుపుకోవాలనుకుంటుంది.

ఇక, వెళ్లాలి, వెళ్లిపోవాలి అని ఉద్యమనినాదాలు ఇస్తున్నవారంటారా, పైన చెప్పినట్టు, పులిచింతలను, పోలవరాన్నే అంగీకరించినవారు, మాటలలోనే తప్ప, చేతలలో పరమసాత్వికంగా ఉంటారు. వారి నాయకత్వానికి మించిన పూచీ మరేమి కావాలి?

No comments:

Post a Comment