Monday, 12 August 2013

అసెంబ్లీ తీర్మానం లేదంటే రక్తపాతమే

అసెంబ్లీ తీర్మానం లేదంటే రక్తపాతమే

August 12, 2013
విశాఖపట్నం, ఆగస్టు 10 : రాజ్యాంగం ప్రకారం రాష్ట్రం విడిపోవాలంటే సంబంధిత అసెంబ్లీ తీర్మానం తప్పనిసరని విశాఖ మాజీ ఎంపీ, టీడీపీ సీనియర్ నేత ఎంవీవీఎస్ మూర్తి చెప్పారు. కాదు...కూడదు... అంటే రక్తపాతమేనని కేంద్ర ప్రభుత్వాన్ని హెచ్చరించారు. విశాఖ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. అధికార దాహంతో, రాజకీయ స్వార్థంతో రాష్ట్ర విభజనకు కాంగ్రెస్ పార్టీ అత్యుత్సాహం చూపిస్తున్నదని ఆగ్రహం వ్యక్తంచేశారు. కేంద్రంలో సంకీర్ణ ప్రభుత్వం నడుస్తున్నందున ఆంధ్రప్రదేశ్‌ను విభజించే హక్కు, అర్హత కాంగ్రెస్ పార్టీకి లేవని ఆయన చెప్పారు. సీమాంధ్ర ప్రజల మనోభావాలను ధైర్యంగా చెప్పిన ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డిని ఆయన అభినందించారు. రాష్ట్ర విభజనపై చంద్రబాబు కేంద్రానికి లేఖ రాశారని, అయితే హైదరాబాద్ భవిష్యత్తు, రాష్ట్ర విభజనకు అనుసరించాల్సిన విధివిధానాలు, ఆర్థికపరమైన అంశాలపై తెలుగుదేశం పార్టీ వైఖరిని స్పష్టం చేయాలని, ఇక చంద్రబాబు నోరు విప్పే సమయం ఆసన్నమైందని మూర్తి అన్నారు. ప్రస్తుత పరిస్థితిపై ప్రధాని స్పందించాలన్నారు. మూడు ప్రాంతాల ప్రజల శ్రమతో హైదరాబాద్ ఎంతో అభివృద్ధి చెందిందని, అందుకే హైదరాబాద్‌పై మరింత స్పష్టత అవసరం అన్నారు. దిగ్విజయ్‌సింగ్ ఏ అధికారంతో ప్రకటనలు చేస్తున్నారని ప్రశ్నించారు. రాష్ట్ర విభజన విషయంలో సీడబ్ల్యుసీ నిర్ణయమే శిలాశాసనమని కేంద్ర మంత్రి జైపాల్‌రెడ్డి మాట్లాడటాన్ని ఆయన తప్పుబట్టారు. అత్తెసరు మెజారిటీతో నడుస్తున్న కాంగ్రెస్‌కు దమ్ముంటే లోక్‌సభను రద్దుచేసి ముందస్తు ఎన్నికలకు వెళ్లాలని మూర్తి సవాల్ చేశారు.

No comments:

Post a Comment