Sunday, 11 August 2013

Division without a vision

విజన్‌ లేని విభజన!

కైలసాని శివప్రసాద్ 



August 11, 2013
చిచ్చు రేపిన విభజన ప్రక్రియ విధానం
సీమాంధ్రులకు తప్పని సంచార జీవనం
మద్రాస్‌ టు కర్నూలు టు హైదరాబాద్‌ టు..?
రాజధాని విషయంలో ఇంకా అస్పష్టతే!
విద్య, ఉద్యోగావకాశాలు అగమ్యగోచరం

రాజకీయ స్వ ప్రయోజనాలకు రాష్ట్రం బలి! ఆంధ్రప్రదేశ్‌ రాష్టవ్రిభజన ప్రక్రియ విధా నంలో కాంగ్రెస్‌ పార్టీ వర్కింగ్‌ కమిటీ ప్రదర్శించిన వైఖరి సీమాంధ్ర ప్రజల హృదయాలను దహింపచేస్తుండడం చర్చనీయాంశం. 56 సంవత్స రాల క్రిందట కలసి‌ఏర్పడిన రెండు ప్రాంతాలను విభజించడంవంటి నిర్ణయం తీసు కోవడంలో కాంగ్రెస్‌పార్టీ ముందుచూపు లేకుండా వ్యవ హరించింది. తెలంగాణ ప్రాంత ప్రజల మనో భావా లను పరిగణనలోకి తీసు కొని రాజకీయంగా లాభపడాలని ఆరాటపడుతోందనే విమర్శను కాంగ్రెస్‌పార్టీ మూటగట్టుకోవడం గమనార్హం. ప్రస్తుతం రాష్ట్రంలో జరుగుతున్న ప్రత్యేక, సమైక్య ఉద్యమాల మూలాలు, వాటి పరిష్కారాలు కనుగొనడంలో కాంగ్రెస్‌పార్టీ లోతుగా అధ్యయనం చేసిన దాఖలాలు కనిపించడంలేదు.

సీమాంధ్రులు ఇప్పుటివరకు మూడు రాజధానులలో సంచారజీవనం సాగించారు. 1953 లో మద్రాసునుండి వేరు పడిననాటి నుంచి 3 సంవత్సరాలు కర్నూలు రాజధానిగా చేసుకొని స్థిరపడక ముందే1956లో హైదరాబాద్‌ నగరానికి తరలి రావాల్సివచ్చింది.ప్రస్తుతం వెలువడిన రాష్ట్ర విభజన ప్రక్రియలో సీమాంధ్రులకు రాజధాని నగరంపై ఇంతవరకు స్పష్ఠత లేకపోవడం శోచనీయం. సీమాంధ్రులు హైదరాబాద్‌ నుంచి ఎక్కడకు వెళ్లాలో దిక్కుతోచని స్థితిలో ఉన్నారు. వారు గత 56 సంవత్సరాలుగా హైదరాబాద్‌లో విద్య, ఉద్యోగ, వ్యాపార, వివాహబంధాలు ఏర్పరచుకొని‌ఉన్నారు. విద్యారంగంలో పదేళ్ళ క్రితంవరకు గుంటూరు, నెల్లూరు అగ్రగాములుగా ఒకవెలుగు వెలిగాయి. సీమాంధ్రులకు హైదరాబాద్‌తో ఏర్పడిన బంధం కారణంగా విద్యావ్యవస్థకు ప్రస్తుతం హైదరాబాద్‌ కేంద్రంగా మారింది. ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రానికి వచ్చిన సెంట్రల్‌ యూనివర్సిటీ, బిట్స్‌, పొట్టిశ్రీరాములు తెలుగు యూనివర్సిటీ, అంబేడ్కర్‌ ఓపెన్‌ యూనివర్సిటీలు, ఇందిరాగాంధి నేషనల్‌ ఓపెన్‌ యూనివర్సిటీ ప్రాంతీయ కేంద్రం, అనేక పోస్ట్‌గ్రాడ్యుయేషన్‌ కళాశాలలు హైదరాబాద్‌లో నెలకొన్నాయి. రాష్టవ్రిభజనవల్ల ఈ సంస్థలలో చదువుతున్న వేలాదిమంది సీమాంధ్ర విద్యార్థుల హక్కు అగమ్యగోచరంగా త యారయింది.

సీమాంధ్రప్రాంతానికి చెంది, చదువు పూర్తిచేసుకున్న ప్రతి విద్యార్థి చూపు ఉద్యోగాన్వేషణకోసం రాజధాని హైదరాబాద్‌ వైపే ఉంటుంది. ప్రతి రాష్ట్రంలో స్థానికులకు 85 శాతం, ఇతరులకు 15శాతం ఉద్యోగాలు కేటాయిస్తారు. రాష్టవ్రిభజన పూర్త‌ఇయిన నాటి నుంచి ప్రైవేట్‌ సంస్థలలోకూడా తెలంగాణ నిరుద్యోగులనుంచి సీమాంధ్ర నిరుద్యోగులు తీవ్ర ప్రతిఘటనలు ఎదుర్కోవలసి వస్తుంది. సీమాంధ్ర ప్రాంతంలో నామమాత్ర ఉద్యోగావకాశాలుకూడా లేవు. ఉన్న కొద్దిపాటి పారిశ్రామిక వాడలు ఎక్కువ భాగం నిరుపయోగంగా ఉండి శిథిలావస్థకు చేరుకొన్నాయి. ప్రతిసంవత్సరం డిగ్రీలుపొందే సీమాంధ్ర విద్యార్ధులకు ఏ విధంగా ఆ ప్రాంతంలో ఉద్యోగావకాశాలు కల్పిస్తారో అంతుచిక్కడం లేదు. సీమాంధ్రలోని 930 కి.మీ. సముద్రతీరప్రాంతంవల్ల సీమాంధ్ర బాగుపడుతుందని దిగ్విజయ్‌ సింగ్‌ వంటి వారు చెపుతుండడం ఆశ్చర్యకరం. రాష్టవ్రిభజన జరిగే ఈ నాలుగు నెలల కాలం లో సముద్రతీర ప్రాంతాన్ని ఏ విధంగా అభివృద్ధి పరుస్తారు? ఇప్పటికిప్పుడు సముద్రతీరం చేపలు పట్టుకొనడానికి మాత్రమే ఉపయోగపడుతోంది. తెలంగా ణజిల్లాల్లో పనిచేసే ఉద్యోగులు రాష్ట్ర విభజనవల్ల విచిత్రమైన పరిస్థితి ఎదుర్కొన బోతున్నారు.ఉద్యోగులలో తల్లి దండ్రులు సీమాంధ్ర ప్రాంతానికి చెందితే, వారిపిల్లలు తెలంగాణ ప్రాంతానికిచెందే పరిస్థితి‌ఉంది.

రాష్ట్ర విభజనవల్ల సీమాంధ్రులు ఎదుర్కొనే అతిప్రధానమైనది నీటిసమస్య. కృష్ణా, గోదావరి లతోపాటు ఇతర మిగులుజలాలను ఏవిధంగా ఇరుప్రాం తాలకు పంచుతారో స్పష్ఠం చేయకుండా రాష్ట్రాన్ని విభజించడం ఏం సమంజసం? దశాబ్దాలు అపరిషృతంగా ఉన్న కావేరి నదీ జలాలు, బాబ్లీ ప్రాజెక్టు, ఆల్మట్టి డ్యాం వంటి విషయాలను గమనంలోకి ఉంచుకుని ఇరు ప్రాంత ప్రజల కు ఆమోదయోగ్యమైన జలపంపిణీ నిర్ణయాన్ని విభజన ప్రక్రియకుముందే తీసు కోవాలి. గుండె, లివర్‌, కిడ్నీ, కాన్సర్‌ వంటి ప్రాణాంతక వ్యాధులకు అవసరమై న శస్తచ్రికిత్సలు అందించే కార్పొరేట్‌ వైద్య శాలలతో పాటు, నిమ్స్‌, ఎమ్‌.ఎన్‌.జె. క్యాన్సర్‌ వైద్యశాల, ఉస్మానియా వైద్యశాల, బసవతారకం కాన్యర్‌ హాస్పిటల్‌ హైద రాబాద్‌లో నిర్మించి నెలకొన్నాయి. రాష్ట్ర విభజన వల్ల సీమాంధ్ర ప్రాంత ఆరోగ్య శ్రీలబ్ధిదారుల జీవితాలు గాలిలో దీపాలుగామారే పరిస్థితి ఏర్పడబోతుంది.
రాష్ట్ర విభజన ప్రక్రియ వల్ల తెలంగాణజిల్లాలకు కూడా ప్రమాదకరమైన స్థాయిలో విద్యుత్‌ సమస్యలు తలెత్తే అవకాశముంది.సీమాంధ్ర ప్రాంతంలో విద్యుత్‌ మిగులు భాగం కనిపిస్తుంది. తెలంగాణ ఉద్యమానికి ఉన్న కారణాలలో ముఖ్యమైనది ఉద్యోగాలలో అన్యాయం జరిగినట్టు భావించడం. గణాంకాలలో భేదాభిప్రాయాలున్నా తెలంగాణప్రజలకు ఉద్యోగాల పంపిణీలో అన్యాయం జరిగింది.

రెండవ కారణంగా భావించేది రాజకీయ పదవులలో అన్యాయం. 4 దశాబ్దాలకు పైగా సీమాంధ్ర వారే ముఖ్యమంత్రి పదవిని అనుభవించారు. 40 సంవత్సరాలకు పైగా ముఖ్యమంత్రి పదవులను అను భవించిన సీమాంధ్ర ముఖ్యమంత్రులు కూడా సీమాంధ్రను విస్మరించి హైదరాబాద్‌ నగరాన్నే అభివృద్ధి పథంలో నడిపించడం గమనార్హం. నీలం సంజీవరెడ్డి, కోట్ల విజయభాస్కరరెడ్డి, నారా చంద్రబాబునాయుడు, డా వై.ఎస్‌. రాజశేఖర్‌ రెడ్డి, ఎన్‌.టి. రామారావు, ప్రస్తుత ముఖ్యమంత్రి నల్లారి కిరణ్‌ కుమార్‌ రెడ్డి రాయలసీమ ప్రాంతంనుంచి ప్రాతినిధ్యం వహించి ముఖ్యమంత్రి పదవి నిర్వహించినా రాయల సీమకు ప్రత్యేకంగా వీరు చేసింది శూన్యమే. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్‌లో రాయలసీమ ప్రాంతం అత్యంత వెనుకబడినప్రాంతం కావడం విచారకరం. రాజకీయ పదవుల నిర్వహణే ప్రామాణికంగా- విభజన అనివార్యమైతే రాష్ట్ర జనాభాలో 52 శాతం ఉన్న వెనుకబడిన తరగతులకు చెందినవారు ఇంతవరకు ఈ విశాలాంధ్రలో ముఖ్యమంత్రి పదవి దరి చేరకపోవడం గర్హనీయం. ఈ ప్రకారం రాష్ట్రంలోని వెనుకబడిన తరగతులవారి పరిస్థితి ఏమిటి? రాజకీయ పదవులలో అన్యాయం జరిగిందని ఉద్యమానికి నడుం బిగించిన తెలంగాణ వాదులు, గతంలో తెలంగాణాలోని కల్వకుర్తి శాసనసభ నియోజకవర్గం నుంచి పోటీచేసిన సీమాంధ్ర ప్రాంతానికి చెందిన నందమూరి తారక రామారావు ఓటమి చెందగా, రాయలసీమలోని నంద్యాల పార్లమెంటు నియోజక వర్గం నుండి తెలంగాణప్రాంతానికి చెందిన పి.వి. నరసింహారావు అత్యధిక మెజారిటీతో గెలుపొంది ప్రధాని పీఠాన్ని అధిరోహించిన విషయాన్ని విస్మరించినట్లున్నారు.

రాష్ట్రంలో ప్రస్తుతం ఆశ్చర్యకరమైన పరిస్థితులు నెలకొన్నాయి.10 జిల్లాలతో కూడిన ప్రత్యేక తెలంగాణరాష్ట్రాన్ని కాంగ్రెస్‌ ?పార్టీ ప్రకటించింది. అంటే, ప్రత్యేకరాష్ట్రం అనే పదానికి అంతర్లీనంగా సీమాంధ్రులను తెలంగాణనుంచి విడదీసే భావన సుస్పష్టం అయింది. 56 సంవత్సరాల తరువాత సీమాంధ్రులను దశ-దిశ నిర్దేశించకుండా వెళ్లిపోవడమంటే ఎక్కడికి వెళతారో కాంగ్రెస్‌ కురువృద్ధులే తెలపాలి. 10 సంవత్సరాలు హైదరాబాద్‌నుంచి పరిపాలన సాగించవచ్చని సీమాంధ్రులకు కాంగ్రెస్‌ పార్టీ భరోసా కల్పించింది. అందువల్ల సీమాంధ్రులకు ఒరిగేదేమిటి? ఈ 10 సంవత్సరాలలో సీమాంధ్ర ప్రాంతంలో ప్రజలకు అవసరమైన అభివృద్ది ఏ విధంగా చేస్తారు. రాజధాని నగరం అంటే కేవలం అసెంబ్లీ, సచివాలయాలే కాదు. ప్రజల జీవితాలకు భద్రత, బ్రతుకులకు భరోసా కల్పించే మౌలిక వసతులను రాజధానినగరం కలిగి ఉండాలి. హైదరాబాద్‌ నగరానికి 400 ఏండ్ల చరిత్ర ఉన్నా అభివృద్ధి చెందింది మాత్రం 1983 తరవాతనే అని చెప్పవచ్చు. 23 జిల్లాల ప్రజలు సమష్ఠి కృషి వల్ల హైదరాబాద్‌ నగరం ఇంతటి స్థాయికి చేరడానికి 56 సంవత్సరాల సమయం తీసుకుంది.

హైదరాబాద్‌వంటి నగరం కాకపోయినా, హైదరాబాద్‌లాంటి మౌలిక వసతులున్న నగరాన్ని తయారు చేసుకోవడానికి తక్కువ ఆదాయవనరులు, ఎక్కువ జనాభా ఉన్న సీమాంధ్రులకు కనీసం 50 సంవత్సరాలు పట్టే అవకాశంఉంది. ఆ ప్రకారం ఇప్పటివరకు హైదరాబాద్‌ అభివృద్ధికి వెచ్చించిన 56 సంవత్సరాల కాలంతోపాటు భవిష్యత్తులో సీమాంధ్ర రాజధాని అభివృద్ధికి వెచ్చించే 50 సంవత్సరాల కాలం వెరసి శతాబ్ది కాలం సీమాంధ్రులకు నిరుపయోగమయ్యే అవకాశముంది. అందువల్ల అంత కాలాన్నీ సీమాంధ్ర ప్రజలు నష్టపోయే ప్రమాదముంది. ఇటువంటి విషయాలను పరిగణిలోకి తీసుకుని సమస్యలను లోతుగా అధ్యయనంచేసి సమగ్ర ప్రణాళికతోకూడిన ప్రకటనను కాంగ్రెస్‌ పార్టీ చేసి ఉండే సబబుగా ఉండేది. దశాబ్దాల తరబడి‌ఉన్న తెలంగాణసమస్యను కాంగ్రెస్‌ పార్టీ చిత్తశుద్ధితో పరిష్క రించాలనుకుంటే మొట్టమొదట తెలంగాణ ప్రాంతానికి చెందిన మేధావులు, రాజకీయ నాయకులు, వివిధ స్వచ్ఛంద, ప్రజాసంఘాల ప్రతినిధులతోనే సంప్రదింపులు జరిపి‌ఉండాలి. వారికి సీమాంధ్రులకు హైదరాబాద్‌తో‌ఉన్న విద్య, ఉద్యోగ, వ్యాపార బంధాలను, హైదరాబాద్‌ నగర అభివృద్ధిలో సీమాంధ్రల పాత్రను- వారితో విపులంగా చర్చించి‌ఉండాలి. రాష్ట్రం విభజిస్తే సీమాంధ్రులు- తెలంగాణప్రజలు ఎదుర్కొనే కష్ఠాలను సాంకేతికంగా, మానవీయ కోణంలో తెలంగాణవాదులతో దీర్ఘస్థాయి చర్చలు జరిపి‌ఉంటే ఖచ్చితంగా ఈ సమస్యకు తెలంగాణవాదుల నుండే సరైన, సమంజసమైన పరిష్కారం లభించి‌ఉండేది.

ఇటువంటి సహేతుకమైన విధానాన్ని అవలంబించకుండా ‘రాష్ట్ర విభజన ప్రక్రియ జరిగిపోయింది- మీసమస్యలు ఇప్పుడుచెప్పండి’ అనడం ఎంతవరకు సమంజ సం?1956 లో ఏర్పడిన రాష్ట్రంలో 13 ఏళ్ళ వ్యవధిలోనే1969లో తెలంగాణ ఉద్యమం, 1972లో జై ఆంధ్ర ఉద్యమం తల ఎత్తిన సమయంలో రాష్ట్రంలో- కేంద్రంలో అధికారంలో?ఉన్నవి కాంగ్రెస్‌ ప్రభుత్వాలే. అప్పుడే రాష్ట్రాన్ని విభజించి ఉంటే ఎవరి ప్రాంతాలను వారు అభివృద్ది చేసుకుని ఉండేవారు. సమస్య ఇంత జఠిలమయ్యేదికాదు. అప్పుడు ఎందుకు ఆపారు, ఇప్పుడెందుకు నిర్ణయం తీసు కున్నారు అనేది చెప్పవలసిన అవసరంకూడా కాంగ్రెస్‌ పార్టీ పెద్దలమీద ఉంది. ప్రణబ్‌ముఖర్జీ కమిటీ, రోశయ్య కమిటీ, జస్టిస్‌ శ్రీకృష్ణ కమిటీల ద్వారా కానరాని పరిష్కారం రాష్టవ్రిభజన ప్రకటన వెలువరించిన తరువాత ఆంటోనికమిటీ సూచి స్తుందంటే అది హాస్యాస్పదంగానే కనుపిస్తుంది.
పెద్ద మనుషుల ఒప్పందానికి విరుద్ధంగా సీమాంధ్ర నాయకులు 10మంది పదవులు అనుభవించారని, అక్ర మంగా సీమాంధ్రులు 30-40 వేలమంది ఉద్యోగాలు పొందారనే వాదనలతో 56 సంవత్సరాలు కలిసి‌ఉన్న 5 కోట్లమంది సీమాంధ్రులను- రాష్ట్రాన్ని విభజించి రోడ్డుపాలు చెయ్యడంలో ఏపాటి ఔచిత్యమున్నదో కాంగ్రెస్‌ పెద్దలు గ్రహించాలి. రాష్ట్రంలోని రాజకీయపార్టీలన్నీ తెలంగాణ ఏర్పాటుకు అనుకూలంగా ఉన్నందు వల్ల రాష్ట్రాన్ని విభజించామనిచెప్పుకున్నా, నిర్ణయం అమలుచేసింది కాంగ్రెస్‌ పార్టీయే కనుక సీమాంధ్ర ప్రాంతంలో కాంగ్రెస్‌ పార్టీ ప్రధాన దోషిగా నిలబడాల్సి వస్తుందనడంలో సందేహంలేదు. కనుక ఇప్పటికైనా అన్నిప్రాంతాలకు అనుకూలమైన, ప్రణాళికాబద్ధమైన నిర్ణయం తీసుకోవలసిన అవసరం ఉంది.

No comments:

Post a Comment