ద్రవ ఆధునికత- రెండు ప్రశ్నలు - వివిన మూర్తి
August 12, 2013
బౌమన్ ఘన, ద్రవ ఆధునికతలను చాలా చక్కగా పరిచయం చేసారు పాపినేని శివశంకర్ (వివిధ- 22.7.13). కొంతకాలంగా వీటితో తన్నుకుంటున్నాను నేను. ఈ వ్యాసం చదివాక నాలో రెండు ప్రశ్నలు మిగిలాయి. ఒకటి ప్రపంచాన్ని అర్ధం చేసుకోటానికి కావలసిన జ్ఞాన సముపార్జనకి చెందినది. రెండవది సముపార్జించిన జ్ఞాన వినియోగానికి చెందినది.
బౌమన్ ప్రయత్నం ప్రపంచాన్ని అర్థం చేసుకునే ప్రయత్నమే. ఈ తరహా ప్రయత్నం కొత్తది కాదు. ఇది స్థల కాలాలకు అతీతంగా ప్రపంచం అంతటా, అన్ని కాలాలలోనూ జరుగుతూనే ఉంది.
ఆదిలో-
మనిషికి బాహిరమైనదీ, అతనిని నిత్యజీవితంలో అస్థిరం చేసినదీ ప్రకృతే. అదే ఆనాటికి మనిషి ప్రపంచం. దానిని అర్థం చేసుకోవాల్సిన అగత్యం మానవునికి ఉండేది. జనన, మరణాలు.. మనిషి జీవితంలోని అస్థిరత్వపు గుర్తింపుకి తొలి ప్రేరణలు అయుంటాయి. కంటికి కనిపించే ప్రకృతి కలిగిస్తున్న ఇబ్బందులను తొలగించుకునే క్రమంలోనే దానిని ప్రసన్నం చేసుకునే ఆరాధనలు, ప్రపంచ తత్వశోధనలూ జమిలిగా పుట్టాయి. సమూహ జీవితాన్ని జంతుదశలోనే సహజాతం చేసుకున్న మానవుడు గుంపులు గుంపులుగా ప్రకృతి ఉత్పాతాలనుంచి తప్పించుకోటానికి ప్రయత్నించాడు. తిండిని వెతుక్కుంటూ వలసలు పోయాడు. వేరే సమూహాలతో భౌతిక ఘర్షణ, తదనంతర ఐక్యత సమూహాలను పెద్దవి చేసాయి. ఆలోచనలు లేదా భావనలు నిలువుగా అడ్డంగా ఎదిగాయి. నిలువు ఎదుగుదల జ్ఞానవృద్ధి అయితే రెండవది వ్యాప్తి అయింది. వ్యాప్తి పరభావనలను తోడుచేస్తే అది వృద్ధికి ఉపకరించింది. ఇదే సమయంలో మానవుడు ప్రకృతితో పోరాటంలో కొంత పట్టుసాధించాడు. కొందరికి వెసులుబాటు లభించింది. వారు జ్ఞానవృద్ధిలో పాల్గొన్నారు.
ఈ క్రమంలోనే- మన దేశానికి చెందిన షడ్దర్శనాల పుట్టుకని చూడాలి. ప్రశ్న-సమాధానం పద్ధతిలో జ్ఞానవృద్ధికి ప్రయత్నించిన ఉపనిషత్తులని చూడాలి. ప్రశ్నించే శిష్యుడూ, అప్పటి వరకూ తనకున్న జ్ఞాన సంచయాన్ని నమూనాగా చేసుకుని సమాధానం ఇచ్చే గురువూ కలిసి ప్రపంచాన్ని అర్ధం చేసుకునే క్రమంలో భాగస్థులయారు. ఇది ఇలా ఉండగా సమాజానికి ఉన్న స్థిరత్వపు మౌలిక అవసరంతో- అనేక సమూహాల మధ్య పెరుగుతున్న అనివార్యమైన సహజీవనంలో- తమ స్మృతులూ, శ్రుతులూ కలబోసుకుంటూ - సామాజిక కట్టుబాట్లు ఏర్పరుచుకోటం పక్కపక్కనే సాగింది. ఇది అంతా సర్దుబాటు చేసుకునే క్రమంలో సాగలేదు. అనేక ఘర్షణలు, రక్తపాతం ఇందులో చోటుచేసుకున్నాయి. జ్ఞానచర్చపై వీటి ప్రతిఫలనాలు తప్పలేదు. మానవుని స్వార్థం-బ్రతకాలనే స్వార్థం- రూపాంతరం చెందింది. సులువుగా బ్రతకాలనే స్వార్థంగా పరిణమించింది. ఆ పరిణామం వ్యక్తికి (సమూహంలో సభ్యుడు) లభించిన ఏ కొద్దిపాటి అధికారమైనా అధికార కేంద్రీకరణకి దారితీసింది. అధికార కేంద్రాలు ఏర్పడ్డాయి. అవి పరస్పరం ఘర్షిస్తూనే అశేష సమూహాలను పాలించటంలో ఎనలేని ఐక్యత ప్రదర్శించాయి. సమూహాలు ఏకం కావటం కన్న వాటిని విడిగా ఉంచి అదుపు చేయటానినే అవి ఎంచుకున్నాయి.
వ్యక్తి స్వంత వివేచన కన్న విధేయత ముందంజ వేసింది. జననానికి కారణం అవగతమయాక సులువుగా బతకాలనే వ్యక్తి స్వార్థం తన సంతానం సులువుగా బతకాలన్న స్వార్థంగా ఎదిగింది. జ్ఞానచర్చకి అర్హతలు ఏర్పరచబడ్డాయి. దానికి వ్యక్తి వైయక్తిక సామర్థ్యాలకన్న వాని పుట్టుకను అర్హతగా చేయటం మనవంటి సమాజాలలో జరిగింది.
వర్తమానానికి వస్తే- ప్రపంచ తత్వశోధన కేవలం తత్వశోధనగా అంటే వివరణగా ఉందన్న గ్రహింపు మార్క్స్ సమయానికి ఓ ప్రతిపాదన చేసింది. తత్వశాస్త్రాల పని వివరణతో ముగియరాదనీ సవరణకు పూనుకోవాలన్నదే ఆ ప్రతిపాదన. ఈ ప్రతిపాదనకి దారితీసిన పరిస్థితులనే-ఆధునికత-అంటున్నాం. దీనిని అంగీకరించి, జనంతో అంగీకరింపజేసి, బాహిర ప్రపంచ మార్పులకోసం చైతన్యంతో -ఉద్దేశ్యపూర్వకంగా- ప్రయత్నించటాన్ని స్థూలంగా విప్లవాలు అంటున్నాం. ఇంతవరకూ జరిగిన తాత్విక శోధనకి ప్రేరణ ఏమిటి? చోదకశక్తి ఏమిటి? ఒకటి వ్యక్తి పరంగా కుతూహలం. రెండవది మానవజాతి పరంగా ఆలోచిస్తే అవసరం. వ్యక్తిది బౌద్ధిక అవసరం. మానవజాతిది మనుగడ అవసరం.
ఈనాటి తాత్విక శోధన విశ్వవిద్యాలయాలలో ప్రధానంగా సాగుతోంది. ఇది అభివృద్ధి చెందబడినవని చెప్పబడే దేశాలలో హెచ్చుగా నడుస్తోంది. ఇవి మెథడాలజీ (పద్ధతి నిర్మాణం) అభివృద్ధి చేసి శోధనకి వేగం పెంచాయి. వ్యవస్థీకృతమైన ఈ శోధనకి- అంటే అనాది, ప్రపంచ వ్యాప్త కార్యకలాపానికి- కేంద్రాలు ఏర్పడ్డాయి. ఈ శోధనకి చోదకశక్తి ఏమిటి? ప్రేరణ ఏమిటి? లక్ష్యం ఏమిటి? వ్యక్తిపరమైన బౌద్ధిక అవసరమా.. మానవజాతి మనుగడ అవసరమా.. ఇవికాక మరేమైనా ఉన్నాయా?
ఇది నాకు కలిగిన మొదటి ప్రశ్న. ఇక్కడ ఉత్పత్తి అవుతున్న ఈ జ్ఞానం వినియోగానికి సంబంధించినది నా రెండవ ప్రశ్న.
2
వ్యాసం చివరిపేరాలో 'ద్రవాధునికత వంటి కొత్త భావనల్ని (లేదా ప్రత్యామ్నాయాల్ని) మన సమాజ, సాహిత్యాలకు అన్వయించుకున్నప్పుడు నూతన విశేషాలు బయటపడతాయి' అంటూ తన అభిప్రాయాన్ని స్పష్టం చేసారు శివశంకర్. దానిని కొనసాగిస్తూ 'సంకీర్ణ సమాజం మనది' అన్నారు. ఈ సంకీర్ణతని వివరించటానికి ప్రయత్నించారు. ఇది 'పూర్వాధునిక లక్షణాలు, పూర్వాధునికత నుంచి ఆధునికతకి సాగే క్రమమూ, ఆధునికత నుంచి ద్రవాధునికతకి సాగే క్రమమూ' ఒకదాని పక్క ఒకటి ఉండటం. వీటిని వారు ఒకటి, రెండు వాక్యాలలో ఉదహరించి ఉంటే నాకు స్పష్టంగా ఉండే ది. మొదటిది కుల, వర్ణ వ్యవస్థలు, రెండవది పారిశ్రామికీకరణ, చివరిది సాఫ్ట్‌వేర్, కార్పొరేట్ ప్రపంచంగా నేను అర్ధం చేసుకుంటున్నాను. పాత టెక్నాలజీలు అంతరించకుండా కొత్తవి వాటితో సహజీవనం చేయటం గురించి ఆర్ యస్ రావు తమ అభివృద్ధి వెలుగు నీడలలో వివరించారు. ఆ వివరణ అంతకు ముందు నాకున్న పాతవి పోయి కొత్తవి వస్తాయన్న అవగాహనని సవరించింది.
శివశంకర్ చెపుతున్న సంకీర్ణత నేను గమనిస్తున్న సంకీర్ణత (complexity) భిన్నమైనవని నాకు అనిపిస్తోంది. మన పాత విభజనలు (కుల, వర్ణ వ్యవస్థలు) ఆధునిక ప్రభావంలో కొట్టుకుపోకపోగా బలపడ్డాయి. ఆధునిక ప్రభావంతో అంటే పారిశ్రామికీకరణ; జ్ఞానోదయం, స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రాతృత్వం వంటి ఫ్రెంచి విప్లవ భావాల వ్యాప్తితో మన గురజాడలు ఎన్నో కొత్త కలలు కన్నారు. మతములన్నీ మాసిపోవును.. వర్ణభేదము లెల్ల కల్లై.. అంటూ గానం చేసారు. అదే సమయంలో వార్తాపత్రికలు ఆరంభమవుతూన్నపుడే కుల పత్రికలు పుట్టాయి. కుల సంఘాలు ఏర్పడ్డాయి. వామపక్ష భావనలు వర్గ విభజన, వర్గ పోరాటం వంటివి కొద్దికాలం ప్రజా సమూహాన్ని ఆర్థిక విభజనలతో పాత విభజనలను కదిలించి పారెయ్యగలవని ఆశలు కలిగించాయి. మన పాత విభజనలు వామపక్ష భావనల ఉనికికే ప్రశ్నార్ధకాలయ్యాయి.
ఆ తర్వాత మన ఆలోచనాపరుల్లో కొంతమంది సార్త్ర్ అస్తిత్వవాదంతో గట్టిగా ప్రభావితమయారు. నీ గురించి మరో వ్యక్తి చెప్పగలిగే కులం, మతం, భాష, ప్రాంతం, దేశం వంటి వాస్తవాలు (facticity) ఇచ్చే గుర్తింపు నీదా లేక self defining animal వయిన మనిషీ నిన్ను నువ్వు నిర్వచించుకున్న విధంగా లోకం గుర్తించాలని అనుకుంటున్నావా అన్నది ఆయన ప్రశ్న. నాకు ఎదురైన ఒక ఆస్తికుడు సార్త్ర్‌కి భక్తుడు. 'మరో వ్యక్తి స్థానంలో దేవుడిని పెట్టాడు. దేవుడు ఈ గుర్తింపులన్నీ నీకు ఇచ్చాడు. నిన్ను దేవుడు ఎలా గుర్తించాలని అనుకుంటున్నావు' అని వివరించాడు. ఇటీవల మనం చూస్తున్న వివిధ అస్తిత్వ (గుర్తింపు) ఉద్యమాలు ఫాక్టిసిటీ పరిధిలోనే నడుస్తున్నాయి.
పోస్ట్ మాడర్న్ (ఉత్తరాధునికత లేక అత్యాధునికత) అన్న భావన మనని ఇటీవల ఆకర్షించింది. అది ఆధునికత తీసుకువచ్చిన భావాలకు కాలం చెల్లిపోయిందన్న చెల్లుచీటిగా మనం అర్ధం చేసుకున్నాం. కేపిటలిజం, కమ్యూనిజం మధ్య ఘర్షణ అన్న భావన కాలదోషం పట్టిందన్నారు. ఆధునికుడనటం కన్న అత్యాధునికుడు అన్నది ఉత్తమ పొగడ్త చేసారు. దానికి వ్యతిరేకులుగా కమ్యూనిస్టు భావుకులు ముద్ర వేయబడ్డారు. ఈ పోస్ట్ మాడర్న్ తీసుకు వచ్చిన ఆలోచనలలో ఒకటైన - సమస్య అఖండం కాదు గనక పరిష్కారం అఖండం కాదు. -అన్నది మన వర్తమాన అస్తిత్వ ఉద్యమాలకు తాత్విక భూమిక ఏర్పరిచింది.
ఇలా మనం మన పరిస్థితులను అర్థం చేసుకోటానికీ, వాటిని అధిగమించటానికీ తెచ్చుకున్న అనేక భావనలు మన గడ్డకట్టిన సమాజపు -ఘనత్వాన్ని - పైపైన తాకాయిగాని సమస్య మూలాలకు వెళ్లటానికి మనలను ఉద్యుక్తులను చేయలేకపోయాయి. ఈ స్థితిలో ద్రవ ఆధునికత అన్న భావన మనకి చూపించే కొత్త విశేషాలేమిటి? మన శతాబ్దాల సామాజిక దుర్వ్యవస్థలను కదిలించగలదా? కనీసం ఆ ముఖంగా మన ఆలోచనలను నెట్టగలదా? పెట్టుబడికి ఎల్లలు చెరిగిపోవటమనే వాస్తవాన్ని తాత్వికంగా వివరించిన బౌమన్ భావనలకు మనం వినియోగదారులమవుతామా? లేక వినియోగ సరుకు అవుతామా? ఇది నా రెండవ ప్రశ్న.
-

No comments:
Post a Comment