Wednesday 18 February 2015

మోదీ హితవు!

మోదీ హితవు!
దేశంలోని మైనారిటీలకు అభయం ఇస్తూ ప్రధానమంత్రి నరేంద్రమోదీ చెప్పిన మాటలు, ఇచ్చిన హామీలు స్వాగతించవలసినవి. మత విద్వేషాలను సహించబోమని, అన్ని మతాలకు సమాన స్వేచ్ఛ ఉంటుందని, మతం పూర్తిగా వ్యక్తిగతమైనదని ఆయన ఎటువంటి సందేహాలకు తావులేని ప్రకటన చేశారు. దేశంలో క్రమంగా పెరుగుతూవస్తున్న మతపరమైన దాడులు, వివాదాస్పద వ్యాఖ్యలు, విద్వేషపూరితమైన ప్రకటనలపై తన ప్రభుత్వ విధానాన్ని ప్రకటించడానికి ప్రధాని ఎంచుకున్న వేదిక కూడా సందర్భోచితంగా సరైనది.
అధినాయకులు మాట్లాడనంత కాలం, అనుచర గణం దానిని అంగీకారంగానే తీసుకుంటుంది. తమ చేష్టలకు ఆమోదమే కాదు, ఆశీస్సులు కూడా అందుతున్నాయనుకుంటుంది. మరింత విర్రవీగి అప్రదిష్టపాల్జేస్తుంది. వారి తప్పును తక్షణమే సరిదిద్ది, మార్గాన్ని మార్చకతప్పదు. ఎల్లవేళలా కనిపెట్టుకుని ఉండకా తప్పదు. ఎన్డీయే ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన కొద్దికాలంలోనే ఆరంభమై, అనతికాలంలోనే అనేక వివాదాస్పదమైన అంశాలు సమాజాన్ని రాజేస్తున్న నేపథ్యంలో, స్వయంగా ప్రధాని ఈ స్థాయిలో ఒక స్పష్టమైన సందేశాన్నివ్వడం ఇదే ప్రధమం. కేరళకు చెందిన కురియకోస్‌ చావరా, యూఫ్రేసియాలకు సెయింట్‌ హుడ్‌ ప్రకటించిన సందర్భంగా ఢిల్లీ విజ్ఞాన్‌భవన్‌లో నిర్వహించిన ఒక కార్యక్రమాన్ని ప్రధాని సమయోచితంగా సద్వినియోగం చేసుకున్నారు. వీరిద్దరి ఔన్నత్యాన్నీ శ్లాఘించడంతోపాటు, సర్వమతాలనూ సమానంగా ఆదరించి, గౌరవించే సంప్రదాయం భారతదేశమంత ప్రాచీనమైనదన్నారు ఆయన. రాజ్యాంగ విలువలన్నీ భారత ప్రాచీన సంస్కృతి, సాంప్రదాయాలలో ఉన్నాయనీ, సమానగౌరవమన్న సూత్రం భారతీయ విలువల్లో అంతర్భాగమన్న వ్యాఖ్యలపై అభ్యంతరపెట్టవలసిందీ, ప్రత్యేకంగా విశ్లేషించవలసిందీ ఏమీ లేదు. విలువలను ఎక్కడనుంచి స్వీకరించినప్పటికీ, రాజ్యాంగం నిర్దేశించిన విలువల సంరక్షణకు ప్రభుత్వం కట్టుబడి ఉంటున్నందుకు సంతోషించాలి. ప్రతి ఒక్కరి మతస్వేచ్ఛనూ గౌరవించడం, అన్ని మతాలకూ సమాన గౌరవం దక్కడం, ఇతర మతస్థులపై విద్వేషాన్ని రెచ్చగొట్టే చర్యలను సహించకపోవడం, మతహింస విషయంలో కఠినంగా ఉంటామనడం వగైరా హామీలు ఇచ్చినందుకు అభినందించాలి. మతసామరస్యం లేని సమాజంలో అభివృద్ధి సాధ్యం కాదంటూ తన ఎజెండా ఏమిటో స్పష్టంగా చెప్పినందుకు సంతోషించాలి.
నరేంద్రమోదీ నుంచి ఈ తరహా ప్రకటన ఒకటి ఎప్పుడో వచ్చివుంటే బాగుండేదని అనిపించడం సహజం. గత మూడునెలల కాలంగా ఢిల్లీలో చర్చిలపై దాడులు జరుగుతున్నాయి. అంతకుముందు, ఘర్‌వాపసి పేరిట మతమార్పిడులు జరిగాయి. దేశంలోని పదిహేను కోట్లమందినీ వెనక్కు తీసుకువచ్చే వరకూ ఇది ఆగదన్నారు. పరివారంలోని సాక్షులు, సాధ్వులు ఆందోళన కలిగించే స్థాయిలో వరుసగా వివాదస్పద వ్యాఖ్యలు చేస్తూనే ఉన్నారు. కేవలం, సాధ్వినిరంజన్‌ జ్యోతి వ్యవహారంలో, అందునా పార్లమెంటు స్తంభించిపోయినందున ప్రధాని మోదీ ఆమె వ్యాఖ్యలు తప్పేనన్నారు. గణతంత్ర దినోత్సవానికి ముఖ్య అతిథిగా ఇక్కడకు వచ్చిన అమెరికా అధ్యక్షుడు బరాక్‌ ఒబామా విమానం ఎక్కే ముందూ, అమెరికా తిరిగి చేరుకున్నాక చెప్పిన హితవు మనకు కొంత ఆగ్రహం కలిగింది కానీ, ఇప్పుడు ప్రధాని చెప్పిన మాటలనే ఆయన కూడా చెప్పాడు. ‘మతపరంగా చీలిపోనంత కాలమూ మీరు అభివృద్ధి సాధిస్తార’న్నాడాయన. ఒబామా అభివృద్ధి మంత్రమో, ఢిల్లీలో పనిచేయని తంత్రమో తెలియదు కానీ, మొత్తానికి నరేంద్రమోదీ నుంచి ఒక విస్పష్టమైన సందేశం వచ్చింది. మోదీకి మంచిమాట చెప్పిపోయిన బరాక్‌ ఒబామా ఇప్పుడు సొంతింటిని చక్కదిద్దుకోవడం మీద దృష్టిపెట్టడం అవసరం. జాతివివక్షతో రగిలిపోతున్న ఆ దేశంలో భారతీయులకు వ్యతిరేకంగా జరుగుతున్న వరుస సంఘటనలు ఆందోళన కలిగిస్తున్నాయి. శ్వేతజాతి పోలీసు అధికారి చేతుల్లో తీవ్రంగా గాయపడిన ఒక వృద్ధుడు ఆసుపత్రిలో అచేతనంగా పడివున్నాడు. ఒక యువవ్యాపారిని గుర్తుతెలియని దుండగులు కాల్చివేశారు. కొందరు ఉన్మాదులు మహాశివరాత్రికి ముందు ఆలయంపై దాడిచేసి గోడమీద పిచ్చిరాతలు రాశారు. మసీదులపైన కూడా దాడులు జరుగుతున్నాయి. అమెరికాలో పెరుగుతున్న ఈ అసహనానికి ఎలా అడ్డుకట్టవేయాలో ఒబామా ఆలోచించడం అవసరం. హితవు చెప్పినవారు ఆచరణలో చూపక తప్పదు.
ఆలస్యంగానైనా మోదీ చెప్పిన ఈ హితవు, దేశంలో అలజడులు సృష్టించేవారి చెవికెక్కుతుందనీ, ఒక హెచ్చరికలాగా పనిచేస్తుందని ఆశించవచ్చు. అటువంటి వారి విషయంలో ఎలా వ్యవహరించాలో అర్థంకాక అయోమయంలో ఉన్న వివిధ వ్యవస్థలకు, వ్యక్తులకు ఇది ఎంతో కొంత ధైర్యాన్నిస్తుంది. ఏ కారణం రీత్యా ఈ ప్రకటన చేసినప్పటికీ, దాని సారాంశాన్ని క్షేత్రస్థాయిలో అమలు జరిగేట్టు చూడడం ముఖ్యం. తన పార్టీలో వివాదాస్పద వ్యాఖ్యలు చేసేవారిపట్ల తక్షణమే కఠిన చర్యలు తీసుకోవడం ద్వారా ఆయన మాటలకు మాత్రమే పరిమితం కావడం లేదన్న సంకేతాలు పంపాలి. ఇది మిగతా అనుబంధ శక్తులు వీరంగం వేయకుండా నిలువరిస్తుంది. ప్రజల్లో విశ్వాసాన్ని మరింత ఇనుమడింపచేస్తుంది.

No comments:

Post a Comment