Thursday 12 February 2015

‘షుగర్‌’ అదుపుతప్పినా తెలియదు!

‘షుగర్‌’ అదుపుతప్పినా తెలియదు!

  90 శాతం మధుమేహ బాధితుల పరిస్థితి ఇదే!
 నియంత్రణలోనే ఉందన్న భావన
 హైదరాబాద్‌ సహా 8 నగరాల్లో అధ్యయనం
 ఫార్మాదిగ్గజం అబాట్‌తో కలిసినిర్వహించిన ఏపీఐ

ముంబై: మధుమేహం ఉన్నవారు ఎప్పటికప్పుడు రక్తంలో చక్కెర స్థాయులను పరీక్షించుకోవాలి. అయితే అది నియంత్రణలోనే ఉందని చాలా మంది అనుకుంటుంటారు. కానీ, నిజానికి చాలా మంది దానిపై ఓ అవగాహనకు రాలేకపోతున్నారని తేలింది. పదిలో తొమ్మిది మందికి అంటే 90 శాతం మంది మధుమేహ బాధితులు.. చక్కెరస్థాయులు అధికంగానే ఉన్నా నియంత్రణలోనే ఉందనే భావనలో ఉంటున్నారట! అసోసియేషన్‌ ఆఫ్‌ ఫిజిషియన్స్‌ ఆఫ్‌ ఇండియా (ఏపీఐ) వైద్యులు చేసిన అధ్యయనంలో ఈ విషయం వెల్లడైంది. హైదరాబాద్‌, ముంబై, బెంగళూరు, ఢిల్లీ, కోల్‌కతా, చెన్నై, అహ్మదాబాద్‌, పుణె నగరాలకు చెందిన 1500 మంది మధుమేహ వ్యాధిగ్రస్తులపై ఈ అధ్యయనం నిర్వహించారు. ఫార్మా దిగ్గజం అబాట్‌తో కలిసి ఏపీఐ ఈ అధ్యయనం నిర్వహించింది. ఆ ఫలితాలను బుధవారం విడుదల చేసింది. ‘‘చక్కెర కూడా పొగాకు లాంటిదేనని గతేడాది ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రకటించింది. పొగాకు వల్ల కేన్సర్‌ వస్తుంది. చక్కెర వల్ల మధుమేహం బాధిస్తుంది’’ అని ఏపీఐ అధ్యక్షుడు డాక్టర్‌ శషాంక్‌ జోషి అంటున్నారు. అయినా సరే మధుమేహాన్ని ప్రజలు తీవ్రంగా తీసుకోవట్లేదని ఆయన అన్నారు. ‘‘చాలా మంది రోజు మొత్తం పెరుగుతూ తగ్గుతూ ఉండే చక్కెర స్థాయులపై అవగాహన పెంచుకోవట్లేదు. ఇదే చాలా దుష్పరిణామాలకు దారి తీస్తోంది. అన్నం మానేస్తే.. మాత్రను మానాల్సిన పని లేదని చాలా మంది అనుకుంటారు. కానీ, అన్నం మానేస్తే.. మాత్రను మానాలని మాత్రం వారికి తెలియదు. ఈ అవగాహన లోపమే అది విజృంభించడానికి కారణమవుతోంది’’ అని జోషి ఆందోళన వ్యక్తం చేశారు. ప్రపంచంలో అత్యధికంగా మధుమేహ బాధితులున్న దేశాల్లో భారత్‌ది రెండోస్థానం. దాదాపు 6.51 కోట్ల మంది ఆ వ్యాధి బారిన పడ్డారని అంతర్జాతీయ మధుమేహ సమాఖ్య పేర్కొంది. 2010లో ఆ సంఖ్య కేవలం 5.08 కోట్లే! అంటే నాలుగేళ్లలో ఆ సంఖ్య 1.50కోట్లు పెరిగింది. 2030 నాటికి అది మరింత తీవ్ర రూపం దాల్చనున్నట్లు తెలుస్తోంది. 10 కోట్ల మందికి మధుమేహం పట్టుకుంటుందని ఓ అంచనా! 50 శాతానికిపైగా మహిళలు వ్యక్తిగత జీవితం వల్లే దాని బారిన పడుతున్నారని, అదే పురుషుల్లో అయితే వృత్తిగత జీవితం, అలసట తదితర కారణాలు దానికి కారణాలుగా తేలాయి. అంతేకాదు.. పురుషుల కన్నా మహిళలకే దానిపై మరింత అవగాహన ఉన్నట్లు ఈ అధ్యయనంలో తేలింది. అధ్యయనం చేసిన వారిలో 54 శాతం మంది మధుమేహం వల్ల కలిగే దుష్పరిణామాలు, ఇతర జబ్బులతో బాధపడుతున్నారని తేలింది. అంతేకాదు.. ముగ్గురులో ఒక్కరు హైపోగ్లైసీమియా (చక్కెర స్థాయులు భారీగా పడిపోవడం), హైపర్‌ గ్లైసీమియా (భారీగా పెరగడం)తో బాధపడుతున్నారని తేలింది. 

No comments:

Post a Comment