Thursday 19 February 2015

ఏపీకి ‘హోదా’ ఇచ్చేశాం!

ఏపీకి ‘హోదా’ ఇచ్చేశాం!

కేబినెట్‌ ఆదేశాలు ఇచ్చాం.. అమలే ఆలస్యం
పదేళ్లన్న బీజేపీ ఇప్పుడు మాట మార్చింది: డిగ్గీ
సభలో నేనే ప్రభుత్వాన్ని నిలదీస్తా: మన్మోహన్‌
కేబినెట్‌లో ఆదేశాలు జారీ చేశాం.. అమలు చేయడమే ఆలస్యం

 నాడు పదేళ్ల కోసం పట్టుబట్టిన బీజేపీ
 అధికారంలోకి వచ్చాక మాట మార్చింది
 ఏపీలో ఆదరించకున్నా జనం కోసం పోరాటం
 పార్లమెంటులో నిలదీస్తాం
 ఏప్రిల్‌లో ఏపీకి సోనియా
 కోటి సంతకాల స్వీకరణ...దిగ్విజయ్‌ ప్రకటన
 నేనే ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తా: మన్మోహన్‌

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 19 (ఆంధ్రజ్యోతి): ‘‘నవ్యాంధ్ర ప్రదేశ్‌కు కాంగ్రెస్‌ ఆధ్వర్యంలోని యూపీఏ ప్రభుత్వమే ప్రత్యేక హోదా ఇచ్చింది. ఇందుకు కేబినెట్‌ ఆమోదం లభించింది. ఆ ఉత్తర్వులను బయటపెడతాం’’ అని కాంగ్రెస్‌ పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి దిగ్విజయ్‌ సింగ్‌ చెప్పారు. నాటి ప్రధాని మన్మోహన్‌ సీమాంధ్రకు ఐదేళ్లపాటు ప్రత్యేక హోదా అని ప్రకటించగా... బీజేపీ నేతలు మాత్రం పదేళ్లు కావాలని పట్టుబట్టారని తెలిపారు. తీరా ఇప్పుడు అధికారంలోకి వచ్చాక మాట మార్చి ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వబోమంటున్నారని ధ్వజమెత్తారు. ప్రత్యేక హోదా, విభజన సందర్భంగా నవ్యాంధ్రకు ఇచ్చిన ఇతర హామీలను అమలు చేసేలా కేంద్రంపై ఒత్తిడి తేవాలని కాంగ్రెస్‌ నిర్ణయించుకున్న సంగతి తెలిసిందే. ఈ దిశగా అనుసరించాల్సిన వ్యూహంపై చర్చించేందుకు గురువారం దిగ్విజయ్‌, ఏపీ పీసీసీ చీఫ్‌ రఘువీరారెడ్డి, రాజ్యసభ సభ్యుడు కేవీపీ రామచంద్రరావు, ఏఐసీసీ ఎస్సీ విభాగం అధ్యక్షుడు కొప్పుల రాజు మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌ను కలిశారు. ఐదేళ్లు ప్రత్యేక హోదా ఇస్తామని తాను రాజ్యసభలో ప్రకటించినప్పుడు... పదేళ్లు కావాలని కోరిన వారు ఇప్పుడెలా వెనక్కి వెళ్తారని మన్మోహన్‌ ఆశ్చర్యపోయినట్లు తెలిసింది. దీనిపై రాబోయే పార్లమెంటు సమావేశాల్లో తానే ప్రభుత్వాన్ని నిలదీస్తానని చెప్పారు. ఆ తర్వాత పార్టీ కార్యాలయంలో దిగ్విజయ్‌ మీడియాతో మాట్లాడారు. ‘‘రాష్ట్ర విభజన సమయంలో కొందరు కాంగ్రెస్‌ ఎంపీలు, నాటి కేంద్ర మంత్రులు ఏపీ ప్రయోజనాల కోసం పోరాడారు. ఏపీలో కేంద్ర సంస్థలు, నౌకాశ్రయాలు, విమానాశ్రయాలు, వెనుకబడ్డ ప్రాంతాలకు నిధులు, కొత్త రాజధానికి ఆర్థిక సహాయం, బడ్జెట్‌ లోటును భర్తీ చేసేందుకు నిధులు వంటివి రాబట్టారు. రాజ్యసభలో ప్రధాని మన్మోహన్‌ సింగ్‌ ఏపీకి ప్రత్యేక హోదా, పన్ను రాయితీలు ఇస్తూ ప్రకటన చేశారు. ఏపీకి ప్రత్యేక హోదా ఐదేళ్లుకాదు... పదేళ్లు కావాలని నాడు బీజేపీ నాయకులు పట్టుబట్టారు. ఇప్పుడు అధికారంలోకి వచ్చాక మాట మార్చేస్తున్నారు. ఇలా మాట మార్చటం బీజేపీకి కొత్తేమీ కాదు’’ అని దిగ్విజయ్‌ పేర్కొన్నారు. కాంగ్రెస్‌కు ఏపీలో ఆదరణ లభించకపోయినా, ప్రజల కోసం తాము కట్టుబడి ఉన్నామని తెలిపారు. విభజన చట్టంలో ఉన్న, రాజ్యసభలో ప్రధాని హోదాలో మన్మోహన్‌ ఇచ్చిన హామీలను అమలు చేసేలా పోరాడతామన్నారు. ఈ హామీలు అమలు చేయాలని ప్రధాని మోదీకి గత ఏడాది జూన్‌లోనే సోనియా గాంధీ లేఖ రాశారని గుర్తు చేశారు. ఆయా హామీలన్నింటినీ రాష్ట్రపతి ప్రసంగంలో పేర్కొనాలని, జాతీయ బడ్జెట్‌, రైల్వే బడ్జెట్‌ల్లో నిధులు కేటాయించాలని కోరుతూ ఇప్పుడు మరొకమారు ప్రధానికి సోనియా లేఖ రాస్తారని దిగ్విజయ్‌ తెలిపారు. హామీల అమలుపై చేపట్టిన కోటి సంతకాలను స్వీకరించేందుకు సోనియాగాంధీ ఏపీకి వస్తారన్నారు. బహిరంగ సభలో పాల్గొని ప్రజలనుద్దేశించి ప్రసంగిస్తారని చెప్పారు. తర్వాత కోటి సంతకాలను రాష్ట్రపతి ప్రణబ్‌ ముఖర్జీకి సమర్పిస్తారని వివరించారు.
ప్రతి బూత్‌కు వెళతాం... 
రాష్ట్ర విభజనపై కాంగ్రెస్‌ వైఖరి, ఏపీకి మేలు చేసేలా బిల్లులో పేర్కొన్న హామీలు, పోలవరం నిర్మాణం త్వరితగతిన పూర్తయ్యేందుకు తీసుకున్న చర్యల్ని ఏపీలో ప్రతి పోలింగ్‌ బూత్‌కు వెళ్లి వివరిస్తామని దిగ్విజయ్‌ చెప్పారు. ఏపీ నుంచి ఒక్క కాంగ్రెస్‌ ఎంపీ కూడా లోక్‌సభలో లేనప్పటికీ... హామీల అమలు అంశాన్ని తమ పార్టీ ఎంపీలు పార్లమెంటులో లేవనెత్తుతారని, ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తారని చెప్పారు. ‘‘మా పార్టీ సీఎంలు కూడా ప్రత్యేక హోదాకు డిమాండ్‌ చేయొచ్చు. అంతే తప్ప, ఆంధ్రప్రదేశ్‌కు ఇస్తే వ్యతిరేకించరు’’ అని దిగ్విజయ్‌ ఓ ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. పోలవరం నిర్వాసితులకు మంచి పునరావాస ప్యాకేజీ కావాలని మాత్రమే తెలంగాణ కాంగ్రెస్‌ డిమాండ్‌ చేస్తోందని, ప్రాజెక్టును వ్యతిరేకించటం లేదని చెప్పారు. విభజన చట్టంలో చాలా లోపాలున్నాయని కేంద్ర మంత్రి వెంకయ్య చేసిన వ్యాఖ్యల్ని గుర్తు చేయగా.. ఈ లోపాలన్నింటినీ సరిచేయొచ్చునని తెలిపారు.
అందని ‘ఉత్త’ర్వులు
ఏపీకి ప్రత్యేక హోదా అంశాన్ని బిల్లులోనే ఎందుకు పొందుపర్చలేదు? అనే ప్రశ్నకు దిగ్విజయ్‌ బదులిస్తూ... ‘‘దీనిపైనా మేం అప్పట్లో చర్చించాం. కొన్ని ఇబ్బందులు ఉండటంతో రాజ్యసభలో ప్రకటన చేశాం. కేబినెట్‌లోనూ ఆమోదించాం. ఏపీకి ప్రత్యేక హోదా ఇస్తూ కేబినెట్‌ ఆమోద ఉత్తర్వులు ఉన్నాయి’’ అని తెలిపారు. అలాంటి ఆదేశాలు ఉంటే చూపించాలని కేంద్ర మంత్రి వెంకయ్య నాయుడు సవాల్‌ చేశారని చెప్పగా... వాటి ప్రతులను మీడియాకు విడుదల చేస్తామని దిగ్విజయ్‌ చెప్పారు. పీసీసీ ఛీఫ్‌ రఘువీరా సైతం ప్రత్యేక హోదాపై కేబినెట్‌ ఉత్తర్వులు ఉన్నాయని, ఇప్పుడే వాటిని తీసుకొచ్చి ఇస్తానని దిగ్విజయ్‌ వద్దకు వెళ్లారు. కానీ, రాత్రి వరకూ ఎదురుచూసినా ఉత్తర్వుల ప్రతులు మీడియాకు అందలేదు. అధిష్ఠాన పెద్దలకు మళ్లీ గుర్తు చూసినా... స్పందన రాలేదు.

No comments:

Post a Comment