Thursday 26 February 2015

అమ్ముడుద్యమం : కంచ ఐలయ్య

అమ్ముడుద్యమం : కంచ ఐలయ్య సుప్రసిద్ధ రచయిత, సామాజిక శాస్త్రవేత్త

చరిత్రలో ఉద్యమాలు అని పేరుపెట్టిన ప్రజా ప్రక్రియకు కొన్ని విలువలుండడం తప్పనిసరి. ప్రాంతీయ మేధావి వర్గం కూడా ప్రతిదానికి ఉద్యమమని పేరు పెట్టింది కనుక ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వం ఒక కొత్త ఉద్యమం నడుపబోతున్నది. దాన్నే మనం ‘అమ్ముడుద్యమం’ అని పిలవొచ్చు.... గత కొంతకాలంగా వసూళ్ళను, ఆత్మహత్యను ఉద్యమమని నిర్వచించినప్పుడు ఇప్పుడు ముందుకొస్తున్న ఆస్తులమ్ముడు కార్యక్రమం కూడా ఒక ‘ఉద్యమమే’ అని నిర్వచిస్తే తప్పేమిటి? ఇంతటితో ఆగదు. వాస్తునమ్మకం ఉద్యమంలో భాగమౌతుంది. కొంపలు కూల్చడం ఉద్యమంలో భాగమౌతుంది. కాని వృద్ధిరేటు పెంచడం మాత్రం ఆలోచనా రంగంలో లేకుండా పోతుంది.
ప్ర
పంచ దేశాల్లో ఎన్నో రకాల పోరాటాలకు, ప్రజాస్వామ్య వ్యవస్థల నిర్మాణానికి ఆదర్శంగా ఉన్న అబ్రహాం లింకన్‌, అమెరికాను విడగొట్టడానికి అంతర్యుద్ధం తీవ్రంగా జరుగుతున్న సమయంలో ఒక గొప్ప మాటన్నాడు ‘అందర్ని కొంతకాలం, కొందర్ని అన్ని కాలాలు మోసం చెయ్యొచ్చు, కాని అందర్ని అన్ని కాలాలు మోసం చెయ్యలేరు’ అని. అది ఆ దేశం ముక్కలౌతున్న దశలో బానిస యజమానులు తెల్లప్రజలకు చెప్పే అబద్ధాలను తిప్పికొట్టడానికి చెప్పిన మాట.
రాష్ట్రం విడిపోక ముందు, ఇది విడిపోతే తెలంగాణ ప్రజలందరూ - ఒక్క భూస్వాములు, అరకొరగా తెలంగాణలో ఉన్న పెట్టుబడిదారులే కాదు, అందరంటే అందరు- ఆంధ్ర ప్రజలందరి కంటే అద్భుతంగా బతుకుతారని చెప్పిన మాటలు ఒక రాష్ట్రం ప్రజలందర్నీ చాలా కాలం మోసం చెయ్యలేవు. ప్రభుత్వాలని నడిపేవాళ్ళు రోజూ అబద్ధాలతో కూడా ప్రజల్ని చాలా కాలం నమ్మించలేరు.
ఈ మధ్య కాలంలో ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం విడుదల చేసిన వృద్ధిరేటు గణాంకాలు 2012-2013 సంవత్సరం కంటే ఆ జిల్లాల్లో 2014-2015ల్లో బాగా పెరిగింది అని తేల్చాయి. తెలంగాణ అభివృద్ధి రేటు పరిస్థితి ఏందో ఇక్కడి ప్రభుత్వం చెప్పడం లేదు. కామన్‌ సెన్సు ఉన్న ఎవరికైనా అర్థమయ్యేదేమంటే 2012-13 సంవత్సరం కంటే 2013-14 అభివృద్ధి రేటు తెలంగాణలో బాగా తగ్గింది. అందుకు కరువు ఒక కారణం కాగా ఇక్కడి పాలకుల ఫ్యూడల్‌ అహంభావం మరొక కారణం. గత రెండు సంవత్సరాల్లో హైదరాబాద్‌ ఇండస్ర్టియల్‌ కీలక ఉత్పత్తి సంస్థలు కూడా పూణే, బెంగుళూరు వంటి చోట్లకు తరలిపోయాయి.
పెట్టుబడిని కోపం వచ్చినప్పుడు తిట్టి, అవసరం వచ్చినప్పుడు పొగిడితే అది తిట్టినప్పుడు వెళ్లిపోయి పొగిడినప్పుడు తిరిగిరాదు. ఆంధ్ర ప్రజలంతా - పెట్టుబడిదారులతో సహా - మోసగాళ్ళు, దగాకోర్లు అని పదేళ్ళు తిట్టి ఇప్పుడంతా మంచివాళ్లే అంటే ఇక్కడి పాలకులకు పది పైసల మేలు జరగొచ్చేమో కాని విశాల ప్రజలకు మేలు జరుగదు. రాజకీయ, ఆర్థిక రంగాలు పగటి బాగోతాలు కావు కదా! చరిత్రలో ఉద్యమాలు అని పేరుపెట్టిన ప్రజా ప్రక్రియకు కొన్ని విలువలుండడం తప్పనిసరి. ప్రాంతీయ మేధావి వర్గం కూడా ప్రతిదానికి ఉద్యమమని పేరు పెట్టింది కనుక ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వం ఒక కొత్త ఉద్యమం నడుపబోతున్నది. దాన్నే మనం ‘అమ్ముడుద్యమం’ అని పిలవొచ్చు. అందులో కూడా లాభపడేవాళ్ళు ఉంటారు. నష్టపొయ్యేవాళ్ళు మాత్రం నేరుగా కనిపించరు. ఎందుకంటే ఈ అమ్ముడుద్యమం రాష్ట్ర సాధన ఉద్యమ వెన్నంటుకొనే వస్తుంది కనుక. ఇది రాజశేఖర రెడ్డి ప్రభుత్వ అమ్ముడు రాజకీయంలా ఉండదు. ఇదొక మహా ఉద్యమంగా ఉంటుంది.
ఈ ఉద్యమం ముందు నిర్వచనాలనుమార్చే వందిమాగధ మేధావుల్ని సంబుర పెడుతుంది. ఇది హుసేన్‌సాగర్‌ భూముల్ని అమ్మి ఆకాశమెత్తు భవంతులు కడతామనే ఒక అభూత నమ్మకం (కల్పన కాదు). అక్కడి నుండి హైదరాబాద్‌ కలెక్టరేట్‌, పాత గెస్ట్‌హౌజ్‌లైన లేక్‌వ్యూ, అక్కడి నుండి నేరుగా సెక్రటేరియట్‌కే ఎసరు పెట్టింది.
ఆంధ్రప్రదేశ్‌ సమైక్య రాష్ట్రంగా ఏర్పడ్డాక నీలం సంజీవరెడ్డి, కాసు బ్రహ్మానందరెడ్డి నుంచి మొదలుకొని ఎన్‌.టి.రామారావు వరకు, ఆంధ్ర దోపిడీ ముఖ్యమంత్రులని మనమెవరినైతే తిట్టామో వాళ్ళు హైదరాబాదులో ఒక్క ప్రభుత్వ బంగ్లానంటే ఒక్కదాన్ని కూడా అమ్మిన దాఖలాలు లేవు. చివరికి నిజాం ఇంటిగా ఉన్న కింగ్‌ కోఠి బంగ్లా ఆ రోజుల్లో అమ్మాలంటే, ఆనాటి విలువతో చాలా డబ్బే వచ్చేది. కాని వాళ్ళు అమ్మలేదు. అందులో ప్రభుత్వ దవాఖాన నడిపారు. ఇప్పటికీ నడుస్తున్నది. వాళ్ళు అమ్ముకుంటే కోఠి ఉమెన్స్‌ కాలేజి భూమి, బంగ్లా, ఉస్మానియా యూనివర్సిటీ ల్యాండ్‌ బంగారంతో సమానమైనవి. కాని వాళ్ళు అమ్మలేదు. ఈ మధ్య గత పదేండ్ల తెలంగాణ ‘ఉద్యమ’ కాలంలో రాష్ట్రం రావాలని చాలా ఆరాటపడ్డ ఒక వృద్ధ ప్రొఫెసర్‌ నాకు ఫోన్‌చేసి ‘రాష్ట్రం రాగానే ఇంత ఘోరమైన అమ్మకం ప్రతిపాదనలు వస్తాయని నేను అనుకోలేదు- ఐలయ్యా! హుస్సేన్‌సాగర్‌ నీళ్ళెత్తిపొయ్యడమంటే అమ్మడానికే, నిజమే’ అని వాపొయ్యాడు. ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం ఐదేళ్ళలో ఇక్కడ ఉండదు. సెక్రటేరియట్‌లో ఎన్నో పెద్ద, పెద్ద బంగ్లాలు ఖాళీగా ఉంటాయి. పది జిల్లాల తెలంగాణ ప్రభుత్వం ఆ బంగ్లాల్లో క్రికెట్‌ ఆడుకునేంత స్థలం ఉంటుంది. వాటన్నిటికీ వాస్తు బాగలేదని చెప్పిస్తారు. అమ్మకానికి పెడతారు. అయ్యో గిదేమి తెలంగాణ! అని నిన్నమొన్నటి ఉద్యమ అభిమానులు తల పట్టుకుంటున్నారు. గిదే ఫ్యూడల్‌ తెలంగాణ పాలకవర్గం. ఇప్పుడు వాస్తు బాగుండదు. రేపు దయ్యం పడుతుంది.
నేను చాలా కాలంగా తెలంగాణ ఫ్యూడలిజానికి అభివృద్ధి కాముక అడ్మినిస్ర్టేటివ్‌ విలువలు లేవని చెప్పింది ఈ లక్షణాలన్నిటినీ దృష్టిలో పెట్టుకొనే. పెట్టుబడికి కొనుక్కునే లక్షణం ఉంటే ఫ్యూడలిజానికి అమ్మే లక్షణం ఉంటుంది. ముఖ్యంగా ఇప్పుడు రాబోయే అమ్ముడు ఉద్యమానికి ఒక ప్రత్యేక లక్షణం ఉంటుంది.
ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ పార్టీ ప్రతి దళిత కుటుంబానికి మూడెకరాల భూమి, ప్రతి బీద కుటుంబానికి (దళిత్‌ -దళితేతర) ఒక రెండు గదుల ఇల్లు, ప్రతి పింఛన్‌దారుకు నెలకు 1000 రూపాయలు ఇస్తానని ప్రామీస్‌ చేసింది. అధికారంలోకి వచ్చింది. ఇవి ఇస్తామని ప్రజల్ని నమ్మించాలంటే ఆదాయం లేకపోయినా పెద్ద బడ్జెట్‌ పెట్టాలి. అందులో చాలా లోటు చూపెట్టాలి. లోటు తీర్చడానికి భూములమ్మాలి కదా! హైదరాబాద్‌ చుట్టుపక్కల్లో ఎన్ని ఎకరాలు భూములమ్ముదామన్నా ఇప్పుడు కొనేవాళ్ళు లేరు. అందుకని నగరం నడిబొడ్డులోవి, వెంటనే కొనుగోలుదారులకు లాభాలు తెచ్చిపెట్టేవి అమ్మాలి. అందుకు మంచిగా కట్టుబడి ఉన్నదాంట్లో హైదరాబాద్‌ కలెక్టరేట్‌, గెస్ట్‌హౌజులు, ముఖ్యంగా సెక్రటేరియట్‌ లాంటివైతే ఏదో ఒక అంతర్జాతీయ మాల్‌ కంపెనీ కొనొచ్చు. ఐనా ఇవన్నీ అమ్మేది ప్రజలకు, ఉద్యమకారులకు పంచడానికే కదా! తెలంగాణలో ప్రజల ఉనికి, అభివృద్ధి, ప్రజా సంక్షేమం కొత్తకోణం నుండి జరుగాలంటే నగర నడిబొడ్డు ఆస్తులు అమ్మడం తెలంగాణ ప్రజల మేలుకోసమే అంటే ఇప్పటికీ నమ్మేవాళ్ళు ఉన్నారు. ఇంకొంత కాలం ఉంటారు. కాని ఎల్లకాలం ఉండరు. సంక్షేమ వ్యవస్థను రోజువారిగా ఆస్తులమ్మి నడిపిస్తే కొంతకాలం తరువాత అమ్మడానికి ఏమీ మిగులవు.
ఆంధ్రప్రదేశ్‌కు తెలంగాణకు ఇప్పుడు తేడా ఏమంటే విడిపోతే బాగుపడతామని ప్రజలకు తెలంగాణ వాదులు చెప్పారు. ఆంధ్ర అభిమానులు విడిపోతే చెడిపోతామని ప్రజలకు చెప్పారు. ఆ అభిప్రాయాన్ని బలంగా ఏర్పర్చినందు వల్లనే ఆంధ్రలో కాంగ్రేసును అక్కడి ప్రజలు అడ్రసు లేకుండా చేశారు. విభజన జరిగిన మొదటి సంవత్సరంలోనే తెలంగాణ ప్రభుత్వం ‘అమ్ముడుద్యమం’ మొదలెట్టింది. ఆంధ్ర ప్రభుత్వం ప్రపంచమంతా తిరిగి పెట్టుబడుల ‘గుడ్‌విల్‌’ సమీకరించే స్థితిలో ఉన్నది. ప్రత్యేకహోదా కోసం దేశస్థాయి ఉద్యమం మొదలుపెడతామని కాంగ్రెస్‌ కూడా అంటుంది. కాని తెలంగాణ రాష్ర్టాన్ని ఆదుకునే గుడ్‌విల్‌ కూడా లేదు. ఈ స్థితి రాష్ట్ర ప్రజలు దుస్థితిలో పడిపోకుండా చూడాల్సిన బాధ్యత పాలకపక్షంపైన ఉంది. కేంద్రం తెలంగాణకు అదనపు నిధులివ్వడమో, ప్రత్యేకహోదా ఇవ్వడమో జరుగదు. రాష్ట్రంలోని మొత్తం జిల్లాలు కరువు కోరల్లో ఉన్నాయి. ఉన్న వనరుల్లో ఉద్యోగులకు, ఆర్గనైజ్‌డ్‌ సంస్థలకు అడిగినవన్నీ ఇచ్చుకుంటూ పోతున్నారు.
ఆస్తులమ్మి వ్యవస్థను నడుపడం చాలాకాలం నడిచేది కాదు. గ్రామీణ వ్యవస్థను, ముఖ్యంగా రైతాంగాన్ని కరువు కోరల నుండి కాపాడడం చాలా ముఖ్యం. దానికి ఇప్పుడు రాష్ట్రంలో ఉన్న వనరులను అతి జాగ్రత్తగా వాడుకోవడం, అవసరం లేని ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ కట్టే డాంబీకాలకు పోకపోవడం, ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంతో ప్రతి విషయంలో పోటీపడక పోవడమొక్కటే ఇప్పుడున్న మార్గం. రానున్న ఐదేండ్లలో ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వ యంత్రాంగమంతా విజయవాడకు మారాక తెలంగాణలో - ముఖ్యంగా హైదరాబాద్‌లో- డాంబీకపు కట్టడాలు అవసరం లేదు.
గత బడ్జెట్‌లో ఆదాయం లేకున్నా లక్ష కోట్లకు పైగా ప్రతిపాదన చేశారు. ఆదాయం లేకున్నా బడ్జెట్‌ పెట్టుడెందుకు? ఉమ్మడి రాష్ట్రంలో మొదటిసారి రాజశేఖర్‌ రెడ్డి లక్షకోట్ల బడ్జెట్‌ పెట్టినప్పుడే మనందరికి ఆశ్చర్యమనిపించింది. అంత డబ్బు వస్తుందని చూపించడానికి ఆయన ప్రభుత్వ భూముల్ని హైదరాబాద్‌ నడిబొడ్డులో వేలం వేసి ఆర్టిఫిసియల్‌ కొనుగోళ్ళు చేయించారు. దానితో ఒక రియల్‌ ఎస్టేట్‌ బూమ్‌ సృష్టించారు. అందులో మునిగినోళ్ళు నిండా మునిగారు. రామలింగరాజు కొంప ఆ బూమ్‌లో మునిగిందే. ప్రభుత్వ భూముల్ని ప్రయివేటుకు తరలించి ఐఏఎస్‌ అధికారుల కొంపముంచిన చరిత్ర చూశాం. అదే మోడల్‌లో ఇంత చిన్న రాష్ర్టానికి అంతపెద్ద బడ్జెట్‌ పెట్టి రూ.6000 కోట్లు భూములమ్మకం ద్వారా రాబడతామని చూపించి అధికారులకు అమ్మక భూములు వెతికి పట్టుకోండి అని మొదటి రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలిస్తే భవిష్యత్‌ ఎలా ఉంటుందో చూడండి!
ఆఖరికి తేలిందేమి? హైదరాబాద్‌ కలెక్టర్‌ అమ్మకానికి లిటిగేషన్‌ కాని భూములు దాదాపు 9 ఎకరాల వరకు మాత్రమే ఉన్నదని (అన్నిముక్కలు కలిపితే) తేల్చాడు. దాన్ని ఇప్పుడు వేలం వేస్తారట. అప్పుడు రాజశేఖర్‌ రెడ్డి మిత్రబృందమే బస్తాల్లో నోట్లుతెచ్చి ఆ భూములు కొన్నట్టు చూపించి, మళ్ళీ డబ్బంతా వెనక్కి తీసుకున్నారని వదంతులు ఉన్నాయి. మరి ఇప్పుడు ఎవరు కొంటారు? ఇప్పుడు కూడా పాలకుల కుల బంధువుల కాక! ఆంధ్రులైతే ఇప్పుడు బస్తాల్లో డబ్బుతెచ్చి ఇక్కడ కొనరుగదా! అక్కడి బస్తాలన్ని ఇప్పుడు విజయవాడ చుట్టూ తిరుగుతున్నాయి. మరి ఇక్కడికి ఎక్కడి నుండి వస్తాయి. తెలంగాణలో కూడా రాజశేఖర్‌ రెడ్డి మోడల్‌ ఇప్పుడే మొదలెడితే తెలంగాణ ప్రజల బతుకు ఎట్లుం టుందో ఊహించవచ్చు. ఈ మొత్తం ప్రక్రియ ఏం చెబుతుంది?
తెలంగాణ రాష్ట్రంలో కరువుకు తోడు, ఫ్యూడల్‌ విలువలు రాష్ర్టాన్ని ఉత్పత్తి రంగాన్ని కాపాడుకోలేని పరిస్థితులు ఇప్పటి నుండే మొదలయ్యాయి. ప్రత్యేక రాష్ట్రం కావాలని అడిగింది అందుబాటులో ఉన్న ఆస్తులన్నీ అమ్మటానికి కాదు. ఆంధ్రుల దోపిడీ పోతే మన వనరులతో, ఉత్పత్తితో - వ్యవసాయ, పారిశ్రామిక- తెలంగాణ ప్రజలు సమైక్య రాష్ట్రంలో ఉన్న జీవితానికంటే మంచి జీవితాన్ని అనుభవించగలరని ప్రతిరోజూ చెప్పారు. తెలంగాణ రాష్ర్టాన్ని విడగొట్టడాన్ని దేశ స్వాతంత్య్రంతో పోల్చారు. విడిపోవాలా వద్దా అనే అంశంపై ఒక రెఫరెండం వంటిది పెట్టి శాంతియుత వాతావరణంలో చర్చ జరక్కుండా చేశారు. ఇప్పుడు రాష్ట్రం రాగానే సంవత్సరం కూడా తిరక్కముందే భూములు, బంగ్లాలు, చెరువులు, సెక్రటేరియట్‌తో సహా అమ్మితే తప్ప వ్యవస్థను నడుపలేమని తేలుస్తున్నారు.
నేను మొదటి నుండే చెబుతున్నట్టు ఫ్యూడల్‌ విలువలతో ప్రజాస్వామ్య వ్యవస్థను సంక్షేమ దృక్పథంతో పాలించడం కష్టం. ప్రజాస్వామ్యంలో పాలకునికి స్వయంగా ప్రజాస్వామ్య విలువలపట్ల గౌరవం ఉండాలి. అన్ని అబద్ధాలు చెప్పి అధికారంలోకి వచ్చినా, ఆ అబ ద్ధాలను మార్చిమార్చి చెప్పినా చివరికి ప్రజల జీవన ప్రమాణాలను కాపాడడం ముఖ్యమౌతుంది. పాలకులు తప్పుచేస్తూ కొన్ని నిజాలనైనా ప్రజలకు చెప్పే మీడియా మీద రోజూ విరుచుకపడ్డా పరిపాలనా వ్యవస్థ మెరుగుపడదు. గత కొంతకాలంగా వసూళ్ళను, ఆత్మ హత్యను ఉద్యమమని నిర్వచించినప్పుడు ఇప్పుడు ముందుకొస్తున్న ఆస్తులమ్ముడు కార్యక్రమం కూడా ఒక ‘ఉద్యమమే’ అని నిర్వచిస్తే తప్పేమిటి? ఇంతటితో ఆగదు. వాస్తునమ్మకం ఉద్యమంలో భాగమౌతుంది. కొంపలు కూల్చడం ఉద్యమంలో భాగమౌతుంది. కాని వృద్ధిరేటు పెంచడం మాత్రం ఆలోచనా రంగంలో లేకుండా పోతుంది.
ుఽ కంచ ఐలయ్య
సుప్రసిద్ధ రచయిత, సామాజిక శాస్త్రవేత్త

No comments:

Post a Comment