Thursday 19 February 2015

సెటిలర్లెవరూ లేరు.. అంతా నా వాళ్లే!

సెటిలర్లెవరూ లేరు.. అంతా నా వాళ్లే!

ఇక్కడున్నోళ్లంతా హైదరాబాదీలే.. మీకు చీమ కుడితే నాకు ముల్లు గుచ్చుకున్నట్టే
ఉద్యమ అవసరాల్లోంచి చాలా చెబుతాం.. ఏడాది తర్వాతా అదే పాట పాడలేం
సెటిలర్స్‌ భావనే వద్దు.. నాది మెదక్‌.. కానీ హైదరాబాదీననే చెప్పుకొంటా: కేసీఆర్‌
హైదరాబాద్‌లో ఉన్నవారంతా హైదరాబాదీలే

 కడుపులో పెట్టుకొని చూసుకుంటా
 మీకాలుకి చీమ కుడితే నాకు ముల్లు గుచ్చుకున్నట్టే
 ఉద్యమ అవసరాల్లో చాలా చెబుతాం
 ఏడాది తరువాతా అదే పాట పాడలేం
 సెటిలర్స్‌ అన్న భావనే వద్దు
 అలాగంటే నేనూ హైదరాబాదీననే చెప్పుకుంటా
 మా సర్కార్‌కు ప్రాంతీయ విభేదాల్లేవు
 అందుకే అధికార లాంఛనాలతో
రామానాయుడు అంత్యక్రియలు జరిపాం : కేసీఆర్‌
 టీఆర్‌ఎస్‌లో చేరిన కూకట్‌పల్లి వాసులు

హైదరాబాద్‌, ఫిబ్రవరి19 (ఆంధ్రజ్యోతి) : తెలంగాణ ప్రభుత్వానికి ప్రాంతీయ విభేదాలు లేవని, హైదరాబాద్‌లో నివాసం ఉండేవారంతా హైదరాబాదీలేనని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు అన్నారు. ఏ మట్టిలో పుట్టినవారు ఆ ప్రాంతానికి చెందుతారని స్పష్టం చేశారు. ‘‘ఉద్యమం అన్నది సందర్భాన్ని బట్టి, అవసరాన్నిబట్టి ముందుకొస్తూ ఉంటుంది. ఆ క్రమంలో తెలిసీ తెలియక పొరపాట్లు కూడా జరిగి ఉండవచ్చు. ఇప్పుడు ఆ పాత విషయాలగురించి ఆలోచించొద్దు. సెటిలర్స్‌ అన్న భావన విడిచిపెట్టండి. అందరం కలిసి తెలంగాణ అభివృద్ధికి కృషి చేద్దామ’’ని ఆయన పిలుపునిచ్చారు. గురువారమిక్కడ సీఎం నివాసంలో ఆయన సమక్షంలో వెయ్యిమందికిపైగా కూకట్‌పల్లి ప్రాంతీయులు టీఆర్‌ఎస్‌ పార్టీలో చేశారు. ‘‘దాదాపు 58 ఏళ్లు కలిసి ఉన్నాం. కానీ విడిపోవాల్సిన అవసరం వచ్చింది. కాబట్టి పోరాటాలు చేశాం. తెలంగాణ సాధించుకున్నాం. అంతేకానీ తెలుగువారి మధ్య విభేదాలేమీ లేవు. హైదరాబాద్‌లో బతుకుతెరువు కోసం వచ్చినవారి భద్రతకు ప్రభుత్వం కట్టుబడి ఉన్నది. మీరు ధైర్యంగా ఉండండి. నిర్భయంగా తిరగండి. మీ(సెటిలర్ల) కాలికి చీమ కుడితే నా కాలుకు ముల్లు గుచ్చుకున్నట్టు బాధపడతాను. మీ కాలికి ముల్లు దిగితే పంటితో తీసేస్తాన’’ని వ్యాఖ్యానించారు. అయినా, హైదరాబాద్‌లో స్థిరపడినవారెవరూ సెటిలర్స్‌ కాదని, ఈ భావనతోనే ప్రముఖ నిర్మాత డి.రామానాయుడు అంత్యక్రియలను ప్రభుత్వ లాంఛనాలతో నిర్వహించామని తెలిపారు. ‘‘ఆయన ఎంతో కష్టపడి తెలుగు చిత్ర పరిశ్రమకు సేవలు చేశారు. తెలుగు ప్రజలు గర్వపడే వ్యక్తి. ఆయన పిల్లలు ఇక్కడే పుట్టారు. వారిని వేరే ప్రాంతం వారని అనలేం కదా! గోదావరిఖనిలో గుంటూరు, కృష్ణాజిల్లాలకు చెందిన కుటుంబాల్లో నాకు స్నేహితులు ఉన్నారు. సంక్రాంతికి ఊరికి వెళదామని తల్లిదండ్రులు అంటే.. ‘మనది ఈ ఊరే కదా’ అని వాళ్ల పిల్లలు అంటారు. అలాగే, నాది మెదక్‌. అయినా హైదరాబాద్‌ అనే చెప్పుకుంటాను. నా మనవడు కూడా (కేటీఆర్‌ కుమారుడు) అదే అంటాడు’’ అని సీఎం కేసీఆర్‌ అన్నారు. ‘‘వచ్చే రెండేళ్లలో హైదరాబాద్‌లో మార్పు చూస్తారు. తెలంగాణ అద్భుతమైన రాష్ట్రంగా తయారవుతుంది. మన పిల్లలందరికీ ఉద్యోగాలు, ఉపాధి అవకాశాలు వస్తాయ’’ని చెప్పారు. హైదరాబాద్‌లో నివసించే ప్రతి వ్యక్తి బాధ్యత ముఖ్యమంత్రిగా తనదేనని, ప్రతి ఒక్కరినీ కడుపులో పెట్టుకుని కాపాడుకుంటానని హామీ ఇచ్చారు. ‘‘అబద్ధాలు మాట్లాడటం నాకు నచ్చదు. చెప్పే విషయమేదైనా ముఖం మీదే మాట్లాడటమే నా పద్ధతి. నేను చెప్పిన మాటలను వందశాతం చేసి చూపిస్తాను’’ అని పేర్కొన్నారు. మనసులో ఏమీ పెట్టుకోవద్దని, అందరం తెలంగాణ అభివృద్ధికి సహకరించాలని సీఎం అభ్యర్థించారు. ఈ కార్యక్రమంలో మంత్రి తలసాని శ్రీనివాస్‌, పెద్ది సుదర్శన్‌రెడ్డి, మైనంపల్లి హన్మంతరావు, గొట్టిముక్కల పద్మారావు పాల్గొన్నారు. 

No comments:

Post a Comment