Thursday 19 February 2015

కాంగ్రెస్‌ ఇచ్చింది శూన్య ‘హస్తమే’ - వెంకయ్య

కాంగ్రెస్‌ ఇచ్చింది శూన్య ‘హస్తమే’

ప్రత్యేక హోదాపై కేబినెట్‌ ఉత్తర్వులు ఎక్కడ?.. ఐదు లక్షల కోట్లు వాళ్లే ఇచ్చారా?.. అవెక్కడున్నాయో చూపించండి ఉత్తుత్తి హామీలతో సరిపెట్టారు.. హోదా ఎలా ఇవ్వాలో అధ్యయనం చేస్తున్నాం.. మా వైఖరి మారలేదు: వెంకయ్య
 ఐదు లక్షల కోట్లు వాళ్లే ఇచ్చారా?
 అవెక్కడున్నాయో చూపించండి
 ఉత్తుత్తి హామీలతో సరిపెట్టారు
 ఏపీకి ప్రత్యేక హోదా నిరాకరించలేదు
 ఎలా ఇవ్వాలో అధ్యయనం చేస్తున్నాం
 సీఎంలు కోరితేనే కేంద్రం జోక్యం: వెంకయ్య

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 19 (ఆంధ్రజ్యోతి): ‘‘ఆంధ్రప్రదేశ్‌కు యూపీఏ ప్రభుత్వం ప్రత్యేక హోదా ఇవ్వలేదు. నవ్యాంధ్రకు ఒక్క రూపాయి కూడా కేటాయించలేదు’’ అని కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు స్పష్టం చేశారు. ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వబోమని తాము అనలేదని తెలిపారు. హోదా ఎలా ఇవ్వాలనే అంశంపైనే అధ్యయనం చేస్తున్నామని తెలిపారు. ప్రత్యేక హోదాపై ఏపీలో కోటి సంతకాల సేకరిస్తూ, పార్లమెంటులో బీజేపీని నిలదీసేందుకు కాంగ్రెస్‌ కసరత్తు చేస్తున్న నేపథ్యంలో వెంకయ్య గురువారం ‘ఆంధ్రజ్యోతి’తో ఆయా అంశాలపై సవివరంగా చర్చించారు. ‘‘ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా ఇచ్చేశామని, కావల్సినన్ని నిధులు కేటాయించామని అంటున్న కాంగ్రెస్‌ నాయకులు... అందుకు ఆధారాలు చూపాలి’’ అని సూటిగా సవాల్‌ విసిరారు. ఇంకా వెంకయ్య ఏమన్నారంటే...
తొమ్మిదేళ్లు నిద్రపోయి...
తొమ్మిదేళ్ల తొమ్మిది నెలలు నిద్రపోయి, ఆఖరి క్షణంలో, దింపుడు కళ్లెం ఆశలతో, ఇదైనా చేస్తే తెలంగాణలో అయినా కొన్ని సీట్లు వస్తాయన్న ఉద్దేశంతో కాంగ్రెస్‌ విభజన బిల్లు తెచ్చింది. ఏమాత్రం ఆలోచన, చిత్తశుద్ధి, కామన్‌సెన్స్‌ ఉన్నా.. శాసన మండలి సభ్యుల సంఖ్య, రాజ్యసభ సభ్యుల కేటాయింపు, ఉద్యోగులు, ఆస్తులు, సంస్థల పంపకాలలో ఉన్న సవాళ్లు, సమస్యలను పరిగణనలోకి తీసుకునే వారు. ఇప్పుడు వీటిపై స్పష్టత లేకపోగా, గందరగోళం నెలకొందని ఇరు రాషా్ట్రల ప్రభుత్వాలు, అధికారులు చెబుతున్నారు. ఈ లోపాల గురించి నేను చెబితే... విభజన బిల్లును అసలుకే మార్చేస్తామంటూ విమర్శిస్తున్నారు. ఇప్పుడు తెలంగాణ బిల్లును మార్చి, ఎవరైనా తెలంగాణ రాషా్ట్రన్ని రద్దు చేయగలరా? ఇలా ఆలోచించటమే మూర్ఖత్వం. విభజన చట్టం చేసింది కాంగ్రెస్‌ వాళ్లే. అందులో లొసుగులేంటో వారికి తెలుసు. ఆయా సమస్యల్ని ప్రజా ప్రతినిధులు మా దృష్టికి వచ్చారు. వీటిని సంబంధిత శాఖలకు పంపించాం. వారు సంబంధిత రాషా్ట్రలతో చర్చించి, సవరణ ప్రతిపాదనల్ని కేబినెట్‌కు సమర్పించాలి. ఆ తర్వాతనే ఇవి పార్లమెంటుకు వస్తాయి.
లెక్కలు చెబితే నిధులు..
సహజంగా చూస్తే ప్రత్యేక హోదా అనేది ఆంధ్రప్రదేశ్‌కు వర్తించదు. కొండ ప్రాంతాలు, సరిహద్దు ప్రాంతాలకు మాత్రమే గతంలో ప్రత్యేక హోదా ఇచ్చారు. అయితే... విభజన తర్వాత హైదరాబాద్‌ను, దానిద్వారా వచ్చే ఆదాయాన్ని ఏపీ కోల్పోతోంది. హైదరాబాద్‌ తమకు కావాలంటే తమకు కావాలంటూ ఇరు రాషా్ట్రల నుంచి ఒత్తిళ్లు వచ్చిన నేపథ్యంలో కేంద్రం మీమాంసలో పడింది. అప్పుడు హైదరాబాద్‌ను తెలంగాణకే ఇవ్వాలని చెప్పిన వాళ్లలో నేనూ ఒకడిని. హైదరాబాద్‌ను అంతా కలిసి అభివృద్ధి చేసినందున, అంతా కలిసి ఉన్నందున ఆదాయం వాటాను ఏపీకి ఇవ్వాలని కొందరు అడిగారు. కానీ, ఇది కూడా సాధ్యం కాదు. అందుకే ఏం చేస్తారని నేను ప్రభుత్వాన్ని ప్రశ్నించాను. బడ్జెట్‌లో లోటు తీరుస్తాం అన్నారు. బడ్జెట్‌లో లోటు తీర్చటం కాకుండా ప్రభుత్వమే ఆ విషయం ప్రకటించాల్సింది. కానీ, కాంగ్రెస్‌ ప్రభుత్వం ఆ పని చేయలేదు. మిగతా విషయాలపైనా నేను గట్టిగా వాదిస్తే ఫైనాన్స్‌ కమిషన్‌ నివేదిస్తామని చెప్పారు. ప్రభుత్వం మారింది. ఇప్పుడు ఫైనాన్స్‌ కమిషన్‌ నివేదిక ఇచ్చింది. రేపోమాపో నివేదిక పార్లమెంటుకు వస్తుంది. తప్పని సరిగా ఏపీకి ఏర్పడిన ఆర్థిక లోటును ఫైనాన్స్‌ కమిషన్‌ నూటికి నూరుపాళ్లూ సరిచేస్తుందన్న విశ్వాసం నాకుంది. ఫైనాన్స్‌ కమిషన్‌ అధ్యక్షుడిని కలిసి ఈ విషయంపై మాట్లాడాను. నివేదిక పార్లమెంటుకు రాకుండా దానిలో ఉన్న విషయాలు బయటకు మాట్లాడటం సరికాదు. కానీ, ఏపీ ఆర్థిక లోటు భర్తీ అయ్యేందుకు కొంత సమయం పడుతుంది. అప్పటి వరకూ లోటును పూడ్చేందుకు ఫైనాన్స్‌ కమిషన్‌ చర్యలు చేపడుతుందని నాకు విశ్వాసం ఉంది. ఈ ఏడాది ఆర్థిక లోటు ఎంతో లెక్కలపరంగా స్పష్టంగా చెబితే దాన్ని కూడా సరిదిద్దుతామని కేంద్ర ఆర్థిక మంత్రి హామీ ఇచ్చారు. నేను దీనిపై మూడుసార్లు ఆయనతో మాట్లాడాను. ప్రత్యేక పరిస్థితుల నేపథ్యంలో చంద్రబాబు నాయుడుతో కలిసి కూడా ఒకసారి భేటీ అయ్యాను.
ఏమేం చేస్తామో వేచి చూడండి!
ఈ ప్రభుత్వానికి ప్రజలు ఐదేళ్లపాటు అధికారం ఇచ్చారు. మా పని మేం చేయకపోతే అప్పుడు విమర్శించండి. మాకు ఎవరూ కర్తవ్య బోధ చేయాల్సిన అవసరం లేదు. ప్రత్యేక హోదా అనేది ఒక్క మాటతో వచ్చేదే అయితే.. ఆరోజు ఉన్న ప్రభుత్వమే ప్రకటించేసి, బిల్లులోనే పొందుపరచాల్సింది. అదే జరిగి ఉంటే అసలు ఇప్పుడు ఎవ్వరూ మాట్లాడేందుకు అవకాశమే ఉండేది కాదు. 2014 మార్చి 3వ తేదీనే కేబినెట్‌ ఆమోదం తెలిపామని కాంగ్రెస్‌ అంటోంది. కానీ, అదెక్కడ ఉంది? గాల్లో ఉందా? ఐదు లక్షల కోట్లు ఏపీకి కేటాయించామని వాళ్లు అంటున్నారు. వాళ్లే కేటాయిస్తే మళ్లీ మేం కేటాయించేదేముంది? అవెక్కడున్నాయో చెబితే సరిపోతుంది కదా! నిజానికి... ప్రత్యేక హోదా ఇస్తామని హామీ ఇచ్చారే తప్ప ఇవ్వలేదు. గాలికిపోయే పేలాల పిండి రామార్పణం అన్నట్లు అనేక హామీలు ఇచ్చారు. ఏపీకి ఏమేం కష్టాలు, ఇబ్బందులు, లోటు ఉంటాయో తెలుసుకుని అడిగింది నేను. అడగడమే పాపం అన్నట్లుగా మాట్లాడుతున్నారు. వారు చేయలేకపోయినవి మేం చేసేందుకు చర్యలు తీసుకుంటున్నాం. నావంతు పని నేను చేస్తున్నాను. సాంకేతికంగా నేను ఏపీకి చెందిన ఎంపీని కాకపోయినా, ప్రజలు బాధ్యత ఇవ్వకపోయినా, ఒక తెలుగువాడిగా రెండు ప్రాంతాలకూ న్యాయం జరగాలని కోరుకుంటున్నాను. తెలంగాణ, ఆంధ్రా సీఎంలతో నాకు సత్సంబంధాలు ఉన్నాయి. ఏ రాష్ట్రం పట్లా వివక్ష చూపను.
హోదా అసాధ్యమని అప్పుడు చెప్పారు
ప్రత్యేక హోదా అమలు చేసేందుకు చర్యలు తీసుకోవాలని నేను అప్పటి ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు మాంటెక్‌ సింగ్‌ అహ్లూవాలియాను కోరాను. అది సాధ్యం కాదని, జాతీయ అభివృద్ధి మండలి (ఎన్‌డీసీ) భేటీ జరపాల్సి ఉంటుందని ఆయన నాకు చెప్పారు. ఇప్పుడు ప్రణాళికా సంఘం, ఎన్‌డీసీలు లేవని కొందరు అంటున్నారు. అయితే, దీనికి సంబంధించిన చిక్కులు ఏమున్నాయో ప్రభుత్వం పరిశీలిస్తోంది. ఆ దిశలో పయనిస్తున్నాం. మా ప్రభుత్వం ఏపీకి ప్రత్యేక హోదాను తిరస్కరించలేదు. దీనిపై అధ్యయనం జరుగుతోంది. ప్రణాళికా సంఘం పోయి నీతి ఆయోగ్‌ వచ్చింది. వివిధ రాషా్ట్రల నుంచి వస్తున్న డిమాండ్లు కూడా ఉన్నాయి. ఒక సంధికాలంలో ఉన్నాం. ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని అడుగేయాలి. ఎన్‌డీసీ ఏర్పడాలి. అందులో కాంగ్రెస్‌ నాయకులు పూర్తిగా మద్దతు ఇస్తామన్నారు. ఆ పార్టీ అధికారంలో ఉన్న రాషా్ట్రలు కూడా ముందుకు వస్తే మంచిది. ప్రత్యేక హోదా పదేళ్లు ఇవ్వాలని నేనే కోరాను. నా సహచరులకూ చెబుతున్నా. మేం నాటకాలాడుతున్నామంటున్న సీపీఐ కానీ, ఇతర పార్టీల పరిస్థితి కానీ మనకు తెలుసు. ప్రధానిని కరెంటు స్తంభానికి కట్టేసి కొడతామని కూడా సీపీఐ నాయకులు అంటున్నారు. వారి మాటలకు మనమేం అంటాం!
రాత్రికి రాత్రి ఏమీ జరగదు
ఏపీకి చేసింది చాలా కొద్దిపాటి మాత్రమే. చేయాల్సింది చాలా ఉంది. మా ప్రభుత్వం చేస్తుంది కూడా. ఈ విషయంలో మా వైఖరి ఒక్కశాతం కూడా మారలేదు. ఏవిధమైన జాప్యం కూడా లేదు. రూ.లక్షల కోట్ల గురించి మాట్లాడే కాంగ్రెస్‌ నాయకులు మాకు వారసత్వంగా ఎలాంటి భయంకరమైన ఆర్థిక పరిస్థితిని ఇచ్చారో ప్రజలు గుర్తించాలి. దేశ ఆర్థిక పరిస్థితి మెరుగుపడ్డాక కేంద్రం అన్ని రకాల చర్యలు తీసుకుంటుంది. ఇప్పటికే కొన్ని నిధులు, సంస్థలు ఏపీకి మంజూరయ్యాయి. ఏపీ నుంచి వస్తున్న విజ్ఞప్తులపై కేంద్రం సహాయం చేస్తుంది. ఏం చేస్తుందనేది కొన్ని రోజుల తర్వాత తెలుస్తుంది. ఒక్కరోజులో అయ్యేది కాదు. రాత్రికి రాత్రి ఏమీ జరగదు. సంవత్సరం గడిచాక ఏ రాషా్ట్రనికి కేంద్రం ద్వారా ఏ మేరకు నిధులు అందాయో అన్నీ చెబుతాం. టీడీపీ-బీజేపీ చేతిలో ఉన్న అధికారాన్ని మాకు ఇస్తేనే ఏపీకి న్యాయం జరిగినట్లు అన్నట్లుంది కాంగ్రెస్‌ నాయకుల వైఖరి. కానీ, ప్రజలేం అనుకుంటున్నారో తిరుపతి ఉప ఎన్నికల ఫలితాలు చెబుతున్నాయి. పెట్టాల్సిన సంతకం పెట్టాల్సిన సమయంలో పెట్టాల్సిన చోట పెట్టకుండా ఇప్పుడు కోటి సంతకాల పేరిటజనం వద్దకు వెళ్తున్నారు.
ఆ మాట గవర్నర్‌నే అడగాలి...
హైదరాబాద్‌పై ఇచ్చిన అధికారాలను ఎందుకు అమలు చేయటం లేదో గవర్నరే సమాధానం చెప్పాలి. లేదా... అలాంటి బిల్లు పెట్టిన వారు సమాధానం చెప్పాలి. నేనెలా చెబుతాను? సున్నితమైన అంశాలు మీడియా ముందు కూర్చుని మాట్లాడేవి కాదు. ఇద్దరు సీఎంలు కూర్చుని మాట్లాడుకోవటం శుభపరిణామం. ఇద్దరు సీఎంలు కోరితేనే కేంద్రం జోక్యం చేసుకుంటుంది. లేదా పరిస్థితి అదుపు తప్పేలా ఉంటే కేంద్రం నిర్ణయం తీసుకుంటుంది. ఏకపక్షంగా మాత్రం వ్యవహరించదు.
అభివృద్ధి కోసం టీఆర్‌ఎస్‌తో కలిసి పనిచేస్తే తప్పేంటి?
టీఆర్‌ఎస్‌ కేంద్రంలో చేరుతోందంటూ వస్తున్న వార్తల గురించి రాసే వాళ్లనే అడగాలి. కానీ, మా మధ్య అలాంటి ప్రతిపాదనలేవీ లేవు. చర్చలూ జరగలేదు. టీఆర్‌ఎస్‌ ఈ దేశంలో ఒక పార్టీ. రాషా్ట్రభివృద్ధి కోసం దానితో కలిసి పనిచేస్తే తప్పులేదు. ఢిల్లీ ఎన్నికల ఫలితాల వల్ల కేంద్ర ఆర్థిక విధానాల్లో ఎలాంటి మార్పూ రాదు. ఎనిమిది రాషా్ట్రల ఎన్నికల్లో ఏడు గెలిచాం. ఒకటి ఓడిపోయాం. అందులోనూ మిగతా పార్టీలన్నీ ఏకమైనా మా పునాదులు చెక్కుచెదరలేదు.

No comments:

Post a Comment