Monday 9 February 2015

ఏపీ ఉద్యోగులకు 43 శాతం ఫిట్‌మెంట్‌

ఏపీ ఉద్యోగులకు 43 శాతం ఫిట్‌మెంట్‌

భారీ ప్రయోజనం ప్రకటించిన సీఎం చంద్రబాబు
రాష్ట్ర విభజన నాటి నుంచే అమలు
ఏప్రిల్‌ నుంచి నగదుగా చెల్లింపు
బకాయిలకు బాండ్లు జారీ?
ఉద్యోగుల్లో హర్షాతిరేకాలు
ముఖ్యమంత్రికి ధన్యవాదాలు
ప్రభుత్వంపై 9,284 కోట్ల భారం
ఆంధ్రప్రదేశ్‌ ఇంకా కుదురుకోకున్నా.. 
అసలే అనేక ఆర్థిక కష్టాల్లో ఉన్నా...
రెవెన్యూ లోటు పోటు పొడుస్తున్నా...
కేంద్ర సాయం అంతంత మాత్రమే అయినా.. 
రిటైర్‌మెంట్‌ వయసు రెండేళ్లు పెంచినా...
నవ్యాంధ్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లపై 
ఏపీ ‘చంద్రుడు’ చల్లని చూపులే చూశాడు!

హైదరాబాద్‌, ఫిబ్రవరి 9 (ఆంధ్రజ్యోతి): ‘కొత్త వేతనం’పై ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబు తీపి కబురు చెప్పారు. ఎకాఎకిన 43 శాతం ఫిట్‌మెంట్‌ ప్రకటించారు. రాష్ట్ర విభజన అమలులోకి వచ్చిన 2014 జూన్‌ మాసం నుంచే 43 శాతం ఫిట్‌మెంట్‌ అమలు చేస్తామని తెలిపారు! ఈ ఏడాది ఏప్రిల్‌ నుంచే కొత్త వేతనాలు నగదు రూపంలో అందుతాయని చెప్పారు. బకాయి మొత్తాన్ని ఏ రూపంలో చెల్లించాలనే అంశాన్ని తర్వాత నిర్ణయిస్తామని తెలిపారు. బహుశా... పదినెలల వేతన బకాయిలను ఒక్కసారిగా ఉద్యోగుల పీఎఫ్‌ ఖాతాల్లో జమచేసే పరిస్థితి లేకపోవడంతో బాండ్‌ల రూపంలో ఇచ్చే అవకాశాలున్నాయని సూచన ప్రాయంగా తెలిపారు. ఇప్పటికే తెలంగాణ సర్కారు... చర్చలు, సాగతీత, బేరసారాలకు తావివ్వకుండా తమ ఉద్యోగులకు 43 శాతం ఫిట్‌మెంట్‌ ప్రకటించిన సంగతి తెలిసిందే. ఇప్పుడు చంద్రబాబూ తమ రాష్ట్ర ఉద్యోగులకు అదే వరం ఇచ్చారు. ‘‘తీవ్ర ఆర్థిక కష్టాలున్నప్పటికీ... ఉద్యోగులకు 43 శాతం ఫిట్‌మెంట్‌ ఇస్తున్నాం’’ అని ప్రకటించారు. ఉద్యోగులకు 2014 జూన్‌ 2 నుంచి ఆర్థిక ప్రయోజనాలు అందుతాయని తెలిపారు. అయితే, ఏ నెల వరకు బకాయిలు జీపీఎఫ్‌ ఖాతాల్లో జమ చేస్తారు? ఎప్పటి నుంచి నగదు రూపంలో చెల్లిస్తారు? అనే అంశాన్ని ఆ తర్వాత నిర్ణయిస్తామన్నారు. 43 శాతం ఫిట్‌మెంట్‌వల్ల ఏటా ఖజానాపై 9284.52 కోట్ల భారం పడుతుందన్నారు. అయితే... ఇప్పటికే చెల్లిస్తున్న 27 శాతం మధ్యంతర భృతిని మినహాయిస్తే అదనంగా 3610.80 కోట్ల అదనపు భారం పడుతుందని తెలిపారు. ఏపీఎన్జీవో, సచివాలయ, ఉపాధ్యాయ సంఘాలకు చెందిన ప్రతినిధులతో సోమవారం మంత్రివర్గ ఉపసంఘ సభ్యులు యనమల రామకృష్ణుడు, గంటా శ్రీనివాసరావు, పి.నారాయణ, పల్లె రఘునాథరెడ్డి, కామినేని శ్రీనివాసరావు చర్చలు జరిపారు. ‘‘తెలంగాణ ఉద్యోగులకు 43 శాతం ఫిట్‌మెంట్‌ ప్రకటించారు. మాకు అంతకంటే తక్కువ ఇవ్వడం భావ్యంకాదు. అది సమంజసంగా కూడా ఉండదు’’ అని ఉద్యోగ సంఘాల నేతలు తెలిపారు. ఈ అభిప్రాయంతో మంత్రివర్గ ఉపసంఘం సభ్యులూ ఏకీభవించారు. కాంట్రాక్టు ఉద్యోగుల సర్వీసు క్రమబద్ధీకరణ తదితర అంశాలు చర్చకు వచ్చినా... వాటిపై ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. అత్యంత కీలకమైన ఫిట్‌మెంట్‌పై మాత్రం ఓ నిర్ణయానికి వచ్చారు. ఆ తర్వాత ముఖ్యమంత్రి వద్ద విషయం ఖరారైంది. మంత్రులు, ఉద్యోగ సంఘాల ప్రతినిధులు, మంత్రివర్గ ఉపసంఘం సభ్యులు, ఆర్థిక శాఖ ముఖ్యకార్యదర్శి పీవీ రమేశ్‌లతో కలిసి చంద్రబాబు మీడియా ముందుకు వచ్చారు. కొత్త రాష్ట్రంలో ఆర్థిక ఇబ్బందులు ఎక్కువగా ఉన్నప్పటికీ... ఉద్యోగులను నిరాశపరచకుండా, వారిని సంతృప్తి పరచాల్సిన బాధ్యత తమపై ఉందని తెలిపారు. ‘‘కొత్త రాష్ట్రానికి ఆర్థిక ఇబ్బందులున్నాయి. 59శాతం జనాభా ఉన్న నవ్యాంధ్రకు 48.5శాతం ఆదాయం వచ్చింది. 41 శాతం ఉన్న తెలంగాణకు 52శాతం ఆదాయం వచ్చింది. ఇదే విషయాన్ని గతంలో ఢిల్లీలో చెప్పాను. జనవరి వరకూ లెక్కలు చూస్తే ఈ విషయం స్పష్టంగా తెలుస్తుంది. విభజన బిల్లు సందర్భంగా కూడా రెండు రాష్ట్రాల ఆర్థికంగా సమానమైన స్థితికి వచ్చేదాకా మాకు సహాయం అందించాలని కేంద్రాన్ని కోరాం. ఆదివారం కూడా కేంద్ర ప్రభుత్వాన్ని ఇదే విన్నవించుకున్నాం. అయినా... కేంద్రం నుంచి తగిన సహకారం లభించడంలేదు’’ అని బాబు వివరించారు. ఆదాయం పెంచు కుంటే తప్ప ఆంధ్రప్రదేశ్‌లో అభివృద్ధి జరగదని ముఖ్యమంత్రి వ్యాఖ్యానించారు. ‘‘మనందరం కష్టపడాలి. ఆదాయాన్ని పెంచాలి. అప్పులు చెల్లించాలి. సంక్షేమమూ చూసుకోవాలి’ అని చంద్రబాబు ఉద్యోగులనుద్దేశించి వ్యాఖ్యానించారు. ఎన్నికల్లో ఎలాంటి హామీ ఇవ్వకపోయినప్పటికీ ఉద్యోగుల పదవీ విరమణ వయసు 58 నుంచి 60ఏళ్లకు పెంచామని గుర్తు చేశారు. ఉద్యోగుల పట్ల తాము సానుకూలంగా ఉన్నాన్నారు. ఇక... ఈ పీఆర్సీ ఆర్థిక ప్రయోజనాలు ఎప్పటి నుంచి అందించాలనే అంశంపై ఆర్థికశాఖ అధికారులు ఉద్యోగులతో చర్చించి నిర్ణయిస్తారని తెలిపారు. ఫిట్‌మెంట్‌పై జరిగిన చర్చల్లో ఏపీఎన్జీవో, ఉపాధ్యాయ, సచివాలయ, రెవెన్యూ తదితర సంఘాలకు చెందిన నేతలు అశోక్‌బాబు, చంద్రశేఖర్‌రెడ్డి, బొప్పరాజు ఐ.వెంకటేశ్వరరావు, మురళీకృష్ణ, కృష్ణయ్య, విజయ లక్ష్మి, కత్తి నరసింహారెడ్డి, ఐ. వెంకటేశ్వర్రావు, శ్రీనివాస్‌, కల్లేపల్లి మధుసూధన్‌ రాజు, దేవరాజు, కుళాయప్ప, భాస్కర్‌, కమలాకర్‌రావు, సాగర్‌, యోగీశ్వరరెడ్డి, తదితరులు చర్చల్లో పాల్గొన్నారు. కనీస వేతనం, ఇంక్రిమెంట్‌ రేట్‌, అడ్వాన్స్‌డ్‌ ఇంక్రిమెంట్‌, కాంట్రాక్టు కార్మికుల క్రమబద్ధీకరణ తదితర అంశాలపై వారం పది రోజుల్లో ప్రభుత్వం నిర్ణయాలు తీసుకునే అవకాశముంది.
కొత్త మూల వేతనం ఇలా... : 43 శాతం ‘ఫిట్‌మెంట్‌’ను ప్రకటించిన నేపథ్యంలో ఇక వేతన స్కేళ్ళ సవరణ కూడా జరగాల్సి ఉంది. పదో పీఆర్సీ డ్యూడేట్‌ నాటికి అంటే... 2013 జులై నాటికి ఉన్న మూలవేతనానికి 43 శాతం కలుపుతారు. ఆ మొత్తానికి 2013 జులై 1 నాటికి ఉన్న 63.344 శాతం కరువుభత్యాన్ని కూడా కలుపుతారు. అదే... కొత్త మూలవేతనం అవుతుంది. 
 For more photos

No comments:

Post a Comment