Wednesday 18 February 2015

శాశ్వత రాజధానే! ఏపీ సర్కారులో పునరాలోచన

శాశ్వత రాజధానే! ఏపీ సర్కారులో పునరాలోచన

‘తాత్కాలికం’ వద్దు! ‘శాశ్వతమే’ మేలు!!
తాత్కాలిక నిర్మాణాలకు 300 కోట్లు వ్యయం!
పూర్తికావడానికి ఏడాది పట్టే అవకాశం
రెండేళ్లలో 800 కోట్లతో శాశ్వత నిర్మాణాలు!
‘తాత్కాలిక’ పేరుతో అనవసర వ్యయమే!
వసతుల్లేకుంటే ఉద్యోగులూ రారనే అభిప్రాయం
‘జూన్‌ నాటికి తాత్కాలిక రాజధాని నిర్మాణం... అక్కడి నుంచే పాలన’ ఇప్పటిదాకా వచ్చిన ప్రకటనలివి! కానీ... తాత్కాలిక రాజధానిపై ఏపీ సర్కార్‌ పునరాలోచనలో పడినట్లు సమాచారం. దీనివల్ల అనవసర వ్యయం తప్పితే, పెద్దగా ప్రయోజనం ఉండదని భావిస్తున్నట్లు తెలుస్తోంది.
హైదరాబాద్‌, ఫిబ్రవరి 18 (ఆంధ్రజ్యోతి): తాత్కాలిక రాజధాని నిర్మాణంకన్నా శాశ్వత రాజధాని నిర్మాణంపైనే ఏపీ సర్కార్‌ దృష్టి సారించిందా? తాత్కాలిక రాజధాని నిర్మాణం వల్ల ఆర్థిక భారమే తప్ప, పెద్దగా ప్రయోజనం లేదని భావిస్తోందా? ఈ ప్రశ్నలకు ప్రభుత్వ ఉన్నత వర్గాలు అవుననే సమాధానం చెబుతున్నాయి. నవ్యాంధ్రప్రదేశ్‌ పాలన సీమాంధ్ర నుంచే సాగాలని, ఈ ఏడాది జూన్‌ 8లోగా తాత్కాలిక రాజధానిని నిర్మించాలని లక్ష్యంగా పెట్టుకున్న ప్రభుత్వ పెద్దలు పునరాలోచనలో పడ్డారని సమాచారం. ‘‘ఇప్పటికిప్పుడు తాత్కాలిక రాజధాని నిర్మాణ పనులు చేపట్టినా, దానిని పూర్తి చేసేందుకు ఏడాది కాలం పడుతుంది. తాత్కాలిక రాజధాని నిర్మాణానికి కనీసం రూ.300 కోట్లు వ్యయం అవుతుంది. ఇంత ఖర్చు చేసినా ఉద్యోగులకు పూర్తి స్థాయిలో మౌలిక సదుపాయాలు అందుబాటులోకి రావు. రహదారులు, సిబ్బందికి ఆవాసాలు, విద్యాసంస్థలు, ఆసుపత్రులు తగిన స్థాయిలో లేవు. వసతులు కల్పిస్తేనే కొత్త రాజధానికి వస్తామని ఉద్యోగ సంఘాల నేతలు చెబుతున్నారు. తూతూమంత్రంగా ఏప్రిల్‌, మే నెల నాటికి తాత్కాలిక రాజధాని పూర్తయినా... అప్పటికే విద్యాసంస్థల్లో పిల్లలను చేర్చేందుకు సమయం మించి పోతుంది. ఈ కారణం చూపుతూ మరో ఏడాది తర్వాతే తాత్కాలిక రాజధాని నగరానికి తరలేందుకు ఉద్యోగులు సుముఖత చూపుతారు’’ అని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. శాశ్వత రాజధానిలో భాగంగా అసెంబ్లీ, సెక్రటేరియేట్‌ వంటి భవనాల నిర్మాణానికి దాదాపు రూ.800 కోట్ల వరకూ వ్యయమవుతుందని భావిస్తున్నారు. ‘‘రెండేళ్లలో వాటి నిర్మాణ పనులు పూర్తయ్యే అవకాశముంది. అలాంటప్పడు తాత్కాలిక రాజధాని నిర్మాణం అవసరం ఏముంది’’ అని ప్రశ్నిస్తున్నారు. ప్రస్తుతం నవ్యాంధ్రకు రాజధానిగా ఎంపిక చేసిన ప్రాంతంలో అంతార్జాతీయ విమానాశ్రయం అందుబాటులో లేదని, ప్రభుత్వం సమావేశాల నిర్వహణకు సరైన వేదిక కూడా లేదని పేర్కొంటున్నారు. ఇలాంటి అవస్థల మధ్య తాత్కాలిక రాజధాని పేరిట ఉద్యోగులను ఇబ్బంది పెట్టటం, ఆర్థిక సంక్షోభం సమయంలో రూ.300 కోట్లకు పైగా వ్యయం చేయడం అనవసరమని ప్రభుత్వ వర్గాలు భావిస్తున్నాయి. వాస్తవానికి తాత్కాలిక రాజధాని నిర్మాణానికి ‘ఇన్‌క్యాప్‌’ టెండర్లను పిలిచింది. ఓ సంస్థకు బాధ్యతలను కూడా అప్పగించింది. అయితే, తుది ఆమోదానికి మాత్రం తటపటాయించింది. తాము చెప్పేంత వరకూ తాత్కాలిక రాజధాని డిజైన్‌ రూపకల్పనపై ఎలాంటి నిర్ణయం తీసుకోవద్దని స్పష్టం చేసింది. ఇదే సమయంలో అమరావతి టౌన్‌ షిప్‌లో తాత్కాలిక రాజధాని నిర్మాణం జరుగుతుందంటూ చెబుతూ వచ్చిన ప్రభుత్వ వర్గాలు ఇప్పుడు మౌనం పాటించాయి. ఇంకా స్థలాన్ని ఖరారు చేయలేదని చెబుతున్నాయి.
భూములివ్వం..హైకోర్టులో పిటిషన్‌
సీఆర్‌డీఏను సవాల్‌చేస్తూ హైకోర్టులో ప్రజాహిత వ్యాజం దాఖలైంది. ఈ వ్యాజ్యాన్ని గుంటూరు జిల్లా మంగళగిరి మండలం నిడమర్రుకి చెందిన రైతు బి.శివరామిరెడ్డి, నిడమర్రు, తాడేపల్లి మండలం, పెనుమాక గ్రామానికి చెందిన మరో 31మంది రైతులు సంయుక్తంగా దాఖలు చేశారు. పురపాలకశాఖ ముఖ్యకార్యదర్శి, సీఆర్‌డీఏ కమిషనర్‌, గుంటూరు, కృష్ణా జిల్లాల కలెక్టర్లను పిటిషన్‌లో ప్రతివాదులుగా చేర్చారు.

No comments:

Post a Comment