Wednesday 4 February 2015

హస్తవాసిపైనే బీజేపీ ఆశలు

హస్తవాసిపైనే బీజేపీ ఆశలు

    కాంగ్రెస్‌ ఓట్ల శాతం పెంపే బీజేపీ కోరిక
    ఆప్‌ బలహీనపడి లాభిస్తుందని లెక్కలు

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 3 (ఆంధ్రజ్యోతి): ‘కాంగ్రెస్‌ ముక్త భారత్‌’ బీజేపీ ప్రచారాస్త్రమిది. కానీ ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో మాత్రం కాంగ్రెస్‌ బలపడి, ఆ పార్టీ ఓట్ల శాతం పెరగాలని బీజేపీ బలంగా కోరుకుంటోంది. కాస్త ఆశ్చ ర్యంగా ఉన్నా ఇది నిజం. ఎందుకంటే కాంగ్రెస్‌ సంప్రదాయ ఓటు బ్యాంకు అయిన ముస్లింలు, మైనారిటీలు, దళితులు గత ఎన్నికల్లో ఆమ్‌ ఆద్మీ పార్టీకి ఓట్లేశారు. ఈ నేపథ్యంలో కాంగ్రెస్‌ ఓట్ల శాతం పెంచుకుంటే ఆప్‌ బలహీనపడి, తమ పని సులువవుతుందన్నదే బీజేపీ ఆశ.
ప్రచారానికీ జంకుతున్న
కాంగ్రెస్‌ అధిష్ఠానం!
కాంగ్రెస్‌ పార్టీకి అవకాశాలు ఏమాత్రం లేవని తెలిసినా అధిష్ఠానం అజయ్‌ మాకెన్‌ను సీఎం అభ్యర్థిగా రంగంలో దించింది. తద్వారా కొత్త తరంతో పూర్వవైభవాన్ని చేజిక్కించుకోవాలని చూస్తున్నప్పటికీ హస్తినలో హస్తవాసి నానాటికీ దిగజారుతోంది. ఎన్నికలలో ఏ పార్టీ అయినా భారీగా ప్రచారం చేయటం సహజం. కానీ, మూడోస్థానం కోసం కూడా ఎందుకంత శ్రమ? అన్న రీతిలో కాంగ్రెస్‌ వ్యవహరిస్తోంది. ప్రచారానికి రెండురోజులే మిగిలి ఉండగా నేటిదాకా అధినేత్రి సోనియాఒక సభలో, ఉపాధ్యక్షుడు రాహుల్‌ 2 సభల్లో మాత్రమే పాల్గొనటం గమనార్హం.
తెలుగోళ్ల జోలికి ఇప్పుడొద్దు!
ఢిల్లీలో ఇతర ప్రాంతాల జనాభా ఎక్కువ. వారిని ఆకర్షించేందుకు బీజేపీ ఏకంగా 19మంది కేంద్ర మంత్రులు, 120 మంది ఎంపీలను రంగంలో దించటంతో పాటు ఆయా రాషా్ట్రల పార్టీ అధ్యక్షులను, సీనియర్లను పిలిపించింది. ఇదే తరహా లో కాంగ్రెస్‌ సైతం కేరళ సీఎం ఊమెన్‌ చాందీ, తమిళనాడు పీసీసీ అధ్యక్షుడు ఇలంగోవన్‌, కర్ణాటక సీనియర్‌ నేతలు ఆస్కార్‌ ఫెర్నాండెజ్‌, మల్లిఖార్జున ఖర్గే తదితరులను రంగంలో దించింది. ఢిల్లీలో తమిళులు, మలయాళీలు, కన్నడిగులు ఎక్కువగా నివసించే ప్రాంతాల్లో వీరు పర్యటించారు. కానీ, తెలుగు ప్రజలూ ఢిల్లీలో ఎక్కువగానే ఉన్నారు. గతంలో షీలా దీక్షిత్‌ సైతం తెలుగు సంఘాలతో ప్రత్యేకంగా భేటీ అయ్యి పార్టీకి మద్దతు ఇవ్వమని కోరేవారు. అయితే, మారిన పరిస్థితుల నేపథ్యంలో ‘ఇప్పుడు తెలుగు ప్రజల జోలికి వెళ్లకపోవటమే మంచిది’ అన్నట్లు కాంగ్రెస్‌ వ్యవహరిస్తోంది. అయితే, తెలుగువారు అధికంగా ఉన్న రాజేంద్రనగర్‌ తదితర ప్రాంతాల అభ్యర్థులు, వారి సన్నిహితులు తెలంగాణ సీనియర్‌ నేత వీహెచ్‌, ఎమ్మెల్సీ పొంగులేటి సుధాకర్‌రెడ్డి వంటి తమకు పరిచయంగల నేతలతో ప్రచారం చేయించుకుంటున్నా రు. కానీ, తెలుగుప్రజలు చాలామంది కాంగ్రెస్‌పట్ల విముఖంగానే ఉన్నారు.
కాంగ్రెస్‌ గత ఎన్నికల్లో 8స్థానాల్లో విజయం సాధించింది. ఇవన్నీ ముస్లింలు, మైనారిటీలు, సిక్కులు, దళితు లు అధికంగా ఉన్న ప్రాంతాలే. అయితే, 2013 డిసెంబర్‌ ఎన్నికలతో పోలిస్తే గతేడాది జరిగిన సార్వత్రిక ఎన్నికల సమయానికి కాంగ్రెస్‌ ఓటు సగానికి సగం పడిపోయింది. మొత్తంగా పాతిక శాతానికి పైగా కాంగ్రెస్‌ ఓటు బ్యాంకు ఆమ్‌ ఆద్మీ పార్టీకి వెళ్లిపోయినట్లు రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు.  కాగా, గతంతో పోలిస్తే ఈ ఎన్నికల్లో పార్టీ కోసం క్షేత్రస్థాయి నుంచి పనిచేస్తూ పైకెదిగిన బ్రహ్మ్‌ యాదవ్‌ లాంటి ఏడెనిమిది మందికి తొలిసారిగా టికెట్లు ఇవ్వటంతో వారి ద్వారా కొన్ని ఓట్లు పడే అవకాశాలున్నాయి. ఏదేమైనా కాంగ్రెస్‌ పార్టీగా ఎన్నికల్లో విజయం సాధించే అవకాశాలు లేకున్నా అజయ్‌ మాకెన్‌, శర్మిష్ఠ ముఖర్జీ వంటివారు తమతమ కుటుంబ గౌరవం ద్వారా ప్రత్యర్థులకు పోటీ ఇచ్చే అవకాశముంది.
పోలింగ్‌నాటికి మార్పు:వెంకయ్య
న్యూఢిల్లీ, ఫిబ్రవరి 3 (ఆంధ్రజ్యోతి): ఢిల్లీ ఎన్నికల్లో బీజేపీకి మంచి స్పందన లభిస్తోందని, పోలింగ్‌ తేదీ దగ్గరపడుతున్న కొద్దీ మార్పు కనిపిస్తోందని కేంద్రమంత్రి వెంకయ్య నాయుడు అన్నారు. మంగళవారం ఆయన అంబేద్కర్‌ నగర్‌ ప్రచారం చేశారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ.. ఢిల్లీ అభివృద్ధి కేంద్రప్రభుత్వంతో ముడిపడి ఉన్నదని, అందుకే బీజేపీకే ఓట్లేయాలన్నారు. ఆప్‌, కాంగ్రెస్‌ల మధ్య తేడా ఏమీలేదని చెప్పారు. కేజ్రీవాల్‌ గెలిచినా, ఓడినా ధర్నాలు చేస్తానంటున్నారని, ఆయనకు అదే సరైన పదవని ఎద్దేవా చేశారు. ఇదిలా ఉండగా కేంద్ర మంత్రి బండారు దత్తాత్రేయ, తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు కిషన్‌ రెడ్డి తదితరులు జనక్‌పురి అసెంబ్లీ నియోజకవర్గంలో పర్యటించారు

No comments:

Post a Comment