Thursday 19 February 2015

సచివాలయంలో మీడియాకు నో ఎంట్రీ! - టీయూడబ్ల్యూజే ఆందోళన

సచివాలయంలో మీడియాకు నో ఎంట్రీ!
అవసరమైతే ఆహ్వానం.. లేదంటే ప్రవేశం నిషిద్ధం
అధికారులతో కేసీఆర్‌ వ్యాఖ్యలు
‘మీడియా గోలేంది’
‘ఇక్కడ వాళ్లకేం పని’
అంటూ అసహనం
మీడియా స్వేచ్ఛకు
సీఎం కొత్త భాష్యం
రేపోమాపో ఉత్తర్వులు

హైదరాబాద్‌, ఫిబ్రవరి 19 (ఆంధ్రజ్యోతి): ‘‘ఈ మీడియా గోలేందయ్యా! కారెక్కుతుంటే కెమెరా పెడతారు, దిగుతుంటే పెడతారు. వాళ్లని ఎవరు రమ్మన్నారసలు. వీళ్లందరూ ఈడ (సచివాలయంలో) అవసరమా?’ అంటూ తెలంగాణ సీఎం కేసీఆర్‌ మీడియాపై అసహనాన్ని వెళ్లగక్కారు. తెలంగాణ సచివాలయంలోకి మీడియాను అనుమతించకుండా నిషేధం విధించాలనే ఆలోచనకు వచ్చారు. గురువారం మధ్యాహ్న భోజన విరామానికి ముందు అధికారులతో కేసీఆర్‌ సమాలోచన జరుపుతున్నప్పుడు మీడియా ప్రస్తావన వచ్చింది. విశ్వసనీయవర్గాల సమాచారం ప్రకారం... ‘‘మీడియాకు స్వేచ్ఛ ఎక్కువైంది. అంత అవసరమా? సచివాలయంలో వాళ్లకేం పని?’’ అంటూ కేసీఆర్‌ కొంత ఆగ్రహాన్ని ప్రదర్శించారు. ముఖ్యంగా ఎలకా్ట్రనిక్‌ మీడియా తన వైపు కెమెరాలు ఫోకస్‌ చేయడాన్ని ఆయన తప్పుపట్టారు. ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్‌ మీడియాను సచివాలయంలోకి రాకుండా నిషేధించారని... మనమూ అదే చేద్దామని కేసీఆర్‌ ప్రతిపాదించారు. ఇది సమంజసంగా ఉండదేమోనన్న కొందరు అధికారుల సూచనలను ఆయన తోసిపుచ్చారు. ‘సెక్రటేరియట్‌లో ఎటు చూసినా మీడియా వాళ్లే కనిపిస్తున్నారు. చూడండయ్యా, ఎందుకు
వీళ్లంతా ఇక్కడ? అవసరమొచ్చినప్పుడు పిలుద్దాం! మిగతా అప్పుడు ఆపేద్దాం! మన పనులు మనం చేసుకోకుండా మధ్యలో వీళ్ల లొల్లి ఏమిటి?’’ అని అసహనం ప్రదర్శించారు. ఢిల్లీతోపాటు తమిళనాడులోనూ సచివాలయంలోకి మీడియా ప్రవేశంపై ఆంక్షలు ఉన్న విషయాన్ని చెబుతూ... అదే పద్ధతిని ఇక్కడా పాటిస్తామని కేసీఆర్‌ స్పష్టం చేసినట్లు తెలిసింది. ఒకట్రెండు రోజుల్లోనే సచివాలయంలోకి మీడియా ప్రతినిధులను నిషేధిస్తూ ఉత్తర్వులు వెలువడే అవకాశం ఉందని అధికార వర్గాలు వెల్లడించాయి. తెలంగాణ సచివాలయానికి 100 అడుగుల దాకా మీడియా ప్రవేశించకుండా నగర పోలీస్‌ కమిషనర్‌ ద్వారా నోటిఫికేషన్‌ జారీ చేయించే అవకాశముంది. నిర్ణీతకాలంపాటు నిషేధం అమలులో ఉంటుందని పేర్కొంటూ... ఎప్పటికప్పుడు దీనిని పొడిగించవచ్చునని చెబుతున్నారు.

సచివాలయంలో టీయూడబ్ల్యూజే ఆందోళన

హైదరాబాద్‌: సచివాలయంలో మీడియాను నిషేధించడంపై టీయూడబ్ల్యూజే ఆందోళనకు దిగింది. తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్న అనతికాలంలోనే కేసీఆర్‌ ప్రభుత్వం ఇలాంటి నిర్ణయాలు తీసుకోవడం ఆందోళన కలిగిస్తోందని టీయూడబ్ల్యూజే నాయకులు ఆవేదన వ్యక్తం చేశారు. తెలంగాణ పునర్నిర్మాణం జరుగుతున్న సమయంలో సీఎం ఇటువంటి నిర్ణయాలు తీసుకోవడం తగదని సంఘం ఉపాధ్యక్షుడు పల్లెరవి, జనరల్‌ సెక్రటరీ క్రాంతి  అన్నారు.

No comments:

Post a Comment