Friday, 12 February 2016

విభజన చేసినవారు తలదించుకునేలా రాష్ట్రాభివృద్ధి చేస్తా

పాలన ప్రైవేటీకరించం
13-02-2016 01:41:27

  • మహిళా ఉద్యోగులకు 60 రోజుల చైల్డ్‌కేర్‌ లీవు
  • బందరు, శ్రీకాకుళం, చిత్తూరుల్లో 20ు హెచ్‌ఆర్‌ఏ
  • ఫైళ్లన్నీ ఈ- ఆఫీసే.. సంస్కరణలతో పనిభారం తగ్గిస్తా
  • సంక్షోభాల్లో ఉద్యోగులు సర్కార్‌కు అండగా ఉన్నారు
  • విభజన చేసినవారు తలదించుకునేలా రాషా్ట్రభివృద్ధి
  • ఉద్యోగులపై చంద్రబాబు ప్రశంసలు.. వరాల జల్లు
  • విభజన తొలి బాధితుడిని తానేనని వ్యాఖ్య
  • శ్రీకాకుళంలో ఘనంగా ఏపీ ఎన్జీవోల రాష్ట్ర మహాసభలు
  • ఉద్యోగులకు అండగా ఉంటాం: చీఫ్‌ సెక్రటరీ టక్కర్‌
శ్రీకాకుళం, ఫిబ్రవరి 12(ఆంధ్రజ్యోతి): రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులపై సీఎం వరాలజల్లు కురిపించారు. మహిళా ఉద్యోగులకు చైల్డ్‌కేర్‌ లీవ్‌ కింద 60 రోజులు సెలవులు, జిల్లా కేంద్రాలైన శ్రీకాకుళం, చిత్తూరు, మచిలీపట్నంల్లో పనిచేస్తున్న ప్రభుత్వ ఉద్యోగులకు 20శాతం హెచ్‌ఆర్‌ఏ ఇవ్వనున్నట్లు ప్రకటించారు. రాష్ట్రంలో పాలనను ప్రైవేటీకరించబోనని స్పష్టం చేశారు. శుక్రవారం శ్రీకాకుళం జిల్లా ఎచ్చెర్లలో ఏపీ ఎన్జీవోల 19వ రాష్ట్రస్థాయి మహాసభలు ప్రారంభమయ్యాయి. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా సీఎం చంద్రబాబు హాజరయ్యారు. ఎన్జీవోల డిమాండ్లను సావధానంగా ఆలకించిన చంద్రబాబు అనంతరం సభలో మాట్లాడుతూ.. ఉద్యోగులపై వరాలజల్లు కురిపించారు. ప్రభుత్వశాఖల్లో పాలనాసంస్కరణలను ప్రవేశపెట్టి ఉద్యోగులపై పనిభారం తగ్గిస్తానని వెల్లడించారు. రాష్ట్రంలో ఉద్యోగులు రొటీనగా పని చేయవద్దని, ప్రతి ఒక్కరూ కొత్త ఆలోచనలతో ముందుకు రావాలని సీఎం చంద్రబాబు ఉద్యోగులకు పిలుపునిచ్చారు. ప్రతి ఒక్కరూ సాంకేతికతను అందిపుచ్చుకోవాలన్నారు. ఉద్యోగులంతా ఈ-ఆఫీస్‌ విధానం ద్వారా ఫైళ్లు పంపాలని సూచించారు. ప్రభుత్వశాఖల్లో పనితీరు ఏవిధంగా ఉండాలనే దానిపై పరిపాలన సంస్కరణల కమిటీ సూచనల ద్వారా పనిభారం తగ్గిస్తామన్నారు. ‘మీరు భ్రమపడినట్లు పరిపాలనను నేను ప్రైవేటీకరించబోను. ఉద్యోగులు.. ప్రభుత్వం కలిసి అవినీతిని పరిష్కరించే బాధ్యత తీసుకుందాం. మీరు గట్టిగా పనిచేస్తే మీ అందరిని అన్ని విధాలుగా ఆదుకుంటాను. కాంట్రాక్టు ఉద్యోగులు, ఔట్‌ సోర్సింగ్‌ ఉద్యోగుల విషయం గురించి ఆలోచిస్తా. ఒకేసారి అన్నీ చేయలేం. ప్రభుత్వ ఉద్యోగులకు అన్నీ చేస్తా. వెసులుబాటు ఉంటే ఏమాత్రం వెనక్కిపోను. ప్రభుత్వం బడ్జెట్‌కు సంబంధించి కసరత్తు చేస్తోంది. ఇందులో మీరు కూడా కొత్త ఆలోచనలతో భాగస్వామ్యం కావాలి. ఏ శాఖలో ఏం చేస్తే బాగుంటుందో ఆలోచించండి’ అని సీఎం కోరారు. ఉద్యోగులు కూడా ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధిని ప్రజల్లోకి తీసుకువెళ్లాలన్నారు. రాష్ట్రంలో ఇటీవల వచ్చిన వరదలను అధిగమించడంలోను, విశాఖలో నిర్వహించిన సీఐఐ పెట్టుబడుల సదస్సు, ఐఎ్‌ఫఆర్‌ విజయవంతంలోను, హుద్‌హుద్‌ తుపానును సమర్థవంతంగా ఎదుర్కోవడంలోనూ ఉద్యోగుల పాత్ర మరువలేనిదన్నారు. ప్రతి సంక్షోభంలోనూ వారు ప్రభుత్వానికి అండగా ఉన్నారని ప్రశంసించారు.
 
విభజించుకునేవాళ్లు తలదించుకునేలా అభివృద్ధి
‘రాష్ట్ర విభజనను ఇష్టానుసారం చేశారు. ఇప్పటికీ రాజధాని లేక ఇబ్బందులు పడుతున్నాం. కొందరు ఉద్యోగులు హైదరాబాద్‌లో పనిచేస్తుంటే నేనేమో విజయవాడ నుంచి పనిచేస్తున్నా. ఎన్ని కష్టాలు ఎదురైనా అన్నిటినీ అధిగమించి, విభజన చేసినవారు తలదించుకునేలా రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తా’ అని సీఎం చంద్రబాబు పునరుద్ఘాటించారు. రాష్ట్రంలో ప్రభుత్వ ఆస్పత్రులను ప్రక్షాళన చేయాల్సిన అవసరం ఉందని సీఎం అభిప్రాయపడ్డారు.
 
పరిశ్రమలు, పోర్టులు వద్దంటే ఎలా?
‘పరిశ్రమలు, కొత్త పోర్టుల రాకతోనే ఏ ప్రాంతమైనా అభివృద్ధి చెందుతుంది. కాని ఇక్కడేమో పోర్టులు, పరిశ్రమలు వద్దంటున్నారు. ఇలా అయితే ప్రగతి ఎలా సాధ్యమవుతుంది. శ్రీకాకుళం జిల్లాలో భావనపాడు పోర్టు నిర్మాణమైతే ఈ జిల్లా దశ మారిపోతుంది. విశాఖపట్నం, కాకినాడల్లో పోర్టులు ఉండటం వల్లే ఆ ప్రాంతాలు వేగంగా అభివృద్ధి చెందాయి’ అని సీఎం చంద్రబాబు పేర్కొన్నారు.
 
తొలి బాధితుడిని నేనే : చంద్రబాబు
రాష్ట్ర విభజన తొలి బాధితుడిని తానేనని సీఎం చంద్రబాబు పేర్కొన్నారు. తాను విజయవాడలో పనిచేస్తుంటే తన మనవడు హైదరాబాద్‌లో ఉంటున్నాడని, దీంతో మనవడితో గడిపేందుకు సమయం దొరకడం లేదని చంద్రబాబు ఆవేదన వ్యక్తం చేశారు. ఎన్జీవోల రాష్ట్ర మహాసభల్లో పాల్గొనడానికి వచ్చిన సీఎం విభజన సమయంలో ఉద్యోగుల పోరాటాన్ని కొనియాడారు. ఈ సందర్భంగా ఉద్యోగులు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఒకచోట పనిచేస్తుంటే, తాను విజయవాడ నుంచి పనిచేస్తున్నానని చెప్పుకొచ్చారు. దీంతో కుటుంబంతో ముఖ్యంగా తన మనవడితో గడిపేందుకు సమయం దొరకడం లేదంటూ వ్యాఖ్యానించారు.

No comments:

Post a Comment