గ్రేటర్ ఎన్నికల్లో టీడీపీ పరాజయానికి కారణం అదేనా ? ఆంధ్రాలో కూడా సేమ్ సీన్ రిపీటవుద్దా ?
10-02-2016 09:43:44
విజయం అందరిదీ.. పరాజయం అనాధ.. అంటారు.. ప్రస్తుతం గ్రేటర్ విజయానికి టి.ఆర్.యస్ లో అందరూ బాధ్యులే.. కానీ గ్రేటర్ లో తెలుగుదేశం పరాజయానికి ఆంధ్రాలో అలజడి ప్రారంభమైంది. ఇదేమిటీ గ్రేటర్ ఎన్నికలతో ఆంధ్రాకు సంబంధం ఏమిటి అనుకుంటున్నారా.. సంబంధం ఉంది. అక్కడి ఓటమి ఆంధ్రాలో అధికార పార్టీలో చర్చనీయాంశమైంది. విశ్లేషణలకు వేదిక అయ్యింది. భవిష్యత్ పై బెంగ పట్టుకుంది. మేల్కోక పోతే, మెతక వైఖరి అవలంబిస్తే ఇక్కడా ప్రజలకు ముఖం మొత్తుతుందేమే అన్నదే బాబు తమ్ముళ్ళలో భయంగా మారింది. గ్రేటర్ ఎన్నికలు ఆంధ్రాలో రేపుతున్న అలజడి ఏమిటి ?
ఉమ్మడి రాజధాని హైదరాబాద్‌లో జరిగిన గ్రేటర్ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ ఘోర పరాజయాన్ని చవి చూడటం ఆంధ్రప్రదేశ్‌లోని అధికార పార్టీ నేతలకు నిద్రపట్టనివ్వకుండా చేసింది.. కొందరు కూడికలు తీసివేతలు వేసుకుంటున్నారు. మరికొందరు వాదనలు..విశ్లేషణలు జరుపుకుంటున్నారు.. అయినా వారిలో సంతృప్తి కలగడం లేదు.. పరాజయం తప్పదనుకున్నారు కానీ.. ఇంతటి ఘోర పరాజయం ఎదురవుతుందని వారు కలలో కూడా ఊహించలేదు. అందుకే ఈ ఓటమిని జీర్ణించులేకపోతున్నారు. హైదరాబాద్‌లో సెటిలర్‌లు ఉన్న సరిహద్దు ప్రాంతాలన్నింటిలో ఆంధ్రా తెలుగుదేశం పార్టీ నేతలు మోహరించారు. ఒక్క కృష్ణా జిల్లా నుంచే మంత్రి దేవినేని ఉమ, ఎమ్మెల్యేలు గద్దె రామ్మోహన్, బోండా ఉమ, ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న....వైవీబీ రాజేంద్రప్రసాద్ వంటి నేతలు హైదరాబాద్‌లో మకాం వేసి ప్రచారం చేశారు. సెటిలర్ల హక్కులను కాపాడాలంటే తెలుగుదేశం పార్టీకే ఓటు వేయాలని వీధివీధికి తిరిగి ప్రచారం చేశారు. సహజంగా హైదరాబాద్‌లో కోస్తా వాసులు ఎక్కువ మందే ఉన్నారు.. ఎన్నో ఏళ్ల క్రితం హైదరాబాద్‌కు వచ్చి స్థిర నివాసం ఏర్పరచుకున్నారు. విస్తృతంగా ప్రచారం చేసి వచ్చిన తెలుగుదేశం పార్టీ నేతలు ఓ అంచనాకైతే వచ్చారు.. గ్రేటర్ పీఠం దక్కడం కష్టం కానీ.. గౌరవప్రదమైన స్థానాలను గెల్చుకోగలమని భావించారు. ఇదే విషయాన్ని ఇక్కడ నేతలకు వివరించారు. మరి కొంతమంది మాత్రం హైదరాబాద్‌లో పరిస్థితి మునుపటిలా లేదని మాత్రం చెప్పారు.
కాని ఫలితాలు వచ్చిన తర్వాత అందరూ డీలాపడిపోయారు. ఘోర పరాజయం ఎదురుకావడంతో ఏం చేయాలో పాలుపోని స్థితికి వచ్చేశారు. చంద్రబాబు ఎన్నికల ప్రచారానికి ప్రజలు ఎక్కువగా రావడం పార్టీ శ్రేణులలో నైతికస్థయిర్యాన్ని నింపినప్పటికీ అది ఓట్ల రూపంలో మారలేదనేది ఒక నేత చేసిన విశ్లేషణ. ప్రజలు చంద్రబాబు చెప్పింది శ్రద్ధగా విని వెళ్లారు.. కాని ఓటు మాత్రం వేయలేదు.. కారణం ఒక్కటే...చంద్రబాబు ఇక్కడకు వచ్చి పరిపాలన చేయలేరు కదా అని సెటిలర్లు భావించడమే! మన రాష్ర్టానికి పక్క రాష్ర్ట ముఖ్యమంత్రి వచ్చి ఏమి చేస్తారని తెలంగాణవారు నిర్ణయించుకున్నారనేది మరో తెలుగుదేశం నేత విశ్లేషణ.
రెండు పడవల మీద కాళ్లు పెడితే ఇటువంటి అనుభవాలే ఎదురవుతాయనేది కొంత మంది నేతలు ఆఫ్ ది రికార్డుగా చెబుతున్నారు. ఎప్పుడైతే చంద్రబాబు విజయవాడ వచ్చేశారో, హైదరాబాద్‌లో ఉన్న సెటిలర్లకు తాము ఇక తెలుగుదేశం పార్టీపై ఆధారపడలేమనే భావనకు వచ్చారని చెబుతున్నారు. దీనితో పాటు అయ్యప్ప సొసైటీ, మరికొన్ని ప్రాంతాలలో టీఆర్‌ఎస్ అధికారంలోకి వచ్చిన వెంటనే అక్రమ కట్టడాల కూల్చివేత వంటి చర్యలతో అక్కడ ఉండే సెటిలర్లలో కొంత భయం నెలకొన్నదని... ఆ భయమే టీఆర్‌ఎస్‌కు ఓటు వేయకపోతే ఇబ్బందులు వస్తాయనే భావనను తెచ్చిందని ఇక్కడి నేతలు అంటున్నారు. పోలింగ్‌బూత్‌కు వెళితే తెలంగాణ రాష్ర్ట సమితికి ఓటు వేయవలసి వస్తుందనే ఉద్దేశంతో కొంతమంది ఓటింగ్ కూడా వెళ్లడం మానేశారు. అందువల్లే తెలుగుదేశం పార్టీకి ఘోర పరాజయం ఎదురైందని విశ్లేషిస్తున్నారు. స్థానిక ఎన్నికలలో తీర్పు, సాధారణ ఎన్నికలలో తీర్పు భిన్నంగా ఉంటాయని, స్థానిక ఎన్నికలలో తీర్పు అధికార పార్టీకి అనుకూలంగా ఉంటుందని, హైదరాబాద్ లో అభివృద్ధి కావాలంటే అధికారంలో ఉన్న టీఆర్‌ఎస్‌కే ఓటు వేయాలనే భావనకు అక్కడి సెటిలర్లు వచ్చారని మరికొందరు విశ్లేషిస్తున్నారు. ఈ విశ్లేషణలు ఎలా ఉన్నా రాష్ట్రంలో మాత్రం తెలుగుదేశం పార్టీ అప్రమత్తం కావాల్సిన పరిస్థితి ఏర్పడింది. నేల విడిచి సాము చేయడం కంటే క్షేత్రస్థాయిలో ఏమి జరుగుతుందో తెలుసుకోవాలని తెలుగుదేశాధీశుడికి ఆ పార్టీ కార్యకర్తలు చెబుతున్నారు. అధికారంలోకి వచ్చి రెండు సంవత్సరాలు గడుస్తున్నా నేటి వరకు నియామక పదవులు భర్తీ కాకపోవడం, కొంతమంది ఎమ్మెల్యేల అవినీతి పతాకస్థాయికి చేరుకోవడం, కొంతమంది ఎమ్మెల్యేల పుత్రరత్నాలు, బంధువుల విచ్చలవిడి అవినీతి, అధికారుల అలసత్వం, ఆర్ధిక లోటు కారణంగా అభివృద్ధి కార్యక్రమాల అమలులో జాప్యం వంటి అంశాలలో క్షేత్రస్థాయిలో ప్రభుత్వానికి ప్రతికూలంగా ఉన్నాయని, వీటిని గమనించి సరి చేయాల్సిన బాధ్యత చంద్రబాబు పై ఉందని ఆ పార్టీ నేతలే గుర్తు చేస్తున్నారు.
సమాచార, సమన్వయ లోపం కారణంగా రాజధాని నిర్మాణానికి 33వేల ఎకరాల భూములు ఇచ్చిన రైతులే ప్రభుత్వంపై ఆగ్రహం చెందుతున్నారంటే పాలనలో ఎంత లోపం కనిపిస్తుందో పరిగణలోకి తీసుకోవాలని తెలుగుదేశం పార్టీ అగ్ర నేత ఒకరు వ్యాఖ్యానించారు. ముఖ్యమంత్రిగా పని చేసిన తొమ్మిది సంవత్సరాల కాలంలో మంచి పరిపాలన దక్షునిగా, హైదరాబాద్ నగరాన్ని అభివృద్ది చేసిన నేతగా గుర్తించిన ఆంధ్రులు విడిపోయిన ఆంధ్రప్రదేశ్ ను బాగు చేయగలిగే సత్తా చంద్రబాబుకే ఉందని బలంగా నమ్మారు. ఆ నమ్మకంతోనే వైఎస్ సెంటిమెంట్‌ను కూడా కాదని చంద్రబాబుకు పట్టం కట్టారు. ప్రజల మనోభావాలను పరిగణనలోకి తీసుకుని ఆ దిశగా కృషి చేయడంతో పాటు...రానున్న మూడు సంవత్సరాల కాలంలో సీరియస్‌గా పని చేయవలసి ఉంటుందని టీడీపీ నేతలు అనుకుంటున్నారు. క్షేత్రస్థాయిలో అభివృద్ధి కార్యక్రమాలను, రాజధాని నిర్మాణాన్ని చేసి చూపిస్తేనే చంద్రబాబు పై మళ్లీ ప్రజల్లో నమ్మకం పెరిగే అవకాశాలు ఉన్నాయి. ఈ అంశాలను చంద్రబాబు దగ్గరకు తీసుకెళ్లడానికి కొంతమంది నేతలు ప్రయత్నిస్తున్నా అవకాశం కుదరడం లేదు. ఇంకా ఆలస్యమైతే పరిస్థితి చేయి దాటి పోతుందనే ఆందోళన వారిలో కనిపిస్తోంది. గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికలలో ఘోర పరాజయం నేపథ్యంలో రాజధానిలో తెలుగుదేశం పార్టీ నేతలు చంద్రబాబు దగ్గరకు వెళ్లి ముఖాముఖి చర్చలలో పార్టీ కార్యకర్తల మనోభావాలు, క్షేత్రస్థాయిలో పార్టీ పరిస్థితిని వివరించాల్సిందేనని నిర్ణయించుకున్నారు. అవకాశం కోసం ఎదురు చూస్తున్నారు.
No comments:
Post a Comment