Friday, 12 February 2016

మురిగిపోతున్న చంద్రన్న ‘కానుకలు’

మురిగిపోతున్న చంద్రన్న ‘కానుకలు’ 
13-02-2016 11:31:48

  • మిగిలిన పోయిన 46 వేల సంచులు 
  • వసతి గృహాలకు చేర్చాలని ప్రభుత్వ ఆదేశాలు 
  • పట్టించుకోని పౌరసరఫరాల అధికారులు 
  • డీలర్ల వద్దనే చంద్రన్న సంక్రాంతి సరుకులు 
  • ఇప్పటికే కొన్ని వస్తువులు మాయం 

ఒంగోలు నగరం: ‘చంద్రన్న సంక్రాంతి కానుక’ సరుకులు డీలర్ల వద్దనే మురిగి పోతున్నాయి. మిగిలి పోయిన సరుకులను సంక్షేమ వసతి గృహాలకు చేర్చాలంటూ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసి నెల రోజులు కావస్తోంది. అయినా నేటికీ వాటిని వసతి గృహాలకు చేర్చటంలో పౌరసరఫరాలశాఖ అధికారులు నిర్లక్ష్యం వహిస్తున్నారు. అసలే నాసిరకం సరుకులను చంద్రన్న సంక్రాంతి కానుల కింద కాంట్రాక్టర్‌ సరఫరా చేశారు. వీటిని ప్రభుత్వం డిసెంబర్‌లో క్రిస్మస్‌కు, జనవరిలో సంక్రాంతి పండుగకు పంపిణీ చేశారు. జిల్లాలో 9,29,170 తెల్లకార్డులు ఉన్నాయి. వీటికి చంద్రన్న కానుక పేరుతో ప్రభుత్వం రేషన్‌ దుకాణాల ద్వారా ఆరు రకాల నిత్యావసర వస్తువులను పంపిణీ చేసింది. వాటిల్లో కేజీ గోధుమ పిండి, అర లీటర్‌ పామాయిల్‌, 100 గ్రాముల నెయ్యి, శనగపప్పు, కందిపప్పు, బెల్లం అర కేజీ చొప్పున ప్యాకెట్లు చేసి ప్రత్యేకంగా రూపొందించిన సంచుల్లో ఉంచి పంపిణీ చేశారు. టెండర్‌దారుడు ఈ సంచులను డిసెంబర్‌, జనవరి నెలల్లో పంపిణీ చేశారు. పంపిణీ సమయంలోనే ఈ సరుకులపై విమర్శలు వెల్లువెత్తాయి. సరుకులు నాసిరకంగా ఉన్నాయంటూ కార్డుదారులు గగ్గోలు పెట్టారు. బెల్లం నీరుగారి పోయి వాసన వస్తున్నా అధికారులు అలాగే పంపిణీ చేశారు.
 
             అయితే కానుక కింద పంపిణీ చేసిన సంచుల్లో 46 వేల సంచులు మిగిలి పోయాయి. మిగిలిన ఈ సరుకులను జిల్లాలోని సంక్షేమ వసతి గృహాలకు పంపిణీ చేయాలని ప్రభుత్వం నుంచి ఆదేశాలు జారీ అయ్యాయి. సంక్రాంతి పండుగ సమయంలోనే ఈ ఆదేశాలు జారీ అయ్యాయి. అయితే కొన్ని జిల్లాల్లో మిగిలిన చంద్రన్న కానుక సరుకులను అప్పుడే వసతి గృహాలకు అందజేశారు. జిల్లాలో ఇంత వరకు వాటిని వసతి గృహాలకు అందజేయలేదు. అసలు ఆ సరుకుల సంచులు ఇంత వరకు డీలర్ల వద్ద నుంచి సమీప ఎంఎల్‌ఎస్‌ పాయింట్లకు చేరనేలేదు. డీలర్లు ఈ సంచులను మూలన పడేశారు. వాటిని ఎంఎల్‌ఎస్‌ పాయింట్ల వద్దకు చేర్చి అక్కడ నుంచి సమీపంలోని వసతి గృహాలకు చేర్చాల్సి ఉండగా పౌరసరఫరాలశాఖ అధికారులు ఇంత వరకు వాటిని ఇప్పటికీ డీలర్ల వద్దనే ఉంచి కాలయాపన చేస్తున్నారు. డీలర్లు ఈ సంచుల్లో ఉన్న వాటిలో కొన్నింటిని మాయం చేసి బ్లాక్‌ తరలించగా కొన్ని వస్తువుల పాడై పోయాయి. ఈ సరుకులను ప్యాక్‌ చేసి ఇప్పటికి రెండు నెలలు కావస్తోంది.
 
            ఇంత కాలం స్టాక్‌ పెట్టటం వలన వస్తువులు పాడై పోవటం ఖాయమని తెలిసినా వాటిని ఇంత వరకు వసతి గృహాలకు చేర్చకపోవడంపై అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఈ పంపిణీకి సంబంధించి రెండు రోజుల క్రితం జరిగిన సమావేశంలో జేసీ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆహార తనిఖీ విభాగం అధికారులు పరిశీలించిన తర్వాతే వాటిని వసతి గృహాలకు చేర్చండి అంటూ ఆయన పౌరసరఫరాలశాఖ అధికారులకు సూచించారు. అయినా వారిలో స్పందన లేదు. పూర్తిగా పాడైన తర్వాతే వాటిని వసతి గృహాలకు అందజేస్తాం అన్నట్లుగా అధికారుల తీరు ఉంది.

No comments:

Post a Comment