Thursday, 11 February 2016

వైసీపీ నుంచి టీడీపీలోకి దూకేద్దాం..

వైసీపీ నుంచి టీడీపీలోకి దూకేద్దాం..
12-02-2016 10:28:02

  • ఎమ్మెల్యే జలీల్‌కు లైన్ క్లియర్‌
  • టీడీపీతో టచలో తిరువూరు ఎమ్మెల్యే రక్షణ నిధి
  • నూజివీడు ఎమ్మెల్యే ప్రతాప్‌ చూపు కూడా!
  • పరోక్షంగా, ప్రత్యక్షంగా టీడీపీతో సంబంధాలు
తెలంగాణలో టీడీపీ ఎమ్మెల్యేలు టీఆర్‌ఎస్‌లోకి క్యూ కడుతుంటే... ఆంధ్రాలో వైసీపీ ఎమ్మెల్యేలు టీడీపీలోకి క్యూ కట్టే పరిస్థితి కనిపిస్తోంది. ఇప్పటి వరకూ వైసీపీ ఎమ్మెల్యేలను చేర్చుకోవడంపై పెద్దగా ఆసక్తి చూపని టీడీపీ తెలంగాణలో పరిస్థితి చూశాక రూటు మార్చుకొన్నట్టు కనిపిస్తోంది. అధికారంలో వున్న పార్టీలోకి వలసలు పెద్ద విషయం ఏమీ కాదని, ఆంధ్రాలో తమకు అంతకంటే ఎక్కువ స్పందనే వుందని టీఆర్‌ఎస్‌కు బదులిచ్చేందుకు సిద్ధమైనట్టు కనిపిస్తోంది. అందుకు తొలిగా రాజధాని ప్రాంతమైన కృష్ణాజిల్లా నుంచే శ్రీకారం చుట్టే పరిస్థితులు కనిపిస్తున్నాయి. 

(ఆంధ్రజ్యోతి ప్రతినిధి- విజయవాడ) 

టీడీపీలోకి వలసల పర్వానికి పార్టీ నేతలు మంచి ముహూర్త బలం కోసం వెదుకుతున్నారు. వైసీపీ ఎమ్మెల్యేలు కొందరు ఎప్పటినుంచో తెలుగుదేశం పార్టీలో చేరే ప్రయత్నాలలో వున్నారన్న ప్రచారం వుంది. పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే జలీల్‌ఖాన, తిరువూరు ఎమ్మెల్యే రక్షణనిధి, నూజివీడు ఎమ్మెల్యే మేకా ప్రతాప్‌ అప్పారావుల పేర్లు ఈ క్రమంలో వినిపించాయి. వీరిలో జలీల్‌ఖాన ఒక్కరే అనేక పర్యాయాలు ముఖ్యమంత్రి చంద్రబాబును కలిశారు. కలసిన ప్రతిసారీ తన నియోజకవర్గ అభివృద్ధి పనుల గురించే సీఎంను కలిశాను తప్ప ఎటువంటి రాజకీయ ప్రాధాన్యత లేదని చెబుతూ వచ్చారు. తాజాగా గురువారం మంత్రి దేవినేని ఉమాతో కలసి మరీ ఎమ్మెల్యే జలీల్‌ఖాన ముఖ్యమంత్రి చంద్రబాబు నివాసానికి వెళ్లి కలవడం రాజకీయ ప్రాధాన్యత సంతరించుకుంది. ఆయన మాత్రం యధావిధిగా తన నియోజకవర్గంలో షాదీఖానా శంకుస్ధాపన కార్యక్రమానికి ఆహ్వానించడానికి వెళ్లానని చెప్పారు. అయితే జలీల్‌ ముఖ్యమంత్రితో భేటీ అవడానికి వెనుక బలమైన కారణం వున్నట్టు తెలిసింది. 
 
           పార్టీ వర్గాలు అందించిన సమాచారం ప్రకారం... జలీల్‌ఖాన పార్టీలో చేరడానికి లైన క్లియర్‌ అయింది. పెద్ద షరతులు ఏమీ లేకుండానే ఆయన టీడీపీలో చేరనున్నారు. ఇప్పటివరకు ఆయన టీడీపీలో చేరడానికి కొన్ని షరతులు పెడుతూ వచ్చారు. మంత్రివర్గంలో ముస్లింలకు ప్రాతినిధ్యం లేదు కనుక తనకు మంత్రి పదవి ఇచ్చి ముస్లిం మైనారిటీ సంక్షేమ శాఖను ఇస్తే పార్టీలో చేరతానని మధ్యవర్తుల ద్వారా రాయబారం పంపారు. దాంతోపాటు పశ్చిమ నియోజకవర్గ సీటు వచ్చే ఎన్నికలలో తనకు ఇస్తానని మంత్రి దేవినేని ఉమా, ఎంపి కేశినేని నానిల సమక్షంలో ముఖ్యమంత్రి చంద్రబాబు చెప్పాలని గతంలో వేసిన భేటీలలో జలీల్‌ కోరారు. విజయవాడ పశ్చిమ సీటు జలీల్‌కు ఇవ్వడం వరకు ఇబ్బంది లేదన్న ముఖ్యమంత్రి చంద్రబాబు మిగిలిన వాటిపై స్పష్టత ఇవ్వలేదు. టీడీపీలో చేరాలన్న తలంపుతో వున్న జలీల్‌ను, జిల్లా మంత్రి ఒకరు బుధవారం నగరానికి వచ్చిన టీడీపీ జనరల్‌ సెక్రటరీ లోకేష్‌తో కూర్చోపెట్టి మాట్లాడించినట్టు తెలిసింది. అక్కడ కూడా జలీల్‌ తనకు మంత్రి పదవి కాని మైనారిటీ కార్పొరేషన చైర్మన పదవి కాని ఇవ్వాలని కోరినట్టు సమాచారం. అయితే లోకేష్‌ వీటి గురించి ముఖ్యమంత్రితో నేరుగా మాట్లాడమని సూచించినట్టు తెలుస్తోంది. గురువారం చంద్రబాబును కలిసిన జలీల్‌ఖాన రెండు గంటల పాటు మంతనాలు జరిపారు. ప్రాథమికంగా ముందు పార్టీలోకి హాజరు కావాల్సిందిగా జలీల్‌ను ఆహ్వానించినట్టు ఆయన వర్గీయులు చె బుతున్నారు. సముచిత ప్రాధాన్యం కల్పిస్తానని చంద్రబాబు కూడా చెప్పినట్టు సమాచారం. ఇదే సందర్భంలో మెడలో కండువా కూడా వేయించుకున్నట్టు తెలుస్తోంది. అయితే బయటకు వచ్చిన తర్వాత కండువా ఏమీ కనిపించలేదు. ఆయన అనుచరులు త్వరలోనే ఆయన టీడీపీలోకి అధికారికంగా చేరటం ఖాయమని చెబుతున్నారు. అప్పుడే చేరలేదని, తొందరేముందంటూ భేటీ అనంతరం జలీల్‌ వ్యాఖ్యానించటం గమనార్హం.
 
టచ్‌లో ఉంటున్న వైసీసీ ఎమ్మెల్యేలు
జలీల్‌ఖానతో పాటు జిల్లా నుంచి మరో ఇద్దరు వైసీపీ ఎమ్మెల్యేలు టీడీపీ ముఖ్యనేతలు, అధినేతతోనూ టచలో ఉంటున్నారు. తిరువూరు ఎమ్మెల్యే రక్షణనిధి కాస్త అడ్వాన్సుగా ఉంటున్నారు. తెలుగుదేశం పార్టీతో సంబంధాలు కొనసాగిస్తున్నారనడానికి కొద్ది కాలం కిందట విజయవాడలో జరిగిన టాటా ట్రస్ట్‌ సదస్సు గురించి చెప్పుకోవాలి. కేశినేని నాని ప్రాతినిధ్యం వహిస్తున్న పార్లమెంట్‌ నియోజకవర్గం పరిధిలోని గ్రామాలను టాటా ట్రస్ట్‌ దత్తత తీసుకున్న సంగతి తెలిసిందే. దీనికి సంబంధించి ఆరోజు సమావేశం జరిగింది. కార్యక్రమంలో రతన టాటా కూడా పాల్గొన్నారు. ఈ సందర్భంగా రక్షణనిధి పాల్గొన్నారు. తన సొంత కార్యక్రమంగా ఫీలయ్యారు. కార్యక్రమంలో టీడీపీ నేతలతో పాటు ఆయన కూడా ఆకర్షణగా నిలిచారు. చంద్రబాబుకు ఘనంగా స్వాగతం పలికారు. వేదికపైకి వచ్చి భారీ పుష్పగుచ్చాన్ని ఇచ్చి మరీ అభినందనలు తెలిపారు. టీడీపీ నేతలతో కూడా కలుపుగోలుగా మాట్లాడారు. కార్యక్రమం తన సొంతదిలా ఫీలయ్యారు. అప్పుడే రక్షణ నిధి తీరుపై అనుమానాలు కలిగాయి. నూజివీడు ఎమ్మెల్యే మేకా ప్రతాప్‌ అప్పారావు బహిరంగంగా బయట పడకపోయినా, అంతర్గతంగా నేతలతో టచలో ఉంటున్నట్టు తెలుస్తోంది. ఇద్దరి ఎమ్మెల్యేల వర్గీయులు వీటిపై కాదని ఖండించకపోయినా.. స్తబ్దుగా ఉండటం గమనార్హం .

No comments:

Post a Comment