రెండేళ్ల పాలనలో ఏపీకి చేసిందేంటి ?
17-02-2016 12:50:36
కేంద్రంలో ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి దాదాపు రెండేళ్లు కావస్తుంది. విభజన సమయంలో ఏపీకి ఇచ్చిన ప్రధాన హామీలన్నీ ఇంకా అలానే వున్నాయి. వాటి అమలుకు కేంద్రం చొరవ చూపాలని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఎన్డీఏ సమావేశంలో అభ్యర్థించారు. రాష్ర్టానికి సమస్యలు ఎక్కువ, నిధులు తక్కువ. విభజన తరువాత పరిస్థితి ఘోరంగా వుందని ఐదేళ్ల తరువాత కూడా ఆర్ధిక లోటు నుంచి ఏపీ బయట పడలేదని 14వ ఆర్థిక సంఘం తేల్చి చెప్పింది. ఈ విషయాన్ని గుర్తించి రాష్ర్టానికి ఉదారంగా సాయం చేయడానికి కేంద్రం ముందుకు రావాలి.
2014-15 కేంద్ర వార్షిక బడ్జెట్ కేటాయింపులు కానీ, 2015-16 కేంద్ర వార్షిక బడ్జెట్ కేటాయింపులు కానీ పరిశీలిస్తే అరకొర విదిలింపులతోనే సరిపెట్టారు. 2016-17 కేంద్ర వార్షిక బడ్జెట్‌లోనైనా పూర్తి నిధులు కేటాయించి కనికరిస్తారో లేదో చూడాలి. అట్లాగే ఏపీ ప్రజల ప్రగాఢ వాంఛ తమ రాష్ర్టానికి ప్రత్యేక హోదా. గత రెండు బడ్జెట్లలోనూ దాని ఊసే లేదు. ప్రత్యేక ప్యాకేజీ, రాజధానికి ఆర్థిక మద్దతు మాటమాత్రమైనా ప్రకటించలేదు. రెండు బడ్జెట్లలోనూ ప్రత్యేక హోదా కానీ, ప్యాకేజీ కానీ ఇస్తారని రెండేళ్లుగా ఎదురుచూస్తున్న ప్రజలకు కళ్ళు కాయలు కాశాయి. ఈ బడ్జెట్‌లోనైనా ప్రత్యేక హోదా కానీ, ప్యాకేజీ కానీ ప్రకటిస్తారేమోనని రాష్ట్ర ప్రజలు ఎదురుచూస్తున్నారు. విభజన చట్టంలో సమతుల్యత లోపించి ప్రతికూల పరిణామాలు ఆంధ్రప్రదేశ్‌పై పడ్డాయి.
విభజన కారణంగా ఎదురవుతున్న ప్రతికూల పరిస్థితులను చక్కదిద్దేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అష్టకష్టాలు పడాల్సి వస్తోంది. అభివృద్ధికి అవసరమైన నిధులు సమకూర్చుకోవడం ప్రధాన సమస్యగా పరిణమించింది. అభివృద్ధి పథంలో దూసుకుపోవాలనుకుంటున్న రాష్ర్టానికి ఆర్థిక పరిస్థితులు ప్రతిబంధకంగా మారాయి. చుట్టుముట్టిన ఆర్థిక సంక్లిష్టతలను అధిగమించి నూతన వ్యవస్థలను నిర్మించడానికి ముఖ్యమంత్రి కఠోర శ్రమ చేస్తున్నారు. రాష్ర్టాన్ని ఆదుకోవడానికి కేంద్రం ఉదారంగా ముందుకు రావాలని ప్రధానమంత్రి, కేంద్ర మంత్రులను కలిసి విభజన తరువాత రాష్ట్రం ఎదుర్కొంటున్న సమస్యల గురించి చంద్రబాబు వారికి వివరించారు. రెవెన్యూలోటు భర్తీ చేస్తాం, పారిశ్రామిక ప్రోత్సాహకాలు ఇస్తాం, ఏడు వెనుకబడిన జిల్లాలకు ప్రత్యేక ప్యాకేజీ ఇస్తాం, నూతన రాజధాని అభివృద్ధికి సహకరిస్తామంటూ విభజన చట్టంలో కేంద్రం హామీ ఇచ్చింది. ఇచ్చిన హామీ మేరకు ఆర్థిక సంక్లిష్ట పరిస్థితుల నుంచి ఆంధ్రప్రదేశ్‌ను గట్టెక్కించాలని, కేంద్రం కనికరించకపోతే గట్టెక్కలేమని కేంద్ర సాయమే ఆంధ్రప్రదేశ్‌కు ఆక్సిజన్ అని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ప్రధానమంత్రిని, కేంద్ర ఆర్థిక మంత్రిని అభ్యర్థించారు.
నవ్యాంధ్రను ఆదుకోవాలని అన్నింటికంటే ముఖ్యంగా రాష్ర్టానికి ప్రత్యేక హోదా, ప్రత్యేక ప్యాకేజీ, ఆర్థిక లోటు భర్తీకి ప్రత్యేక గ్రాంట్ వంటి తొమ్మిది అంశాలతో కూడిన వినతిపత్రాన్ని ప్రధాని నరేంద్ర మోదీకి ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అందించారు. కేంద్ర బడ్జెట్ ప్రవేశపెడుతున్న నేపథ్యంలో రాష్ర్టానికి ఇతోధికంగా నిధులు కేటాయించాలని ప్రధానికి విజ్ఞప్తి చేశారు. ఆంధ్రప్రదేశ్‌ని అన్నివిధాల ఆదుకుంటాం, ఏ మాత్రం నిర్లక్ష్యం చేయం, ఇచ్చిన హామీలన్నిటినీ నెరవేరుస్తాం, ప్రత్యేక హోదా, ఆర్థిక ప్యాకేజీపై నిశ్చింతగా ఉండాలని ప్రధాని చెప్పినప్పుడు రానున్న బడ్జెట్‌లోనే చేర్చితే బాగుంటుందని చంద్రబాబు కోరారు. ఆనాడు విభజనకు సహకరించిన బీజేపీ నేడు అధికారంలో వుంది కాబట్టి విభజనతో ఆర్థిక సంక్షోభం ఎదుర్కొంటున్న ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి కేంద్రప్రభుత్వం వెన్నుదన్నుగా నిలవాల్సిన బాధ్యత వున్నది.
ఆర్థికంగా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కుంటున్న ఆంధ్రప్రదేశ్‌కి కేంద్రం తగినంతగా చేయూతనివ్వడం లేదు. ప్రత్యేక ప్యాకేజీ అటుంచితే చట్టబద్ధంగా రావాల్సిన నిధుల కోసం రాష్ట్ర ప్రభుత్వం రాజకీయంగా ఒత్తిడి తేవాల్సిన పరిస్థితులు నెలకొన్నాయి. 2014-15 ఆర్థిక సంవత్సరంలో చట్టబద్ధంగా చెప్పిన రెవెన్యూ లోటును రాబట్టుకోవడానికి ప్రభుత్వం ఆర్థిక సంవత్సరం చివరి రోజయినా మార్చి 31 అర్ధరాత్రి వరకు వేచిచూడాల్సిన పరిస్థితి నెలకొన్నది. ప్రతి చిన్న విషయానికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఢిల్లీ వెళ్లాల్సి వస్తోంది. గత ఆర్థిక సంవత్సరంలో రాష్ర్టానికి 15వేల కోట్లు రెవెన్యూ లోతు ఏర్పడితే రూ.2300 కోట్లు మాత్రమే కేంద్రం ఇచ్చింది. వెనుకబడి వున్న రాయలసీమ, ఉత్తరాంధ్ర జిల్లాలకు ఇప్పటివరకు రూ.350 కోట్లు మాత్రమే ఇచ్చారు. రాష్ట్ర ప్రభుత్వం ఒక్కో జిల్లాకు రూ.200 కోట్లు చొప్పున 7 జిల్లాలకు 4 ఏళ్ల పాటు రూ.5000 కోట్లు ఇవ్వాలని కోరింది.
ఇటీవల కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిన గ్రామీణ జనాభా లెక్కల ప్రకారం చూస్తే ప్రభుత్వ, ప్రైవేటు ఉద్యోగాల్లో ఆంధ్రప్రదేశ్ 36వ స్థానంలో వుంది. దీనికంటే కింద మరే రాష్ట్రం లేదు. ఉద్యోగాల మీద ఆధారపడిన కుటుంబాలు రాష్ట్రంలో 4.56 శాతం మాత్రమే వున్నాయి. పరిశ్రమలను ప్రోత్సహించేలా పన్ను రాయితీలు కల్పిస్తేనే పరిశ్రమలు ఏర్పాటయి కొత్త ఉద్యోగాల సృష్టికి వీలు పడుతుంది. ఏపీ పునర్వ్యవస్థీకరణ చట్టంలో పేర్కొన్న విద్యా సంస్థలు, నౌకాశ్రయం, రహదారులు, ఉక్కు కర్మాగారం, ఆయిల్ రిఫైనరీ తదితరాలకు నాలుగున్నర లక్షల కోట్ల రూపాయల సమీకృత ఆర్థిక ప్యాకేజీ అవసరమని శివరామకృష్ణన్ కమిటీ నివేదించింది. ఏపీలో దుగ్గరాజపట్నం ఓడరేవు, వైజాగ్-చెన్నై పారిశ్రామిక కారిడార్ ఏర్పాటుకు భరోసా ఇచ్చారు. ఈ చట్టబద్ద వాగ్దానాలను నిర్దిష్ట కాలపరిమితిలో పూర్తి చేయడానికి కేంద్రప్రభుత్వం పూనుకోవాలి. అట్లాగే పోలవరం నిర్మాణాన్ని 2018 నాటికి పూర్తి చేస్తామని రాష్ట్ర ప్రభుత్వం ప్రజలకు పదే-పదే చెబుతున్నది. కానీ కేంద్రం మాత్రం జాతీయ ప్రాజెక్టుగా ప్రకటించడం తప్ప అందుకు తగ్గ నిధులు కేటాయించడం లేదు. 2018 నాటికి పోలవరం పూర్తి కావాలంటే ఏడాదికి రూ.5000 కోట్లు ఖర్చుచేయాల్సి వుంది. ఈ పరిస్థితుల్లో కేంద్రం పోలవరానికి అరకొర నిధులు కేటాయిస్తే అది పూర్తయ్యే పరిస్థితి లేదు. రానున్న మూడేళ్లలో పోలవరం ప్రాజెక్టు నిర్మాణం, రాజధాని నిర్మాణమనే బృహత్తర బాధ్యత ప్రభుత్వంపై వుంది.
నరేంద్ర మోదీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత ప్రణాళికా సంఘాన్ని రద్దు చేసి దాని స్థానంలో నీతి ఆయోగ్ ఏర్పాటు చేసి ఏడాది దాటినా దాని విధివిధానాల్లో స్పష్టత కొరవడి నీతి ఆయోగ్ రాష్ర్టాలకు సరైన దిశా-నిర్దేశం చేయలేకపోతుంది. రాష్ట్ర అవసరాలు తెలుసుకోవడంలో తాను గందరగోళ పడుతూ రాష్ర్టాలను గందరగోళ పరుస్తుంది. రాష్ట్రం ఇప్పటికే 2016-17 బడ్జెట్ తయారీ కసరత్తు చేస్తుంది. పథకాలపై, నిధులపై కేంద్రం స్పష్టత ఇస్తేనే కొత్త రాష్ట్రం బడ్జెట్‌లో అవసరాలకు తగ్గ అంచనాలను వేసుకోవడానికి వీలవుతుంది. 2016-17 కేంద్ర బడ్జెట్‌లో ఆంధ్రప్రదేశ్ విశాల హితానికి గొడుగు పట్టే విధంగా కేటాయింపులు జరపాలి. ప్రపంచస్థాయి వసతులతో కూడిన రాజధాని నిర్మాణానికి పూర్తిస్థాయి మద్దతు పలికిన మోదీ ఇప్పుడు పెద్ద మనస్సుతో స్పందించాలి.
రాష్ర్టాన్ని ఆదుకుంటాం, అండగా ఉంటాం విభజన చట్టంలో పొందుపరిచిన అంశాలను అమలు చేస్తాం, సమస్యల నుంచి బయటపడి ఆర్థిక పురోభివృద్ధి సాధించడానికి సహాయపడతాం అని కేంద్ర ప్రభుత్వం చెబుతున్నది. ఇవన్నీ వినేవారికి వినసొంపుగానే వుంటాయి. కాని ప్రజలు ఇచ్చిన అధికార సమయం అంతా ఇలా చెప్పుకుంటూపోతే వారికి ఇచ్చిన హామీలు నెరవేర్చేది ఎప్పుడు? ఇప్పటికే రెండేళ్ళు కావస్తున్నది. ఇంకా మూడు సంవత్సరాల సమయం మాత్రమే మిగిలి ఉన్నది. ప్రజలు స్పీడుగా ఉన్నారు. అన్ని వర్గాల ప్రజలు త్వరగా అభివృద్ధి జరగాలని కాంక్షిస్తున్నారు. ఇచ్చిన హమీలు అమలుకు నోచుకోకపోతే ప్రజలు గతంలో వలే ఎంతోకాలం వేచిచూసే పరిస్థితి లేదు.
ప్రత్యేక హోదా అంశం నీతిఆయోగ్ పరిశీలిస్తుంది అంటారు. ఇంత వరకు హోదాలేదు, ప్రత్యేక ప్యాకేజీ లేదు. రైల్వే జోన్ అతీగతీ లేదు. గిరిజన విశ్వవిద్యాలయం ఏర్పాటుకు చట్టసవరణ చేయాలంటూ పొద్దుపుచ్చుతున్నారు. ప్రత్యేక హైకోర్టు వూసే లేదు. లోటు బడ్జెట్ సమస్య లేకుండా నిధులిస్తామంటారు. ఇవేమీ అమలుకు నోచుకోవడం లేదు. కావున ప్రజలకు ఫలితాలు చూపకుండా మాటలతో ఒప్పించటం ఎంతో కాలం కుదిరే పని కాదు. ఒకపక్కన రాష్ట్రంలో ప్రభుత్వం ఏమీ పని చేయటం లేదని ప్రచారం చేస్తూ ప్రతిపక్షం బలం పుంజుకునే ప్రయత్నం చేస్తున్నది. ప్రతికూల అంశాల్లోను పెద్ద పెద్ద లక్ష్యాలను ప్రజల ముందు ఉంచి లక్ష్యాలను చేరుకోవడానికి అలుపెరగకుండా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు శ్రమిస్తున్నా ఆర్థిక లోటు ఇబ్బంది పెడుతున్నది. అస్థిపంజరంలా కూలబడిన ఆర్థిక వ్యవస్థకు ప్రాణవాయువులు ఊది మళ్ళీ నిలబెట్టడం మాటలతో అయ్యేపని కాదు. ఈ పరిస్థితుల్లో ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి అరకొర నిధులు విదిలించకుండా 2016-17 బడ్జెట్‌లో పూర్తి స్థాయిలో నిధులు కేటాయించి విభజించి వెన్నువిరిసిన రాష్ర్టానికి వెన్నుదన్నుగా నిలవాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వంపై ఉంది. విభజనానంతరం అచేతనంగా వున్న ఆంధ్రప్రదేశ్‌కి కేంద్రం సరైన చేయూత ఇవ్వకపోతే అభివృద్ధి చెందటం అసంభవం.
రాష్ర్టానికి ఇవ్వాల్సిన ప్రత్యేక హోదా కానీ, ప్రత్యేక ప్యాకేజీ కానీ ఇవ్వగలిగితేనే రాష్ర్టానికి, ప్రజలకు కేంద్రం మేలు చేసిందవుతుంది. ఒకవైపు తీవ్రమైన ఆర్ధిక లోటు, మరోవైపు అభివృద్ధికి రాజకీయంగా ఎదురవుతున్న ఇబ్బందులు, అంతగా కనికరించని కేంద్రం, ఇన్ని సవాళ్ల దారిలోనూ చంద్రబాబు సానుకూలంగా ప్రభుత్వాన్ని నడిపిస్తుండటంతో ప్రతిపక్షాలు సహకరించడం లేదు. ప్రత్యేక హోదా విషయంలో కేంద్రంపై ఒత్తిడి తెచ్చి సాధించడంలో రాష్ట్ర ప్రభుత్వం విఫలమైందంటూ కాంగ్రెస్, వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీలు రాజకీయ ప్రయోజనాలు పొందాలని చూస్తున్నాయి. కావున రాష్ర్టానికి చేయూతనివ్వకుండా నాశనం చేసినవారికి కేంద్ర ప్రభుత్వం రాజకీయంగా బతికించే అవకాశం కల్పించొద్దు. ఏది ఏమైనా కేంద్ర ఆర్థిక సాయమే ఆంధ్రప్రదేశ్‌కి ఆక్సిజన్.
నీరుకొండ ప్రసాద్
No comments:
Post a Comment