పట్టణ ధనికులకు 100 గజాలు ఉచితం!
Sakshi | Updated: February 03, 2016 12:52 (IST)
100 గజాల వరకూ ఉచితంగా క్రమబద్ధీకరణకు యోచన
నిర్ధారించిన ధరకే ఇవ్వాలని గత కమిటీల సూచన
దానిని పక్కనబెట్టిన ప్రభుత్వం.. ఉచితంవైపే మొగ్గు
సాక్షి, హైదరాబాద్: పట్టణాల్లో అనధికారికంగా ఆక్రమించిన స్థలాలను క్రమబద్ధీకరించాలని చంద్రబాబు సర్కారు నిర్ణయించింది. పట్టణాల్లో దారిద్య్ర రేఖకు దిగువనున్న పేదలకు మాత్రమే 80 చదరపు గజాల వరకు ఉచితంగా క్రమబద్ధీకరించాలని జిల్లా కలెక్టర్లతో కూడిన కమిటీతో పాటు సీసీఎల్‌ఎ కమిటీ ప్రభుత్వానికి సిఫార్సు చేశాయి. మిగతా వారందరికీ నిర్ధారించిన ధరకు క్రమబద్ధీకరించాలని సూచించాయి.
అయితే ఈ సిఫార్సు ప్రభుత్వ పెద్దకు ఏ మాత్రం నచ్చలేదు. ధనికులకు కూడా 100 చదరపు గజాల వరకు ఇళ్ల స్థలాలను ఉచితంగా క్రమబద్ధీకరించాలనేది ఆయన లక్ష్యం. ఇందుకోసం అధికారుల కమిటీ సిఫార్సులను పక్కన పెట్టి మంత్రులతో ఉప కమిటీ వేశారు. ఈ మంత్రుల కమిటీ పేద, ధనిక తేడా లేకుండా పట్టణాల్లో 100 చదరపు గజాల వరకు ఉచితంగా క్రమబద్ధీకరించాలంటూ సిఫార్సులు చేసింది.
గత ప్రభుత్వాలు బీపీఎల్ కుంటుంబాలకు మాత్రమే గ్రామాల్లో 100 చదరపు గజాలు, పట్టణాల్లో 80 చదరపు గజాల వరకు ఉచితంగా క్రమబద్ధీకరించాయి. దారిద్య్ర రేఖకు ఎగువన (ఏపీఎల్) ఉండే కుటుంబాలకూ ఉచితంగా క్రమబద్ధీకరిస్తామనడం చూస్తుంటే అసలు క్రమబద్ధీకరణ ధనికుల కోసమే అన్నట్లుందని అధికార వర్గాలు పేర్కొంటున్నాయి. మంత్రుల కమిటీ సిఫార్సులను రాష్ట్ర మంత్రివర్గం ఆమోదించాల్సి ఉందని ఆ వర్గాలు చెప్పాయి.
గతంలో క్రమబద్ధీకరణకు కోర్టు బ్రేక్..
ఉమ్మడి రాష్ట్రంలో 2008లో అప్పటి ప్రభుత్వం పట్టణాల్లో ఆక్రమణల ఇళ్ల స్థలాలను క్రమబద్ధీకరించింది. అయితే 2013లో న్యాయస్థానం ఆదేశాలతో ఆక్రమణల క్రమబద్ధీకరణ నిలిచిపోయింది. అప్పట్లో ప్రస్తుత ఆంధ్రప్రదేశ్ 13 జిల్లాల్లో ఆక్రమణల క్రమబద్ధీకరణకు 2013, అక్టోబర్ నెలాఖరు వరకు 33,090 దరఖాస్తులు ప్రభుత్వానికి అందాయి. అందులో 1,463 దరఖాస్తుదారులకు 80 చదరపు గజాల వరకు పేదలకు ఉచితంగాను, 1,758 దరఖాస్తు దారులకు 250 చదరపు గజాల వరకు నిర్ధారించిన ధరకు మొత్తం 4,59,861.61 చదరపు గజాలను క్రమబద్ధీకరించారు.
న్యాయస్ధానం ఆదేశంతో క్రమబద్ధీకరణ నిలిచిపోవడంతో 2013, అక్టోబర్ నెలాఖరు నాటికి 1,833 దరఖాస్తులు పెండింగ్‌లో ఉన్నాయి. అయితే అప్పుడే నిబంధనలకు సరిపడా దరఖాస్తులు లేని కారణంగా ఏకంగా 27,736 దరఖాస్తులను జిల్లాల్లో తిరస్కరించారు.
No comments:
Post a Comment