Wednesday 22 July 2015

రాజధాని గ్రామాల చుట్టూ రోడ్ల అభివృద్ధి

రాజధాని గ్రామాల చుట్టూ రోడ్ల అభివృద్ధి
తాడికొండ : రాజధాని ప్రాంతంలోని గ్రామాల చుట్టూ హద్దు రోడ్లు నిర్మించాలని సింగపూర్‌ నిపుణులు ప్రభుత్వానికి సూచించారు. ప్రస్తుతం విస్తరించిన గ్రామ కంఠాలతో అనేక గ్రామాల హద్దులు సరిగ్గా లేవు. దీంతో గ్రామాల హద్దులు నిర్ణయించి, ఆయా గ్రామాల చుట్టూ రోడ్లు వేయాలని ప్రతిపాదించారు. భవిష్యత్‌ అవసరాల కోసం గ్రామాల చుట్టూ కొంత భూమిని వదిలి రోడ్లు వేస్తారని అధికారులు చెప్తున్నారు. దీంతో రాజధానిలోని 29 గ్రామాల హద్దులు తెలియజేయడంతో పాటు గ్రామ కంఠాల సమస్య పరిష్కారం అవుతుందని భావిస్తున్నారు. రాజధాని చుట్టూ వలయాకారంలో వచ్చే పెద్ద రోడ్లతో పాటు గ్రామానికి గ్రామానికి మధ్య రహదార్లను మరింత విస్తరించనున్నట్లు సమాచారం. రాజధానిలోని గ్రామాలను కదలించబోమని మంత్రులు చెప్తున్నందున గ్రామాల్లో అంతర్గతంగా సిమెంట్లు రోడ్లు వేసి, సుందర గ్రామాలుగా తీర్చిదిద్ధేందుకు సీఆర్‌డీఏ అధికారులు ప్రతిపాదనలు సిద్ధం చేస్తున్నారు.
భూమిపూజ ప్రదేశం వద్ద
పోలీస్‌ భవనం 

రాజధాని భూమిపూజ ప్రదేశం పర్యాటక స్థలంగా మారుతుండడంతో పోలీసులు రక్షణ చర్యలు చేపట్టారు. ఇన్నాళ్లు తాత్కాలికంగా గుడారంలో తలదాచుకుంటున్న పోలీస్‌ సిబ్బందికి పక్కా భవనాన్ని నిర్మించారు. పోలీస్‌ అవుట్‌పోస్టు తరహాలో దీనిని ఏర్పాటు చేస్తున్నారు. మందడంలోని 136 సర్వే నెంబరు భూమిలో ముఖ్యమంత్రి చంద్రబాబు రాజధానికి భూమిపూజ నిర్వహించిన విషయం తెలిసిందే. అప్పటి నుంచి ఈ ప్రదేశంలో 24 గంటల పోలీస్‌ పహరా ఏర్పాటు చేశారు. ఐదుగురు కానిస్టేబుల్స్‌ రోజు మార్చి రోజు విధులు నిర్వర్తిస్తున్నారు. త్వరలో దీనిని పోలీస్‌ ఉన్నతాధికారులు ప్రారంభించనున్నట్లు చెప్తున్నారు.

No comments:

Post a Comment