Thursday 23 July 2015

ఈ శిక్ష సమాజానికి మంచి చేస్తుందా?

ఈ శిక్ష సమాజానికి మంచి చేస్తుందా?

భారతదేశానికి కావలసింది ముంబై హింసాకాండలూ పేలుళ్లూ గుజరాత్‌లూ పునరావృత్తం కాని పరిస్థితి. దేశంలో విధింపబడిన అవాంఛనీయమైన వాతావరణాన్ని పటాపంచలు చేసే సామరస్యం. ఈ శిక్షలూ కక్షలూ వాటిని సాధిస్తాయా? నేరానికి పాల్పడిన ముఖ్యవ్యక్తులు విదేశాల్లో భద్రంగా ఉంటే, దొరికిన వాడెవడో ఒకడిని ఉరితీయడం శిక్షావాదులకు మాత్రం మనోస్థైర్యాన్నిస్తుందా?... అభిప్రాయభేదాలతో నిమిత్తం లేకుండా ఉరిశిక్ష పడ్డ వారందరి తరఫునా మాట్లాడేవారెవరూ దేశంలో లేరు.

పదిహేనేళ్ల కిందట వచ్చిన హృతిక్‌రోషన్‌-కరిష్మాకపూర్‌ సినిమా ‘ఫిజా’ పెద్దగా ఆడలేదు కానీ ప్రశంసలు మాత్రం పొందింది. సంక్లిష్టమయిన పరిస్థితుల మధ్య సోదరుని కోసం అన్వేషిస్తూ వెళ్లిన ముస్లిం యువతిగా కరిష్మా నటన ఒక ఎత్తు అయితే, ఆ పరిస్థితుల చిత్రణలో కనిపించిన కించిత్‌ ధైర్యమూ వాస్తవికతా మరొక ఎత్తు. 1992-93లో జరిగిన ముంబయి హింసాకాండలో బాధితుడై తరువాత మాయమై టెర్రరిస్టుగా మారిన వ్యక్తి ఆ సినిమా కథానాయకుడు (హృతిక్‌రోషన్‌). సినిమా చూసిన వారికి దేశంలోని సంఘటనలు, వాటి స్పందనలు, స్పందనల ప్రతిస్పందనలు ఎటువంటి పరిణామాలను సృష్టిస్తున్నాయో స్ఫురిస్తుంది. 2007లో సంచలనం సృష్టించిన ‘బ్లాక్‌ ఫ్రైడే’ సంగతి చెప్పనక్కరలేదు. 1993 మార్చి 12 నాడు ముంబయిలో జరిగిన వరుస బాంబు పేలుళ్ల ఇతివృత్తంగా నిర్మించిన, డాక్యుమెంటరీ అనదగ్గ చిత్రం అది. కార్యకారణ సంబంధాలను, నేరానికి పాల్పడిన, చిక్కుకుపోయిన వ్యక్తుల డోలాయమానస్థితిని, అనివార్యతలను కథనం చేసింది ఆ సినిమా. ముంబై పేలుళ్ల తీర్పును ప్రభావితం చేయగలదేమోనని మూడేళ్లపాటు ఆ సినిమా ప్రదర్శనను నిలిపివేశారు కూడా.
నిజాన్ని ఏ కొంచెం చెప్పినా కృతజ్ఞతగా ఉండవలసిన పాడు కాలం కాబట్టి కానీ, సినిమాల ప్రస్తావనా సహాయమూ అనవసరం. అంతా కళ్లకు కట్టినట్టు గుర్తున్నది. దలాల్‌సీ్ట్రట్‌ పేలుడుతో అప్పుడప్పుడే రంగం మీదకు వచ్చిన కేబుల్‌ టీవీ రంగుల్లో కంపించిపోవడం గుర్తున్నది. నడుస్తున్న చరిత్రకు నిర్ఘాంతపోవడమే తప్ప అర్థం చేసుకోగలిగిన తెరిపి ఇవ్వకుండా పదమూడు పేలుళ్లు వరుసగా గుండెల్లో పేలడం గుర్తున్నది. సాయంత్రానికల్లా వందల కొద్దీ మరణాల లెక్క తేలడమూ గుర్తున్నది. మొత్తం మీద మూడువందల పై చిలుకు చావులు, వెయ్యిమందికి పైగా క్షతగాత్రులు. అక్కడ నెత్తురోడినవారే కాదు, దృశ్యాలను చూసినవారు, వార్తలను చదివినవారూ అందరూ బాధితులే. ఎక్కడో ఏదో తెగింది. పెంచిపోషించిన వ్రణాలు ఏవో పగలిపోతున్నాయి. కొత్తకొత్త రణక్షేత్రాలు పురుడుపోసుకుంటున్నాయి.
ఎవరు మాత్రం దీన్ని సహిస్తారు? పొగిలిన దుఃఖం ఆగ్రహం కావలసిందే కదా? దేశంలో మునుపెన్నడూ తెలియని బీభత్సం అది. తొలిసారి ఆర్డీఎక్స్‌ వాడిన పేలుళ్లు అవి. లక్ష్యం అంటూ లేకుండా వీలయినచోట్లల్లా మానవహననానికి ఉద్దేశించిన దుర్మార్గం అది. అమాయక జనాన్ని ఉద్దేశించి జరిగిన తొలి ఉగ్రదాడికి ఇరవైరెండేళ్ల వయస్సు. అది ఆరంభమే కానీ అంతం కాదు, జరుగుతూనే ఉన్నాయి. హాహాకారాలూ ఆర్తనాదాలూ దేశవ్యాప్తం అయిపోయాయి. యాకుబ్‌ మెమన్‌కు ఉరిశిక్ష దాదాపుగా ఖాయం అయి పోయింది. ముంబై పేలుళ్ల కేసులో మరణశిక్ష ఖాయపడిన ఏకైక నిందితుడు. ‘స్వయంగా విధ్వంసంలో పాల్గొనలేదు కానీ చేసిన వాళ్ల వెనుక ఇతనున్నాడు’ అని సుప్రీంకోర్టు అభిప్రాయపడింది. రాష్ట్రపతి క్షమాభిక్ష నిరాకరించారు. రివ్యూపిటిషన్‌ను కొట్టివేసింది. విచారణలోనో నిర్ధారణలోనో లోపాలూ అసమగ్రతలు ఉంటే శిక్ష నుంచి ఉపశమనం కలిగించే క్యూరేటివ్‌ పిటిషన్‌ను కూడా ఉన్నత న్యాయస్థానం కొట్టివేసింది. మహారాష్ట్ర గవర్నర్‌ కూడా క్షమాభిక్షను కాదంటే, జులై 30 నాడు మెమన్‌ను భారత రాజ్యం మరణింపజేస్తుంది. మెమన్‌ ఉరికంబం ఎక్కితే, ఎంతో కొంత న్యాయం జరిగిందని మూడువందల బాధిత కుటుంబాలు, కాళ్లూ చేతులూ పొగొట్టుకుని నిత్యనరకం అనుభవిస్తున్నవారూ సంతోషిస్తుండవచ్చు. వారిలో అతి కొద్ది మంది అయినా, న్యాయాన్యాయాలకు అతీతమైన నిర్వేదానికో, వైరాగ్యానికో, క్షమాగుణానికో లోనై ఇటువంటి శిక్షను కోరుకోకపోయీ ఉండవచ్చు. సాధారణ మానవ స్పందనకే అధికారం లభిస్తే కంటికి కన్ను పంటికి పన్ను మాత్రమే న్యాయం అవుతుంది. కానీ వేల ఏళ్ల నాగరికతా ప్రస్థానం, న్యాయశాస్త్ర పురోగమనం శిక్షల విచారణకు కూడా ఒక వ్యవస్థను, సర్వసమానతను, సభ్యతను అలవరిచాయి. అటువంటి న్యాయవ్యవస్థే మెమన్‌ను దోషిగా నిర్ధారించింది. కోర్టులకు ఏ రాగద్వేషాలూ ఉండవు. అవి సాక్ష్యాన్ని, చట్టాన్ని, దేశ అవసరాన్ని దృష్టిలో పెట్టుకుని తీర్పులు రాస్తాయి. కానీ ప్రాసిక్యూషన్‌లకు అంతటి పవిత్రతను ఆపాదించలేము. వ్యవస్థాంగాల కంటె మించి, ప్రజాస్వామిక శక్తులు, శ్రేణుల సముదాయాలు దీర్ఘకాలికమైన, సవ్యమయిన ఫలితాలను ఇచ్చే విశ్లేషణలకు, నిర్ధారణలకు రాగలగుతాయి. వారు మెమన్‌ ఉరితీత సందర్భాన్ని ఎట్లా చూస్తారు?
సమస్య ఎక్కడంటే, యాకూబ్‌ మెమన్‌తోనే ఈ నేరం .మొదలయిందా? జరిగిన నేరంలో ఇతని పాలు ఎంత? యాకూబ్‌ మెమన్‌ దోషనిర్ధారణ లోపరహితంగా జరిగిందా? యాకూబ్‌ మెమన్‌ ఉరితీత నేరవాతావరణాన్ని కొనసాగింపజేస్తుందా, సమసిపోయేట్టు చేస్తుందా? మరణశిక్ష వేయదగినంత నేరం మెమన్‌ చేయకపోయి ఉంటే, అప్పుడు కూడా బాధిత కుటుంబాలు హర్షిస్తాయా? అతను నిజానికి నిర్దోషిగానో ప్రాసిక్యూషన్‌కు సహకారిగానో వదిలివేయవలసిన వ్యక్తి అయితే కూడా అతని శిక్షను అతివాద ఉరితీతవాదులు సంతోషిస్తారా? ఇరవైమూడేళ్ల ఏకాంతవాస సుదీర్ఘ నిర్బంధం తరువాత అయినా సరే అతనిని వదిలివేయడం భారతదేశ ప్రతిష్ఠను ఇనుమడింపజేస్తుందని తెలిస్తే కూడా దేశభక్తులు అతనిని చంపేయమనే అనగలరా? సుప్రీంకోర్టు తుది నిర్ధారణ తరువాత కూడా ఇంకా మెమన్‌ తరఫున వాదనలు సమాధానాలు దొరకక మిగిలే ఉంటే జులై 30కి అతన్ని శిక్షించవలసిందే అనగలమా? భారతదేశానికి కావలసింది ముంబై హింసాకాండలూ పేలుళ్లూ గుజరాత్‌లూ పునరావృత్తం కాని పరిస్థితి. దేశంలో విధింపబడిన అవాంఛనీయమైన వాతావరణాన్ని (ఫిజా అంటే వాతావరణమే) పటాపంచలు చేసే సామరస్యం. ఈ శిక్షలూ కక్షలూ వాటిని సాధిస్తాయా? నేరానికి పాల్పడిన ముఖ్యవ్యక్తులు విదేశాల్లో భద్రంగా ఉంటే, దొరికినవాడెవడో ఒకడిని ఉరితీయడం శిక్షావాదులకు మాత్రం మనోస్థైర్యాన్నిస్తుందా?
ఆపరేషన్‌బ్లూస్టార్‌కూ ఇందిర దారుణ హత్యకు వేలాది సిక్కుల ఊచకోతకూ పంజాబ్‌ ఉగ్రవాదం విస్తరణకూ సంబంధం లేదనగలమా? ఐపీకేఎఫ్‌కూ రాజీవ్‌గాంధీ విషాదనిష్క్రమణకూ లంకె ప్రత్యేకంగా పెట్టాలా? ప్రతిసమస్యకూ సంఘటనకూ మూలకారణాలుంటాయి. ముంబై పేలుళ్ల దుఃఖాన్ని గుర్తు తెచ్చుకుంటున్నప్పుడు అంతకు మూడు నెలల ముందు 1992 చివర-1993 మొదట జరిగిన ముంబై హింసాకాండ కూడా గుర్తుకు రావాలి. 1992 డిసెంబర్‌ 6న జరిగిన బాబ్రీమసీదు విధ్వంసం కూడా స్ఫురించాలి. బాబ్రీమసీదు కూల్చివేతకు నిరసనలపై పెద్ద ఎత్తున జరిగిన పోలీసుకాల్పులు, అనంతరం అది పౌరహింసగా పరిణమించి జరిగిన వేయి మరణాలు దేశచరిత్రలో మచ్చ వంటివి. ఆ క్రమంలోనే ముంబై పేలుళ్లు జరిగాయి. ఉద్వేగాలు, ప్రతీకారాలు ఏ నేరాన్ని మాఫీ చేయవు, నిజమే. కానీ ప్రతి నేరానికి పూర్వాపరాలుంటాయి. బాబ్రీమసీదు సంఘటనపై ఇంకా విచారణే పూర్తి కాలేదు. ముంబై హింసాకాండలో ఏ ఒక్క దోషికీ మరణశిక్ష పడలేదు. జస్టిస్‌ శ్రీకృష్ణ కమిషన్‌ చేసిన సూచనలను, సిఫార్సులను ప్రభుత్వాలు పట్టించుకున్న పాపాన పోలేదు. అనేక నేరాల వరుసలో ఒక నేరానికి మాత్రమే శిక్ష విధిస్తే, అది ఎటువంటి అర్థాలను ఇస్తుందో తెలియదా? యాకూబ్‌ మెమన్‌ సాంకేతికంగా దోషి అనో నిర్దోషి అనో చెప్పడం లేదు. శేషప్రశ్నల గురించి మాత్రమే చర్చ. ఆ ప్రశ్నలు అందరికీ సంబంధించినవి. టైగర్‌ మెమన్‌కు సోదరుడయినందుకు మాత్రమే అతన్ని శిక్షిస్తున్నారని అతని కుటుంబం అనుకుంటోంది. యాకూబ్‌ మెమన్‌ లేకపోతే ముంబై పేలుళ్ల కేసులో టైగర్‌ మెమన్‌-దావూద్‌ పాత్ర నిర్ధారణ అయ్యేదే కాదని విచారణను దగ్గరగా పరిశీలించినవారు చెబుతున్నారు. ముంబై పేలుళ్లకు ముందే దేశం విడిచిపెట్టి వెళ్లిన మెమన్‌ కుటుంబంలో యాకూబ్‌ ఒక్కడే దేశం తిరిగి వచ్చి, నేరంలో తన భాగాన్ని కడిగేసుకోవడానికి సిద్ధపడ్డాడు. పాక్‌ నుంచే తాను సీబీఐని సంప్రదించానని, అప్రూవర్‌గా మారడానికి సిద్ధపడి నేపాల్‌ సరిహద్దులో లొంగిపోయానని, కానీ భారత హోంశాఖ తనను ఢిల్లీలో అరెస్టు చేసినట్టు ప్రకటించిందని మెమన్‌ న్యూస్‌ట్రాక్‌ ఇంటర్వ్యూలో చెప్పాడు. అతని వాదన అరణ్యరోదనే అయింది. నిజంగానే భారతీయ ప్రాసిక్యూషన్‌ అతని సాయం తీసుకుని, తరువాత అతనినే దోషిగా నిలబెట్టిందా? అదే నిజమయితే దేశానికి అది గౌరవమా? ‘‘పెద్ద గాంధేయవాదిలాగా ఇండియాకు వెడుతున్నావు, వాళ్లు మాత్రం నిన్ను టెర్రరిస్టుగానే చూస్తారు’’ అని టైగర్‌ మెమన్‌ తన సోదరుడితో అన్నాడట. అదే నిజమయిందా? తన పిల్లలను భారతీయులుగానే పెంచాలనుకుంటున్నానని యాకూబ్‌ మెమన్‌ చెప్పాడు. అట్లా అనుకోవడం పొరపాటు అయిందా? దేశంలో మరణశిక్ష పడిన ఖైదీలలో నూటికి 75 శాతం మంది బడుగు, బలహీన, మైనారిటీ వర్గాలవారేనని లెక్కలు చెబుతున్నాయి. లెక్కలే కాదు, దేశ లా కమిషన్‌ చైర్మన్‌ జస్టిస్‌ ఎ.పి. షా మాట్లాడుతూ సాధారణంగా పేదలూ బలహీనులే ఉరికంబం ఎక్కుతారని అన్నారు. దేశంలో మరణశిక్ష విధింపును సమీక్షించవలసిన అవసరం ఉందని కూడా వ్యాఖ్యానించారు. వ్యవస్థను ఏరకంగానూ ఒత్తిడి చేయలేని వారే అంతిమశిక్ష దాకా వెడతారు. దేశంలోని ఏ ఒత్తిడి బృందమూ మెమన్‌ తరఫున వాదించే పరిస్థితి లేదు. నేరానికి కఠిన శిక్షలు వేయడమే భద్రమైన సమాజాన్ని సృష్టిస్తుందని నమ్మేవారు చాలా మంది ఉంటారు. ఎంతటి దుర్మార్గమైన నేరం చేసిన వారికైనా మరణశిక్ష విధించగూ డదని, నేరాలను శిక్షలు నిరోధించలేవని నమ్మేవారూ లోకంలో ఉన్నారు. గాంధీజీని నాథూరామ్‌ గాడ్సే హత్య చేసినప్పుడు, హంతకుడికి మరణశిక్షను వ్యతిరేకించినవారిలో గాంధీగారి ఇద్దరు కుమారులూ ఉన్నారు. అంతే కాదు, జవహర్‌లాల్‌ నెహ్రూ కూడా ఉన్నారు. వారెవరూ గాడ్సేవాదులు కారు. నేరస్థుడికి క్షమ అడిగినవారిని నేరానికి సమర్థుకులుగా చిత్రించే రోజులు అప్పటికి రాలేదు. ఇవాళ యాకూబ్‌ మెమన్‌ మరణశిక్ష గురించి భారతీయ పౌరసమాజం గంభీరమైన మౌనాన్నే ప్రదర్శిస్తుంది. అభిప్రాయభేదాలతో నిమిత్తం లేకుండా ఉరిశిక్ష పడ్డ వారందరి తరఫునా మాట్లాడేవారెవరూ దేశంలో లేరు.

No comments:

Post a Comment