Tuesday 21 July 2015

ఉద్ధండరాయునిపాలెం, తాళ్లాయపాలెం, లింగాయపాలెం సంబరం

ఉద్ధండరాయునిపాలెం, తాళ్లాయపాలెం, లింగాయపాలెం సంబరం.. ఆ భూముల్లోనే ఏపీ సీడ్‌ క్యాపిటల్‌

  • బ్యారేజీ నుంచి 10 కిలోమీటర్ల దూరం
  • స్థానికుల్లో సంభ్రమాశ్చర్యాలు..
  • గ్రామాలు కదిలిస్తారనే ఆందోళన!
  • ళ్లూ ఇస్తామంటున్న వారు కొందరు
  • మెట్ట గ్రామాల రైతుల్లో నిరాశ
 
(విజయవాడ, గుంటూరు - ఆంధ్రజ్యోతి)
ఉద్దండరాయునిపాలెం, తాళ్లాయపాలెం, లింగాయపాలెం... గుంటూరు జిల్లాలో కృష్ణా నదిని ఆనుకుని ఉన్న మూడు గ్రామాలు! నిన్న మొన్నటిదాకా ఆంధ్రప్రదేశ్‌లో ఉన్న వేలకొద్దీ గ్రామాల్లో ఇవీ ఒకటి! మరి ఇప్పుడు... నవ్యాంధ్ర రాజధాని పరిపాలన కేంద్రానికి ‘కేంద్రంగా’ మారుతున్న గ్రామా లు! రాజధాని ప్రధాన ప్రాంతం (సీడ్‌ క్యాపిటల్‌) బృహత్‌ ప్రణాళిక విడుదల కావడంతో... ఈ మూడు గ్రామాలు ఇప్పుడు ‘హాట్‌ టాపిక్‌’గా మారిపోయాయి. సీడ్‌ క్యాపిటల్‌ కోసం ఎంపికైన 16.9 చదరపు కిలోమీటర్ల ప్రాంతం
జీఛిౌ.్చటఞ్ఠ లింగాయపాలెం, ఉద్ధండరాయునిపాలెం, తాళ్లాయపాలెం (మందడం హ్యామ్లెట్‌) గ్రామాల పరిధిలోనే ఉంటుంది. అంటే రాజధానికి గుండెకాయ వంటి సచివాలయం, శాసనసభ, రాజ్‌భవన్‌ వంటి ముఖ్య భవనాలన్నీ ఈ గ్రామాలలోనే నిర్మితం కానున్నాయి. దీంతో... తాము ఊహించినదానికంటే ఎన్నో రెట్లుగా తమ దశ తిరిగిపోతుందని ఈ గ్రామస్తులు భావిస్తున్నారు. అదే సమయంలో... కీలక రాజధాని ప్రాంతం అభివృద్ధి కోసం తమ ఊళ్లను కూడా కదిలిస్తారేమోనని ఆందోళన చెందుతున్నారు. నిజానికి... జరీబు భూములున్న లింగాయపాలెం, ఉద్ధండరాయునిపాలెం, తాళ్లాయపాలెం రైతులు తొలుత భూసమీకరణను వ్యతిరేకించారు. ఆ తర్వాత... ప్రభుత్వం ప్రకటించిన మెరుగైన ప్యాకేజ్‌లతో సంతృప్తి చెంది ‘సరే’ అన్నారు. ఇప్పుడు... జరీబు గ్రామాలలో సీడ్‌ క్యాపిటల్‌ అనగానే తెల్లవారే సరికి భూముల విలువలు మరింత పెరిగాయి. లింగాయపాలెంలో ఎకరం రూ.1.85 కోట్లు చెబుతున్నారు. అయినా మా ఊళ్లో అమ్మేవారు లేరని ఆ గ్రామ సర్పంచ్‌ అనుమోలు సత్యం అన్నారు.
 
గ్రామాల పరిస్థితి ఏమిటి?
రాజధాని నిర్మాణంలో భాగంగా... గ్రామాలను, ఇళ్లను కదిలించబోమని ప్రభుత్వం పలుమార్లు హామీ ఇచ్చింది. సోమవారం రాజమండ్రిలో బృహత్‌ ప్రణాళిక విడుదల సమయంలోనూ... వీలైనంత వరకు గ్రామాలను కదిలించబోమని ముఖ్యమంత్రి చంద్రబాబు కూడా తెలిపారు. ఇదే జరిగి... ఈ మూడు గ్రామాలను యథాతథంగా వదిలేసి చుట్టూ ‘సీడ్‌ క్యాపిటల్‌’ అభివృద్ధి చెందితే, వీటి దశ తిరిగినట్లే. రోడ్ల విస్తరణ, పచ్చదనం, ఓపెన్‌స్పే్‌సల కోసం గ్రామాల్లో కూడా భూసేకరణ చేస్తే మాత్రం మూడు గ్రామాలు చెదిరిపోతాయి. రాజధానికి అవసరమైతే ఒకటి రెండు గ్రామాలను కూడా తీసుకోవాల్సి ఉంటుందని అటు మంత్రులు, ఇటు సీఆర్‌డీఏ అధికారులు చెబుతున్నారు. ప్రజలకు తగిన నివాసం చూపించిన తర్వాతే వాటిని సేకరిస్తామంటోన్నారు. అలాగే... ఈ మూడు గ్రామాల్లో భవన నిర్మాణాలను మూడంతస్తులకే పరిమితం చేస్తారన్న ప్రచారం కూడా జరుగుతోంది. దీంతో... ఒకవైపు సీడ్‌ క్యాపిటల్‌ తమ ప్రాంతంలో వచ్చిన సంతోషంతోపాటు ఆందోళన కూడా మొదలైంది. భూములు ఇచ్చేందుకు అంగీకరించిన రైతులు... ఇళ్లు కూడా ‘త్యాగం’ చేసేందుకు సిద్ధంగా లేరు. ‘‘భూములు ఇచ్చాం. కానీ, ఇళ్లు కూడా ఇవ్వమంటే ఎలా? మేము ఎక్కడ ఉండాలి?’’ అని ప్రశ్నిస్తున్నారు. కొందరు గ్రామస్తులు మాత్రం మంచి ప్యాకేజీ ఇస్తే ఇళ్లు ఇచ్చేయడానికి కూడా అభ్యంతరం లేదని అంటున్నారు.
 
మెట్ట రైతుల్లో నిరాశ..
రాజధానికి భూములు ఇచ్చేందుకు స్వచ్ఛందంగా ముందుకు వచ్చిన మెట్ట భూముల గ్రామాల రైతులలో ఇప్పుడు కొంత నిరాశ కనిపిస్తోంది. ‘నవ్యాంధ్ర రాజధాని తుళ్లూరు’ అంటూ తొలుత భారీ ప్రచారం జరిగింది. ఇప్పటికీ రాజధాని పరిధిలోనే తుళ్లూరు, ఈ మూడు గ్రామాలు తుళ్లూరు మండలంలోనే ఉన్నా... సీడ్‌ క్యాపిటల్‌ రేసు నుంచి మాత్రం తప్పుకొన్నట్లయింది. ‘రాజధాని అనగానే ముందుగా స్పందించింది మేమే. మా భూములన్నీ ఇస్తాం తీసుకోమని బేషరతుగా చెప్పింది మేమైతే రాజధాని ముఖ్య భవనాలన్నీ జరీబు గ్రామాలలో నిర్మించడం మమ్మల్ని నిరుత్సాహానికి గురి చేసింది’’ అని తుళ్లూరు మాజీ జడ్‌పీటీసీ దామినేని శ్రీనివాస్‌ అన్నారు. లింగాయపాలెం, ఉద్ధండరాయునిపాలెం, తాళ్లాయపాలెం గ్రామాలు కృష్ణా నదికి అతి దగ్గరగా ఉండటం, చక్కటి సారవంతమైన నేల కావడం, 40 అడుగులలోపే భూగర్భ జలాలు అందుబాటులో ఉండటం... ఈ నేపథ్యంలోనే సీడ్‌ క్యాపిటల్‌కు ఆ మూడు గ్రామాలను ఎంపిక చేసినట్లు తెలుస్తోంది.
 
మూడు గ్రామాల పరిధిలో 5 వేల ఎకరాల భూమి ఉంది. ఇందులో 4485 ఎకరాలను రైతులు భూసమీకరణ కింద అంగీకార పత్రాలు ఇచ్చారు. సీడ్‌ క్యాపిటల్‌కు ఎంపిక చేసిన ప్రాంతం ప్రకాశం బ్యారేజీ దిగువన 10 కిలోమీటర్ల దూరంలో ఉంది. రెండోవైపు ఇబ్రహీంపట్నం సమీపంలో ఉంటుంది. నది అంచున సుమారు 6 కిలోమీటర్ల పొడవున రాజధాని ముఖ్య భవనాలు నిర్మిస్తారని సీడ్‌ క్యాపిటల్‌ ప్లాన్‌ను బట్టి వెల్లడవుతోంది.
 
 
గ్రామాలు పోకుండా చూడాలి
మా ఇద్దరు అబ్బాయిలకు కలిపి మొత్తం 50 ఎకరాలు ఉన్నాయి. వీటిలో 40 ఎకరాలు జరీబు భూములు. సీడ్‌ క్యాపిటల్‌ మా ప్రాంతంలో ఏర్పాటు చేయటం చాలా సంతోషంగా ఉంది. సాధ్యమైనంత వరకు గ్రామాలు పోకుండా చూడాలి
- చింతల వెంకటరావు, రైతు
 
మెట్ట ప్రాంతాల్లోనూ అభివృద్ధి
తాళ్లాయపాలెం, లింగాయపాలెం, ఉద్దండరాయపాలెంలలో సీడ్‌ క్యాపిటల్‌ ఉంటుందని తొలి నుంచే అనుకుంటున్నాం. మందడంలో భూమి పూజ చేసిన రోజే అభివృద్ది అంతా జరీబు భూముల్లోనే కాకుండా మెట్ట ప్రాంతాల్లోనూ చూడాలని కోరాం.
- శ్రీనివాసరావు, తుళ్లూరు
 
మెట్ట ప్రాంత రైతుల్లో ఆందోళన
మెట్ట ప్రాంత రైతులలో ఆందోళనగా ఉంది. ఎక్కువగా భూములు ఇచ్చింది మెట్ట ప్రాంత రైతులే. మేం ప్రభుత్వానికి పూర్తిగా సహకరించాం. భూములన్నీ ధారాదత్తం చేశాం. ఇక్కడ ఎకరం భూమి 90 లక్షలు ఉంటే , జరీబు భూమికి 2 కోట్లు పలుకుతోంది.
- సుబ్బారావు, నేలపాడు సర్పంచ్‌
 
మా ఇళ్లూ ఇచ్చేస్తాం
గట్టిగా కేకవేస్తే చంద్రబాబుకు వినిపించేంత దగ్గరగా భవనాలు ఏర్పాటు కానున్నాయి. పార్కులు, భవనాలు ఇదంతా చూస్తుం టే ఉత్కంఠత కలుగుతుంది. చంద్రబాబుపై మాకు నమ్మకం ఉంది. తగిన పరిహారం ఇస్తే ఇళ్లూ ఇచ్చేస్తాం.
-గణేశ్‌ ప్రసాద్‌, లింగాయపాలెం

No comments:

Post a Comment